అమెజాన్‌కు 30 ఏళ్లు: ‘మాది నష్టాల్లో ఉన్న సుప్రసిద్ధ సంస్థ’ - జెఫ్ బెజోస్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాన్సిస్ అగస్టిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా ఉన్న అమెజాన్, ఒకప్పుడు "నష్టాలలో ఉన్న సుప్రసిద్ధ సంస్థ".
ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ 2000 సంవత్సరం జూన్ 8నబీబీసీ న్యూస్‌నైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే, నేడు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీలలో ఒకటిగా, 2 ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన సంస్థగా మారింది.
అప్పుడేం జరిగింది?
2000 సంవత్సరం మధ్య నాటికి ‘డాట్‌కామ్ బూమ్’ సృష్టించిన ఎకనామిక్ బబుల్, పేలిపోయే స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. అమెజాన్‌తో సహా డజన్ల కొద్దీ ఆన్‌లైన్ వ్యాపారాలపై దాని ప్రభావం కనిపించింది.
1999లో అమెజాన్ సంస్థ తమకు అమ్మకాల ద్వారా 1.6 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం మారకపు విలువ ప్రకారం సుమారు 13 వేల కోట్ల రూపాయలు) ఆదాయం రాగా, 720 మిలియన్ డాలర్ల (6 వేల కోట్ల రూపాయల) నికర నష్టం వచ్చిందని ప్రకటించింది. దాంతో తీవ్ర ఒడిదొడుకులకు లోనైన ఆ కంపెనీ షేరు ధర 1999 డిసెంబర్‌లో 113 డాలర్లు ఉంటే, 2000 జూన్‌లో 52 డాలర్లకు పతనమైంది.
2000 నాటి ఆ ఇంటర్వ్యూలో ప్రెజెంటర్ జెరెమీ వైన్.. "అమెజాన్ 'అద్భుతం' అని ప్రజలు అంటుంటారు, అలాంటప్పుడు అమెజాన్ ఇలా నష్టాల్లో ఉండటం ఆశ్చర్యంగా లేదా?" అని జెఫ్ బెజోస్‌ను ప్రశ్నించారు.
దానికి సమాధానంగా "మాది నష్టాలలో ఉన్న సుప్రసిద్ధ కంపెనీ" అని బెజోస్ బెదరకుండా స్పందించారు.
"అది మేం కావాలని అనుసరిస్తున్న వ్యూహం" అన్నారు.
ఇంటర్వ్యూ జరిగిన 24 ఏళ్ల తర్వాత వైన్ ఆ ఇంటర్వ్యూలోని అనేక అంశాలను జెరెమీ వైన్ గుర్తు చేసుకున్నారు.
"నేను కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగాను. కానీ జెఫ్ బెజోస్ ఏమీ బెదరలేదు. ఆయన ముఖం మీద ఒక్క చెమట చుక్క కూడా కనిపించలేదు" అని అన్నారు.
"ఈ వ్యక్తి నిజంగా చాలా సంతోషంగా జీవించే మనిషి అనుకున్నా. వెనక్కి తిరిగి చూస్తే, ఆయనకు తాను ఈ భూమి మీద అత్యంత ధనవంతుణ్ని అవుతానని అప్పటికే తెలుసుని అనుకుంటా" అని జెరెమీ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
ఈ-కామర్స్‌లో అవకాశాలను ముందే పసిగట్టి..
జెఫ్ బెజోస్ 1994 జులై 5న వాషింగ్టన్‌లోని బెల్లేవ్యులోని ఒక గ్యారేజీలో కంపెనీని స్థాపించారు.
ఒక సంవత్సరం తర్వాత ఆ కంపెనీ వెబ్‌సైట్ ప్రారంభమైంది. అప్పటికి వరల్డ్ వైడ్ వెబ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది (అప్పట్లో దానిని వెబ్ 1.0 అని పిలిచేవారు).
కొన్ని కంపెనీలు మాత్రమే వెబ్ ఆధారిత వ్యాపారంలో ఉన్న లాభాలను ముందే గుర్తించాయి.
ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్మే సంస్థగా అమెజాన్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ సమయంలో అది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-బుక్‌ల సేకరణదారుగా ప్రచారం చేసుకుంది. అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్‌లో కీలకంగా మారడానికి పుస్తకాలను రెట్టింపు చేసింది.
డాట్‌కామ్ విజృంభణను అనువుగా చేసుకుని అమెజాన్ వేగంగా అభివృద్ధి చెందింది. 1990ల చివరిలో అమెరికా టెక్నాలజీ రంగంలో వచ్చిన వేగవంతమైన అభివృద్ధి, భారీ పెట్టుబడులతో నూతన ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలు పుట్టుకొచ్చాయి.
'అతిపెద్ద ఆన్‌లైన్ వేదిక'
సైట్ ప్రారంభించిన 4 సంవత్సరాల తర్వాత, అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ విక్రయ వేదికగా అవతరించింది. అది ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువుల శ్రేణి ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, గృహోపకరణాలు వంటి వాటికి విస్తరించింది.
2000 చివరి నాటికి, అమెజాన్‌కు 1.7 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ విలువ, ఐపీఓ విలువ కంటే 50 రెట్లు పెరిగింది.
జెఫ్ బెజోస్‌ను టైమ్ మ్యాగజైన్ 1999 ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసింది. ఆయనను "కింగ్ ఆఫ్ సైబర్ కామర్స్" అని పిలిచింది.
