యజమాని నుంచి తప్పిపోయి అయిదేళ్లుగా అడవి జింకలతో తిరుగుతున్న గాడిద

జింకలతో ఉన్న గాడిద

ఫొటో సోర్స్, @maxfennell

కాలిఫోర్నియాలో అయిదేళ్ల కిందట తన యజమాని ఇంటి నుంచి తప్పించుకున్న ఒక పెంపుడు గాడిద, అడవిలో జింకలతో కలిసి తిరుగుతూ తన జీవితాన్ని హాయిగా గడుపుతున్నట్లు గుర్తించారు.

ఈ నెలలో ఒక విహార యాత్రికుడు చిత్రీకరించిన వీడియోలో ఉన్నది తమ పెంపుడు గాడిద ‘డీజిల్’ అని ఆబర్న్‌కు చెందిన టెర్రీ, డేవ్ డ్రూవరీ గుర్తించారు.

తమ పెంపుడు గాడిద క్షేమంగా ఉన్నట్లు తెలిశాక తమకు చాలా ఊరటగా అనిపించిందన్నారు డ్రూవరీ దంపతులు.

అడవి జింకలతోనే తమ పెంపుడు గాడిదను స్వేచ్ఛగా తిరగనివ్వాలని ఆ కుటుంబం నిర్ణయించింది.

2019లో కాలిఫోర్నియాలోని క్లియర్ లేక్‌కు సమీపంలో డేవ్ డ్రూవరీతో కలిసి హైకింగ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఈ గాడిద తప్పిపోయింది.

పలువారాల పాటు దీనికి గురించి ఆ కుటుంబం వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత కొన్ని నెలలకు ట్రయల్ కెమెరాలో దీని ఫోటోను చూడటమే చివరిసారి.

‘ఇక చేసేదేం లేక ఆశలు వదిలేసుకున్నాం’ అని బీబీసీ న్యూస్ పార్టనర్ సీబీఎస్‌కు టెర్రీ డ్రూవరీ చెప్పారు. దానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదన్నారామె.

కానీ, విహార యాత్రికుడు మ్యాక్స్ ఫెన్నెల్ ఈ నెల ప్రారంభంలో జింకలతో కలిసి ఉన్న ఓ గాడిదను వీడియోలో బంధించారు. గాడిద చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉందని చెప్పారు. తాను తీసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

‘‘ఇది నిజంగా అద్భుతం. ఓ మై గాడ్ అనిపించేలా ఉంది. చివరికి మేం దాన్ని చూడగలిగాం. ఇది చాలా సంతోషంగా, మంచి జీవితం గడుపుతుందని మేం తెలుసుకున్నాం. హాయిగా, ఆరోగ్యకరంగా ఉంది. ఈ విషయం మాకు ఊరటనిచ్చింది.’’ అని టెర్రీ డ్రూవరీ అన్నారు.

డీజిల్ తొలిసారి కనిపించకుండా పోయిన ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలోనే జింకల గుంపు ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా అటవీ గాడిదలు లేవు.

‘‘ఈ రెండు పూర్తిగా భిన్నమైన జంతువులు. కానీ, ఒకదానితో ఒకటి కలిసి ఎలా జీవించాలో, ఇవి నేర్చుకున్నాయి.’’ అని టెర్రీ అన్నారు.

డీజిల్ కనిపించకుండా పోయినప్పటి నుంచి గాడిదలను దత్తత తీసుకుంటున్నారు డ్రూవరీ దంపతులు. కనిపించకుండా పోయిన తమ పెంపుడు గాడిదను తిరిగి తెచ్చుకునే ఉద్దేశ్యమేమీ తమకు లేదన్నారు టెర్రీ.

‘‘దాన్ని పట్టుకోవడం అసాధ్యం. ఇప్పుడది పూర్తిగా అడవి గాడిద అయిపోయింది.’’ అని టెర్రీ చెప్పారు.

డీజిల్‌కు ఎనిమిదేళ్ల వయసు ఉంటుందని, గాడిదలు 40 ఏళ్ల వరకు జీవించగలవని ఆమె చెప్పారు.

