అమెరికా సైనిక రహస్యాల బహిర్గతం కేసులో జూలియన్ అసాంజ్‌కు విముక్తి, అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా సైనిక రహస్యాలను బహిర్గతం చేశారనే కేసులో సుదీర్ఘ పోరాటం తరువాత వికీలీక్స్ వ్యవస్థపాకుడు జూలియన్ అసాంజ్ విడుదలయ్యారు. కోర్టులో నేరాంగీకారం తెలపడంతో ఇక ఆయన స్వేచ్ఛగా తిరగొచ్చని న్యాయమూర్తి తెలిపారు.
ఐదేళ్లపాటు బ్రిటన్‌లోని జైలులో ఉన్న అసాంజ్ నేరాంగీకారానికి సిద్ధమని అమెరికాతో ఒప్పందం చేసుకున్న తర్వాత సోమవారం విడుదలయ్యారు. అనంతరం నేర అంగీకారం తెలిపేందుకు ఆయన అమెరికాలోని నార్త్ మరియానా ఐలాండ్స్ కోర్టుకు హాజరయ్యారు.
బ్రిటన్‌లో అసాంజ్ గడిపిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆయన ఇక అమెరికా కస్టడీలో గడిపే అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు.
దీంతో ఆయన అమెరికా నుంచి తన స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించి దాన్ని బయటపెట్టారని అసాంజ్‌పై అమెరికా ప్రభుత్వం అభియోగాలు మోపింది.
ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటపెట్టిన వికిలీక్స్ ఫైల్స్ అనేక జీవితాలను ప్రమాదంలోకి నెట్టాయని అమెరికా వాదించింది.
ఐదేళ్లపాటు బ్రిటిష్ జైలులోనే గడిపిన అసాంజ్ అక్కడి నుంచే తనను అమెరికాకు అప్పగించకుండా ఉండేలా న్యాయపోరాటం సాగించారు.
ఒకే ఒక అభియోగంలో తనను దోషిగా గుర్తించేలా అంగీకరించిన ఆయన జూన్ 26న నార్త్ మరియానా ఐలాండ్స్ కోర్టులో తుది అంగీకారం తెలిపారు.


ఫొటో సోర్స్, wikileaks
అసాంజ్‌ను విడుదల చేసినందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా వికీలీక్స్ ధన్యవాదాలు తెలిపింది. ఐక్య రాజ్య సమితిలో అసాంజ్ తరఫున పోరాడిన నేతలకు , మద్దతిచ్చినవారికి కృతజ్ఞతలు చెప్పింది.
బెల్‌మార్ష్ జైలులో ఓ చిన్న గదిలో 1,901 రోజులు గడిపిన అసాంజ్, సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యారని ఎక్స్‌లో షేర్ చేసిన ఒక ప్రకటనలో వికీలీక్స్ తెలిపింది.
‘‘సోమవారం మధ్యాహ్నం ఆయనను స్టాన్‌స్టెడ్ విమానాశ్రయం వద్ద వదిలిపెట్టారు. అక్కడి నుంచి ఆయన విమానంలో బయల్దేరారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ అసాంజ్ భార్య స్టెల్లా అసాంజ్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈ కేసును చాలాకాలం సాగదీశారని ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా అటార్నీ రిచర్డ్ మిల్లర్‌ను సీబీఎస్ కోరగా ఆయన తిరస్కరించారు. బీబీసీ కూడా అమెరికాలోని ఆయన న్యాయవాదిని సంప్రదించింది.
ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని అసాంజ్, ఆయన తరఫు న్యాయవాదులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.
అసాంజ్‌పై జరుగుతున్న విచారణను ఉపసంహరించుకోవాలన్న ఆస్ట్రేలియా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
ఓ నెల తరువాత అమెరికాకు అప్పగింత విషయంపై అసాంజ్ మరోసారి అప్పీలు చేసుకోవాలని యూకే హైకోర్టు తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, PA Media
మొత్తం 18 అభియోగాలపై అసాంజ్‌ను విచారించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు భావించారు. వీటిల్లో ఎక్కువ భాగం గూఢచర్యం చట్టానికి సంబంధించినవే.
2006లో అసాంజ్ స్థాపించిన వికీలీక్స్, దేశ చరిత్రలోనే అతిపెద్ద రహస్య పత్రాల వెల్లడికి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. ఈ లీక్స్ దాదాపు కోటికి పైగా రహస్య పత్రాలను ప్రచురించింది.
అమెరికా మిలిటరీ హెలికాప్టర్ నుంచి తీసిన ఒక వీడియోను 2010లో వికీలీక్స్ వెబ్‌సైట్ బయటపెట్టింది. ఈ హెలికాప్టర్ వీడియో.. బాగ్దాద్‌లో ఇద్దరు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్టర్లు సహా డజనుకు పైగా ఇరాకీ పౌరులను చంపినట్లు చూపించింది.
అసాంజ్‌కు అత్యంత నమ్మకమైన సహచరుల్లో ఒకరైన యూఎస్ ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ చెల్సియా మానింగ్‌కు 35 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే 2017లో ఒబామా ప్రభుత్వం ఆ శిక్షను కుదించింది.
స్వీడన్‌లో అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించి అసాంజ్‌పై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అయితే, ఆయన వాటిని ఖండించారు.
స్వీడన్‌లో నమోదైన కేసులు తనను అమెరికాకు పట్టిస్తాయంటూ ఆయన లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఏడు సంవత్సరాలపాటు తలదాచుకున్నారు.
స్వీడన్ అధికారులు 2019లో ఆయనపై కేసును ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత యూకే అధికారులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు.
సుదీర్ఘ న్యాయ పోరాటాల నడుమ కూడా ఆయన చాలా అరుదుగా బయట కనిపించారు. 2021లో జైలులో ఉండగా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కిరాయికి ఇస్తే నట్టింట్లో 3 అడుగుల మట్టిపోసి గంజాయి సాగు చేశారు
- పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది
- క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ: ‘నేను గర్భవతినని బిడ్డను కనడానికి నెల రోజుల ముందు వరకు నాకు తెలియలేదు’
- టీ20 వరల్డ్‌కప్: సూపర్-8 రౌండ్ పోటీలు ఎలా నిర్ణయించారు? సెమీస్, ఫైనల్లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















