వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?

ఫొటో సోర్స్, SeaTerra
- రచయిత, సోఫీ ఆర్డాచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్ర గర్భాల్లో 1.6 మిలియన్ టన్నులకి పైగా ఉపయోగించని (పేల్చని) ఆయుధాలు ఉన్నాయి.
సముద్ర గర్భంలో రిమోట్‌తో పనిచేసే క్రాలర్లు (సముద్రం అడుగున తిరిగే వాహనాలు), స్మార్ట్ గ్రాబర్స్(వస్తువులను పట్టుకునే ఏర్పాటు)తో కూడిన రోబోట్‌లు ఇప్పుడు ఈ విషపూరిత ఆయుధాలను వెలికితీసి సముద్రాన్ని శుభ్రం చేస్తున్నాయి.
ఒక బాక్సీ రోబోట్ ఉత్తర జర్మనీ సమీపంలోని సముద్రగర్భంలో మెల్లగా కదులుతూ, తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది. దాని లక్ష్యం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సముద్రంలో పడేసిన తప్పుపట్టిన గ్రెనేడ్.
మరో రోబోట్ సముద్రం ఉపరితలంపై ఈదుతూ, నీటి అడుగున ఆయుధాల కోసం స్కాన్ చేస్తూ ఉంటుంది. మరికొన్ని రోబోలు సముద్ర గర్భంలోకి వెళ్లి, తమ పంజాతో బాంబులను, ఇతర వస్తువులను పట్టుకుని పైకి వస్తాయి.
ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రాలను కలుషితం చేస్తున్న నీటి అడుగు ఆయుధ సామగ్రిని గుర్తించి, నాశనం చేసే ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు జర్మన్ ప్రభుత్వ మద్దతుతో పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా బాల్టిక్ సముద్రంలో, నిర్దేశిత ప్రాంతంలో ఈ రోబో టెక్నాలజీ, ఇతర టెక్నాలజీలను వినియోగిస్తున్నారు.
దాదాపు 10.69 కోట్ల డాలర్ల (సుమారు రూ. 84 కోట్లు ) తో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, జర్మనీ పరిధిలోని ఉత్తర, బాల్టిక్ సముద్రాల్లో పేరుకుపోయిన ఆయుధాలను సురక్షితంగా వెలికితీసి, వాటిని నాశనం చేసే విధానాన్ని అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సుమారు 1.6 మిలియన్ టన్నుల (16 లక్షల టన్నుల) పేలుడు పదార్థాలు, ఆయుధాలను సముద్రంలో పడవేసినట్లు అంచనా.

''యుద్ధం జరిగిన ప్రతి సముద్రప్రాంతంలో ఆయుధాలు పోగుపడతాయి. అవి చాలాకాలం పాటు సముద్ర గర్భంలోనే ఉన్నప్పుడు క్యాన్సర్ కారకాలను, ఇతర విష పదార్థాలను విడుదల చేస్తాయి.'' అని జర్మనీలోని కీల్‌లో ఉన్న క్రిస్టియన్ ఆల్బ్రెచ్ యూనివర్సిటీలో డీప్ సీ మానిటరింగ్ ప్రొఫెసర్ జెన్స్ గ్రీనెర్ట్ చెప్పారు. ఈయన జియోమర్ హెల్మ్‌హోల్జ్ సెంటర్ ఫర్ ఓషన్ రీసర్చ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సహకరిస్తున్న శాస్త్రవేత్తల్లో ఈయన కూడా ఒకరు.
సంప్రదాయ ఆయుధాలు లేదా రసాయనిక ఆయుధాలను సముద్రంలో ఎక్కడెక్కడ డంప్ చేశారో ఈ మ్యాప్ వివరిస్తుంది.
''ఈ ఆయుధాలు తుప్పుపట్టిపోతున్నాయి. కాలక్రమేణా అవి మరింత ఎక్కువగా క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తున్నాయని మా పరిశోధనలో తేలింది. చేపలు, మస్సెల్స్‌లో వీటి జాడలు కనిపించాయి'' అని గ్రీనెర్ట్ చెప్పారు.
