నుస్రత్ ఫతే అలీ ఖాన్: ఇంతవరకు ఎవరూ వినని 4 ఖవ్వాలీల రిలీజ్ ఎప్పుడంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమాద్ ఖాలిక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులు ఇష్టపడే గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ మరణించిన 27 సంవత్సరాల తర్వాత, ఆయనకు సంబంధించిన ఒక ఆల్బమ్ ఈ ఏడాది విడుదల కానుంది.
34 ఏళ్ల కిందటి ఈ ఆల్బమ్, రియల్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన లండన్ స్టుడియోలోని స్టోర్ రూమ్‌లో దొరికింది.
దీనికి ఆ సంస్థ 'చైన్ ఆఫ్ లైట్' అని పేరు పెట్టింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఇందులో నాలుగు ఖవ్వాలీలు ఉన్నాయి.
ఈ ఆల్బమ్ బయటపడిన విధానం చాలా ఆసక్తికరం.
రియల్ వరల్డ్ రికార్డ్స్ తమ పాత రికార్డింగ్‌లను 2021లో వేరే ప్రదేశానికి తరలించే అవసరం లేకుంటే, ఇది అభిమానులకు చేరువయ్యేది కాదు.

ఈ వార్త తెలిసాక, ప్రపంచవ్యాప్తంగా నుస్రత్ ఫతే అలీ ఖాన్ అభిమానులు ఈ ఆల్బమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నుస్రత్ ఫతే అలీ ఖాన్ కంఠం ఎంత సమ్మోహనంగా ఉంటుందంటే.. ఆయన అభిమానులు ఇప్పటికే ఆ ఆల్బమ్ విడుదలయ్యే సెప్టెంబర్ 20 తేదీని నోట్ చేసి పెట్టుకున్నారు.
నుస్రత్ ఫతే అలీ ఖాన్ 1997లో, 48 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. బహుశా ఈ శతాబ్దంలో జన్మించిన కొత్త తరానికి నుస్రత్ గానం పరిచయం కావడానికి ఈ రికార్డింగ్ దోహదపడవచ్చు.
ఇంతకూ 34 ఏళ్ల కిందట రికార్డ్ చేసిన ఆ ఖవ్వాలీలు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఎలా వెలుగులోకి వచ్చాయి? అనే విషయాన్ని కనుగొనేందుకు రియల్ వరల్డ్ రికార్డ్స్‌ను బీబీసీ సంప్రదించింది.

ఫొటో సోర్స్, Getty Images
"ఈ టేప్ దొరికినప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు’’
నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడిన గజల్ 'ఆఫ్రీన్'ను మాటల్లో ప్రశంసించడం సాధ్యం కాదని ఆయనతో కలిసి పాడిన అమెరికన్ గాయకుడు జెఫ్ బక్లీ అన్నారు.
"ఆయనలో బుద్ధుడు ఉన్నాడు. ఒక భూతమూ ఉంది. ఒక దైవదూతా ఉన్నారు. ఆయన స్వరానికి సరిపోల్చదగింది వేరే ఏదీ లేదు" అని చెప్పారు.
ఈ రికార్డింగ్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, ప్రజలు తరచుగా నుస్రత్ ఫతే అలీ ఖాన్ ