‘పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడం లేదు’ - చెన్నై సమీపంలోని ఐఫోన్ తయారీ కంపెనీపై నివేదిక కోరిన కేంద్రం

చెన్నై సమీపంలో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ బయట హైరింగ్ ఏజెంట్‌తో మాట్లాడుతున్న ఉద్యోగ అభ్యర్థులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ బయట హైరింగ్ ఏజెంట్‌తో మాట్లాడుతున్న మహిళా అభ్యర్థులు

ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌లో ఉద్యోగాలకు పెళ్లయిన మహిళలను తీసుకోవడం లేదన్న మీడియా కథనాల నేపథ్యంలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్‌పై నివేదిక ఇవ్వాలని కేంద్రం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

ఫాక్స్‌కాన్ చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంట్‌లో ఉద్యోగాలకు పెళ్లయిన మహిళలను తీసుకోవడం లేదంటూ రాయిటర్స్ వార్తాసంస్థ ఇన్వెస్టిగేషన్ కథనం ఆరోపించింది.

పెళ్లికాని మహిళలతో పోల్చినప్పుడు పెళ్లయిన మహిళలకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండటం దీనికి కారణంగా చెప్తోందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

అయితే.. పురుషులు, మహిళలను నియమించుకునేటప్పుడు ఎలాంటి వివక్షను చూపించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దీనిపై సమాధానం చెప్పాలంటూ రాయిటర్స్ పంపిన అభ్యర్థనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, యాపిల్ కంపెనీ కానీ స్పందించలేదు.

దీనిపై బీబీసీ కూడా తమిళనాడు కార్మిక విభాగం, ఫాక్స్‌కాన్‌ల స్పందన కోరింది.

యాపిల్ ఐఫోన్లకు అతిపెద్ద సరఫరాదారు ఫాక్స్‌కాన్.

2017లో ఈ కంపెనీ తమిళనాడులో తన తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి భారత్‌లో తన ఆపరేషన్స్‌ను వేగంగా విస్తరిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
foxconn

ఫొటో సోర్స్, Getty Images

2023లో తమిళనాడులో ఐఫోన్ 15ను అసెంబుల్ చేయడం ప్రారంభించింది ఫాక్స్‌కాన్.

ఈ ఏడాది ప్రారంభంలో, తమిళనాడులో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్‌తో సైతం ఒప్పందం చేసుకుంది.

అయితే, భారత్‌లో ఈ సంస్థ నియామకాల విధానాలపై వస్తున్న నివేదికలు ఆందోళనకరంగా ఉన్నాయని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఉపాధి అవకాశాల కోసం వేల మంది ఈ ఫ్యాక్టరీల వైపు చూస్తుంటారని చెబుతున్నారు.

ఫాక్స్‌కాన్ అనుసరిస్తోన్న నియామకాల విధానంపై కథనాన్ని అందించడం కోసం తాము ఫాక్స్‌కాన్ హైరింగ్ ఏజెన్సీలతో, ఎంతోమంది ఉద్యోగులతో మాట్లాడామని రాయిటర్స్ తెలిపింది.

‘‘కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం, ప్రెగ్నెన్సీ, ఎక్కువగా విధులకు రాలేకపోవడం వంటి కారణాలను చూపిస్తూ..’’ ఫాక్స్‌కాన్ వివాహిత మహిళలను తన ప్లాంట్‌లో నియమించుకునేందుకు తిరస్కరిస్తోందని హైరింగ్ ఏజెంట్లు, ఫాక్స్‌కాన్ హెచ్‌ఆర్‌ విభాగానికి చెందిన వారు చెప్పినట్లు రాయిటర్స్ రిపోర్టు తెలిపింది.

తన కార్మిక విధానాలపై ఈ సంస్థ ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు.

అమెజాన్ కోసం ఉత్పత్తులు తయారు చేసే చైనాలోని ఒక ఫ్యాక్టరీలో తాత్కాలిక కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తోందని, ఎక్కువ పని భారాన్ని మోపుతోందంటూ 2018లో కూడా ఈ సంస్థపై అమెరికాకు చెందిన ఒక హక్కుల బృందం ఆరోపణలు చేసింది.

2022లో చైనాలో ఫాక్స్‌కాన్ ఐఫోన్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు నిరసనలు చేశారు. సంస్థ కొన్ని బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)