చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్గరీటా రోడ్రిగ్జ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చనిపోవడం మనిషి జీవితంలో ముఖ్యమైన ఆఖరి భాగం. కానీ, చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుందో మనకు దాదాపు తెలియదని అర్ధమయ్యాక న్యూరో సైంటిస్ట్ జిమో బోర్జిగిన్ ఆశ్చర్యపోయారు.
ఈ వాస్తవం ఆమెకు చాలా యాదృచ్ఛికంగా సుమారు ఒక దశాబ్దం కిందట తెలిసింది.
"అప్పుడు ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నాం. శస్త్రచికిత్స తర్వాత మేం వాటి మెదడులోని న్యూరోకెమికల్ స్రావాలను పరిశీలిస్తున్నాం." అని ఆమె బీబీసీకి వివరించారు.
హఠాత్తుగా, వాటిలో రెండు ఎలుకలు చనిపోయాయి. దాంతో ఆమె వాటి మెదడులో జరిగే మరణ ప్రక్రియను గమనించడం సాధ్యమైంది.
"ఒక ఎలుకలో సెరోటోనిన్ చాలా ఎక్కువగా స్రవించిందని తెలిసింది. ఆ ఎలుకలో ఏవైనా మానసిక భ్రాంతులు కలిగాయా?” అని తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.
సెరోటోనిన్‌కు భ్రాంతితో సంబంధం ఉంటుందని ఆమె వివరించారు.

భావోద్వేగాలను నియంత్రించే రసాయనం సెరోటోనిన్ అంతగా స్రవించడం చూసి ఆమెలో ఆసక్తి పెరిగింది.
“దానికి ఏదో కారణం ఉంటుంది కాబట్టి, నేను దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. చనిపోయే ప్రక్రియ గురించి మనకు చాలా తక్కువ తెలుసని గ్రహించాక నేను ఆశ్చర్యపోయా.’’ అని తెలిపారు.
నాటి నుంచి మిషిగన్ విశ్వవిద్యాలయంలో మాలిక్యులర్, ఇంటిగ్రేటివ్ ఫిజియాలజీ, న్యూరాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ జిమో బోర్జిగిన్, మనం చనిపోతున్నప్పుడు మెదడులో ఏమి జరుగుతుందో అధ్యయనం చేయడానికి అంకితమయ్యారు.
అయితే తాను కనుగొన్నది, ఊహించిన దానికి విరుద్ధంగా ఉందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, UNIVERSITY OF MICHIGAN
మరణం నిర్వచనం
‘‘గుండె ఆగిపోయిన తర్వాత ఎవరికైనా చాలాసేపు నాడి అందకపోతే, వైద్యపరంగా వాళ్లు చనిపోయినట్లు నిర్వచిస్తారు. ఈ సందర్భంలో, మన దృష్టంతా గుండెపై కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కానీ, బ్రెయిన్ అరెస్ట్ అనరు.’’
"స్పందన లేనందువల్ల మెదడు పని చేయడం లేదు అనేది శాస్త్రీయ అవగాహన. ఈ వ్యక్తులు మాట్లాడలేరు, నిలబడలేరు, కూర్చోలేరు"
మెదడు పనిచేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం. గుండె రక్తాన్ని పంప్ చేయకపోతే ఆక్సిజన్ మెదడును చేరదు.’’
"ఆ తర్వాత మెదడు పని చేయడంలేదని అన్నీ సూచిస్తాయి. అంటే మెదడు కార్యకలాపాలు చాలా తగ్గిపోతాయి అని చెప్పవచ్చు" అని జిమో బోర్జిగిన్ వివరించారు.
అయితే, ఆమె బృందం చేసిన పరిశోధనలు కొన్ని భిన్నమైన విషయాలను వెల్లడించాయి.

ఫొటో సోర్స్, Getty Images
'హైపర్‌డ్రైవ్'లో మెదడు
“సెరోటోనిన్ 60 రెట్లు పెరిగింది, మనకు ‘ఫీల్ గుడ్’ అనుభూతిని కలిగించే డోపమైన్ అనే రసాయనం 40 నుంచి 60 రెట్లు పెరిగింది.
"మనం అప్రమత్తంగా ఉండేలా చేసే నోర్‌పైన్‌ఫ్రైన్, సుమారు 100 రెట్లు పెరిగింది."
జంతువు సజీవంగా ఉన్నప్పుడు ఇంత పెద్దస్థాయిలో అవి పెరగడం అసాధ్యం అని ఆమె చెప్పారు.
చనిపోతున్న ఎలుకల మెదడుపై 2015లో వీళ్ల బృందం మరో పరిశోధన చేసింది.
"రెండు సందర్భాలలో, 100% జంతువులలో మెదడులో పెద్ద ఎత్తున యాక్టివిటీ కనిపించింది." అని ఆమె చెప్పారు.
వాటి మెదడు హైపర్‌డ్రైవ్‌లో ఉంది. అవి హైపర్-యాక్టివ్ స్థితిలో ఉన్నాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గామా తరంగాలు
2023లో, వాళ్లు తమ ఒక పరిశోధనలో ఒక భాగాన్ని ప్రచురించారు. దీనిలో వాళ్లు కోమాలో ఉన్న, లైఫ్ సపోర్ట్ తీసుకుంటున్న నలుగురు రోగులను పరిశీలించారు. దీనిలో భాగంగా మెదడు పనితీరును స్కాన్ చేయడానికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ ఎలక్ట్రోడ్‌లను అమర్చారు.
ఆ నలుగురూ మరణం అంచుల్లో ఉన్నారు. ఆ సమయంలో వైద్యులు, వాళ్ల కుటుంబ సభ్యులు, వాళ్లు బతికే అవకాశం లేదనందువల్ల, వాళ్లపై నమ్మకం వదిలేసుకోవడం మేలని భావించారు.
బంధువుల అనుమతితో వైద్యులు, వాళ్లు బతకడానికి ఆధారంగా ఉన్న వెంటిలేటర్లను ఆపేశారు.
అప్పుడు ఇద్దరు రోగులలో మెదడు అత్యంత చురుకుగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
మెదడులో అత్యంత వేగవంతమైన గామా తరంగాలు సైతం పరిశోధకులకు కనిపించాయి. సంక్లిష్ట సమాచార ప్రాసెసింగ్‌కు, జ్ఞాపకశక్తికి గామా తరంగాలే ఆధారం.
రోగులలో ఒకరి మెదడుకు రెండు వైపులా, టెంపోరల్ లోబ్స్‌లో చాలా కార్యకలాపాలు కనిపించాయి.
సహానుభూతి కోసం, సరైన టెంపోరోపారిటల్ జంక్షన్ ముఖ్యమైనదని డాక్టర్ బోర్జిగిన్ అభిప్రాయపడ్డారు.
కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడిన చాలా మంది రోగులు, దాదాపు మరణం అంచుకు వెళ్లి వచ్చిన అనుభవాలు తమను మంచి వ్యక్తిగా మార్చాయని, తాము ఇతరుల పట్ల సహానుభూతితో ఉండడం పెరిగిందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
మరణపు అంచులలో అనుభవాలు
మరణం అంచుల దాకా వెళ్ళిన కొందరు వ్యక్తులు, తమ జీవితం కళ్ళ ముందు జీవితం ఒక్కసారి మెరుపులా మెరిసి పోతుందని, లేదా జీవితంలోని కీలక క్షణాలు గుర్తుకు వచ్చాయని తెలిపారు.
చాలా మంది తాము తీవ్రమైన కాంతిని చూశామని, మరికొందరు తమ శరీరం తమది కాదన్న అనుభూతి కలిగిందని, పైనుంచి ఏవో దృశ్యాలను గమనిస్తున్నట్లు అనిపించిందని తెలిపారు.
డాక్టర్ బోర్జిగిన్ తన అధ్యయనంలో గమనించిన హైపర్-యాక్టివ్ బ్రెయిన్, కొంతమంది వ్యక్తులు మరణపు అంచులో ఎందుకు ఇలాంటి తీవ్రమైన అనుభవాలను ఎదుర్కొన్నారో వివరిస్తుందా?
"అవును, అది వివరిస్తుందనే నేను అనుకుంటున్నాను" అని ఆమె అన్నారు.
"కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడినవారిలో కనీసం 20% -25% మంది తెల్లటి కాంతి, లేదంటే అలాంటిది మరొకటి కనిపించిందని చెప్పారు. ఇది ఆ సమయంలో వాళ్ల విజువల్ కార్టెక్స్ పని చేసిందని సూచిస్తుంది." అని తెలిపారు.
