NEET: వేల మంది భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ చదవడానికి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘ఈ ఏడాది మెడికల్ ప్రవేశ పరీక్షలో జరిగినట్లు మళ్లీ జరిగితే చాలా మంది యువతలో డాక్టర్ కావాలనే కోరికే నశిస్తుంది’
మహారాష్ట్ర నుంచి రష్యా వెళ్లి ఎంబీబీఎస్ చదువుతున్న ‘సోయామి లోహకరే’తో వీడియో కాల్‌లో మాట్లాడాను.
ఆమె ఇప్పుడు నార్తర్న్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.
రష్యా రాజధాని మాస్కోకు ఉత్తరాన దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో ఆర్కిటిక్ ప్రాంతంలో ఆ విశ్వవిద్యాలయం ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న అనేక మంది భారతీయ విద్యార్థుల్లో ఆమె ఒకరు.
2022లో 7,50,365 మంది విద్యార్థులు భారత్ నుంచి విదేశాలకు వెళ్లారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అది 69 శాతం ఎక్కువని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంపై 2022 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
“ముఖ్యంగా వైద్య విద్యార్థులు చిన్నచిన్న దేశాలకు కూడా వెళ్తున్నారు. అక్కడి భాష వారికి పెద్ద సమస్య. అయినా వెళ్తున్నారు. దానివల్ల మనం ఆదాయం కోల్పోతున్నాం. మన దేశంలోని ప్రైవేట్ సంస్థలు భారీ ఎత్తున ఈ రంగంలోకి దిగలేవా? రాష్ట్రాలు మంచి విధానాలు రూపొందించి భూములను సమకూర్చలేవా? (కళాశాలల కోసం)” అని ప్రధాని అన్నారు.

మరోవైపు, భారత విద్యార్థులు విదేశాల్లో అభ్యసిస్తున్న వైద్య విద్య నాణ్యతపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన భారత పార్లమెంటు.. 'విద్యార్థులను విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి' ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.
'విద్య విషయంలో భారత్‌ను ప్రపంచ గమ్యస్థానంగా' మార్చాలన్నది లక్ష్యమని జాతీయ విద్యా విధానం (2020)లో పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో, మెరుగైన విద్యను అందించాలన్నది ఈ పాలసీ లక్ష్యాల్లో ఒకటి.
అలాంటప్పుడు, మీరు చదువు కోసం విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అని సోయామిని అడిగాను.
“నాకు వచ్చిన నీట్ (NEET) స్కోర్‌తో ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాదు. కాబట్టి, ప్రైవేట్ కళాశాలల్లో చేరాలి. ఒక కాలేజీ ప్రతినిధితో మాట్లాడితే, సీటు బుకింగ్ కోసం రూ. 1.20 కోట్లు డిపాజిట్ చేయాలని అడిగారు. అంతేకాదు, వార్షిక ఖర్చుల కింద వేరే ఫీజు కూడా ఉంటుందన్నారు. అది చాలా ఎక్కువ. అంత ఖర్చు మేం భరించలేం. అందుకే ఖర్చు తక్కువయ్యే దేశానికి వెళ్లి చదువుకోవాలని నిర్ణయించుకున్నాను” అని ఆమె వివరించారు.
తన తండ్రి పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని, తల్లి ఇంట్లోనే ఉంటారని సోయామి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో వైద్యవిద్యకు అయ్యే ఖర్చెంత?
భారత్‌లో ప్రైవేట్‌గా వైద్య విద్యను అభ్యసించాలంటే 2008లో రూ.30 లక్షలు అయిన ఖర్చు ప్రస్తుతం నాలుగింతలు పెరిగి రూ.1.20 కోట్ల వరకు అవుతుంది.
భారత్‌లో ఉన్న మెడికల్ సీట్లన్నంటిలో 48 శాతం ప్రైవేట్ కాలేజీల చేతుల్లోనే ఉన్నాయి.
మిగిలిన సీట్లు ప్రభుత్వ కాలేజీలలో ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలలో వైద్య విద్య తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సబ్సిడీ రేటులో రూ. 2.5 లక్షలకే వైద్య విద్యను అందిస్తున్నాయి ప్రభుత్వ కాలేజీలు.
‘‘కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల లాబీ మామూలుగా ఉండదు. ప్రైవేట్ కాలేజీల్లో ఒకే తరహా ఫీజుల విధానం అమలు చేయాలని, ఫీజులపై ఒక పరిమితి ఉండాలని మేం ప్రభుత్వాన్ని కోరాం’’ అని డాక్టర్ అవిరల్ మాథుర్ చెప్పారు. ఈయన ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎఫ్ఓఆర్‌డీఏ)కు అధ్యక్షుడిగా ఉన్నారు.
