షెఫాలీ వర్మ: ‘ముందే తెలిసి ఉంటే అవుట్ అవ్వకపోయేదాన్ని’ - మహిళల క్రికెట్‌లో సెహ్వాగ్‌గా పిలిచే ‘సిక్సర్ల షెఫాలీ’ ఎందుకలా అన్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు రికార్డులు సృష్టించింది.
తొలి రోజు ఆటలో ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన పరుగుల వర్షం కురిపిస్తూ రికార్డులను నెలకొల్పారు.
శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. మొత్తంగా చూసుకుంటే పురుషుల, మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్క రోజులోనే నమోదైన గరిష్ఠ స్కోరు ఇదే.
గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక ఒక్క రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది.
2002లో బంగ్లాదేశ్‌తో జరిగిన కొలంబో టెస్టు రెండోరోజున శ్రీలంక ఈ ఘనత సాధించింది.
తాజాగా భారత్ ఈ రికార్డును 16 పరుగుల తేడాతో అధిగమించి టెస్టుల్లో ఒక్కరోజులోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.


ఫొటో సోర్స్, Getty Images
సెహ్వాగ్‌ను తలపించిన షెఫాలీ
షెఫాలీ వర్మను మహిళల క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌గా పిలుస్తుంటారు. దక్షిణాఫ్రికాతో టెస్టులో సెహ్వాగ్ స్టయిల్‌లో బ్యాటింగ్ చేసిన షెఫాలీ, ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకుంది.
మహిళల క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. 194 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సర్లతో ఆమె డబుల్ సెంచరీ చేసింది.
అంతకుముందు వేగంగా డబుల్ సెంచరీ చేసిన రికార్డు అనాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనే 248 బంతుల్లో సదర్లాండ్ ఈ రికార్డును సాధించింది.
మహిళల క్రికెట్‌లో ఒక రోజులోనే డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ షెఫాలీనే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షెఫాలీ 197 బంతుల్లో 205 పరుగులు చేసి అవుటైంది.
మహిళల క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసే దిశగా షెఫాలీ కదులుతున్నట్లు కనిపించింది.
కానీ, జెమీమాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌గా కావడంతో అత్యధిక స్కోరుకు 38 పరుగుల దూరంలో వెనుదిరగాల్సి వచ్చింది.
మహిళల క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు పాకిస్తాన్ ప్లేయర్ కిరణ్ బలూచ్ పేరిట ఉంది. 2004లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కిరణ్ బలూచ్ 242 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్లతో సెంచరీ, డబుల్ సెంచరీ ఫీట్లను అందుకుంటాడని.. సెహ్వాగ్ పుస్తకం విడుదల సందర్భంగా మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ అన్నారు.
షెఫాలీ వర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే తీరు కనిపించింది.
షెఫాలీ వర్మ డబుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో ఆఫ్ స్పిన్నర్ డెల్మీ టకర్ బౌలింగ్‌కు దిగారు.
టకర్ బౌలింగ్‌లో రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది, తర్వాత ఒక పరుగుతో డబుల్ సెంచరీ చేసిన షెఫాలీ వర్మ, తనను మహిళా క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌తో ఎందుకు పోలుస్తారో రుజువు చేసింది.
భారత్ నుంచి డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ షెఫాలీ. ఈ ఫీట్ అందుకున్న తొలి బ్యాటర్ మిథాలీ రాజ్.
22 ఏళ్ల క్రితం, టాంటన్‌తో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మిథాలీరాజ్ 407 బంతుల్లో 214 పరుగులు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘స్మృతి సలహా పనిచేసింది’
‘‘మీకు మహిళల టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరు గురించి తెలుసా?’’ అని డబుల్ సెంచరీ తర్వాత షెఫాలీ వర్మను అడిగారు.
‘‘ఆ విషయం ముందే తెలిసి ఉంటే, ఆ స్కోరును అధిగమించేందుకు ప్రయత్నించేదాన్ని’’ అని చెబుతూ గట్టిగా నవ్వారు షెఫాలీ.
ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘‘నా రేంజ్‌లోకి వచ్చిన ప్రతీ బంతిని బాదాను. అలాగే స్మృతి ఇచ్చిన సలహా కూడా బాగా పనిచేసింది. బంతిపై ఎదురుదాడి చేయాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అటాక్ చేయమంటూ స్మృతి సలహా ఇచ్చారు’’ అని షెఫాలీ చెప్పారు.
మరో ఎండ్‌లో ఉంటూ షెఫాలీ ఇన్నింగ్స్‌ను చూడటం చాలా బాగుందని స్మృతి మంధాన అన్నారు.
మహిళల టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో రెండు కంటే ఎక్కువ సిక్స్‌లు బాదిన తొలి బ్యాటర్ షెఫాలీ వర్మ.

ఫొటో సోర్స్, Getty Images
స్మృతి మంధాన కూడా ఏం తగ్గలేదు
భారత మహిళల జట్టు ఒక్క రోజులోనే అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించడంలో స్మృతి మంధాన పాత్ర కూడా ఉంది.
ఆమె 161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు చేసింది.
ఓపెనింగ్‌కు దిగిన షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 292 పరుగులు జోడించారు. మహిళల టెస్టుల్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం.
గతంలో పాకిస్తాన్ ప్లేయర్లు కిరణ్ బలూచ్, సాజిదా షా జోడీ అత్యధికంగా 242 పరుగులు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు భారత్ జోడీ పేరిట చేరింది.
మహిళల టెస్టులో ఒక్క రోజే 500 పరుగులు
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్క రోజులోనే 500 పరుగులకు పైగా నమోదు చేసిన తొలి టీమ్‌గా భారత జట్టు నిలిచింది.
అంతకుముందు 1935లో క్రైస్ట్‌చర్చ్ టెస్టులో ఒక రోజే 475 పరుగులు వచ్చాయి.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌ను షెఫాలీ వర్మ, స్మృతి మంధాన చాలా జాగ్రత్తగా ప్రారంభించారు.
మార్నింగ్ సెషన్‌లో కేవలం 130 పరుగులు మాత్రమే జోడించారు.
మధ్యాహ్నం సెషన్‌లో మాత్రం ఈ ఇద్దరు ఓపెనర్లు పరుగుల వరద పారించారు.
అదే స్పీడ్‌ను కొనసాగిస్తూ సరికొత్త రికార్డును సృష్టించారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














