అమెరికాలో చైనీయుల కోసం నిర్మించిన ఏకైక పట్టణం ఇప్పుడు ఎందుకిలా అయ్యింది?

అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, చైనీయుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్మించిన పట్టణం లాక్.
    • రచయిత, పామ్, గ్యారీ బేకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

చైనా కార్మికులు అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాను ఒక చిత్తడి నేల నుంచి వ్యవసాయ శక్తికి కేంద్రంగా మార్చారు. ఈ ప్రక్రియలో ఒకప్పుడు "మోంటికార్లో ఆఫ్ కాలిఫోర్నియా" అన్న పేరు సంపాదించిన ఈ ప్రాంతంలో చైనీయులే నిర్వహించుకునే ఒక పట్టణం కూడా వెలసింది.

చాలా ఏళ్లుగా, వలసదారులు ఇక్కడి శాక్రమెంటో నది వెంట ఉన్న సారవంతమైన ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే ద్రాక్ష తోటలు, పొలాల మధ్య కాలిఫోర్నియాలోని ‘లాక్’ అనే చిన్న పట్టణం మాత్రం వలస వచ్చిన చైనీయుల కోసం చైనీయులే అభివృద్ధి చేసుకున్న సెటిల్‌మెంట్‌గా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది.

‘లాక్‌’లోని ఇరుకైన ప్రధాన వీధి ఒక సందులా కనిపిస్తుంది. అక్కడ శతాబ్దాల నాటి చెక్క భవనాలు, బాల్కనీలతో కూడిన ఇళ్లు రోడ్డుకు ఇరువైపులా కనిపిస్తాయి. ఈ పట్టణం ఒకప్పుడు పాఠశాలలు, సినిమా థియేటర్, హోటళ్లు, రెస్టారెంట్లతో కూడిన చైనీయుల కేంద్రంగా సందర్శకులను ఆకర్షిస్తుండేది.

కానీ, ఇప్పుడు లాక్ పట్టణం ఒకప్పటి ఉత్తర కాలిఫోర్నియాలోని గ్రామీణ చైనీస్ స్థావరాలకు ఒక ఉదాహరణగా మిగిలిపోయింది.

అసలు వారసులలో కొద్దిమంది ఇప్పటికీ లాక్ పట్టణంలో నివసిస్తూ, వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ ఒకప్పటి చైనీస్ పాఠశాల, బోర్డింగ్ హౌస్‌లు, జూదపు హాళ్లను మ్యూజియంలుగా మార్చారు.

వాట్సాప్
అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, లాక్ పట్టణంలో కనిపించే వీధి బోర్డులు ఇంగ్లీష్, చైనీస్ రెండింటిలోనూ రాశారు.

బంగారు పర్వతం

అమెరికా చివరి గ్రామీణ చైనీయుల పట్టణాన్ని సందర్శిస్తే, చైనా వలసదారుల జీవితాలు, వాళ్ల నూతన మాతృభూమిపై వారి సాంస్కృతిక ప్రభావం గురించి మరింత లోతైన అవగాహన వస్తుంది.

1848లో కాలిఫోర్నియా గోల్డ్ రష్ గురించిన వార్త చైనాకు చేరినప్పుడు, ధనవంతులు కావాలనే ఆశతో వేలాది మంది చైనీయులు సియెర్రా పర్వత ప్రాంతాలకు తరలివచ్చారు.

చైనీయులు కాలిఫోర్నియాను గామ్ సాన్ లేదా "బంగారు పర్వతం" అని పిలుస్తారు. మొదట్లో వారు కొంత లాభం పొందినా, ఆగ్రహంతో ఉన్న మైనర్లు తర్వాత వారిని తరిమికొట్టారు.

1850లో, కాలిఫోర్నియా చైనీయులను లక్ష్యంగా చేసుకుని భారీగా విదేశీ మైనర్ల పన్నును విధించింది. ఆ తర్వాత కొంతకాలానికే ఇతర మైనర్లు చైనీయులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. చివరికి, చాలా మంది చైనీస్ కార్మికులు వ్యవసాయం, ట్రాన్స్‌కాంటినెంటల్ రైల్‌రోడ్‌ను నిర్మించడం వంటి ఇతర పనుల వైపు మళ్లారు.

అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Alamy

1861 నాటి కాలిఫోర్నియా స్వాంప్ అండ్ ఓవర్‌ఫ్లో యాక్ట్ ద్వారా చిత్తడి నేలలలో భూయజమానులు, ప్రైవేట్ కంపెనీలు నీళ్లను తొలగించడానికి అనుమతించి, వ్యవసాయానికి అవకాశం కల్పించింది.

