తెలంగాణ ఏనుగులకు ఆవాసంగా మారనుందా? ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు మరణించిన ఘటన ఏం చెప్తోంది

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఒక అడవి ఏనుగు వచ్చింది.
ఆ ఏనుగు దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అది తిరిగి మహారాష్ట్రలోకి వెళ్తున్న క్రమంలో అదే ఏనుగు దాడిలో మహారాష్ట్రకు చెందిన ఒకరు చనిపోయారు.
నిజానికి తెలంగాణలోని అడవుల్లో ఏనుగులు ఉన్నట్లు ఇటీవలి చరిత్రలో లేదు.
ఈ ఏనుగు రాక భవిష్యత్తులో తెలంగాణ అడవుల్లో వాటి శాశ్వత నివాసానికి ఒక సంకేతం అన్న అంచనాలు అటవీ శాఖ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
అదే జరిగితే ఇక్కడి అడవులు, సమీప గ్రామాల ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది.


ఈ ఏడాది ఏప్రిల్ 3న ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి వచ్చిన ఏనుగు రెండు రోజులు తిరిగింది.
తెలంగాణలోకి ప్రవేశించిన 24 గంటల వ్యవధిలో ఈ ఏనుగు ఇద్దరిపై దాడి చేసింది.
ఆ దాడిలో సిర్పూర్ నియోజకవర్గం బూరేపల్లికి చెందిన రైతు అల్లూరి శంకర్ (55), కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోశన్న(50) ప్రాణాలు కోల్పోయారు.
ఏనుగు దాడి సమయంలో వీరిద్దరు తమ పొలాల్లో వ్యవసాయ పనుల్లో ఉన్నారు.
ఏనుగు సంచారంతో రెండు రోజులు పాటు చింతలమానేపల్లి, దహేగాం, బెజ్జూరు మండలాల పరిధిలో అధికారులు 144 సెక్షన్ విధించారు.

‘’అంతా మాయలా అనిపించింది’’
స్వేచ్ఛగా సంచరించే అడవి ఏనుగును చూడటం ఈ ప్రాంత వాసులకు అదే తొలిసారి.
ఏనుగు వచ్చిన రోజు తమ అనుభవాలను స్థానికులు బీబీసీతో పంచుకున్నారు.
‘’తెల్లవారాకే లేచారు. మేత కోసం మేకలు వదలమని చెప్పి ఆయన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. పది నిమిషాల్లోనే మా ఆయనను ఏనుగు తొక్కి చంపిందని చెప్పారు. ఏనుగు మాయచేసి పోయిందా అని అనిపిస్తోంది. మా ప్రాంతంలోకి ఏనుగు రావడం ఎప్పుడూ లేదు’’ అని మృతుడు కారు పోశన్న భార్య సుశీల అన్నారు.
‘’ఏనుగు దాడి చేయడం గ్రామ ప్రజలు చూశారు కాబట్టి సరిపోయింది, లేదంటే మా నాన్నను చంపింది ఏనుగేనా అని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు కచ్చితంగా అనుమానం వ్యక్తం చేసేవారు’’ అని పోశన్న కుమారుడు కారు భీమేశ్ అంటున్నారు.
''ఈ ఘటన తర్వాత భయం భయంగా ఉంటున్నాం. పులి ఊళ్లోకి రాదని తెలుసు, కానీ ఏనుగు వస్తే దాన్ని నిలువరించడానికి వందమంది అయినా సరిపోం'' అన్నారు.
ఏనుగు దాడి మృతుల కుటుంబాలకు తెలంగాణ అటవీ శాఖ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించింది.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదెకరాల భూమి కూడా ఇస్తామని వాగ్దానం చేశారని, అది నెరవేర్చలేదని భీమేష్ అన్నారు.

