డి.శ్రీనివాస్: ఆర్‌బీఐ క్లర్క్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో మంత్రి వరకు..

ఫొటో సోర్స్, FB/revanthofficial
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్(76) కన్నుమూశారు. 2024 జూన్ 29 తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
డి.శ్రీనివాస్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
డి.శ్రీనివాస్ మరణంపై ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు.
‘‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I will miss you DADDY! నా తండ్రి, నా గురువు, అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకై జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు’’ అంటూ ధర్మపురి అర్వింద్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
డీఎస్, వైఎస్ కాంబినేషన్
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన డి.శ్రీనివాస్‌కు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు సార్లూ పీసీసీ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ ఉన్నారు.
‘‘నాది, డి.శ్రీనివాస్ ది జోడెద్దుల బంధం. మేమిద్దం కలిసి వెళ్లిన రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించాం. ఆయన పార్టీ సారథిగా, నేను సీఎల్పీ నేతగా సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చాం’’ అంటూ 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు.
అప్పట్లో వీరిద్దరిది కాంగ్రెస్ పార్టీకి ‘హిట్’ కాంబినేషన్‌గా పార్టీ నాయకులు చెప్పుకొనేవారు.
2004లో పార్టీ గెలిచాక పీసీసీ సారథిని మార్చారు. డి.శ్రీనివాస్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా తీసుకోవడంతో ఆయన్ను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు.
అయినప్పటికీ మరోసారి 2009 ఎన్నికల ముందు డి.శ్రీనివాస్‌ను పీసీసీ చీఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. తెలంగాణ ప్రాంతీయ నేపథ్యం, బీసీ కార్డు.. ఈ రెండూ డి.శ్రీనివాస్‌కు బాగా కలిసొచ్చాయని కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు.
‘‘వైఎస్, డీఎస్ మధ్య మంచి సఖ్యత కుదిరింది. ఆ సమయంలో పరిస్థితులు కలిసి వచ్చాయి. దాని వల్ల ఇద్దరూ జోడెద్దుల తరహాలో పార్టీని నడిపించారని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేయడంతో అలా గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. మున్నూరు కాపుల్లో పేరున్న నాయకుడిగా డీఎస్ గుర్తింపు సాధించారు’’ అని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మెరుగుమాల నాంచారయ్య బీబీసీతో చెప్పారు.
డి.శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారని నిజామాబాద్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాహెర్ బిన్ హందన్ చెప్పారు.
డిఎస్‌తో తాహెర్‌కు 40 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులు ఉన్నా, అందరితో సమన్వయంతో పనిచేశారు. పని చేసేందుకు పోటీ పడేవారు తప్ప వ్యక్తిగతంగా ఎవరితో పోటీ పడేవారు కాదు. పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. యువతను ఎక్కువగా ప్రోత్సహించారు’’ అని తాహెర్ వివరించారు.

ఫొటో సోర్స్, x/Arvindharmapuri
ఆర్‌బీఐ క్లర్క్‌గా పనిచేసి..
డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా ప్రయాణం ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ అయ్యాక 1974 నుంచి కొన్నేళ్లపాటు రిజర్వ్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్గుల్ రాజారాం స్ఫూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు.
‘‘టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1982లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీకి శ్రీనివాస్‌కు అవకాశం వచ్చింది. ఆ ఎన్నికలో ఓడిపోయారు.
ఆ తర్వాత 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1985లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1989లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివ్రద్ధి, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు’’ అని బీబీసీతో చెప్పారు తాహెర్.

ఫొటో సోర్స్, FB/Arvind Dharmapuri
కాంగ్రెస్.. బీఆర్ఎస్.. కాంగ్రెస్..
డిఎస్‌కు విజయాలతోపాటు ఓటములు ఎదురయ్యాయి.
1994లో పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు డీఎస్.
1999లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గానూ పనిచేశారు.
2004 ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.
2004లో జరిగిన ఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే కావడంతోపాటు వైఎస్ కేబినెట్‌లో ఎక్సైజ్, ఉన్నత విద్యా శాఖల మంత్రిగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఆ ప్రాంత వాదనను అధిష్ఠానం ముందు వినిపించారు.
2009, 2010 ఉపఎన్నిక, 2014 సాధారణ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు.
2015లో ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో పార్టీపై అసంతృప్తితో, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జులై 2న బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత 2016లో రాజ్యసభకు ఎంపికై 2022 వరకు పనిచేశారు.
2023 మార్చిలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఫొటో సోర్స్, X/Arvindharmapuri
కుమారుడు అర్వింద్ రెండు సార్లు ఎంపీ
డి.శ్రీనివాస్ 1948 సెప్టెంబరు 27న నిజామాబాద్‌లో జన్మించారు.
ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారులు సంజయ్, అర్వింద్ ఉన్నారు.
వీరిలో ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు.
సంజయ్ నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు.
డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు’’ అని రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.
‘‘శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ సహా పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు డి. శ్రీనివాస్ మరణం పట్ల సంతాపం తెలిపారు.
డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఈ నెల 30న ఆదివారం నిజామాబాద్‌లో జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














