టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్: వర్షం పడితే భారత్ పరిస్థితి ఏమిటి? టీమిండియాను వేధిస్తున్న సవాళ్లేమిటి

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 వరల్డ్ కప్-2024 చివరి దశకు చేరుకుంది.

సెమీఫైనల్స్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా కేవలం 56 పరుగులకే అఫ్గాన్ జట్టు మొత్తాన్ని ఆలౌట్ చేసి తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి, టీ20 ఫైనల్‌కు చేరుకుంది.

సెమీస్‌లో భారత్ కనుక ఇంగ్లండ్‌ను ఓడిస్తే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది.

ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూన్ 29న నిర్వహిస్తారు.

టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు రెండుసార్లు కైవసం చేసుకుంది.

2007లో తొలిసారి ఈ ఫార్మాట్‌లో భారత్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ప్రస్తుత టోర్నీ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు అజేయంగా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడినా, బౌలర్లు విజయాన్ని అందించారు.

సూపర్-8 మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా రూపంలో బలమైన జట్టు ఎదురైంది.

2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌ను ఓడించి వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.

కానీ ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌ సూపర్-8 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్ సాయంతో, నవంబర్‌లో ఎదురైన ఓటమి బాధను భారత్ కొంత తగ్గించుకుంది. ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది.

టీ20 ప్రపంచ కప్

ఫొటో సోర్స్, Getty Images

టీమిండియా బలహీనతలు

50 ఓవర్ల ప్రపంచకప్‌లో మాదిరిగానే ఈ టీ-20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.

అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు పెద్ద సమస్యగా మారే కొన్ని బలహీనతలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత జట్టుకు ఓపెనింగ్ తలనొప్పిగా మారింది.

ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ స్థాయికి తగిన ప్రదర్శన కనబరచలేకపోయారు.

ఈ మొత్తం టోర్నీలో రోహిత్ శర్మ కేవలం రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ 52 పరుగులు చేశాడు.

అయితే, ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కానీ భారత్ ముందున్న అతి పెద్ద సమస్య విరాట్ కోహ్లీ, ఈ టోర్నీలో కోహ్లీ ఫామ్‌లోకి రాలేదు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆయన 30 పరుగులు దాటాడు.

అంతే కాకుండా ఈ టోర్నీలో కోహ్లీ రెండుసార్లు డకౌట్ అయ్యాడు.

ఐర్లాండ్, అమెరికా, బంగ్లాదేశ్ వంటి జట్లపైనా కోహ్లీ రన్స్ చేయలేకపోయాడు.

ఈ మొత్తం టోర్నీలో ఇప్పటి వరకు కోహ్లీ, రోహిత్‌ల మధ్య పెద్ద భాగస్వామ్యం లేదు.

ఓపెనింగ్‌లోనే కాదు, మిడిల్ ఆర్డర్‌పైనా టీమిండియా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

కానీ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్‌ల ఒకటి, రెండు ఇన్నింగ్స్ కారణంగా దీనిని పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ టోర్నీలో భారత మిడిలార్డర్‌ను నిశితంగా పరిశీలిస్తే, దాదాపు అన్ని మ్యాచ్‌లలో బాగా బ్యాటింగ్ చేసిన లేదా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.

ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ రెండు హాఫ్ సెంచరీలు, హార్దిక్ పాండ్య ఒక హాఫ్ సెంచరీ సాధించారు.

మిడిలార్డర్‌లో శివమ్ దుబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యారు.

శివమ్ దుబే కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే 30కి మించి స్కోర్ చేయగలిగారు.

రవీంద్ర జడేజా ఇప్పటివరకు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ప్రభావం చూపలేకపోయారు.

జడేజా మాదిరిగానే అక్షర్ పటేల్, శివమ్ దుబే కూడా ఆల్ రౌండ్ సామర్థ్యంతో జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు అంచనాల మేరకు రాణించలేకపోయారు.

కోహ్లీ ఓపెనింగ్‌ నిర్ణయం తప్పా?

గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌కు ఇరుసుగా మారారు. 2023 ప్రపంచకప్‌లోనూ, మొత్తం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

అదే టోర్నీలో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ, సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. దీని తర్వాత జరిగిన ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

కానీ, 2024 టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ వరుసగా ఫ్లాప్‌ అవుతూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్.

టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో కోహ్లీ గత కొన్నేళ్లుగా మూడో స్థానంలో ఆడుతున్నాడు.

ఒక రకంగా చెప్పాలంటే 2010 నుంచి కోహ్లీ మూడో స్థానంలో స్థిరపడ్డాడు. కోహ్లీ ఈ స్థానంలో అత్యధిక పరుగులు చేశాడు. ఈ స్థానంలోనే అత్యధిక మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు.

కోహ్లీ మూడోస్థానంలో రావడం అది భారత బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలాన్ని ఇస్తుంది.

ఓపెనర్లు తొందరగా అవుటైతే మిడిలార్డర్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌లతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేవాడు.

ఈ ప్రపంచకప్‌లో ఓపెనింగ్ బాధ్యతలను కోహ్లీకి అప్పగించారు. అయితే ఇప్పటి వరకు ఆయన ప్రదర్శనను పరిశీలిస్తే, ఈ బాధ్యతను నెరవేర్చడంలో కోహ్లీ విఫలమయ్యాడు.