గాడిదలు

ఫొటో సోర్స్, Getty Images

గాడిదలు పెంపుడు జంతువులుగా ఎలా మారాయి?

గాడిదలు మనుషులకు ఎలా పెంపుడు జంతువులుగా మారాయి అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.

మానవ చరిత్రలో గాడిదలు ఎలాంటి పాత్ర పోషించాయో తెలుసుకోవడానికి వివిధ దేశాలకు చెందిన 39 ప్రయోగశాలల నుంచి 49 మంది శాస్త్రవేత్తల బృందం ఒకటి అధ్యయనం చేసింది.

ప్రపంచంలోని 207 ఆధునిక గాడిదలు, 31 ప్రాచీన గాడిదల జన్యువులను ఈ బృందం సీక్వెన్స్ చేసింది. జెనెటిక్ మోడలింగ్ టెక్నిక్స్ సహాయంతో కాలక్రమంలో గాడిదల జనాభాలో వచ్చిన మార్పులను వీరు గుర్తించారు.

అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చడం ఒక విధంగా గాడిదలతోనే మొదలైనట్లు ఈ బృందం చెప్పింది.

కెన్యా, తూర్పు ఆఫ్రికా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాలలో 7,000 ఏళ్ల కిందట ఈ ధోరణి ప్రారంభమైందని వీరు అంచనా వేశారు.

గతంలో కొన్ని అధ్యయనాలు గాడిదలను పెంపుడు జంతువులుగా మార్చడం యెమెన్‌లో ప్రారంభమైనట్లు పేర్కొన్నాయి.

అయితే, ఒకప్పుడు పచ్చగా ఉన్న సహారా ప్రాంతం పొడిబారిన కాలం.. ఈ గాడిదలను పెంపుడు జంతువులుగా మార్చడం ప్రారంభమైన కాలం రెండూ దాదాపు ఒకటే కావడం ఆసక్తికరం.

సుమారు 8,200 ఏళ్ల కిందట రుతుపవనాలు బలహీనపడడం అరంభించాయి.. అనంతరం జంతువులు మేత, పచ్చదనాన్ని హరించివేయడం, ఇతర మానవ చర్యలు వర్షపాతంలో తగ్గుదలకు తద్వారా ఎడారీకరణకు దారితీసింది.

ఇలాంటి కఠిన పరిస్థితులకు మానవులు అలవాటు పడడంలో గాడిదలు పాత్ర ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.

దూర ప్రయాణాలకు, ముఖ్యంగా కఠిన భౌగోళిక పరిస్థితులలో ఎక్కువ దూరం బరువులు తరలించడానికి గాడిదల సేవలను మనుషులు ఉపయోగించుకుని ఉండొచ్చు.

ఈజిప్ట్‌లో 6,500 ఏళ్ల కిందట గాడిదలు ఉన్నట్లు తవ్వకాలలో బయట పడిన కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.

అక్కడి నుంచి 2,500 ఏళ్ల కాలంలో గాడిదలు యూరప్ అంతటా, ఆసియా ఖండం మొత్తం విస్తరించాయి.

గుర్రాల కంటే ముందు నుంచే గాడిదలు మనుషుల వద్ద బతికాయని వీరి పరిశోధనలలో తేలింది.

4,200 ఏళ్ల కిందట మనిషి తన అవసరాల కోసం గుర్రాలను పెంచడం ప్రారంభించగా అంతకంటే ముందు నుంచే గాడిదలను పెంచినట్లు ఈ అధ్యయనం సూచిస్తోంది.

మానవ చరిత్రలో గుర్రాల ప్రభావం కంటే ముందే గాడిదల ప్రభావం ఉందని వీరు చెప్తున్నారు.

ప్రస్తుత ప్రపంచంలో అనేక ప్రాంతాలలో గాడిదలకు ప్రాధాన్యం లేనప్పటికీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికీ అవి కీలకమే.

అభివృద్ధి చెందిన దేశాలలో గాడిదల ఉపయోగం పెద్దగా లేనప్పటికీ ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్ప దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మానవ, సరకు రవాణాలలో గాడిదలను ఉపయోగిస్తున్నారు.

టెర్రీ, డేవ్ లాంటి వారు వాటిని ప్రేమగా సాకుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)