రాహుల్ గాంధీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేతను షాడో ప్రధాని అని ఎందుకంటారు?

రాహుల్ గాంధీకి పుష్పగుచ్ఛమందిస్తున్న మల్లికార్జున్ ఖర్గే

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పదేళ్ళ తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత పదవిని దక్కించుకుంది.
    • రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. దీంతో 10 ఏళ్ళ తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కినట్టయింది.

16, 17 సభలలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా 44, 52 స్థానాలు మాత్రమే రావడంతో ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు.

సంఖ్యాబలం రీత్యా అతిపెద్ద విపక్షంగా మాత్రమే పరిగణించారు. ఫలితంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేకుండా పదేళ్ళు గడిచిపోయాయి.

2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత స్థానం పొందే అవకాశం లభించింది.

ఈమేరకు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పాత్ర కీలకం.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలోని మంచి చెడ్డలను ఎత్తిచూపడం, సభను ప్రజలకు జవాబుదారీ చేయడం, ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు, విధానాలకు ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ప్రతిపక్ష నేతల ఫోటో

ఫొటో సోర్స్, https://eparlib.nic.in/

ఫొటో క్యాప్షన్, 1969 నుంచి లోక్‌స‌భ ప్రతిపక్ష నేతలు

ప్రతిపక్ష నేతను షాడో ప్రధాని అని ఎందుకంటారు?

లోక్‌సభలో ప్రతిపక్ష నేతను షాడో ప్రధానిగా అభివర్ణిస్తారు. ప్రభుత్వం రాజీనామా చేసినా, సభలో బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమైనా.. పరిపాలనను చేపట్టడానికి ప్రతిపక్ష నేత సిద్ధంగా ఉంటారు.

పార్లమెంటరీ వ్యవస్థ పరస్పర సహనశీలతపై ఆధారపడి నడుస్తుంది. ప్రభుత్వం సజావుగా నడిచేందుకు ప్రతిపక్ష నేత ప్రధానికి సహకరిస్తారు. అలాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకించేందుకు ప్రతిపక్ష నేతకు అవకాశం ఉంటుంది.

సభా కార్యకలాపాలు సజావుగా సాగడానికి ప్రభుత్వం ఎంత ముఖ్యమో, ప్రతిపక్ష నేత పాత్ర కూడా అంతే ముఖ్యం.

లోక్ సభ చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిపక్ష నేత ఎక్కడ కుర్చుంటారు?

ప్రతిపక్ష నేత లోక్‌సభలో స్పీకర్‌కు ఎడమవైపున ముందు వరుసలో ఉండే సీటులో కూర్చుంటారు. ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రతిపక్ష నేతకు ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి.

కొత్తగా ఎన్నికైన సభాపతిని ఆయన సీటు వరకు తీసుకువెళ్ళడం, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో ముందు వరుసలో కూర్చునే అవకాశం కలుగుతుంది.

అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్న నేతకు ప్రాధాన్యం దక్కుతుంది.

ప్రతిపక్ష నేతకు 1977 పార్లమెంటు ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం ప్రకారం సౌకర్యాలు, జీతం అందిస్తారు.

లోక్‌పాల్, సీబీఐ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ తదితర కీలక నియామకాల కమిటీలో లోక్‌సభా విపక్ష నేత కూడా సభ్యునిగా ఉంటారు.

అయితే 16వ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత పదవి సాధించేందుకు నిర్ణీత సంఖ్యాబలం (10 శాతం) సాధించకపోవడంతో లోక్‌పాల్ నియామక కమిటీ సమావేశానికి లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రత్యేక ఆహ్వానితుని పేరుతో పిలవడంతో ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

ఇది కీలక విషయాలలో విపక్ష వాణిని వినిపించకుండా చేసే కుట్ర అని ఆయన విమర్శంచారు.

కీలక నియామక కమిటీల సమావేశాలకు ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ అయిన తమ శాసనసభా పక్ష నేతను హాజరయ్యేందుకు అనుమతించేలా సంబంధిత చట్టాలను సవరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల నియామకానికి సంబంధించి సవరణలు జరిగాయి. కానీ, లోక్ సభలో 10 శాతం సీట్లు సాధించకపోతే అతిపెద్ద ప్రతిపక్షాన్ని ఆహ్వానించేలా లోక్ పాల్ చట్టాన్ని సవరించలేదని ఇండియా టుడేలో ప్రచురితమైన ఓ కథనం పేర్కొంది.

లోక్‌సభ వెబ్‌సైట్

ఫొటో సోర్స్, SUNSAD.IN

ఫొటో క్యాప్షన్, 2014 నుంచి ప్రతిపక్ష నేత పదవి ఖాళీగా ఉన్నట్టు చూపుతున్న లోక్‌సభ వెబ్‌సైట్

మావలాంకర్ 10 శాతం నిబంధన

లోక్‌సభలో 2014, 2019లలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాని కోల్పోయింది. దీనికి కారణం మొత్తం లోక్‌సభ స్థానాలలో, అంటే ప్రస్తుత 543 స్థానాలలో ఆ పార్టీ పది శాతం అంటే 55 సీట్లను సాధించలేకపోవడమే.

