పోస్ట్‌లో కప్పలు, ఖడ్గమృగాల కొమ్ములు: మారుతున్న స్మగ్లర్ల వ్యూహాలు, వన్యప్రాణుల అక్రమ రవాణాకు ఎలా ఆజ్యం పోస్తున్నాయి?

ఫొటో సోర్స్, Press office/Bogota Environmental Agency
- రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
- హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి
ఏనుగు దంతాలను పొడిగా, ఖడ్గమృగాల కొమ్ములను పేస్ట్‌గా మారుస్తున్నారు. పాములను ఆలూ చిప్స్ డబ్బాలలో రవాణా చేస్తున్నారు.
వన్యప్రాణుల అక్రమ రవాణాదారులు ఉపయోగించే స్మగ్లింగ్ పద్ధతుల్లో ఇవి కొన్ని మాత్రమే అని పరిశోధనలో వెల్లడైంది.
స్మగ్లర్ల నేరపూరిత వ్యూహాలు అక్కడితో ఆగవు. వాళ్లు బతికి ఉన్న జంతువులను పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపుతున్నారు.
వన్యప్రాణుల అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో వన్యప్రాణుల అక్రమ రవాణాదారులు ఉపయోగించే స్మగ్లింగ్ వ్యూహాలు అతిపెద్ద సవాలుగా మారాయని సంరక్షకులు అంటున్నారు.
నిబంధనల్లోని మార్పులు, కఠినమైన నియంత్రణా నియమాలను తప్పించుకోవడానికి వన్యప్రాణుల అక్రమ రవాణాదారులు తమ పద్ధతులు, మార్గాలను మార్చుకుంటున్నారని మే నెలలో విడుదలైన ఐక్యరాజ్య సమితి ప్రపంచ వన్యప్రాణుల నేర నివేదిక వెల్లడించింది.

రెండు దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టి చర్యలు తీసుకుంటున్నా.. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోందని నివేదిక తెలిపింది.
ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం విలువ ఏడాదికి సుమారు 167 వేల కోట్ల రూపాయలుగా ఉందని అంచనా. అది కేవలం ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా విలువ మాత్రమే.
"ఇటీవల వన్యప్రాణుల అక్రమ రవాణాలో అధునాతనమైన, విభిన్నమైన రహస్య పద్ధతులను అనుసరిస్తున్నారు" అని యూఎన్ డ్రగ్స్, నేర కార్యాలయంలో పని చేస్తున్న అధికారి జికియాంగ్ టావో బీబీసీకి తెలిపారు.
ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ప్రకారం, 2022లో కస్టమ్స్ తనిఖీలలో 3,428 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 3,316గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆవు కొమ్ముల కింద ‘నల్లని’ ఏనుగు దంతాలు
గత మార్చిలో, ఈశాన్య వియత్నాంలోని హై ఫాంగ్ నగరంలో కస్టమ్స్ అధికారులు నైజీరియా నుంచి వచ్చిన ఒక పార్సిల్ చూసి ఆశ్చర్యపోయారు.
కంటైనర్‌లో వాళ్లకు నల్లటి ఆవు కొమ్ములు కనిపించాయి. నిశితంగా పరిశీలిస్తే నిజానికి అవి ఏనుగు దంతాలు అని, వాటికి నలుపు రంగు వేశారని వెల్లడైంది.
మొత్తం 550 దంతాలు పట్టుబడగా, వాటి బరువు దాదాపు 1,600 కిలోలు ఉంది.
దంతాలకు నలుపు రంగు వేసి ఆవు కొమ్ముల కింద దాచి రవాణా చేయడం ఇదే మొదటిసారి అని నేర నిపుణులు తెలిపారు.
ఈ రవాణాకు సంబంధించి నైజీరియాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఆఫ్రికన్ ఏనుగుల సంఖ్య తగ్గిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఈ దంతాల అక్రమ రవాణా ఒకటి.
గత 30 ఏళ్లలో వాటి జనాభా దాదాపు 90% తగ్గడంతో, ఆఫ్రికా ఏనుగులను అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ (IUCN) అంతరించిపోతున్న జాతులలో చేర్చింది.
జంతు జాతులు ఇలా అంతరించిపోతున్నప్పుడు, వాటి జనాభా మళ్లీ పెరిగేందుకు వీలుగా, వాటి అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిషేధిస్తారు లేదా పరిమితం చేస్తారు.

