టీ20 వరల్డ్‌ కప్: అఫ్గానిస్తాన్ మరో సంచలనం, బంగ్లాపై గెలుపుతో సెమీస్‌కు, ఆస్ట్రేలియా అవుట్

రషీద్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెప్టెన్ రషీద్ ఖాన్ సంబరం

టీ20 ప్రపంచకప్‌లో సంచనల విజయాలతో అఫ్గానిస్తాన్ సత్తా చాటింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై, సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపైనా విజయాలు సాధించిన ఆ జట్టు అనుకున్నట్టుగానే సెమీస్ చేసింది. దీంతో తొలిసారి టీ 20 ప్రపంచకప్ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా సూపర్ 8 దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది.

మంగళవారం ఉదయం జరిగిన సూపర్8 మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్ ‌తో జరిగిన ఉత్కంఠ పోరులో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గనిస్తాన్ 8 పరుగుల తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు మాత్రమే చేసినా, బంగ్లాదేశ్‌ను లక్ష్యం చేరకుండా కట్టడి చేయగలిగింది.

వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించి బంగ్లా లక్ష్యాన్ని 114 పరుగులుగా నిర్ణయించారు.

బంగ్లా జట్టులో ఓపెనర్ లిట్టన్ దాస్ మాత్రమే 54 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌కు ఉపశమనం దొరకలేదు. అతను 49 బంతులలో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 54 పరుగులు చేశాడు.

ఆ తరువాత సౌమ్యా సర్కార్ (10), తౌహిద్ (14) మాత్రమే బంగ్లా జట్టులో ఓ మాదిరిగా ఆడారు.

అఫ్గానిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ కూడా 4 వికెట్లు తీశాడు. ఫారూఖీ, గుల్బాదిన్ చెరో వికెట్ తీశారు.

26 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన నవీన్ ఉల్ హక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టులో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 43 పరుగుల చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహిం జర్దాన్ 18 పరుగులు, కెప్టెన్ రషీద్ ఖాన్ 19 పరుగులు చేశారు.

మొత్తంగా అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో కేవలం 115 పరుగులకే పరిమితమైంది.

బంగ్లా బౌలర్లలో రిషాద్ హుస్సేనీ 3 వికెట్లు తీయగా, తస్కిన్ 1, ముస్తాఫిజుర్ రహ్మాన్ 1 వికెట్ తీశారు.

ఈనెల 27న జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.

బీబీసీ వాట్సాప్ చానల్

ఇంటి ముఖం పట్టిన ఆస్ట్రేలియా

సూపర్ 8 స్టేజీలో ఆస్ట్రేలియా అఫ్గానిస్తాన్‌పై ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్1లో ఎవరు సెమీస్‌కు చేరుతారనే ఉత్కంఠ నెలకొంది.

ఆస్ట్రేలియాపై గెలిచిన ఇండియా తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మొత్తం 6 పాయింట్లతో ఎటువంటి సమీకరణాలతోనూ పనిలేకుండా సెమీస్‌కు చేరింది.

అయితే తాను సెమీస్‌కు చేరాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆస్ట్రేలియా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం జరిగిన అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓడిపోవాలని ఆస్ట్రేలియా కోరుకుని ఉంటుంది. ఎందుకంటే అఫ్గానిస్తాన్ ఓడిపోతే నెట్‌రన్ రేట్ ఆధారంగా ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్త్ ఖాయమయ్యే అవకాశం ఉండేది.

కానీ, అఫ్గానిస్తాన్ అటువంటి సమీకరణాలకు చోటు లేకుండా బంగ్లాదేశ్‌పై తక్కువ స్కోరు చేసినా, ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను కాపాడుకుంటూ సెమీస్‌కు చేరింది.

దీంతో ఆస్ట్రేలియా సూపర్ 8 దశలోనే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది.

రోహిత్ శర్మ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ చేసిన 92 పరుగులలో 76 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి.

ఆస్ట్రేలియాపై చెలరేగిన రోహిత్

ఇక సోమవారం రాత్రి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. సూపర్ 8లో భాగంగా గ్రూప్1లో ఇండియా తన చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాపై ఆడి 24 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది.

ఇండియా మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆటే హైలైట్. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిన శర్మ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.

5 ఓవర్లలో జట్టు స్కోరు 52 పరుగులు ఉన్నప్పుడు అందులో రోహిత్ శర్మ చేసిన పరుగులే 50 ఉండటం అతను ఏ స్థాయిలో రెచ్చిపోయి ఆడాడో తెలుపుతోంది.