‘మార్నింగ్ వాకింగ్ మానేశాను’
కొండపల్లిలోకి ప్రవేశించిన ఏనుగును చూసినవారిలో ఎలకాని సుధాకర్ ఒకరు. ఆయన రోజూ మార్నింగ్ వాక్‌కి వెళ్లేవారు.
‘’నా పక్కన చెట్టు కదిలినట్టుగా అనిపించింది. చూస్తే ఏనుగు. దాని ఘీంకారానికి నా చెవులు మూసుకుపోయాయి. భయంతో పరుగుతీస్తుంటే రెండు కిలోమీటర్లు వెంబడించింది. గ్రామస్థులెవరూ అటువైపు రాకుండా చూడాలని నా భార్యకు ఫోన్‌లో చెప్పాను. ఈ ఘటన నన్ను ఎంతలా భయపెట్టిందంటే, అప్పటి నుంచి ఉదయం నడక మానేశాను’’ అని అన్నారు సుధాకర్.
‘’మా అడవిలో పులులు, ఎలుగుబంట్లు ఇలా చాలా జంతువులను చూశాం. కానీ ఏనుగును, దాని దాడిలో ప్రాణాలు పోవడం ఇదంతా మొదటిసారి చూశాను. మా ప్రాంతంలో ఎవరూ కలలో కూడా ఊహించని సంఘటన ఇది’’ అని ఆయన చెప్పారు.

కొండపల్లి: మనిషి, అడవి జంతువుల సంఘర్షణ
వన్యప్రాణుల దాడుల్లో తరచూ వార్తల్లో నిలిచే గ్రామం కొండపల్లి.
మనిషి-వన్యప్రాణుల మధ్య ఏర్పడ్డ ఘర్షణ వాతావరణానికి ఈ గ్రామం ఒక ఉదాహరణ.
ఇటీవల ఈ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి పసుల నిర్మల(16) పులి దాడిలో చనిపోాయారు, పోశన్న ఏనుగు దాడిలో చనిపోయారు.
‘’పత్తి ఏరడానికి కూలికి వెళ్తే వెనక నుంచి పులి దాడి చేసి ఈడ్చుకెళ్లింది. నా బిడ్డ బతకలేదు. ప్రాణం పోయింది’’ అని నిర్మల తల్లి పసుల లస్మక్క తెలిపారు.
వన్యప్రాణుల దాడులు ఈ గ్రామంలో తరుచూ జరుగుతున్నాయి.
‘’ఈ రెండు కుటుంబాల గురించే బయటి ప్రపంచానికి తెలుసు. ఎలుగుబంట్లు, అడవి పందుల దాడిలో గాయపడ్డవారు, పశువులను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. కరోనా కాలం మాదిరి హఠాత్తుగా ఎవరికేమవుతుందో అర్థం కాని పరిస్థితి మాది’’ అని కొండపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సంజీవ్ బీబీసీతో చెప్పారు.
‘’మహారాష్ట్ర అడవికి మా గ్రామం మీదుగా లింక్ కారిడార్ ఉంది. మా భూములన్నీ అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. పులులు, ఏనుగులు వస్తున్నాయని పనికి వెళ్లకుండా ఉంటే మా జీవితాలు గడవవు’’ అని సంజీవ్ అన్నారు.
‘ఇలాంటి గ్రామాల విషయంలో అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. అడవిలో గోడలు కట్టమని మేం అడగడం లేదు కదా? వన్యప్రాణుల కదలికలు సరిగా ట్రాక్ చేయాలి. ఏనుగులు తిరిగి వస్తాయని అంటున్నారు. వాటిని ఎదుర్కొనేందుకు మేం సిద్దంగా లేం’’ అని తెలిపారు.

కొత్త ప్రాంతానికి ఏనుగు ఎందుకు వచ్చింది?
ఈ విషయం చర్చించే ముందు, దేశంలో పూర్వం ఏనుగుల సంతతి వ్యాప్తిని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ‘సేజ్ ఫౌండేషన్’ కు చెందిన సాగ్నిక్ సేన్ గుప్తా అంటున్నారు.
మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించేందుకు ఈ సంస్థ పని చేస్తోంది.
‘’ఉత్తర తెలంగాణలో ఏనుగు ప్రవేశించిన ప్రాంతం చోటా నాగపూర్ పీఠభూమి దిగువకు వస్తుంది. ఈ పీఠభూమి ప్రాంతంలో 17వ శతాబ్దం మధ్య కాలం వరకు ఏనుగులు ఉన్నాయని బ్రిటిష్ జర్నల్స్ లో ప్రస్తావించారు. అంటే ఏనుగులకు ఇది కొత్త ప్రాంతం కాదని అర్థం అవుతోంది’’ అని సాగ్నిక్ సేన్ గుప్తా బీబీసీతో అన్నారు.
మొఘలుల కాలంలో దేశవ్యాప్తంగా ఏనుగులున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ పేర్కొంది.
''ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో గనుల తవ్వకాలతో (మైనింగ్) ఏర్పడ్డ ఒత్తిడి వల్ల ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు ఏనుగుల వలస పెరుగుతోంది. ఆ ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగే తెలంగాణలోకి వచ్చి వెళ్లింది’’ అని సాగ్నిక్ సేన్ తెలిపారు.

