రాజకీయ నాయకులు ఏడిస్తే ప్రజలకు దగ్గరవుతారా, లేదా అది వారి బలహీనతా?

బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బరాక్ ఒబామా
    • రచయిత, నికోలా బ్రయాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘మగవాళ్ళు ఏడవరు’ అనేది అనాదిగా వస్తున్న పాత సామెత. మరి, ఈ విషయంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఏడిస్తే ప్రజలు ఏమనుకుంటారు?

ఇటీవల, వేల్స్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి ముందు వేల్స్ ఫస్ట్ మినిస్టర్ వాఘన్ గెథింగ్ ఏడుస్తూ కనిపించారు. అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు.

దీంతో, విన్‌స్టన్ చర్చిల్ నుంచి ఒబామా వరకు బహిరంగంగా కంటతడి పెట్టిన ప్రపంచ నేతల జాబితాలో గెథింగ్ కూడా చేరారు.

ఇలా బహిరంగంగా కంటతడి పెట్టే నాయకులను ప్రజలు ఎక్కువ మానవత్వం ఉన్నవారిగా చూస్తారా? లేక అది వారి బలహీనతకు సంకేతంగా భావిస్తారా?

''వారి భావోద్వేగాలతో కనెక్ట్ కావాలని ప్రజలు కోరుకుంటారు. భావోద్వేగపూరిత అవగాహన అవసరం'' అని బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌గా పని చేసిన గుటో హ్యారీ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
రాజకీయాలు

తమ నేతలను బలహీనంగా చూడాలనుకోరు..

అయితే, తమ నేతలను బలహీనులుగా చూడడానికి ప్రజలు ఇష్టపడరనేది కఠిన వాస్తవం. మీకు ఎంత దయ, జాలి ఉన్నా మీ చాంబర్‌లో ఏడుస్తూ కనిపిస్తే మీరు దృఢంగా లేరని భావిస్తారు.

తాను ఎంత నొచ్చుకున్నారనేది, ఏ రాజకీయ నాయకుడికైనా ముఖ్యమైన విషయమని హ్యారీ చెప్పారు.

''సాధారణంగా అంత ఆకర్షణీయంగా కనిపించని వ్యక్తులను నవ్వమని అడిగితే చాలా విచిత్రంగా కనిపిస్తారు. ఉదాహరణకు గోర్డాన్ బ్రౌన్, థెరిసా మే లాంటి వారు కొంతవరకూ అలానే కనిపిస్తారు'' అని ఆయన అన్నారు.

"ఎడ్ మిలిబాండ్ బేకన్ శాండ్‌విచ్ తినడానికి ప్రయత్నించడం, లేదా విలియం హేగ్ పిల్లల దగ్గర బేస్ బాల్ క్యాప్ తీసుకోవడానికి ప్రయత్నించడం వంటివి ఇలాంటి వాటికి నిదర్శనం. తమ వ్యక్తిత్వానికి భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్న రాజకీయ నాయకుల్లో వీరూ ఉన్నారు" అని హ్యారీ చెప్పారు.

థెరెసా మే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థెరెసా మే (ఫైల్ ఫోటో)

నాయకుల సెంటిమెంట్లను కొట్టిపారేయొద్దు

రాజకీయాల్లోనూ, రాజకీయాలకు సంబంధం లేని రంగాలకు చెందిన చాలా మంది నాయకులు కూడా కంటతడి పెడుతూ కెమెరాల కంటికి చిక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి.

విన్‌స్టన్ చర్చిల్ బహిరంగంగా ఏడ్చేవారు.

తనకు ఇష్టమైన యాచ్‌ను 1997లో సర్వీస్ నుంచి తీసివేసినప్పుడు బ్రిటన్ రాణి కళ్లు తుడుచుకుంటూ కనిపించారు. 2019లోనూ సెనోటఫ్‌లో జరిగిన రిమెంబరెన్స్ సండే సర్వీస్ సందర్భంగానూ ఆమె కన్నీళ్లతో కనిపించారు.

2013లో మార్గరెట్ థాచర్ అంత్యక్రియల సందర్భంగా అప్పటి ఛాన్సలర్ జార్జ్ ఆస్‌బార్న్ కన్నీటి పర్యంతమయ్యారు.