వెంటిలేటర్లు ఆపివేసాక మెదడు కార్యకలాపాలు పెరిగిన ఇద్దరు రోగుల విషయంలో, వారి విజువల్ కార్టైసెస్ ఈ దృశ్యమాన అనుభవంతో పరస్పర సంబంధం కలిగిన క్రియాశీలతను ప్రదర్శించాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త అవగాహన
డాక్టర్ బోర్జిగిన్, మానవులపై తాను చేసిన అధ్యయనం పరిమాణరీత్యా చాలా చిన్నదని, మనం చనిపోతున్నప్పుడు మెదడులో ఏమి జరుగుతుందనే దానిపై మరింత పరిశోధన అవసరమని అంగీకరించారు.
అయితే, ఈ అంశంపై 10 సంవత్సరాలకు పైగా పరిశోధన చేసిన తర్వాత, ఆమెకు ఒక విషయం స్పష్టమైంది.
"కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడు నిస్తేజంగా ఉండటానికి బదులుగా, చాలా చురుకుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కానీ మెదడుకు ఆక్సిజన్ అందడం లేదని తెలుసుకున్నప్పుడు అది ఏమవుతుందనే దానిని అర్థం చేసుకోవడానికి మేం ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి ఏ సమాచారమూ లేదు. నిజంగా, మనకు ఏమీ తెలియదు.” అని జిమో బోర్జిగిన్ అన్నారు.
నిద్రాణస్థితిని ప్రస్తావిస్తూ, ఎలుకలు, మానవులతో సహా జంతువులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవటానికి శరీరంలోనే అంతర్గత వ్యవస్థ ఉందని తాను ఊహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
"ఇప్పటి వరకు, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మెదడు ఏమీ చేయకుండా ఉంటుందని భావించారు. గుండె ఆగిపోయినప్పుడు మెదడు చనిపోతుంది. మెదడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేక చనిపోతుంది అనేది ప్రస్తుత ఆలోచన.’’ అన్నారామె.
కానీ, అది ఖచ్చితంగా జరిగిందో లేదో మనకు తెలియదని ఆమె అన్నారు.
మెదడు అంత సులభంగా లొంగిపోదని ఆమె భావిస్తున్నారు. ఇతర సంక్షోభ సమయాలలో మాదిరే అది పోరాడుతుందన్నారు.
"నిజానికి మెదడుకు ఈ సమస్యలను లేదా ఆక్సిజన్ కొరతను తట్టుకునే అంతర్గత వ్యవస్థ ఉంది. నిద్రాణస్థితి అనేది దీనికి మంచి ఉదాహరణ అని నేను నమ్ముతున్నాను. కానీ దానిని ఇంకా పరిశోధించాలి.” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కనిపెట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి
తాను, తన సహచరుల అధ్యయనంలో కనుగొన్నది చాలా తక్కువని, ఇంకా చాలా పరిశోధించాల్సి ఉందని డాక్టర్ బోర్జిగిన్ అన్నారు.
"మెదడుకు హైపోక్సియాతో (ఆక్సిజన్ అందకపోవడం) ఎలా వ్యవహరించాలో తెలిసిన అంతర్గత వ్యవస్థ ఉందని నేను నమ్ముతున్నాను, అది మనకు అర్థం కాకపోవచ్చు.’’
"కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తులకు ఈ అద్భుతమైన, ఆత్మాశ్రయ అనుభవం కలుగుతుందని మనకు తెలుస్తోంది. మెదడు కార్యకలాపాలు పెరగడం చూసి ఆ అనుభవం నిజమేనని మా డేటా చెబుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే: చనిపోతున్న మెదడులో ఎందుకు కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి? అని ’’
"దీన్ని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి మనం అందరం కలిసి పని చేయాలి. ఎందుకంటే మనం మరణం గురించి సరిగా అర్థం చేసుకోక పోవడం వల్ల కోట్లాది మరణాలకు సరైన రోగనిర్ధరణ చేయలేకపోతున్నాం." అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బొడ్డులో దూదిలాంటి వ్యర్థాలు ఎలా చేరతాయి, అక్కడ ఇంకా బతికే జీవులు ఏంటి, వాటితో ప్రమాదమెంత?
- ఇల్లు కిరాయికి ఇస్తే నట్టింట్లో 3 అడుగుల మట్టిపోసి గంజాయి సాగు చేశారు
- పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది
- క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