అయితే, ఆ తర్వాత సంవత్సరాలలో ఆ కంపెనీ పన్ను చెల్లింపులు, కార్మిక విధానాలపై విమర్శలను ఎదుర్కొంది. 2000లోనూ అమెజాన్ సంస్థపై చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.
ఆ ఇంటర్వ్యూ సందర్భంగా బీబీసీ ప్రతినిధి జెరెమీ.. "మీకు 2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నా వ్యాపారంలో నష్టాలు రావాలంటే దానికి చాలా నైపుణ్యం అవసరం" అని సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే బెజోస్ అంతే సరదాగా "అవును, ఆ నైపుణ్యం మాకు ఉంది" అన్నారు.
ఆ తర్వాత సీరియస్‌గా.. "అయితే అక్కడ నిజంగా జరుగుతున్నది ఏంటంటే, మేం సంస్థలో ఇంకా పెట్టుబడులు పెడుతున్నాం" అని ఆయన సమాధానం ఇచ్చారు.
డాట్‌కామ్, ఈ-కామర్స్ రంగంలో అస్థిరత మధ్య, జెఫ్ బెజోస్ అప్పుడు సంస్థ విస్తరణ గురించి ఆలోచిస్తున్నారు.
"సాధ్యమైనంత తక్కువ ధరకు విస్తృతమైన ఎంపిక కలిగిన ఉత్పత్తులను అందించడం" అనే వ్యూహాన్ని అవలంబించడం ఆ సమయంలో కంపెనీ నష్టాలకు కారణమైందని బెజోస్ చెప్పారు.
కానీ ఎప్పటికప్పుడు పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌లను నెరవేర్చడం తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన 2000లో చెప్పారు.
నష్టాలు వచ్చినా, భవిష్యత్‌లో మార్కెట్‌ను పెంచుకోవడానికి బెజోస్ తెలివిగా అడుగులు వేశారు. డాట్‌కామ్ క్రాష్‌తో కంపెనీ తీవ్రంగా దెబ్బతిన్నా సరే, దాని ‘కస్టమర్-ఫస్ట్’ వ్యూహం అమెజాన్ కోలుకోవడానికి సహాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
24 ఏళ్ల తర్వాత
ఆ ఇంటర్వ్యూ జరిగిన 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెజాన్ ఈ-కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో తన స్థానాన్ని, ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది.
బీబీసీ న్యూస్‌నైట్ ఇంటర్వ్యూ జరిగిన చాలా నెలల తర్వాత అమెజాన్ తన ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ను ప్రారంభించి, థర్డ్ పార్టీ వ్యాపారులు తమ వస్తువులను విక్రయించడానికి వేదిక కల్పించింది.
2005లో కంపెనీ తన రెగ్యులర్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు (2024) ప్రైమ్ మెంబర్‌షిప్‌లో సుమారు 18 కోట్ల మంది వినియోగదారులకు పైనే ఉన్నారు.
2023లో నికర అమ్మకాల ఆదాయంలో సుమారు 574.8 బిలియన్ డాలర్లు సంపాదించిన అమెజాన్, చలనచిత్రాలు, టెలివిజన్ స్టూడియో, స్ట్రీమింగ్ సర్వీస్, ఫుల్-సర్వీస్ కిరాణా దుకాణాలు, ఏఐ అసిస్టెంట్లతో సహా రిటైల్ వ్యాపారం నుంచి ఇతర కార్యకలాపాలకూ విస్తరించింది. ట్విచ్ ఇంటరాక్టివ్, హోల్ ఫుడ్స్ (Whole Foods), ఆడిబుల్ (Audible)తో సహా అనేక కంపెనీలను కొనుగోలు చేసి, విలీనం చేసుకుంది.
2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా జెఫ్ బెజోస్ అవతరించారు.
2022లో అమెజాన్ మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లకు పైగా కోల్పోయిన ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది.
బెజోస్ 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మాజీ సీఈఓ ఆండీ జాస్సీకి అప్పగించారు.
అప్పటి నుంచి ఆయన తన ఏరోస్పేస్ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’, 2013లో కొనుగోలు చేసిన ‘ది వాషింగ్టన్ పోస్ట్’లతో సహా తనకు ఇష్టమైన ప్రాజెక్టులపై దృష్టిని పెట్టారు.
వాతావరణ మార్పులు, సమాజంలోని అసమానతలు వంటి సామాజిక సమస్యలపై పోరాటానికి తన సంపదను విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే అమెజాన్‌లోని పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న పన్ను సమస్యలను కప్పి పుచ్చుకోవడానికే ఆయన దాతృత్వం గురించి మాట్లాడుతున్నారని ఆరోపణలు వినిపించాయి.
అమెజాన్ సంస్థ వెనుక ఉన్న వ్యక్తి గురించి కొంతమంది ఏమనుకున్నా మన ఆర్థిక అస్తిత్వానికి సంబంధించిన చాలా అంశాలలో అమెజాన్ ఏ మేరకు చొచ్చుకుపోయింది అన్నదానిని విస్మరించడం కష్టం.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- నుస్రత్ ఫతే అలీ ఖాన్: ఇంతవరకు ఎవరూ వినని 4 ఖవ్వాలీల రిలీజ్ ఎప్పుడంటే
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- ‘మా ముత్తాత విశాఖపట్నానికి తొలి ఎంపీ. కానీ మాకు తినడానికి తిండి లేదు. పనసపళ్లు తిని బతుకుతున్నాం’
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