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఒబామా అనేక సందర్భాల్లో బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. 2012 శాండీ హుక్ ఊచకోత అనంతరం, 2015లో అరేతా ఫ్రాంక్లిన్ ప్రదర్శన వంటి సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

2019లో థెరెసా మే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గెథింగ్ కంటతడి పెట్టుకోవడం, వెల్ష్ ప్రభుత్వ చీఫ్ విప్ జేన్ హట్ ఓదార్చడం, కన్నీళ్లను ఆయన టిష్యూ పేపర్‌తో తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ, మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ కామెంట్లు వచ్చాయి. ''చిన్నపిల్లలా ఏడుస్తున్నారు'' అంటూ చేసిన కామెంట్లు కూడా ఉన్నాయి.

కానీ, ఆ కన్నీళ్లు నిజమని గుటో హ్యారీ విశ్వసిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలు కచ్చితంగా ఉంటాయని అన్నారు.

క్వీన్ ఎలిజబెత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్వీన్ ఎలిజబెత్

ఒకప్పుడు మగాళ్లు ఏడిస్తే బలహీనులుగా భావించేవారు, కానీ ఇప్పుడు కాదు..

''బహిరంగంగా ఏడవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే, అవి బూటకపు కన్నీళ్లని, ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసం అందరి ముందూ కంటతడి పెట్టుకున్నారని భావిస్తారు'' అని హ్యారీ చెప్పారు.

''రాజకీయాల్లో, లేదా జీవితంలో చాలాసార్లు మీరు నిరాశ, నిస్పృహల నుంచి బయటపడాలనుకుంటారు. ఉదాహరణకు, మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. అలాంటప్పుడు మీరు ఎదుటి వారి నుంచి కొంత జాలి కోరుకుంటారు. కానీ, ఏడుపు అనేది, ప్రజలు మిమ్మల్ని విశ్వసించేంత నమ్మకంగా ఉండదు'' అన్నారు.

''చరిత్రను గమనిస్తే, బహిరంగంగా ఏడవడం గురించి ప్రజల అభిప్రాయాలు మారుతూ వచ్చాయి'' అని వార్విక్ యూనివర్సిటీలో హిస్టరీ ఎమెరిటస్ ప్రొఫెసర్‌ బెర్నార్డ్ క్యాప్ అన్నారు.

''ఇది ఒక లోలకం లాంటిది. ప్రాచీన గ్రీస్, లేదా రోమ్, ఇంగ్లండ్‌‌లో మధ్యయుగం నాటి కాలంలో మగవారు తమ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరిచేవారు. వాటిలో ఏడుపు కూడా ఉంది. కోపం, ఆవేశాన్ని కూడా బహిరంగంగానే వ్యక్తపరిచేవారు'' అని ఆయన చెప్పారు.

''కానీ, ఆ తర్వాత కొన్ని కాలాల్లో, అంటే 18, 20 వ శతాబ్దాల ప్రారంభంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం సరైనదిగా భావించారు. ఈ రోజుల్లో రాజకీయం, క్రీడల వంటి రంగాలకు చెందిన వారు తమ భావోద్వేగాలను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు’’ అని బెర్నార్డ్ క్యాప్ వివరించారు.

''కంపెనీ బోర్డు నుంచి ఒక ప్రముఖ వ్యాపారవేత్తను తొలగించినప్పుడు కంటతడి పెట్టుకుంటారని ఊహించలేం. కానీ రాజకీయాల్లో థాచర్, థెరెసా మే పదవికి రాజీనామా చేసే సమయంలో కంటతడి పెట్టారు. అలాగే, విన్‌స్టన్ చర్చిల్ కూడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఏడ్చారు. బ్లిట్జ్‌లో బాంబు దాడి జరిగిన ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు'' అని ఆయన చెప్పారు.

రాజకీయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్గరెట్ థాచర్ మరణం తర్వాత చాన్సలర్ ఒస్బోర్న్ (మధ్య) విలపిస్తూ కనిపించారు

కన్నీళ్లను దాచాల్సిన అవసరం లేదు

పదవి నుంచి తప్పుకునే సమయంలో థాచర్, థెరెసా మే ఏడుస్తూ కనిపించారు.

