వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..

మద్యం సేవిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, OTHERS

మద్యపానం వల్ల ఏటా 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. మద్యపానం వల్ల గుండె జబ్బులు, కాలేయ క్యాన్సర్, మానసిక అనారోగ్యం తదితర వ్యాధుల ముప్పు పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

మద్యం, మత్తుపదార్థాలకు బానిసలుగా మారినవారి ఆరోగ్య సంరక్షణపై నియమించిన కమిషన్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది మద్యం, ఇతర సైకో యాక్టివ్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని, ఇందులో 20 కోట్ల 90 లక్షల మంది మద్యపానానికి అలవాటుపడిన వారున్నారని ఆ నివేదిక అంచనా వేసింది.

ప్రజారోగ్యానికి మద్యపానం తీవ్రమైన ప్రమాదకారి, అధిక మోతాదులో మద్యం సేవించేవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

‘‘ప్రజారోగ్యం, వారి సంక్షేమం మెరుగుపడాలంటే మద్యం వినియోగాన్ని అరికట్టడానికి మనమంతా కట్టుబడి ఉండాలి’’ అని తెలిపింది.

బీబీసీ తెలుగున్యూస్ వాట్సాప్ చానల్
ఆల్కహాల్

ఫొటో సోర్స్, Getty Images

ఈ మూడు దేశాలే టాప్..

ఐరోపా ఖండంలోని దేశాలే మద్యం వినియోగంలో ముందు వరుసలో ఉన్నాయని, ఆ దేశాలలో ఒక్కో మద్యపాన ప్రియుడు సగటున ఏటా 9.2 లీటర్ల మద్యాన్ని సేవిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది.

ఐరోపా తరువాత అమెరికా ఖండంలో మద్యానికి అలవాటుపడిన వ్యక్తి సగటున ఏటా 7.5 లీటర్ల మద్యం తాగుతున్నారని డబ్ల్యూహెచ్‌వో నివేదిక వెల్లడించింది.

1. రొమేనియా

అత్యధికంగా మద్యం వినియోగించే దేశాలలో రొమేనియాది ప్రథమ స్థానం. ఈ భూమ్మీద అత్యధికంగా తాగేవారిలో రొమేనియా పురుషులు ముందు వరుసలో ఉంటారు.

సగటున ఒక రొమేనియన్ పురుషుడు ఏటా దాదాపు 27.3 లీటర్ల మద్యాన్ని సేవిస్తారు.

ఒక దేశంగా మద్యపానంలో రొమేనియా సగటు 16.99 లీటర్లు.

ఇది జార్జియన్ల కంటే 3 లీటర్లు ఎక్కువ.

సుమారు కోటి 90 లక్షల 12 వేల మంది జనాభా ఉన్న ఆ దేశం వైన్ బార్స్‌కు ప్రసిద్ధి చెందింది.

2. జార్జియా

పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన జార్జియా యూరప్, ఆసియా మధ్య ఉంటుంది.

38 లక్షల జనాభా ఉన్న జార్జియా మద్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరు గాంచింది.

అత్యంత పురాతన వైన్ తయారీ దేశంగా జార్జియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ ఎక్కింది.

వైన్, మద్యం తయారీలో ఎంతో చరిత్ర కలిగిన జార్జియా ఇప్పుడు, మద్యం వినియోగంలో ప్రమాదఘంటికలు మోగించే స్థాయిలో ఉంది.

ఏటా జార్జియన్లు సగటున14.33 లీటర్ల స్వచ్ఛమైన ఆల్కహాల్ సేవిస్తారు.

3. చెక్ రిపబ్లిక్

చెక్ రిపబ్లిక్ అద్భుతమైన కోటలు, ప్రత్యేకమైన సంస్కృతికే కాదు, బీరు తయారీలోనూ ప్రసిద్ధిగాంచింది.

ఇక్కడ అత్యంత ప్రసిద్ధి పొందిన పానీయం బీర్.

అక్కడి ప్రజలు బీరును ఇష్టపడే తీరే ఆ దేశాన్ని ఎక్కువగా మద్యాన్ని వినియోగించే దేశాలలో మూడో స్థానంలో నిలిపింది.

చెక్ ప్రజలు సగటున ఏటా 13.29 లీటర్ల ఆల్కాహాల్‌ను సేవిస్తారు.

దీనికితోడు మద్యంపై తలసరి వ్యయం విషయంలో నాలుగు బిలియన్ డాలర్లతో ఆ దేశం తొలి ర్యాంకును పొందినట్టు 2019 నాటి యురోపియన్ గణాంక కార్యాలయం యూరో‌స్టాట్ నివేదిక చూపుతోంది.

కల్తీ మద్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కొన్ని దేశాలలో వీధులలోనే మద్యాన్ని విక్రయిస్తారు.

అనేక దేశాల్లో కల్తీ మద్యం

మద్యపానం వల్లే కాకుండా, కల్తీ మద్యం వల్ల కూడా ఎక్కువమంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.

‘‘కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారు. అందుకే నేను కూడా బతకను అనుకున్నా’’ అని సత్య చెప్పారు. ఇటీవల తమిళనాడులో కల్తీ సారా తాగి ఆస్పత్రి పాలైన 219 మంది బాధితులలో సత్య కూడా ఒకరు.

తమిళనాడులోని కళ్లకురిచ్చీలో కల్తీ సారా తాగి మొత్తం 57 మంది చనిపోయారు.

‘’20 ఏళ్ళుగా నేను మద్యం తాగుతున్నా. హాస్పిటల్లో గడిపిన ప్రతి రోజు ఓ సంవత్సరంలా అనిపించింది. ఇప్పుడు మద్యం తాగడం మానేశా’’ అని మురుగన్ బీబీసీకి చెప్పారు.

రష్యాలో కల్తీ మద్యం సేవించి సగటున ఏటా 900 మంది చనిపోతున్నారని వినియోగదారుల హక్కుల సంస్థలు చెబుతున్నాయి.

ఇరాన్‌లో 2020లో కల్తీ మద్యం తాగి 44 మంది చనిపోయారు.

2018లో ఇండోనేషియాలో 45 మంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు.

కల్తీ మద్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కల్తీ మద్యం వల్ల చనిపోయిన తన భర్త ఫోటోతో ఇండోనేషియా మహిళ

స్థానికంగా మద్యం తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మద్యం కలుషితమవుతంది.

ప్రభుత్వాల అనుమతులు ఉన్న కంపెనీలు మద్యం తయారీలో అనేక ప్రమాణాలను పాటిస్తాయి.

అయితే, ధరల పెరుగుదల కారణంగా, కొందరు పేదలు బ్రాండెడ్ మద్యాన్ని కొనుగోలుచేయలేక స్థానికంగా లభించే మద్యాన్ని సేవిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

కల్తీ మద్యం వల్ల బెంగాల్లో 2011లో 170 మంది, 2009లో గుజరాత్‌లో 100 మంది, 2015లో ముంబయిలో 100 మంది మరణించారు.

దక్షిణాఫ్రికాలో ఓ నైట్‌క్లబ్‌లొ 21 మృతదేహాలను 2022లో పరిశోధకులు గుర్తించారు.

ముస్లిం దేశాలలో నిషేధం

ఇస్లాంలో మద్యపానం నిషిద్ధం. అందుకే చాలా ముస్లిం దేశాలు మద్యపానాన్ని నిషేధించాయి.

ఇరాన్, ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాలలో బార్లపై కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అక్కడ బార్ల సంఖ్య తగ్గడానికి దోహదపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)