ఫొటో సోర్స్, Australian Department of Climate Change, Energy, the Environment and Water
పోస్ట్ ద్వారా బతికి ఉన్న జంతువుల రవాణా
వన్యప్రాణుల అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్న సంస్థలు అక్రమ రవాణాదారులు ఎక్కువగా పోస్టల్, కొరియర్ సేవలను ఉపయోగిస్తున్నారని తెలిపాయి.
ఉదాహరణకు, డిసెంబరు 2023 - జనవరి 2024 మధ్య ఆస్ట్రేలియాలోని పోస్టాఫీసుల నుంచి వివిధ జాతుల బల్లులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలు జరిగాయి.
ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ సరీసృపాలను ప్లాస్టిక్ కంటైనర్లలో కనుగొన్నారు. ఆ బల్లులను సాక్స్‌లలో ఉంచి, చుట్టూ ప్లాస్టిక్ బొమ్మలతో కప్పేశారు.
"ఆహారం, నీరు లేకుండా అవి వాటి మలమూత్రాల మధ్యలో కనిపించాయి" అని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.
కొన్నింటిని రబ్బరు బొమ్మల లోపల దూర్చారు.
జైలు శిక్ష పడిన అక్రమ రవాణాదారు ఒకరు 43 బల్లులను (బ్లూ-టంగ్ స్కింక్‌లు, షింగిల్ బ్యాక్ స్కింక్స్, ఈస్టర్ వాటర్ డ్రాగన్‌లు) ఏడు వేర్వేరు పార్సిళ్లలో హాంకాంగ్‌కు పోస్ట్ చేయడానికి ప్రయత్నించాడు.
ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులకు డిమాండ్ పెరుగుతున్నందు వల్ల బల్లులతో సహా చిన్నచిన్న సరీసృపాలను అక్రమంగా రవాణా చేస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
పోస్ట్ ద్వారా పంపుతున్న అటవీ వస్తువులు చిన్నగా ఉంటాయని, కొన్నిసార్లు బతికి ఉన్న వాటినీ రవాణా చేస్తున్నారని యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌లో సెక్యూరిటీ ప్రోగ్రామ్ మేనేజర్ డాన్ విల్క్స్ చెప్పారు.
“పోస్ట్‌లో అక్రమంగా రవాణా చేయడానికి నేరస్తులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. వాళ్లు సాధారణంగా పిల్లల బొమ్మలను ఉపయోగిస్తున్నారు” అని విల్క్స్ బీబీసీకి చెప్పారు.
ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ 2022లో జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని అక్రమంగా తరలించడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతి వాటిని పార్సిళ్లలో పోస్ట్ చేయడం అని తెలిపింది.
ఆ సంవత్సరం పట్టుబడిన వాటిలో 43% ఇలాగే రవాణా చేశారు.
పోస్టు, కొరియర్ ద్వారా ఇలా జరిగే అక్రమ రవాణా 2021- 2022 మధ్య 17% పెరిగింది. పట్టుబడిన వస్తువుల సంఖ్య 7% పెరిగి మొత్తం 6,453కి చేరుకుంది.

ఫొటో సోర్స్, Australian Department of Climate Change, Energy, the Environment and Water
ఫిల్మ్-రోల్ కేసుల్లో విషపూరితమైన కప్పలు
కేవలం ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో మాత్రమే కాదు. మిగతా ప్రదేశాలలోనూ వన్యప్రాణుల అక్రమ రవాణాదారులు అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు.
జనవరిలో, కొలంబియా అధికారులు రాజధాని బొగోటాలోని ఒక విమానాశ్రయంలో, ఫిల్మ్-రోల్ కేసులలో దాచిన 130 విషపూరితమైన డార్ట్ కప్పలతో కూడిన లగేజీని స్వాధీనం చేసుకున్నారు.
కొలంబియా పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ కప్పలు అంతరించిపోతున్న జంతువుల జాబితా ‘రెడ్ లిస్ట్’లో ఉన్నాయి. వాటిని బ్రెజిల్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు.
"ఫొటో-ఫిల్మ్ కేసులలో కనిపించిన ఆ కప్పలు డీహైడ్రేట్ అయి, చనిపోవడానికి దగ్గరలో ఉన్నాయి" అని అధికారులు తెలిపారు.
వీటిని ఎందుకు రవాణా చేస్తున్నారో తెలియకున్నా, డార్ట్ కప్పలను సాధారణంగా వైద్య పరిశోధకులు, వాటి విషం నుంచి ఔషధాలను తయారు చేయగల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, Bogota Environmental Agency
షార్క్ రెక్కల అక్రమ రవాణా
ప్రపంచంలో 500 కంటే ఎక్కువ జాతుల షార్క్‌లు ఉన్నాయి. అనేక షార్క్ జాతుల రెక్కల వాణిజ్యాన్ని అంతర్జాతీయంగా అనుమతించారు. కానీ దాదాపు 60 షార్క్ జాతులు అంతరించిపోతున్నందున వాటి భాగాలను అమ్మడం, కొనడంపై పరిమితులున్నాయి.
దీనిలోని లొసుగులను అక్రమ రవాణాదారులు సొమ్ము చేసుకుంటున్నారని వన్యప్రాణుల వ్యాపార పరిశోధకులు అంటున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో కస్టమ్స్ అధికారులకు దేశం నుంచి ఎగుమతి అవుతున్న రెండు రకాల షార్క్ రెక్కలు పట్టుబడ్డాయి.
"అంతరించిపోతున్న జాతులను, చట్టబద్ధంగా వర్తకం చేయదగిన జాతులని నేరస్థులు బుకాయిస్తారు" అని వన్యప్రేణుల నేరాలను పరిశోధించే ట్రాఫిక్ ఇంటర్నేషనల్ సంస్థలో నిపుణులు సారా విన్సెంట్ అన్నారు.
"కాబట్టి, దేని రవాణా చట్టబద్ధం, ఏది కాదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం."
షార్క్ రెక్కలు ‘షార్క్ ఫిన్ సూప్’లో కీలకమైనవి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఈ రుచిని చాలామంది ఇష్టపడతారు.
అయితే ఇలా మోసం జరిగేది షార్క్‌ల విషయంలో మాత్రమే కాదు.
"ఐరోపాలో అంతరించిపోతున్న కలప జాతులు ఉన్నాయి. అక్రమ రవాణాదారులు వ్యాపారం అనుమతించిన కలపను, అనుమతి లేని కలపతో కలిపి యూరప్ అంతటా రవాణా చేస్తారు" అని అక్రమ రవాణాపై పోరాడుతున్న యూరోపోల్ సంస్థ మాజీ పరిశోధకుడు జార్జ్ జీసస్ అన్నారు.