అది చైనాలోని గ్వాంగ్‌డాంగ్ (గతంలో కాంటన్) ప్రాంతం నుంచి వచ్చిన వేల మంది వలసదారులను ఆకర్షించింది. వారికి అప్పటికే చిత్తడినేలలను పొడిగా చేయడంలో, కట్టలు నిర్మించడంలో నైపుణ్యం ఉంది. ఈ పునరుద్ధరణ ప్రాజెక్టులు కాలిఫోర్నియా డెల్టా వెంబడి చైనీస్ కార్మికుల కోసం చిన్న స్థావరాల స్థాపనకు దారి తీసాయి.

1860 - 1880 మధ్యకాలంలో, చైనీస్ కార్మికులు 88,000 ఎకరాల డెల్టా మట్టి నుంచి నీటిని తొలగించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఈ ప్రాంతాన్ని వ్యవసాయ కేంద్రంగా మార్చడంలో సహాయపడింది.

"చైనీయులు తమ పనిని చూసుకుని చాలా గర్వించారు" అని ఈ డెల్టాలో పెరిగిన కరోల్ లీ చెప్పారు.

1960లలో లాక్‌లోని చైనీస్ పాఠశాలలో చదువుకున్న ఆయన, పట్టణం గురించి ప్రజలకు అవగాహన కల్పించే లాక్ ఫౌండేషన్ ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.

"మాకు భూమి లేదు, కానీ ఏం చేయాలో మాకు తెలుసు. మేము పెరల్ రివర్ డెల్టా నుంచి వచ్చాం. కట్టలను ఎలా అభివృద్ధి చేయాలో, భూమిని ఎలా సాగు చేయాలో మాకు తెలుసు" అని కరోల్ లీ చెప్పారు.

కానీ బంగారం విషయంలో మాదిరిగానే, చాలామంది చైనీస్ వ్యవసాయ కార్మికులు, తమ ఉద్యోగాలను లాక్కొన్నారని ఆరోపించే శ్వేతజాతీయుల నుంచి ఎదురుదెబ్బలు తిన్నారు.

శ్వేతజాతీయుల ఆగ్రహానికి ప్రతిస్పందనగా అమెరికా ప్రభుత్వం చైనీయుల హక్కులను కాలరాసి, వివక్షాపూరిత చట్టాలను రూపొందించింది.

1872 నుంచి, కాలిఫోర్నియా చైనీయుల పేరిట భూమి లేకుండా లేదా వాళ్లు వ్యాపార లైసెన్స్‌లు పొందకుండా నిషేధించే చట్టాలను ఆమోదించింది. ఆ తర్వాత 1882లో చైనీయుల మినహాయింపు చట్టం వచ్చింది. 1943లో దీన్ని రద్దు చేసేవరకు చైనీయుల వలసలను నిలిపేశారు.

అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Alamy

ఏలియన్ ల్యాండ్ చట్టం

1913లో, కాలిఫోర్నియా ఏలియన్ ల్యాండ్ లాను ఆమోదించింది. దీని ప్రకారం , అమెరికన్లు కాని వారు వ్యవసాయ భూమిని స్వంతం చేసుకోవడం, మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం భూమిని లీజుకు తీసుకోవడం నిషేధం. వారు "పౌరసత్వానికి అనర్హులు".

ఈ పరిమితులు ఉన్నప్పటికీ, చైనా కార్మికులు లాక్‌ పట్టణానికి దక్షిణంగా ఒక మైలు దూరంలో ఉన్న వాల్‌నట్ గ్రోవ్‌లో చైనా టౌన్‌ను అభివృద్ధి చేశారు. 1880 నాటికి 814 మంది ఉన్న ఈ పట్టణం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 100 కంటే ఎక్కువ మంది చైనీస్ ప్రజలు, అలాగే కొంతమంది జపనీస్ వలసదారులకు నిలయంగా ఉంది. అయితే, 1915 అక్టోబర్ 7న అగ్నిప్రమాదం ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది. దీంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

అయితే భూమిని లీజుకు తీసుకుని, వారి ఆస్తిపై భవనాలను నిర్మించేందుకు భూస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకుని చైనీయులు, జపనీయుల సమూహం వాల్‌నట్ గ్రోవ్‌లో తమ ఇళ్లను పునర్నిర్మించుకున్నారు. అయితే, వారిలో లీ బింగ్ లేరు.

