లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా, ఈ పదవి ఎంత పవర్‌ఫుల్ అంటే..

స్పీకర్ ఎన్నిక ఫోటో

ఫొటో సోర్స్, https://x.com/ANI

ఫొటో క్యాప్షన్, లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాను సభాపతి స్థానం వద్దకు తోడ్కొని వచ్చిన ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరెణ్ రిజిజు

18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు.

స్పీకర్ పదవికి ప్రధాని నరేంద్ర మోదీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా, అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ బలపర్చారు. ఎన్డీయేలోని ఇతర పార్టీల నేతలు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు.

అనంతరం నిర్వహించిన మూజువాణీ ఓటింగ్‌‌లో ఓం బిర్లా గెలిచారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు.

వచ్చే ఐదేళ్లపాటు ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు.

రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ స్థానం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

స్పీకర్‌గా ఎన్నికైన ఓంబిర్లాను సంప్రదాయం ప్రకారం, ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభాపతి స్థానం వద్దకు తోడ్కోని వెళ్ళారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
స్పీకర్ గ్రాఫిక్స్

బిర్లా v. కె. సురేష్

రాజ్యాంగంలోని 93వ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.

కచ్చితంగా లోక్‌సభ ఎంపీ అయ్యుండటం తప్ప లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తికి ప్రత్యేకమైన అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు.

లోక్‌సభ సభ్యుల నుంచే సభాపతిని సాధారణ మెజార్టీతో ఎన్నుకుంటారు. అంటే సభకు హాజరైన సభ్యులలో సగానికిపైగా సభ్యులు స్పీకర్‌ అభ్యర్ధికి ఓటు వేయాల్సి ఉంటుంది.

సహజంగా అధికార పక్షానికి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఎంపికవుతారు.

అధికార పక్షం సభలోని ఇతర పార్టీల నాయకులతో లాంఛనప్రాయంగా చర్చించి తన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది.

ఒకసారి ఫలానా వ్యక్తే అభ్యర్థి అని నిర్ణయమయ్యాక, ఆ అభ్యర్థి పేరును సాధారణంగా ప్రధాని, లేదంటే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదిస్తారు.

అయితే, ఈసారి అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో, స్పీకర్ పదవికి ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. సురేష్‌ కూడా నామినేషన్‌ వేశారు.

సాధారణంగా డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారు.

కానీ, పార్లమెంట్ సంప్రదాయాలను పాటించేందుకు ఈ ప్రభుత్వం నిరాకరిస్తోందని కాంగ్రెస్ నేత కేసీ. వేణుగోపాల్ ఆరోపించారు.

కె. సురేష్ కేరళ నుంచి ఎనిమిదో సారి ఎంపీగా గెలిచారు.

ఆయన దళిత నాయకుడు. ఓం బిర్లా కూడా దళిత వర్గానికి చెందినవారే.

స్పీకర్ గ్రాఫిక్స్

లోక్‌సభ స్పీకర్ పదవి ఎంత పవర్‌ఫుల్ అంటే..

సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం స్పీకర్ బాధ్యత. అందుకే ఈ పదవిని అత్యంత కీలకంగా పరిగణిస్తారు. పార్లమెంటరీ సమావేశాల అజెండాను స్పీకరే నిర్ణయిస్తారు.

సభలో ఏదైనా వివాదం ఏర్పడితే రూల్స్‌కు అనుగుణంగా స్పీకర్ చర్యలు తీసుకుంటారు.

సభలో అధికార, విపక్ష సభ్యులు ఉంటారు కనుక కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ తటస్థంగా ఉండాలని భావిస్తారు.

సభాధ్యక్షుడిగా ఏ విషయంపైనైనా స్పీకర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటించరు.

తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో సభాధ్యక్షుడు పాల్గొనరు.

కానీ ఏదైనా తీర్మానంపై ఓటింగ్ జరిగి, ఓట్లు సమానంగా వచ్చినప్పుడు స్పీకర్ ఓటు నిర్ణయాత్మకమవుతుంది.

లోక్‌సభ స్పీకర్ అనేక కమిటీలను ఏర్పాటు చేస్తారు.

ఈ కమిటీలన్నీ స్పీకర్ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుంది.

స్పీకర్ గ్రాఫిక్స్

సభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిని సస్పెండ్ చేసే హక్కు సభాపతికి ఉంటుంది.

2023లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో మొత్తం 141 మంది ప్రతిపక్ష సభ్యులు సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంతో సస్పెండయ్యారు.

వీరిలో లోక్‌సభ నుంచి 95మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండయ్యారు.

ఈ సస్పెన్షన్ల వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శించాయి.

స్పీకర్ గ్రాఫిక్స్

ఏళ్ళ తరబడి అధికార పక్షానికి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఎంపికయ్యే సంప్రదాయం ఉంది కానీ, కొన్నిసార్లు ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న12వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీకి చెందిన జీఎంసీ బాలయోగి స్పీకర్‌గా వ్యవహరించారు.

తదుపరి 13వ లోక్‌సభ స్పీకర్‌గానూ ఆయనే ఎంపికయ్యారు.

కానీ ఆయన పదవిలో ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

బాలయోగి తరువాత శివసేన ఎంపీ మనోహర్ జోషి స్పీకర్ అయ్యారు.

ఇప్పటివరకు చరిత్రలో జీఎస్ దిల్లన్, బలరామ్ జాఖడ్, జీఎంసీ బాలయోగి వరుసగా రెండుసార్లు స్పీకర్లుగా ఎంపికయ్యారు.

వీరిలో బలరామ్ జాఖడ్ మాత్రమే స్పీకర్‌గా, 7, 8వ లోక్‌సభలలో తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.

నాల్గవ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని స్పీకర్‌గా నిర్ణయించిన తరువాత, స్పీకర్ పదవిలో ఉండే వ్యక్తి పక్షపాతం లేకుండా తటస్థంగా ఉండాలనే నియయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ తొలి ప్రభుత్వానికి సీపీఐ(ఎం) మద్దతు ఇచ్చింది.

అప్పట్లో ఆ పార్టీ సీనియర్ నేత సోమనాథ్ చటర్జీకి స్పీకర్ పదవి దక్కింది.

కానీ అమెరికాతో అణుఒప్పందం వ్యవహారంపై సీపీఐ(ఎం) మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

చటర్జీని కూడా స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) కోరింది.

కానీ, ఆయన తిరస్కరించడంతో పార్టీ నుంచి తొలగించారు.

2009 నుంచి 2014వరకు 15వ లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ ఎంపికయ్యారు.

లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్ ఆమె.

ఆమె తరువాత 16వ లోక్‌సభకు బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్ స్పీకర్ అయ్యారు.

స్పీకర్‌ను తొలగించవచ్చా?

లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 సభకు కల్పించింది. 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం ద్వారా సగానికి పైగా సభ్యుల మద్దతుతో చేసిన తీర్మానం ద్వారా లోక్‌సభ స్పీకర్‌ను తొలగించవచ్చు.

సగానికిపైగా సభ్యుల మద్దతు అంటే ఆరోజు సభలో హాజరైన సభ్యుల సంఖ్యలో 50% పైగా అని అర్థం.

దీంతోపాటు ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 7,8 సెక్షన్ల కింద కూడా లోక్‌సభ స్పీకర్‌ను తొలగించవచ్చు.

ఒకవేళ స్పీకరే స్వచ్ఛందంగా వైదొలగానుకుంటే ఉపసభాపతికి రాజీనామా సమర్పించాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)