పాకిస్తాన్ మీద చైనాకు గురి కుదరడం లేదా, ఆపరేషన్ అజ్మ్-ఎ-ఇస్తేహకామ్ ఎందుకు తీసుకొచ్చారు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆజం ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లో ఆపరేషన్ 'అజ్మ్-ఎ-ఇస్తేహకామ్' ని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆమోదించారు. దేశ భద్రతా బాధ్యతను సైన్యంపై ఉంచుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోలేవని ఆయన స్పష్టంచేశారు.

షరీఫ్ అధ్యక్షతన జాతీయ కార్యాచరణ ప్రణాళికపై సెంట్రల్ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం వెలువడిని ప్రకటనలో "పాకిస్తాన్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉగ్రవాదంపై యుద్ధం అవసరం. దేశ ఆధిపత్యాన్ని సవాలు చేయడాన్ని ఎవరూ అంగీకరించరు" అని తెలిపింది.

అంతకుముందు ఇస్లామాబాద్‌లో చైనా మంత్రి లియో జియాన్ చావో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో చైనా పెట్టుబడి పెట్టడం దాని అంతర్గత స్థిరత్వం, మెరుగైన భద్రతా వ్యవస్థతో ముడిపడి ఉంటుందని తెలిపారు.

అయితే, ఇరుదేశాల మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ పెట్టుబడుల కోసం పాకిస్తాన్‌లో అంతర్గత స్థిరత్వాన్ని చైనా ఎందుకు డిమాండ్ చేసింది? అనే ప్రశ్న తలెత్తుతోంది.

వాట్సాప్
పాకిస్తాన్

ఫొటో సోర్స్, GOP

సీపీఈసీ ప్రాజెక్ట్

ఇస్లామాబాద్‌లో జరిగిన పాక్-చైనా అడ్వైజరీ మెకానిజం సమావేశంలో చైనా మంత్రి లియో జియాన్ చావో మాట్లాడుతూ పాకిస్తాన్, చైనాల మధ్య ఒప్పందాలు అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయని, అయితే అభివృద్ధికి "అంతర్గత స్థిరత్వం కూడా అవసరం" అని అన్నారు.

దేశంలో భద్రతను మెరుగుపరచాలని, అప్పుడే వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తారని పాకిస్తాన్‌కు లియో స్పష్టంచేశారు. సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందని సూచించారు.

చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కి భద్రతాపరమైన బెదిరింపులు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని చైనా మంత్రి అన్నారు. పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులే చైనా క్యాపిటల్ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో పాక్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ దార్ ప్రసంగిస్తూ.. సీపీఈసీకి అన్ని పార్టీలు మద్దతుగా ఉన్నాయని అన్నారు.

ప్రతిపక్షానికి చెందిన జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్, పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) పార్టీ నేత బారిస్టర్ అలీ జాఫర్, రౌఫ్ హసన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

మూలధన పెట్టుబడుల విషయంలో పాకిస్తాన్, చైనాలు భిన్నమైన వైఖరితో ఉన్నాయని సీపీఈసీని నిశితంగా గమనిస్తున్న జర్నలిస్ట్, విశ్లేషకుడు ఖుర్రం హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని పాకిస్తాన్ చెబుతుంటే, మీ ఇంటిని ఆర్డర్‌లో పెట్టుకోండని చైనా సూచిస్తోందని హుస్సేన్ బీబీసీతో అన్నారు. ఇప్పటికిప్పుడు చైనా మూలధన పెట్టుబడులపై ఆసక్తి చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా మంత్రి ప్రసంగం తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘’కేంద్ర హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైనా పౌరుల భద్రత కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. దేశంలో భద్రతా ప్రణాళిక, పరిస్థితిపై సంబంధిత సంస్థలు బ్రీఫింగ్ ఇచ్చాయి’’ అని తెలిపింది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ 'అజ్మ్-ఎ-ఇస్తేహకామ్'

పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌లను చైనా మంత్రి లియో జియాన్ కలిశారు.

ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ కార్యాచరణ ప్రణాళిక అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. దేశంలో తీవ్రవాదాన్ని అంతం చేయడానికి ఆపరేషన్ 'అజ్మ్-ఎ-ఇస్తేహకామ్'కి ఆమోదం తెలిపారు.

అనంతరం మాట్లాడిన ప్రధాని షాబాజ్ షరీఫ్.. దేశ అభివృద్ధికి సుస్థిరత, చట్టబద్ధత అవసరమని అన్నారు.