భారత్‌లో ప్రతి 834 మందికి ఒక డాక్టర్ ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు 1:1000 కంటే ఇది మెరుగ్గానే ఉంది.
గ్రామీణ వైద్య సదుపాయాల్లో ఆందోళనకరమైన అంతరాలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత ఏడాది విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. కొన్ని వైద్య విభాగాలలో స్పెషలిస్టుల కొరత ఉన్నట్టు ఈ రిపోర్టులో ఉంది.
జిల్లా, సబ్ జిల్లా ఆస్పత్రిల్లోని వైద్యులను తీసుకుంటే కేటాయించిన పోస్టుల సంఖ్యకు, నియామకాలకు మధ్య అంతరం ఉన్నట్లు తెలుస్తుంది.
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం వరకు సీట్ల ఫీజులను విధానపరంగా కట్టడి చేయగలదు. కానీ, ఎంత తరచుగా ఇలా చేస్తుందో స్పష్టంగా తెలియదు. దీనిపై బీబీసీ అడిగిన ప్రశ్నలకు ఎన్ఎంసీ కానీ, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ స్పందించలేదు.
దీనికి తోడు, వైద్య సీట్ల డిమాండ్‌కు, అందుబాటుకు మధ్య అసలు పొంతన కుదరడం లేదు. గత ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్ష క్లియర్ చేసిన ప్రతి 11 మంది భారతీయ విద్యార్థుల్లో కేవలం ఒక్కరికే సీటు లభించింది.
‘‘ వైద్య విద్యను అభ్యసించాలనుకునే 10 లక్షల మందికి పైగా విద్యార్థులు కోటిన్నర వరకు ఫీజులున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు పొందడం, లేదంటే తక్కువ ఖర్చు అయ్యే చైనా, యుక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వెళ్లి వారి కలను సాకారం చేసుకుంటున్నారు’ అని ఇటీవల పార్లమెంట్‌లో చెప్పారు.

దిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలందించే డాక్టర్ ధ్రువ్ చౌహాన్ విద్యార్థులు, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్నారు.
‘‘నీట్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులే విదేశాలకు వెళ్తుంటారని సాధారణంగా అనుకుంటుంటారు. కానీ, వీరిలో చాలా మంది మంచి స్కోరు సంపాదించినవారే. అయినప్పటికీ, వారు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పొందలేకపోతున్నారు. ఎవరికైతే, ప్రైవేట్ కాలేజీ ఫీజులు కట్టగలిగే స్తోమత ఉంటుందో, వారు మాత్రమే ఇక్కడ ఉండి, మిగతా వారు విదేశాలకు వెళ్తున్నారు’’ అని ఒక ఖాళీ వార్డులో కూర్చుని ధ్రువ్ చౌహాన్ చెప్పారు.
వైద్య కాలేజీల పెంపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
‘‘అంతకుముందు 350 ఉన్న వైద్య కాలేజీలు ప్రస్తుతం 707కి పెరిగాయి. పదేళ్లలో మేం రెండింతలు పెంచాం. అదనంగా వైద్య కాలేజీలు ఎక్కడ ఏర్పాటు చేయొచ్చో సూచించేందుకు ప్రస్తుతం ప్రధాని మోదీ ఒక కమిటీ వేయనున్నారు’’ అని 2024 ఫిబ్రవరిలో వైద్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు.
వైద్య కాలేజీలు పెంచుతామని ప్రభుత్వం పార్లమెంటులో చెప్పినప్పుడు నాణ్యత ప్రమాణాలపై చాలామంది సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
ఫ్యాకల్టీ కొరతతో నాణ్యత సన్నగిల్లవచ్చని సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.
246 మెడికల్ కాలేజీల్లో ఒక్క కాలేజీకి కూడా తగినంత మంది ఫ్యాకల్టీ మెంబర్లు లేదా సీనియర్ రెసిడెంట్స్ లేరని తాజాగా చేపట్టిన అంచనాలో వెల్లడైనట్లు ఆ అధ్యయనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
వలస వెళ్తున్న వైద్యులు
‘2025 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని 2.5 శాతానికి పెంచడం’ లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ నేషనల్ హెల్త్ పాలసీ. ప్రభుత్వం లక్ష్యం దిశగా వెళుతున్నట్లు పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మరో నివేదికలో కేటాయింపుల పెంపు సరిపోదని తెలిపారు.
ఆ విషయాలతో ఏకీభవిస్తూనే.. వైద్యుల డిమాండ్‌కు, సరఫరాకు అంతరం కొనసాగుతోందని డాక్టర్ మాథుర్ అంటున్నారు.
“కేంద్ర ప్రభుత్వం మరిన్ని వనరులను కేటాయిస్తేనే పరిస్థితులు మెరుగుపడతాయి’’ అని అన్నారు.
భారత విద్యార్థుల చాయిస్‌లను పరిశీలిస్తే గరిమా బాజ్‌పాయ్ మంచి ఉదాహరణ.