"చార్లీ" అని పేరుతో కూడా తెలిసిన బింగ్, వాల్‌నట్ గ్రోవ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త, ఇంగ్లీష్ మాట్లాడే కొద్దిమంది చైనీస్ వలసదారులలో ఒకరు.

అమెరికాలో తన మొదటి ఏడేళ్లలో చాలా సంపదను పోగేసుకున్నాక, ఆయన 1908లో వాల్‌నట్ గ్రోవ్‌లో జూద గృహాన్ని నిర్మించారు. ఆ తర్వాత హార్డ్‌వేర్ స్టోర్, డ్రై గూడ్స్ స్టోర్, బార్బర్ షాప్, పూల్ హాల్, చైనీస్ హెర్బల్ మెడిసిన్‌ స్టోర్‌ను నిర్మించారు. కానీ అగ్నిప్రమాదంలో బింగ్‌కు చెందిన ఏడు వ్యాపారాలూ నాశనం అయ్యాయి.

అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, లాక్ ఒకప్పుడు "మోంటే కార్లో ఆఫ్ కాలిఫోర్నియా" అని పిలిచేవారు.

చైనీస్ వారసత్వం గురించి తెలుసుకునేలా..

లాక్‌లోని కొత్త ఝాంగ్‌షాన్ నివాసితులు త్వరలోనే తమ చిన్న చైనీస్ ఎన్‌క్లేవ్‌లో డ్రై గూడ్స్ స్టోర్, సెలూన్, ఒక హోటల్, గ్యాంబ్లింగ్ హాల్‌ను నిర్మించారు. దీని తర్వాత 1915 - 1917 మధ్య ఒకటి, రెండు అంతస్తులు చెక్కతో నిర్మించిన 45 భవనాలను నిర్మించారు.

భూమి వారి పేరు మీద లేకపోవడం వల్ల వాళ్లు లాక్‌ని తాత్కాలిక నివాసంగా భావించి, తక్కువ ఖర్చయ్యే వస్తువులను ఎంచుకున్నారు.

"నాకు, ఇది పాశ్చాత్య పట్టణంలా కనిపిస్తుంది," అని లాక్ ఫౌండేషన్ వైస్ చైర్ క్లారెన్స్ అంటారు. ఈ పట్టణం దాదాపు 100 సంవత్సరాల క్రితం ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే కనిపిస్తుంది. 1915 నుంచి, వందలాది మంది చైనీస్ కార్మికులు లాక్‌లో స్థిరపడ్డారు. వీళ్లు సమీపంలోని క్యానరీలు, స్థానిక డెల్టా పొలాలలో పనిచేసేవాళ్లు. వాళ్లు కేవలం శ్రమించడానికే పరిమితం కాకుండా, చైనీస్ పాఠశాలను స్థాపించారు, చైనీస్ భాషా పాఠాలు బోధించారు. ఈ పాఠశాల కేవలం విద్యా స్థలమే కాదు, సాంస్కృతిక పరిరక్షణకు కేంద్రంగా కూడా ఉంది, తరువాతి తరం తన చైనీస్ వారసత్వం గురించి తెలుసుకునేలా చేస్తుంది." అని లీ వివరించారు.

అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Pam & Gary Baker

ఫొటో క్యాప్షన్, 100 సంవత్సరాల క్రితం లాక్ ఎలా కనిపించిందో అదే మాదిరిగా నేడు కనిపిస్తోంది.

1920ల నుంచి 1940ల వరకు లాక్ అభివృద్ధి చెందుతున్న, ప్రత్యేకమైన సాంస్కృతిక పట్టణంగా ఉండేది. దానిలో దాదాపు 600 మంది జనాభా ఉండేవాళ్లు, వారిలో ఎక్కువ మంది చైనీయులు.

ఈ పట్టణంలో చైనీస్ యాజమాన్యంలోని సినిమా థియేటర్, ఆరు రెస్టారెంట్లు, తొమ్మిది కిరాణా దుకాణాలు, ఒక హోటల్, బోర్డింగ్ హౌస్‌లు, పిండి మిల్లు ఉండేవి. దీనిని "మోంటికార్లో ఆఫ్ కాలిఫోర్నియా"గా అభివర్ణించేవారు. ఎందుకంటే, 1951లో అధికారులు మూసివేసే వరకు ఇక్కడ చట్టవిరుద్ధమైన జూదం హాళ్లు నడిచేవి.

1943లో చైనీస్ ఎక్స్‌క్లూజన్ చట్టం రద్దు చేశాక, లాక్‌లోని చైనీయుల కుటుంబాల వారసులు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ సమీపంలోని నగరాలకు వెళ్లడం ప్రారంభించారు. ఇవాళ, లాక్‌లోని 60 మంది నివాసితులలో కొంత మంది మాత్రమే చైనీయులు.