‘దేశ చట్టాన్ని అమలు చేయడం నా, మనందరి బాధ్యత’ అని ప్రధాని సూచించారు.

‘’ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో కృషి చేస్తాయని ఆశిస్తున్నా, ఉగ్రవాదంపై పోరు విషయంలో మన రాజకీయ, మతపరమైన నాయకత్వం స్పష్టంగా ఉండాలి’’ అని ప్రధాని చెప్పారు.

ఉగ్రవాదంపై పోరుకు సైన్యానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చైనా పర్యటనపై వచ్చే ప్రతికూల వ్యాఖ్యలను తిప్పికొట్టాలని పాక్ ప్రధాని పిలుపునిచ్చారు.

"పాకిస్తాన్ శత్రువులు సోషల్ స్పేస్‌ను విషపూరితం చేశారు. చైనా పర్యటన సమయంలో కూడా ప్రతికూల ప్రచారాలు జరిగాయి" అని ఆయన వివరించారు.

ద్వేషపూరిత భాషను నిర్మూలించే చట్టాలను రూపొందించాలని, భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, రాజ్యాంగాన్ని ఛిన్నాభిన్నం చేయడం కంటే పెద్ద నేరం మరొకటి ఉండదన్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇపుడు చైనా పెట్టుబడులు పెడుతుందా?

పాకిస్తాన్‌లో 26 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడితో సీపీఈసీ మొదటి దశను చైనా దాదాపుగా పూర్తి చేసిందని డాక్టర్ వసీం ఇషాక్ బీబీసీకి తెలిపారు. వసీం ఇషాక్ ఇస్లామాబాద్‌లోని నమల్ యూనివర్సిటీలో చైనా స్టడీస్ సెంటర్ డైరెక్టర్.

సీపీఈసీలో దాదాపు 60 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు వసీం. వీటిలో చాలావరకు మౌలిక సదుపాయాలు, ఇంధన రంగానికి సంబంధించినవని ఆయన తెలిపారు.

గత 10 ఏళ్లలో చైనా పౌరులపై పలు దాడులు జరిగాయని, కొందరు ప్రాణాలు కోల్పోయారని వసీం గుర్తుచేశారు. ఇప్పుడు చైనా తన పౌరుల భద్రత విషయంలో రాజీపడటం లేదని, భద్రత మెరుగ్గా ఉన్న చోట మాత్రమే పెట్టుబడి పెట్టాలని చైనా భావిస్తోందని తెలిపారు.

వారు పాకిస్తాన్‌లో స్థిరత్వం, చైనా పౌరుల భద్రత గురించి సందేహాలు లేవనెత్తుతున్నారని, ఈ రెండు అంశాలు మెరుగుపడే వరకు సీపీఈసీ రెండో దశకు వెళ్లకూడదని చైనా నిర్ణయించుకుందని వసీం అన్నారు. పాకిస్తాన్ స్పష్టమైన చర్యలు తీసుకుని, గ్రౌండ్ పరిస్థితులు మెరుగుపడే వరకు చైనా రెండో దశకు వెళ్లబోదని ఆయన భావిస్తున్నారు.

ప్రధాని షాబాజ్ షరీఫ్ చైనా పర్యటనలో ప్రాజెక్టులను అప్‌గ్రేడ్ చేయడానికి ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ దార్ అన్నారు. సీపీఈసీ తదుపరి దశలో పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఎకనామిక్ జోన్లు అభివృద్ధి అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

పాకిస్తాన్, చైనా వ్యాపారాలు

ఫొటో సోర్స్, Getty Images

'చైనా, పాకిస్తాన్‌ల ప్రయోజనాలు పెనవేసుకున్నాయి'

మిత్రుడి హోదాలో చైనా ఇలా మాట్లాడటం మామూలేనని చైనాలో పాకిస్తాన్ మాజీ రాయబారి నఘ్‌మన హష్మీ బీబీసీతో అన్నారు. రెండు దేశాలు ఒకే ఆలోచనతో ఉన్నాయని హష్మీ అన్నారు.

చైనా వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న డాక్టర్ ఫజ్లుర్ రెహ్మాన్ బీబీసీతో మాట్లాడుతూ.. తాము చాలాకాలంగా పాకిస్తాన్‌ ప్రభుత్వంతో పంచుకుంటున్న ఆందోళనలు ఇవేనని చెప్పారు. అయితే, ఈ భయాలను తొలగిస్తామని పాకిస్తాన్ కూడా హామీ ఇస్తోందని అన్నారు.