గరిమ యుక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఆమె అక్కడ తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి నాతో మాట్లాడారు.
“ రాత్రుళ్లు ఎయిర్ అటాక్ సైరన్‌లు మోగుతుంటాయి. విద్యుత్ కోతలు, నీటి కష్టాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో చదువుకోవడం అంత సులభం కాదు ” అని గరిమ చెప్పారు.
ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్ పొందేలా నీట్ యూజీలో మంచి ర్యాంక్ సాధించడంలో విఫలమవడం, అందుబాటు ధరలో ప్రైవేట్ కళాశాలలో సీటు దొరక్కపోవడంతో ఆమె 2021లో యుక్రెయిన్‌కు వెళ్లారు.
“ఇక్కడ చదువుకోవడం కూడా తక్కువేం కాదు. మీకు దాదాపు రూ. 50 లక్షలు కావాలి. అయితే, భారత్‌లోని ప్రైవేట్ కాలేజీల కంటే చౌక. నా కోసం నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. బాధగా ఉంది. కానీ, నా వంతు ప్రయత్నం చేస్తున్నాను” అని ఆమె చెప్పారు.
ఇలాంటి విద్యార్థులు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే, వారు ప్రభుత్వం నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) క్లియర్ చేయాలి.
ఇటీవల చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ముజామిల్‌ను దిల్లీలో కలిశాను. కశ్మీర్ నివాసి అయిన ముజామిల్ ఎఫ్ఎంజీఈ కోసం సిద్ధమవుతున్నారు.
నిరుడు ఈ పరీక్ష రాసిన 61,616 మందిలో 10,261 మంది మాత్రమే క్లియర్ చేయగలిగారు. అంటే 16.65 శాతం.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. భారత ఎంబీబీఎస్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ చేశాక విదేశాలకు వలస వెళ్లడం.
“నా ఎంబీబీఎస్ బ్యాచ్‌లో 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇవాళ వారిలో 40 మంది అమెరికాలో ఉన్నారు. ఇది కాలక్రమేణా పెరిగింది" అని అన్నారు మాథుర్.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) రికార్డుల ప్రకారం గత సంవత్సరం భారత్ నుంచి పట్టభద్రులైన 49,961 మంది వైద్యులు ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్నారు. గత పదేళ్లలో ఇదే అత్యధికం.
అమెరికాలోని 2,62,000 మంది ఇమిగ్రెంట్ ఫిజీషియన్లు, సర్జన్లలో భారతీయులే అత్యధికం. వారి వాటా 21 శాతం అని గత సంవత్సరం ప్రచురితమైన మరో అధ్యయనం పేర్కొంది.
2014 నుంచి యూకేలో కూడా భారత వైద్యులు పెరిగారు. తాజా నివేదికలో (2022) వారి సంఖ్య 2,402 . కచ్చితంగా చెప్పాలంటే, భారత ప్రభుత్వం దీనిని వ్యతిరేకించదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి 10,000 మందికి 12 మందే డాక్టర్లు..
“భారత వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. వారు దేశంలో పని చేయాలి, ప్రపంచానికీ సేవ చేయాలి’’ అని మాండవియా అన్నారు.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం ప్రతి 10,000 మందికి భారత్ ఇప్పుడు 1991 సంవత్సరం అందించిన దాని కంటే తక్కువ వైద్యులను ఇస్తోంది.
2020లో భారత్ ప్రతి 10 వేల మంది జనాభాకు సగటున 7.26 మంది వైద్యులను అందించింది. 1991లో ఆ సంఖ్య సగటు 12.24గా ఉంది. ఇది దేశంలో వైద్యుల లభ్యతను మించి జనాభా పెరుగుదలను సూచిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికాలో 10,000 మందికి 36 కంటే ఎక్కువ మంది వైద్యులు (2021), యూకేలో 31.74 మంది వైద్యులు (2022), స్వీడన్‌లో 71.5 మంది వైద్యులు (2021) ఉన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుందో లేదో తెలుసుకోవాలని బీబీసీ సంప్రదించింది. కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు.
డాక్టర్ చౌహాన్ భారత్‌లోని డాక్టర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రస్తావించారు. జీతాలు సరిగ్గా లేకపోవడం, దాడుల వంటి సమస్యలను పేర్కొన్నారు.
‘’స్పెషలిస్టులు సహా అగ్రశ్రేణి వైద్య నిపుణులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు’’ అని హెచ్చరించారు.
"డాక్టర్ కావడానికి చాలా శ్రమ అవుతుంది. భద్రత గురించి ఆందోళన చెందవలసి వస్తే, భారతదేశానికి వెళ్లడం సరైనదేనా అనుకుంటాను" అని సోయామి చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)