1960లలో లాక్ జనాభా తగ్గిపోయినా, వలసల వల్ల పట్టణానికి పెద్ద నష్టం జరగలేదు.

"లాక్ ఎప్పుడూ స్థిరమైన ప్రదేశం. అక్కడ ప్రతి ఒక్కరికీ మిగతా వాళ్లు తెలుసు. వాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటారు. పట్టణ ప్రజల మధ్య స్నేహపూర్వక చర్యల కారణంగా ఇక్కడ సామాజిక ఐక్యత కనిపిస్తుంది. "వెళ్లిపోయిన కొందరు పట్టణాన్ని పునరుద్ధరించడంలో సహాయం చేయడానికి తిరిగి వచ్చారు" అని లీ చెప్పారు.

అమెరికాలో చైనా పట్టణం

ఫొటో సోర్స్, Pam & Gary Baker

ఫొటో క్యాప్షన్, జో షూంగ్ స్కూల్ హౌస్ ఇప్పుడు లాక్ చైనీస్ స్కూల్ మ్యూజియం.

1990లో, లాక్‌ను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటీరియర్ "అమెరికాలోని గ్రామీణ, వ్యవసాయ చైనీస్ అమెరికన్ కమ్యూనిటీకి అతిపెద్ద, సంపూర్ణ ఉదాహరణ" అని పేర్కొంది.

అయినప్పటికీ, అదే సమయంలో, లాక్ క్లిష్టమైన మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంది. దాని చైనీస్, కొత్తగా వచ్చిన చైనీస్ కానివాళ్లు ఉండే ఇళ్లు, వాళ్లు వ్యాపారాలు చేసే భూమి, వాళ్లది కాదు.

అయితే, 2004లో శాక్రమెంటో హౌసింగ్ అండ్ రివిటలైజేషన్ అథారిటీ (ఎస్‌హెచ్‌ఆర్‌ఏ) భూమిని కొనుగోలు చేసి, దాన్ని విభజించి, పట్టణంలో మరమ్మతులు చేసి, నివాసితులకు తిరిగి విక్రయించడం మొదలుపెట్టింది.

చివరికి, ఎస్‌హెచ్‌ఆర్‌ఏ సహాయంతో, నిజమైన లాక్ నివాసితులు, వారి వారసులు తరతరాలుగా నివసిస్తున్న భూమిపై యాజమాన్యాన్ని పొందగలిగారు.

నేడు, లాక్‌లోని అనేక అసలైన భవనాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. గతంలో ఉన్న గ్యాంబ్లింగ్ హాల్ ఇప్పుడు డై లాయ్ మ్యూజియంగా మారింది.

పూర్వపు బోర్డింగ్ హౌస్ ఇప్పుడు 1900ల ప్రారంభంలోని ఉపకరణాలు, దుస్తులు, ఇతర చైనీస్ కళాఖండాలను సంరక్షించే మ్యూజియం. జో షూంగ్ స్కూల్ హౌస్, లాక్ చైనీస్ స్కూల్ మ్యూజియంగా మారింది. ఇక్కడ సందర్శకులు 100 సంవత్సరాల క్రితం విద్యార్థులు చదువుకున్న నిజమైన తరగతి గదిని, ఉపయోగించిన డెస్క్‌లను చూడవచ్చు.

గత కొన్నేళ్లుగా ఈ పట్టణంలోని ప్రత్యేకతలకు ఆకర్షితులైన అనేక మంది కళాకారులు లాక్‌లో చెక్కతో నిర్మించిన ఇళ్లలోకి మారారు. కొంతమంది అసలు నివాసితులు, వారసులతో సన్నిహితంగా ఉంటూ ఒక సంస్థలా ఏర్పడ్డారు. మిగతా రోజులలో పట్టణం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, వారాంతాల్లో లాక్‌ను పర్యాటకులు సందర్శిస్తారు.

"ప్రజలు లాక్ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించారు" అని లాక్ ఫౌండేషన్ చైర్ స్టువర్ట్ వాల్తాల్ అన్నారు.

"పరాయీకరణ, పేదరికం, వివక్షను అనుభవించి, ఆ తర్వాత అభివృద్ధి చెందిన వారికి లాక్ ఒక వారసత్వ సంపద. కఠినమైన ఈ ప్రపంచంలో లాక్ వారికి ఆశ్రయం కల్పించింది. మనం దానిని వేడుక చేసుకోవాలి" అని వాల్తాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)