‘’చైనా పద్ధతి ఏమిటంటే మొదట సమస్యను వివరించి, ఆ తర్వాత కలిసి పరిష్కరించడం. ఆర్థిక సమస్యలపై పాకిస్తాన్ వివరణ చైనాకు అర్థమైంది. అయితే ఏం చేసినా చైనాకు నిజం చెప్పాలి. చైనా, పాకిస్తాన్ ప్రయోజనాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. పాకిస్తాన్‌తో సంబంధాలకు చైనా ఇకపై ప్రాముఖ్యత ఇవ్వబోదనుకోవడం సరికాదు.’’ రెహ్మాన్ అన్నారు.

‘చైనాకు భరోసా కల్పించాలి’

చైనా ఈ సంబంధాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఈ రోజు పాకిస్తాన్‌కు ఆధునిక సాంకేతికత వచ్చి ఉండేది కాదని హష్మీ అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్ మీడియా దృష్టిలో భారత్, అమెరికా, బ్రిటన్ కంటే పాకిస్తాన్, చైనాలు వెనకబడి ఉన్నాయని అందుకే ఇరు దేశాల సంబంధాలపై 'నెగటివ్ రిపోర్టింగ్' చేస్తున్నారని హష్మీ ఆరోపించారు.

సీపీఈసీ భద్రతా విభాగం మరింత చురుగ్గా మారాల్సిన అవసరం ఉందని హష్మీ సూచించారు.

"ఇంటెలిజెన్స్ పంచుకోవాలి, చైనీస్ పౌరులకు 'ఆన్-సైట్' భద్రత అవసరం. ప్రయాణ సమయంలో వారికి బలమైన భద్రత కల్పించాలి." అని అన్నారు.

"పాకిస్తాన్ తన పొరుగుదేశాలైన అఫ్గానిస్తాన్, ఇరాన్, భారత్ వంటి దేశాలలో కొంచెం చురుకుగా ఉండాలి. ఇంటెలిజెన్స్ షేరింగ్ ద్వారా దేశం వెలుపల జరిగే కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపాలి. ఇది చైనా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది"అని హష్మీ సూచించారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

సీపీఈసీ పనుల వేగం ఎందుకు నెమ్మదించింది?

సీపీఈసీ మొదటి దశ సజావుగా కొనసాగిందని డాక్టర్ వసీం అంటున్నారు. రోడ్లు, కొత్త మోటార్‌వేలు నిర్మించారని, ఇంధన ప్రాజెక్టులపై కూడా పనులు జరిగాయని చెప్పారు.

అయితే "ఉగ్రవాద దాడులతో మూలధన పెట్టుబడులు ప్రభావితమయ్యాయి" అని వసీం అభిప్రాయపడ్డారు.

"మా వైపు రాజకీయ ప్రతిష్టంభన ఉంది. నిర్ణయం తీసుకోవడంలో కొన్ని సమస్యలు, సౌకర్యాలు కల్పించడంలో అడ్డంకులు ఉన్నాయి. దీని కారణంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌లు దాదాపు ఆగిపోయాయి" అని అన్నారు.

పాకిస్తాన్‌లో 100 శాతం చైనా పౌరులకు భద్రత లభిస్తే తప్ప, సీపీఈసీ పనులు వేగంగా కదలబోవని వసీం అభిప్రాయపడ్డారు.

సీపీఈసీ రెండో దశలో ప్రైవేట్ మూలధన పెట్టుబడులకు మంచి వాతావరణం ఉండటం ముఖ్యమని హష్మీ చెప్పారు.

‘’గత 10 సంవత్సరాలలో సీపీఈసీలో చాలా పురోగతి ఉంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఎకనామిక్ జోన్లు ఏర్పడాలి. కానీ జాప్యం పాకిస్తాన్ వైపు నుంచి ఉంది. ఇందులో చైనా తప్పు లేదు’’ అని అన్నారు.

"ఇటీవల చైనా పర్యటనలో ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు. అన్ని వర్గాలు ఒకే ఆలోచనతో ఉన్నాయని, భద్రత కల్పిస్తామనడానికి ఇది స్పష్టమైన సంకేతం" అని వసీం అన్నారు.

"ప్రభుత్వంతో సహా అన్ని సంస్థలు, పార్టీలకు ఈ విషయం తెలుసు. మనం సమగ్ర వ్యూహాన్ని రూపొందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది" అని తెలిపారు.

ఈ ప్రభుత్వ హయాంలోనే సీపీఈసీ ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉందని డాక్టర్ వసీం తెలిపారు. 80 నుంచి 90 శాతం పనులు పూర్తవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు వసీం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)