ఏనుగుల భవిష్యత్ నివాసమా?
ఒంటరి ఏనుగు భవిష్యత్తులో తన గుంపుతో తిరిగి రావొచ్చన్న వాదనలు ఉన్నాయి. స్థానిక ప్రజల్లో దీనిపై ఆందోళన కనిపిస్తోంది.
‘’తెలంగాణలోకి ఒంటరిగా వచ్చిన ఏనుగు ఈ ప్రాంతంపై అవగాహన కోసం రెక్కీ నిర్వహించింది. అది ఒంటరిగానో లేదా తన గుంపుతోనో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి అనుగుణంగా తెలంగాణ అటవీశాఖ సిద్దం కావాల్సి ఉంటుంది’’ అని సాగ్నిక్ సేన్ గుప్తా అభిప్రాయపడ్డారు.
ఏనుగు రాకపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) నీరజ్ టీబ్రేవాల్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘’పై ప్రాంత అడవుల్లో మైనింగ్ ప్రభావం వల్ల ప్రాణహిత నది ఆవలి తీరంలో మేత, నీరు లభ్యతపై ఏనుగు రెక్కీ నిర్వహించి ఉండొచ్చు. నీరు, మేత రెండూ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. కొత్త ప్రదేశాలకు వెళ్తే వివిధ అంశాలను మనుషులు ఆరా తీయడం లాంటిదే ఇది’’ అని అన్నారు.
భవిష్యత్తులో ఏనుగుల రాక మొదలైతే ఎదుర్కోబోయే పరిస్థితులకు తెలంగాణ అటవీశాఖ సిద్దమవుతోంది.
‘ఏనుగులు తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాయా లేదా కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, వన్యప్రాణుల ప్రవర్తనను మనం అంచనా వేయలేం. మా సిబ్బందిలో చాలామంది అడవి ఏనుగును చూడటం ఇదే మొదటిసారి. తెలంగాణలో ఈ ఘటనకు ముందు ఏనుగుల ఉనికికి ఆధారాలు లేవు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే మూడు దశల్లో మా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తాం. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నిధుల కోసం కేంద్రానికి నివేదిక పంపాం’’ అని టీబ్రేవాల్ అన్నారు.

ప్రాజెక్ట్ ఎలిఫెంట్
భారత ప్రభుత్వం 1992 లో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను ప్రారంభించింది.
ఏనుగు ఆవాసాలు, అవి వలస వెళ్లే కారిడార్‌ల పరిరక్షణ, మనుషులతో ఘర్షణ నివారణ, బందీ ఏనుగుల (క్యాప్టివ్ ఎలిఫెంట్) సంక్షేమం ప్రధాన అంశాలుగా ఈ ప్రాజెక్ట్ కింద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
దీనికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారాలు కేంద్రం అందిస్తోంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చర్యలు చేపట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి.
పర్యావరణ, అటవీ శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 2021 నాటికి భారత్‌లో ఏనుగుల సంఖ్య సుమారు 30 వేలు. 65 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏనుగుల కోసం నిర్ధేశించిన 30 రిజర్వ్ ఫారెస్ట్‌లున్నాయి.
సేజ్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం.. దేశంలో ప్రతి ఏటా ఏనుగుల దాడిలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దంతాల కోసం వేటాడటం, విద్యుత్ షాక్, విషం పెట్టడం, రైలు ఢీకొనడం వంటి కారణాలతో ఏటా సుమారు వంద ఏనుగులు మరణిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