''మనం ఇంకా ఎక్కువ కాలం వేచిచూస్తే, అవి ఇంకా తుప్పుపట్టి మరిన్ని హానికారక పదార్థాలు నీటిలో కలిసే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఆ ఆయుధాలు పాడైపోకముందే గుర్తించి, వాటిని ఏం చేయాలో తేల్చేందుకు ఇది సరైన సమయం.'' అని ఆయన అన్నారు.
ఆయుధాలు తుప్పుపట్టడం, వాటి నుంచి హానికారక పదార్థాల లీకేజీ గురించి శాస్త్రీయ ఆధారాలు లభ్యం కావడంతో సముద్ర గర్భం నుంచి వాటిని తొలగించక తప్పదని జర్మనీ నిర్ణయించింది.
''ఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థ కోసం మనం ఏం చేయాలి? అనేదే మన తొలి ప్రాధాన్యం.’’ అని జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖలో సముద్ర సంరక్షణ నిపుణులు, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న హైకీ ఇమాఫ్ చెప్పారు.
రోబోల సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో సముద్రం నుంచి వెలికితీసిన ఆయుధాలను నాశనం చేసే డిటోనేటర్ చాంబర్‌ను సముద్ర తీరంలో నిర్మిస్తామని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, SeaTerra
సముద్ర గర్భం నుంచి ఆయుధాలను వెలికితీసేందుకు ఇప్పటి వరకూ పీస్‌మీల్ విధానాన్ని వినియోగించేవారు. ఉదాహరణకు, ఆఫ్‌షోర్ విండ్ ఫామ్ డెవలపర్లు బాంబులు , మైన్స్‌ను గుర్తించేందుకు సర్వే చేస్తారు. అలాంటివి ఏవైనా గుర్తించినట్లయితే ఆ ప్రదేశాల నుంచి తప్పుకోవడం లేదా వాటిని తొలగించడం చేస్తారు. డైవింగ్, స్విమ్మింగ్ ఎక్కువగా ఉండే ఈ పనుల్లో మానవ డైవర్లకు ప్రమాదం జరగకుండా నివారించడం కోసం క్రాలింగ్ రోబోలు ఉంటాయి.
పర్యావరణ పర్యవేక్షణ కోసం నిర్వహించే శాస్త్రీయ పరిశోధనలో సిబ్బంది లేని వాహనాలను వినియోగిస్తారు. వాటిలో రిమోట్‌తో పనిచేసే వాహనాలు (రిమోట్‌లీ ఆపరేటెడ్ వెహికల్స్-ROV's) ఉంటాయి. సముద్ర గర్భం లోపల స్విమ్మింగ్, డైవింగ్ పనులు చేసే ఈ ఆర్‌వోవీలు వైర్‌తో ఓడకు అనుసంధానించి ఉంటాయి. అలాగే, సముద్ర గర్భం లోపల తిరిగే క్రాలర్లను కూడా రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. వాటికి వివిధ రకాల సెన్సర్లు, కెమెరాలు అమర్చి ఉంటాయి.
జర్మనీ చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే, ఆర్వోవీలు, క్రాలర్స్ తో పాటు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం రూపొందించిన కొన్ని టెక్నాలజీలను అనుసంధానం చేశారు. ఇది సముద్రగర్భంలో బాంబులను తొలగించడం మాత్రమే కాకుండా, చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్న బాంబులను కూడా గుర్తించి తొలగిస్తుంది.
జర్మనీ నిరాయుధీకరణలో భాగంగా ఇక్కడ బాంబులు పోగుపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, దాని మిత్రదేశాలు తమ వద్దనున్న సంప్రదాయ ఆయుధాలతో పాటు రసాయనిక ఆయుధాలను, షిప్పుల కొద్దీ గ్రెనేడ్లు, బాంబులను సముద్రంలో డంప్ చేశాయి.