కానీ, డేవిడ్ కామెరూన్ తన రాజీనామా సమయంలో హమ్ చేస్తూ కనిపించారు. అలా చేయడం ద్వారా తన భావోద్వేగాలపై తనకు నియంత్రణ ఉందని చూపించాలనుకున్నారు.

బహిరంగంగా ఏడవడాన్ని ఎలా చూస్తారనేదే అసలు ప్రశ్న.

''వాఘన్ గెథింగ్ విషయం తన మీద తనకు కలిగిన జాలికి సంబంధించినది. అది ఆమోదయోగ్యం కాదు. చాలామంది రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే, వారు తమంతట తాము ఏడ్వడం లేదు. అమరవీరులు, అప్పటి సహచరులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు'' అని ఆయన చెప్పారు.

మార్క్ బోర్కోవ్స్కీ క్రైసిస్ పీఏఆర్ కన్సల్టెంట్. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, పెద్దపెద్ద సంస్థల కోసం ఆయన పనిచేస్తారు.

బహిరంగంగా ఏడవడం గురించి గెథింగ్‌కు సలహా ఇవ్వాల్సి వస్తే, కన్నీళ్లను దాచుకోవాల్సిన అవసరం లేదని చెబుతానని మార్క్ అన్నారు. ఏడుపు ద్వారా మీ బాధను వెళ్లగొట్టండి. కానీ, దానిమీద మీరు ఎక్కువగా ఆధారపడొద్దు. ఇతర మార్గాల్లో కూడా మీ బాధను వ్యక్తీకరించవచ్చు.

బ్రిటన్ ప్రజలు, రాజకీయ నాయకుల కంటే తమ భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తపరిచేందుకు ఇప్పుడు ఎక్కువ సిద్ధంగా ఉన్నారని మార్క్ చెప్పారు.

''రాజకీయ నాయకులు కొన్నిసార్లు ప్రజల ముందు తమ సత్తా చూపించి, తమ బలహీనతలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారని అనుకోవచ్చు. కానీ, మనం మనుషులం, బలహీనులం కూడా. మనం తప్పులు చేస్తాం, వాటిని ప్రపంచం ఒప్పుకుంటుంది. ఎవరూ పరిపూర్ణలు కారు. కానీ, ప్రజల్లో ఇప్పటికీ నిజాయితీ ఉంది'' అని మార్క్ అన్నారు.

వాటన్నింటినీ వదిలేసి ఎలా ముందుకు వెళ్తారనేదే అసలు విషయమని, సంక్షోభం సమయంలో అవకాశం కూడా తప్పకుండా ఉంటుందని ఆయన అన్నారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1980 జూన్ 25న సంజయ్ గాంధీ మృతికి సంతాపం తెలుపుతున్నప్పుడు ఇందిరా గాంధీ సన్ గ్లాసెస్ ధరించారు

సన్‌గ్లాసెస్ పెట్టుకున్న ఇందిరా గాంధీ

ప్రపంచవ్యాప్తంగా కొందరు నేతల గురించిన చర్చ ఇది. భారత్‌లోనూ ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏడవడానికి, లేదా బహిరంగంగా ఏడుస్తూ కనిపించడానికి ఇష్టపడలేదు.

ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మృతికి సంతాపం తెలిపేందుకు వెళ్లిన ఆమె సహచరులు, అంత పెద్ద విషాద ఘటన జరిగినా కూడా ఆమె కళ్లలో నీళ్లు రాకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.

ఒకవేళ కళ్లు చెమ్మగిల్లినా, సామాన్యుల మాదిరిగా తాను కూడా భావోద్వేగాలకు లోనైనట్లు ప్రజలకు కనిపించకూడదని తన కొడుకు అంతిమయాత్ర సందర్భంగా ఇందిరా గాంధీ సన్‌గ్లాసెస్ (నల్ల కళ్లద్దాలు) పెట్టుకున్న సంఘటనను భారత ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, SANSAD TV

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ

లాల్ కృష్ణ అడ్వాణీ కూడా చాలా సందర్భాలల్లో భావోద్వేగానికి గురయ్యారు.

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అనేక టీవీ ఇంటర్య్వూల్లో భావోద్వేగంగా కనిపించారు. ఎన్నికల ర్యాలీల్లోనూ ప్రధాని మోదీ చాలాసార్లు గద్గద స్వరంతో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)