యశస్వి జైస్వాల్ స్థానంలో వచ్చిన దుబే సైతం తన పాత్రకు న్యాయం చేయడంలో దాదాపు విఫలమయ్యాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌లాంటి బలమైన జట్టుతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ సమస్యలను అధిగమించడం రోహిత్‌కు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాలే.

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

బౌలింగ్, ఫీల్డింగ్‌లో సవాళ్లు

టోర్నీలోని అన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఈ టోర్నీలో బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్ల ప్రదర్శనే మెరుగ్గా ఉంది. కానీ, భారత్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా నిజం కాదు.

బుమ్రా మినహా దాదాపు భారత బౌలర్లందరూ ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే బాగా బౌలింగ్ చేశారు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ 11 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇస్తే, జడేజా 17 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చారు.

ఒకట్రెండు మ్యాచ్‌లు తప్పితే అక్షర్ పటేల్ సైతం ఓవర్‌కు 8 పరుగుల కంటే ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌కు వికెట్లు లభించి ఉండవచ్చు. కానీ, రన్స్ ఎక్కువగానే ఇచ్చాడు.

సిరాజ్‌కు ఒకే ఒక్క మ్యాచ్‌లో అవకాశం దక్కింది. శివమ్ బుబే అన్ని మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యాడు కానీ ఒక్క మ్యాచ్‌లో తప్ప ఆయనకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.

దీంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు చాలా క్యాచ్‌లు జారవిడిచారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిషెల్ మార్ష్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు వదిలేశాడు.

ముఖ్యమైన సమయాల్లో పేలవమైన ఫీల్డింగ్ వల్ల మ్యాచ్‌లు చేజారవచ్చు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

నాకౌట్ మ్యాచ్‌ల ఒత్తిడి

2013 నుంచి భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ముఖ్యంగా ప్రపంచకప్ వంటి టోర్నీల్లో భారత జట్టు వరుసగా విఫలమవుతోంది.

ఉదాహరణకు గత కొన్ని టోర్నీలను పరిశీలిస్తే 50 ఓవర్ల ప్రపంచకప్‌లో, టీమిండియా ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకుంది.

అయితే స్వదేశంలో ఆడినా ఫైనల్‌ ఒత్తిడిని తట్టుకోలేక ఆ జట్టు మ్యాచ్‌ను చేజార్చుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఈ టీ-20 ప్రపంచకప్‌లోనూ భారత్ తన సెమీఫైనల్ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడుతోంది.

జోస్ బట్లర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ ప్రదర్శన

ఈ టోర్నీలో టైటిల్‌ను కాపాడుకునేందుకు ఇంగ్లండ్ జట్టు పోరాడుతోంది. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీలో ఈ జట్టు ప్రదర్శన మరీ అంత అద్భుతంగా ఏమీ లేదు.

గ్రూప్ మ్యాచ్‌లలో స్కాట్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓటమిని చవి చూసింది. అయితే, సూపర్-8కి చేరుకోవడంలో జట్టు విజయం సాధించింది.

సూపర్-8లో ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో ఓటమిని చవి చూసినా.. అమెరికా, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది.

క్రికెట్ మైదానం

ఫొటో సోర్స్, Getty Images

వర్షం పడితే ఏమవుతుంది?

ఈ రోజు (జూన్ 27) గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇంగ్లండ్-భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరల్డ్ వెదర్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మ్యాచ్ రోజున తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది.

జట్టు కూర్పు, ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఓటమి, విజయానికి వర్షం సైతం ఒక కారణం కావచ్చు.

ఈ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే లేదు. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే అదనపు సమయం ఇస్తారు.

రెండు జట్లూ కనీసం పదేసి ఓవర్లు ఆడితే ఫలితం ప్రకటిస్తారు. లేదంటే మ్యాచ్ రద్దవుతుంది.

గ్రూప్-1లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నందున.. మ్యాచ్ రద్దయితే భారత్ ఫైనల్‌కు చేరుతుంది.

వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే ఆ తరువాత భారత జట్టు ఆటతీరు దెబ్బతిన్న సందర్భాలు గతంలో ఉన్నాయి.

దీనికి అతిపెద్ద ఉదాహరణ 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్.

ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజీలాండ్‌తో తలపడింది. ఒకానొక సమయంలో భారత జట్టు మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజీలాండ్ జట్టును భారత బౌలర్లు కేవలం 239 పరుగులకే కట్టడి చేశారు. కానీ వర్షం కారణంగా ఆటను రిజర్వ్ డేకు పొడిగించారు.

రిజర్వ్ డేలో భారత జట్టు బ్యాటింగ్ కివీస్ బౌలర్ల ముందు పేకమేడలా కుప్పకూలింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 221 పరుగులకే పరిమితమై, ప్రపంచకప్‌ను చేజార్చుకుంది.

టీమిండియా వైపు నుంచి చూస్తే ఈ ప్రపంచకప్ చాలా రకాలుగా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చు.

అటువంటి పరిస్థితిలో, ఈ సెమీ ఫైనల్‌లో ఎలాంటి బలహీనతలూ లేకుండా మ్యాచ్‌ను ఆడడం భారత జట్టుకు చాలా ముఖ్యం.

గత టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ జట్టు సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దానికి ప్రతీకారం తీర్చుకుని, ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలన్న కలను నిజం చేసుకోవడానికి భారత్‌కు ఇదొక మంచి అవకాశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)