అరుంధతీ రాయ్ 'శక్తిమంతమైన’ రచనలకు 2024 పెన్ పింటర్ ప్రైజ్

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ రచయిత్రి అరుంధతీ రాయ్ 2024 సంవత్సరానికి గానూ పెన్ పింటర్ ప్రైజ్‌ను అందుకోనున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషకరమని ఆమె అన్నారు.
నోబెల్ గ్రహీత, నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం 2009 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న అరుంధతీ రాయ్‌కి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
ఎలాంటి పరిస్థితులకు చలించని తీరు, ప్రపంచం పట్ల నిర్మొహమాటమైన దృక్పథం, నిజజీవిత సత్యాలను, సమాజాన్ని వాస్తవికంగా చూపించే మేధో సంకల్పానికి నిదర్శనమైన రచనలు చేసిన యూకే, కామన్వెల్త్ గేమ్స్ దేశాలకు చెందిన రచయితలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
అవార్డు జ్యూరీలో ఈ ఏడాది పెన్ ఫౌండేషన్ అధ్యక్షులు రూత్ బోర్త్‌విక్, నటుడు ఖలీద్ అబ్దుల్లా, రచయిత రోజర్ రాబిన్సన్ ఉన్నారు.

ఒకవైపు చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీ యాక్ట్) కింద ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇటీవల అనుమతి ఇచ్చిన ఇదే తరుణంలో, అరుంధతి రాయ్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఆమె 14 ఏళ్ల కిందట చేసిన ప్రసంగంపై ఈ కేసు నమోదైంది.
అన్యాయానికి సంబంధించిన ముఖ్యమైన కథలను అరుంధతీ రాయ్ చతురతతో అందంగా చెప్పారని ఇంగ్లిష్ పెన్ ప్రెసిడెంట్ రూత్ బోర్త్‌విక్ ప్రశంసించారు.
''అందరూ భారత్ వైపే చూస్తున్నారు, అరుంధతీ రాయ్ అంతర్జాతీయ స్థాయి మేధావి, ఆలోచనాపరురాలు. శక్తివంతమైన ఆమె స్వరాన్ని అణచివేయలేరు'' అని బోర్త్‌విక్ చెప్పారు.
మోదీ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు 62 ఏళ్ల అరుంధతీ రాయ్.
ఆమె రచనలు, ప్రసంగాలు, అభిప్రాయాలను తరచూ రైట్ వింగ్ గ్రూపులు లక్ష్యంగా చేసుకుంటాయి.
గతంలో మైఖేల్ రోసెన్, మైలోరీ బ్లాక్‌మన్, మార్గరెట్ ఎట్‌వుడ్, సల్మాన్ రష్దీ, టామ్ స్టాపర్డ్, కెరోల్ ఎన్ డఫీ వంటి రచయితలు ఈ అవార్డును అందుకున్నారు.
ఈ పురస్కారం లభించిన సందర్భంగా అరుంధతీ రాయ్ మాట్లాడుతూ, "హెరాల్డ్ పింటర్ ఈరోజు మన మధ్య ఉండి ఉంటే, ప్రపంచం తీసుకుంటున్న అనూహ్య మలుపు గురించి రాసేవారు. ఆయన మన మధ్య లేరు కాబట్టి, మనలో ఎవరో ఒకరు రాయాలి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అరుంధతి కేసు విచారణకు ఆదేశాలు
'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' అనే పుస్తకానికి 1997లో అరుంధతి రాయ్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆమె ఎన్నో నవలలు, వ్యాసాలు రాశారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద అరుంధతిని ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ నెలలోనే దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చారు.
ఇది 2010కి సంబంధించిన కేసు. ఆ ప్రసంగంలో "కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు" అని రాయ్ అన్నారు.
అరుంధతీ రాయ్ ఏడు నాన్ ఫిక్షన్ పుస్తకాలు రాశారు. 1999లో వచ్చిన 'కాస్ట్ ఆఫ్ లివింగ్' కూడా వాటిలో ఒకటి. ఇందులో వివాదాస్పద నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్, అణు పరీక్షలకు సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే, 2001లో 'పవర్ పాలిటిక్స్' అనే వ్యాసాల సంకలనం వచ్చింది. అదే ఏడాది 'ది ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫైనైట్ జస్టిస్' కూడా విడుదలైంది. ఆ తర్వాత 2004లో 'ది ఆర్డినరీ పర్సన్స్ గైడ్ టు ఎంపైర్' విడుదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
అనంతరం 2009లో 'ఇండియా, లిజనింగ్ టు గ్రాస్‌షాపర్స్: ఫీల్డ్ నోట్స్ ఆన్ డెమోక్రసీ' అనే పుస్తకం రాశారు రాయ్. ఈ పుస్తకం భారత ప్రజాస్వామ్యంలోని చీకటి కోణాలను ఆవిష్కరించే వ్యాసాలు, కథనాల సమాహారం.
90వ దశకంలో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలను రాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
2002 గుజరాత్ అల్లర్లపై నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె గళం విప్పారు.
భారత్‌లో నక్సలైట్ ఉద్యమంపై కూడా రాయ్ విస్తృతంగా రాశారు. ఏమీలేని గిరిజనుడు సాయుధ పోరాటాల్లో చేరడం తప్ప ఇంకేం చేస్తారని ఆమె తరచూ అంటూ ఉంటారు.
ప్రభుత్వంపై విమర్శనాత్మక వైఖరితో అరుంధతీ రాయ్ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బాలుడి పుర్రెలో మూర్ఛను తగ్గించే పరికరం అమర్చారు.. తర్వాత ఏమైందంటే?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