రోహిత్ శర్మ అర్ధసెంచరీని 19 బంతుల్లోనే పూర్తి చేశాడు. టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ శర్మకు ఇదే అత్యంత వేగమైన అర్థసెంచరీ.

గతంలో అతను వెస్టిండీస్ పై 22 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

ఆట మొదలై, రెండో ఓవర్లోనే కోహ్లీ అవుటైపోవడంతో భారత అభిమానుల్లో నిరాశ నెలకొంది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ నిరాశను స్టేడియం బయటకు విసిరేశాడు.

కోహ్లీ వికెట్ పడింది కదా అని రోహిత్ ఏమీ ఆచి తూచి ఆడలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎవరినీ రోహిత్ వదల్లేదు.

ముఖ్యంగా ప్రపంచ మేటి బౌలర్లలో ఒకడైన స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టిన తీరు అభిమానులను కట్టిపడేసింది.

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో స్టార్క్ బౌలింగ్ రోహిత్ 29 పరుగులు పిండుకున్నాడు. నాలుగు సిక్లర్లు, ఒక ఫోర్ కొట్టి స్టార్క్‌ను కుదేలు చేశాడు.

మొత్తం మీద రోహిత్ శర్మ 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి శతకానికి 8 పరుగుల దూరంలో మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

రోహిత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. 92 పరుగుల్లో ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 76 పరుగులు వచ్చాయి.

దీంతోపాటు టీ 20 మ్యాచ్‌లో 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.

హార్థిక్ పాండ్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హార్థిక్ పాండ్యా 17 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇక సూర్య కుమార్ యాదవ్ (3 ఫోర్లు 2 సిక్సర్లతో 31 పరుగులు) శివమ్ దూబే ( 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్‌తో 28 పరుగులు), హార్థిక్ పాండ్యా ( 17 బంతుల్లో 1 ఫోర్ 2 సిక్సర్లతో 27 పరుగులతో నాటౌట్) కూడా తలో చేయి వేయడంతో ఇండియా స్కోరు 200 పరుగులు దాటింది. 20 ఓవర్లలో భారతజట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌ వుడ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు.

మిషెల్ స్టార్క్ 4 ఓవర్లలో 45 పరుగులకు 2 వికెట్లు, పాట్ కమిన్స్ 4 ఓవర్లలో 48 పరుగులు, ఆడం జంపా 4 ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నారు. మార్కస్ స్టోయినిస్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 56 పరుగులు ఇచ్చాడు.

ట్రావిస్ హెడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రావిస్ హెడ్ 43 బంతులు ఎదుర్కొని 76 పరుగులు చేశాడు

‘హెడ్’ జోరు

205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇండియా మాదిరే స్కోరు బోర్డుపైకి 6 పరుగులు చేరేసరికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్‌ను కోల్పోయింది.

అర్షదీప్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ వెనుదిరిగాడు.

కానీ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిషెల్ మార్ష్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు.

ట్రావిస్ హెడ్ మరోసారి ఇండియా గెలుపును అడ్డుకుంటాడనిపించినా ఆలస్యంగానైనా జస్‌ప్రీత్ బుమ్రా అతని వికెట్ తీసి ఇండియా గెలుపు ఖాయం చేశాడు.

హెడ్ మొత్తం 43 బంతులు ఎదుర్కొని 76 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. జట్టు స్కోరు 150 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుటయ్యాడు.

అప్పటికి ఇంకా ఆస్ట్రేలియా 27 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.

మరోపక్క కెప్టెన్ మిషెల్ మార్ష్ 28 బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యాక, మాక్స్‌వెల్ ఎడాపెడా షాట్లు కొట్టి కొద్దిసేపు భయపెట్టినా కులదీప్ యాదవ్ అతన్ని అవుట్ చేశాడు.

తరువాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ సాంతం 15 పరుగులు దాటకపోవడంతో ఆస్ట్రేలియా పరాజయం ఖాయమైంది.

ఆస్ట్రేలియా మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 181 పరుగులే చేయడంతో ఇండియా 24 పరుగుల తేడాతో గెలిచింది.

ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.

అక్షర్ పటేల్ క్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పడుతున్న అక్షర్ పటేల్. ఈ క్యాచ్ ద్వారా మిషెల్ మార్ష్ అవుటయ్యాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)