ఫొటో సోర్స్, @Traffic
ఆర్చిడ్ గడ్డలా లేక బంగాళా దుంపలా?
గత ఏడాది డిసెంబర్ 23న పశ్చిమ నేపాల్‌లోని లామ్‌జంగ్ జిల్లాలో అధికారులు 400 కిలోల బంగాళదుంపలను తీసుకెళ్తున్న ట్రక్కును అడ్డుకున్నారు. చూడడానికి అవి కొండ ప్రాంతాలలో పెరిగే బంగాళాదుంపల్లా కనిపించాయి.
కానీ వాళ్లకు అనుమానం కలిగి, మొక్కల పరిశోధకుడైన భక్త రాస్కోటిని పిలిపించారు.
"అది నిషేధిత జాబితాలో ఉన్న ఆర్చిడ్ జాతి అని నేను వాళ్లకు చెప్పాను. దాన్ని అమ్మడం, కొనడం నిషేధం" అని ఆర్కిడ్‌లపై పీహెచ్‌డీ చేసిన డాక్టర్ రాస్కోటి తెలిపారు.
"నేను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అడిగినప్పుడు, అతను వేరొకరి కోసం వాటిని రవాణా చేస్తున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఆర్కిడ్లను చైనాకు రవాణా చేస్తారని అతను అన్నాడు"
ప్రపంచంలో అత్యధికంగా అక్రమంగా రవాణా అయ్యే మొక్కలలో ఆర్కిడ్‌స్ ఒకటి. మతపరమైన పూజలలో, పానీయాలు, ఆహారంలో రుచులుగా (ఉదాహరణకు, వనిల్లా ఐస్‌క్రీమ్‌లో), తాజా పువ్వులుగా, సాంప్రదాయ ఔషధాలుగా వీటికి చాలా డిమాండ్ ఉంది.
అనేక రకాల ఆర్కిడ్‌ల వాణిజ్యాన్ని నిషేధించడం లేదా పరిమితం చేసిన కారణంగా, వాటి వేర్లను పొడిగా మార్చడం సహా అనేక మార్గాలలో వాటిని రవాణా చేస్తారు.
"అక్రమ రవాణా పద్ధతులు నిరంతరం మారుతుంటాయి" అని ఆగ్నేయాసియాలోని సీనియర్ వన్యప్రాణి పరిశోధకురాలు ఎలిజబెత్ జాన్ అన్నారు.
"అందుకే ప్రాంతీయ, అంతర్జాతీయ సహచరులతో సమాచారాన్ని పంచుకోవడం నిఘా సంస్థలకు చాలా ముఖ్యం. అప్పుడే సమైక్యంగా అక్రమ రవాణాదారుల ఆటలను కట్టించవచ్చు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Bhakta Bahadur Raskoti
సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కారణంగా, ఇలాంటి అక్రమ రవాణాకు చెక్ పెట్టడమూ ఇటీవల పెరిగింది.
ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అక్రమ వాణిజ్య నివేదిక 2022, వన్యప్రాణులు, కలప పట్టుబడిన సంఘటనలు పెరుగుతున్నాయని నిర్థరించింది.
2020 గణాంకాలతో పోలిస్తే 2022లో ఇలా పట్టుబడిన కేసులు 10% అధికం కాగా, 2021తో పోలిస్తే 56% అధికం.
ఇది ఒక ఆందోళనకరమైన ధోరణిని సూచిస్తోంది.
"ఈ గణాంకాలు వన్యప్రాణులు, కలప అక్రమ రవాణా ఇప్పటికీ ప్రబలంగా ఉందని సూచిస్తోంది. అక్రమ రవాణాదారులు చట్టాల నుంచి తప్పించుకోవడానికి కొత్తకొత్త సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు" అని నివేదిక పేర్కొంది.
కస్టమ్స్, సరిహద్దు నియంత్రణ అధికారులకు కావలసిన వనరులను సమకూర్చి, అక్రమ రవాణాదారుల వ్యూహాల కంటే ముందుండేలా శిక్షణ ఇవ్వడం సవాలుగా మారిందని వన్యప్రాణుల వాణిజ్య నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