''గత 10, 20 ఏళ్లుగా విండ్ ఫార్మ్స్, కేబుల్స్, హార్బర్ విస్తరణ ప్రాజెక్టుల కోసం ఆయుధాలను తొలగిస్తూ వస్తున్నాం. ఎక్కువ ఆయుధాలు లేని ప్రాంతాలను మేం సిద్ధం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే, బాంబులను ఎక్కువగా పడవేసిన ప్రాంతాలు ప్రాజెక్టులకు అనువుగా ఉండవు.'' అని ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొంటున్న యూఎక్స్‌వో(అన్‌ఎక్స్‌ప్లోడెడ్ ఆర్డ్‌నెన్స్ - పేలని ఆయుధ సామగ్రి) సర్వే, క్లియరెన్స్ కంపెనీల్లో ఒకటైన సీటెర్రా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డైటర్ గుల్డిన్ చెప్పారు. ''పర్యావరణం కోసం ఆయుధాలను క్లియర్ చేద్దాం. సముద్రాన్ని శుభ్రం చేయడానికి వాటిని తొలగిద్దాం అని ఇంతకుముందెవరూ చెప్పలేదు. ఇది పూర్తిగా కొత్త విధానం'' అన్నారు.
''బాంబులను పడవేసిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని, పూర్తి స్థాయిలో 24/7 పనిచేయడమే ఈ కొత్త విధానంలో కీలకం'' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులతో జర్మనీ మందుగుండు సామగ్రిని తొలగించేందుకు 150 ఏళ్లు పడుతుందని గుల్డిన్ లెక్కలు వేశారు.
''30 ఏళ్లలోనే సముద్రంలోని బాంబులను తొలగించేందుకు అవసరమైన విధానాలను అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, European Atlas of the Seas/EMODnet
ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా సీటెర్రాతో పాటు ఇతర స్పెషలిస్ట్ కంపెనీలు బాల్టిక్ సముద్రంలోని లుబెక్ బేలో ఉన్న ఆయుధాలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. లుబెక్ బే లోని 400 ఆయుధాల్లో కొన్నింటిని మాత్రమే మొదటి దశలో అవి తొలగించనున్నప్పటికీ, ఇది ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గాలను చూపనుంది.
ఇప్పటికే ఇక్కడ వినియోగిస్తున్న చాలా టెక్నాలజీలు ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల్లో వాడుతున్నవే. కానీ శిథిలమైన బాంబులు, మైన్స్, గ్రెనేడ్‌లు, ఆయుధ సామగ్రిని ఏరివేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం కోసం వాటిని వినియోగిస్తున్నట్లు గుల్డిన్ చెప్పారు.
సముద్ర గర్భం ఉపరితలం నుంచి సర్వే చేసే ఆర్వోవీకి కెమెరా ఉంటుంది. అది సముద్ర గర్భం మీదుగా కదులుతూ మందుగుండు సామగ్రిని చిత్రీకరిస్తుందని గుల్డిన్ చెప్పారు. ఓడలో ఉండే నిపుణులు ఆ కెమెరాలో రికార్డ్ అవుతున్న వాటిని స్క్రీన్‌పై చూస్తూ బాంబులను గుర్తిస్తారు.
సీటెర్రా కంపెనీ వస్తువులను పట్టుకునే పంజా మాదిరిగా తయారు చేసిన 'స్మార్ట్ గ్రాబర్స్'ను కూడా వినియోగిస్తోంది. వాటికి సెన్సార్లు అమర్చి ఉంటాయి. ఓడలోని క్రేన్‌లకు ఇవి అనుసంధానం చేసి ఉంటాయని గుల్డిన్ చెప్పారు. అవి నీటిలోకి వెళ్లి ఆయుధాలు ఉన్న పరిస్థితిని బట్టి, వాటిని సున్నితంగా లేదా దృఢంగా పట్టుకుంటాయి. ఉదాహరణకు, మందుగుండు సామగ్రి చుట్టూ పాడైపోయిన షెల్ ఉన్నట్లయితే, దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా బయటికి తీయవలసి ఉంటుందని ఆయన వివరించారు.
గొలుసుకట్టు చైన్ మీద నడిచే ఒక క్రాలర్ (ఎక్స్‌కవేటర్ లాంటి చిన్న వాహనం) సముద్రగర్భంలో తిరుగుతూ, దాని చిన్న పంజాతో చిన్నచిన్న మందుగుండు సామగ్రిని సేకరిస్తుందని గుల్డిన్ చెప్పారు. అలా వస్తువులను పట్టుకోగలిగిన గ్రాబర్స్ అన్నింటికీ కెమెరాలు అమర్చి ఉంటాయి.