2014లో 44 స్థానాలు సాధించిన కాంగ్రెస్, 2019లో కొంత మెరుగుపడి 52 స్థానాలు గెలిచింది. కానీ ప్రతిపక్ష నేత హోదా పొందడానికి అవసరమైన 55 సీట్లను గెలుచుకోవడంలో విఫలమైంది.

అప్పటి లోక్‌సభ స్పీకర్ సంఖ్యా బలం రీత్యా కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు.

దాంతో ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఆ పార్టీ. అయితే, స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

దీంతో లోక్‌సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.

1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.

నిజానికి 1969 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హెదా లేదు.

తొలి మూడు లోక్‌సభ ఎన్నికల్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది.

ఆ సమయంలో ప్రతిపక్షాలు 10 శాతం సీట్లను గెలుచుకోవడంలో విఫలమయ్యాయి.

ఈ 10 శాతం నిబంధనను తొలి లోక్ సభ స్పీకర్ జీవీ మావలాంకర్ ప్రతిపాదించినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది.

ప్రతిపక్ష పార్టీగా అధికారికంగా గుర్తింపు పొందాలంటే సభా కోరంతో సమానంగా ఉండాలని మావలాంకర్ లోక్‌సభలో రూలింగ్ ఇచ్చారు.

కోరం అనేది 10 శాతం మంది సభ్యులకు సమానం.

అయితే, ‘‘ఈ 10 శాతం నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదని, అంతా స్పీకర్ నిర్ణయం మీదే ఆధారపడుతుంది’’ అని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు బీబీసీతో చెప్పారు.

స్పీకర్ల ఫోటోలు

ఫొటో సోర్స్, https://eparlib.nic.in/

ఫొటో క్యాప్షన్, తొలి స్పీకర్ మావలాంకర్ నుంచి మీరాకుమార్ (2009-2014) వరకు

ప్రతిపక్ష నాయకుడికి చట్టబద్ధమైన నిర్వచనం 1977 నాటి ప్రతిపక్ష నాయకుడి జీతభత్యాల చట్టంతో వచ్చింది.

ప్రతిపక్ష నేత అత్యధిక సంఖ్యాబలం ఉన్న ప్రతిపక్ష పార్టీకి చెందిన వారై ఉంటారని, లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్ పర్సన్ ఆయా సభల్లో ఆ విధంగా గుర్తిస్తారని ఆ చట్టం తెలిపింది.

1977 చట్టంలో 10 శాతం షరతు పెట్టలేదు. కానీ, మావలాంకర్ రూలింగ్‌ను చివరకు పార్లమెంటు (సౌకర్యాలు) చట్టం 1998లోని డైరెక్షన్ 121 (1)లో చేర్చారు.

1977 చట్టం లీడర్ అఫ్ అపోజిషన్‌ను నిర్వచించింది. "సభలో అత్యధిక సంఖ్యాబలం ఉన్న పార్టీ నాయకుడిని రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ గుర్తిస్తారని నిర్వచించింది. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాలను 121(సి) ద్వారా నిర్ణయించారు. ఇది పార్టీ లేదా గ్రూపులను గుర్తించడానికి ఒక షరతు పెట్టింది. సభా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన కోరానికి సమానమైన బలం, అంటే మొత్తం సభ సభ్యుల సంఖ్యలో పదో వంతు" అని ఆ షరతులో పేర్కొన్నారు.

‘‘పార్ల మెంటులో గుర్తింపు పొందిన పార్టీలు, గ్రూపుల నాయకులు, చీఫ్ విప్ లు (సౌకర్యాలు) చట్టం 1998 ’’కూడా లోక్ సభలో 55 మందికి తగ్గకుండా సభ్యులున్న పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొంటోందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ ది హిందూ దినపత్రికలో రాసిన కథనలో పేర్కొన్నారు. అయితే రాజ్యంగపరమైన నిబంధనలు లేనందున 1977 చట్టం 55 మంది సభ్యుల సంఖ్యను అత్యవసరమైన ముందస్తు అవసరంగా పేర్కొనలేదని, అదంతా స్పీకర్ ఆదేశాలు, విచక్షణపై ఆధారపడి ఉంటుందని అందులో రాశారు.

ఇక విపక్షంలో రెండు మూడు పార్టీలకు సమాన సంఖ్యలో సీట్లు వస్తే ఆ పార్టీల ప్రాముఖ్యాన్ని బట్టి స్పీకర్, చైర్మన్ తమ విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు.

వీడియో క్యాప్షన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతను షాడో ప్రధాని అని ఎందుకంటారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)