స్మార్ట్ గ్రాబర్లు సేకరించిన బాంబులు, లేదా ఆయుధాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప బాస్కెట్‌లో ఉంచుతాయి. ఒక్కో బాస్కెట్‌లో ఒకటి లేదా రెండు బాంబులు లేదా ఆయుధాలను ఉంచేలా చూస్తారు. 24 గంటలూ పనిచేసేలా ఓడలో షిఫ్టుల వారీగా నిపుణులు ఉంటారు. ''మందుగుండు సామగ్రిని గుర్తించి వాటిని ఆ బాస్కెట్లలో వేసేలా చేయడమే వారి పని.'' అని గుల్డిన్ చెప్పారు.
''రెండో ఓడపై అమర్చిన క్రేన్ సాయంతో ఈ ఇనుప బాస్కెట్‌లను పైకి తీస్తారు. అక్కడ వాటిని శుభ్రం చేసి, వాటి బరువు చెక్ చేస్తారు. వాటిని ఫోటోలు తీసిన అనంతరం స్టీల్ పైపులో వరుసగా పేర్చుతారు. సముద్రం అడుగుభాగంలో చదరంగం బోర్డు మాదిరిగా ఏర్పాటు చేసిన గ్రిడ్‌పై వాటిని ఉంచుతారు. ఒక్కో చతురస్రపు బ్లాక్‌లో ఒక్కో రకమైన మందుగుండు సామగ్రిని ఉంచుతారు'' అని గుల్డిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, SeaTerra
చివరి దశలో వాటిని నాశనం చేస్తారు. ఈ ప్రక్రియలో ఆయుధాలను జాగ్రత్తగా క్రమబద్దీకరించడం ముఖ్యమని గుల్డిన్ వివరించారు. ప్రాజెక్టు తర్వాతి దశలో భాగంగా, ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫాంలో ఏర్పాటు చేసిన భారీ, ఓవెన్ లాంటి డిటోనేషన్ చాంబర్‌లో ఆయుధ సామగ్రిని లోడ్ చేస్తారు. అక్కడ వాటిని కాల్చేస్తారు.
ఈ ప్రాజెక్టులో ఆయుధాలను నాశనం చేయడమే కీలకమైన అంశం. ఆయుధాలను సముద్రంలో పేల్చివేసే సంప్రదాయ పద్ధతుల కంటే కాల్చివేసే ప్రక్రియ పర్యావరణ హితమని అందులో పాల్గొన్నవారు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో బ్లాస్టింగ్ చేయడం ఉండదు.
ఆయుధాలను నాశనం చేసేందుకు బ్లాస్టింగ్ చేసే విధానంపై అనేక కారణాల రీత్యా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పేలుడు కారణంగా వచ్చే శబ్దం పోర్పోయిస్ వంటి సముద్రజీవులకు హాని కలిగిస్తుంది. నీటి అడుగున శబ్దాన్ని తగ్గించడానికి మార్గాలు ఉన్నప్పటికీ, కాలుష్యానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
''ఉత్తర సముద్ర తీరంలో లేదా సాధారణ పద్ధతిలో సముద్రంలో ఆయుధాలను పేల్చినప్పుడు, విషపూరిత పేలుడు పదార్థం పూర్తిగా కాలిపోదు. దాని అవశేషాలు మొత్తం వ్యాపించి, అల వచ్చినప్పుడు అది నీటిలో కొట్టుకుపోయి అంతటా వ్యాపిస్తుంది'' అని జర్మన్ ప్రాజెక్టుకి మద్దతు ఇస్తున్న జర్మన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీకి సీనియర్ సైంటిఫిక్ సలహాదారు అనిత కునిట్జర్ చెప్పారు.
పైలట్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా, లుబెక్ బేలో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకూ దాదాపు 50 టన్నుల ఆయుధాలను వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో వెలికితీసిన ఆయుధాలను జీఈకేఏ సంస్థ ఏర్పాటు చేసిన డిటోనేషన్ చాంబర్‌లో కాల్చివేస్తారు. ఇది సంప్రదాయ, రసాయనిక ఆయుధాలను నాశనం చేయడంలో ప్రత్యేకత కలిగిన సంస్థ.

ఫొటో సోర్స్, SeaTerra
బీచ్‌లో రాళ్లలా..
సముద్రంలో పడవేసిన ఆయుధాల సమస్య చాలా తీవ్రమైనది. ఎందుకంటే, పిల్లలు లేదా బీచ్‌లో తిరిగే వారు అప్పుడప్పుడు రాళ్లు అనుకుని, ఆయుధాల భాగాలను తీసుకుంటూ ఉంటారు. వేడెక్కినప్పుడు అవి మండుతాయి. చేతిలో, లేదా ప్యాంటు జేబులో పెట్టుకున్నప్పుడు వేడి కారణంగా వాటి నుంచి మంటలు చెలరేగుతాయి.
యూరప్‌లో వాకర్లు, డైవర్లు, ఫిషింగ్ సిబ్బంది కూడా యుద్ధకాలపు పాత ఆయుధాలను వెతికే పనిలో ఉన్నారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఆస్పార్ కమిషన్ అలాంటి వందల సంఘటనలను రికార్డ్ చేసింది.
యూరప్‌లోని భారీ ఆఫ్‌షోర్ విండ్ ఫామ్ ప్రాజెక్టుల విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనూ పేలని ఆయుధాలు తారసపడుతూ ఉంటాయి.
''ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా విండ్ ఫామ్‌లు నిర్వహిస్తున్నాం. ప్రతి ప్రదేశంలోనూ పేల్చకుండా వదిలేసిన ఆయుధాలు చాలా కనిపిస్తుంటాయి'' అని ఆర్డ్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ లీ గూడెర్‌హ్యామ్ చెప్పారు. యూకే కేంద్రంగా పనిచేస్తున్న ఈ కన్సల్టెన్సీ సంస్థ పేల్చకుండా పడేసిన ఆయుధాల రిస్క్ మేనేజ్‌మెంట్‌పై పనిచేస్తుంది.
''వాటిలో కొట్టుకుపోయిన మైన్స్, లెక్కల్లో లేని బాంబులు, యుద్ధంలో గురితప్పిన టార్పెడోలు'' వంటివి ఉంటాయని ఆయన చెప్పారు.
పురాతన మ్యాపులు కచ్చితంగా ఉండకపోవచ్చు. పేలని ఆయుధాలను వెలికితీయడంలో ఆఫ్‌షోర్ డెవలపర్లకు సాయపడడానికి వీలుగా కచ్చితమైన మ్యాపులను రూపొందించేందుకు ఆర్డ్‌టెక్ సంస్థ అదనపు డేటాను ఉపయోగిస్తుంది. అందులో భాగంగా డ్రోన్లను వాడడం మాత్రమే కాకుండా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంకా ఇతర దేశాల మిలిటరీ లేదా ఆర్కైవ్స్ నుంచి సమాచారం పొందేందుకు పరిశోధకులను పంపుతుంది.

ఫొటో సోర్స్, Institute of Oceanology PAN
రసాయనిక ముప్పు
యుద్ధ కాలంలో పడేసిన మరో విషపూరిత వస్తువులను పరిశోధించేందుకు కూడా ఈ రోబోలు సాయపడుతున్నాయి. అవే రసాయన ఆయుధాలు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంప్రదాయ ఆయుధాల తరహాలోనే రసాయన ఆయుధాలను కూడా సముద్రంలో పడవేశారు. అవి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.
రసాయన ఆయుధాలను అత్యంత జాగ్రత్తగా సముద్రం నుంచి వెలికితీసి, పర్యావరణహిత మార్గాల్లో వాటిని నాశనం చేయాల్సి ఉంటుందని ఆయుధ రంగ నిపుణులు, పోలిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీలో పరిశోధకుడిగా ఉన్న జాసెక్ బెల్డోస్కీ చెప్పారు. కానీ, ఆచరణలో అది చాలా కష్టమని ఆయన చెప్పారు.
''ఒక్క బాల్టిక్ సముద్రంలోనే దాదాపు 40 వేల టన్నుల రసాయన ఆయుధాలు ఉండొచ్చు. స్కాగెర్రాక్ (నార్వే, స్వీడన్ సమీపంలో) దాదాపు 1,50,000 టన్నులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాలు, మహాసముద్రాల్లో ఇంకా భారీ మొత్తంలో ఉండొచ్చు. అంత భారీ మొత్తంలో ఆయుధాలను వెలికితీసి, నాశనం చేయడం ఇప్పుడున్న టెక్నాలజీతో అసాధ్యం'' అని ఆయన అన్నారు.
సముద్రంలో పడేసిన రసాయనిక ఆయుధాల వల్ల కలిగే ప్రమాదం గురించి మనకి ఇంకా చాలా తక్కువ తెలుసని బెల్డోస్కీ అన్నారు. వాటిని నాశనం చేసే ప్రక్రియ చాలా క్లిష్టతరమని, అది పర్యావరణంతోనూ ముడిపడి ఉంటుందని అన్నారు.
కాలం గడిచేకొద్దీ కొన్ని తక్కువ విషపూరితం అవుతాయని, ఇంకొన్ని మరింత విషపూరితమవుతాయని, మరికొన్ని స్థిరంగా ఉంటాయని ఆయన చెప్పారు.
పరిశోధకులు సముద్ర గర్భంలోని రసాయన ఆయుధాలను, వాటి చుట్టూ ఉన్న పరిస్థితులను ఆర్వోవీ సాయంతో అధ్యయనం చేశారు. ఇటు ప్రభుత్వం, అటు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ ఒక్కొక్కటిగా ఆ రసాయన ఆయుధాలను ఏం చేయాలో తేల్చేందుకు నిర్ణయం తీసుకునే ఒక ఏర్పాటు కూడా చేశారు.
అందులో భాగంగా మొదట స్థిరంగా ఉన్నవాటిని పర్యవేక్షిస్తూ ఉండడం, అవసాన దశకు చేరుకుని ప్రమాదకరంగా మారిన వాటిని గుర్తించి, వీలైనంత త్వరగా వాటిని బయటకు తీసి, నాశనం చేయడం అవసరం.'' అని ఆయన చెప్పారు. ఒక పరిశ్రమలాగా ఈ పని చేపడితే ఉపయోగకరమని ఆయన అన్నారు.
''లుబెక్ బేలో ప్రస్తుతం సంప్రదాయ ఆయుధాలను వెలికితీసి నాశనం చేసే ప్రక్రియ చేపట్టడంలో జర్మనీ చూపిన చొరవ, రసాయన ఆయుధాల విషయంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, దాదాపు వాటిని నాశనం చేసే ప్రక్రియలోనూ చాలా దశలు ఒకేలా ఉంటాయి'' అని బెల్డోస్కీ చెప్పారు.
''రసాయన ఆయుధాల్లోని రసాయనాలు బయటకు లీక్ కాకుండా సురక్షితంగా వెలికి తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతల వద్ద, రసాయనాల ప్రభావం బయటికి వెలువడకుండా వాటిని నాశనం చేయాలి.'' అన్నారు.
సముద్రంలో పేరుకుపోయిన ఆయుధాలను తొలిగించేందుకు జర్మనీ చేపట్టిన ప్రాజెక్టుకి పర్యావరణ కారణాలే ప్రాధాన్యం. కానీ దీర్ఘకాలికంగా చూస్తే, విండ్ ఫార్మ్స్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా కూడా ఆయుధాలను సులభంగా వెలికితీసి నాశనం చేసే అవకాశం ఏర్పడుతుందని సైంటిస్ట్ గ్రీనెర్ట్ చెప్పారు.
జర్మన్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రజల నుంచి సానకూల స్పందన రావడం సంతోషించాల్సిన అంశాల్లో ఒకటని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌లో శాంతి స్థాపనకు పుతిన్ షరతులను తిరస్కరించిన ఇటలీ, జర్మనీ
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














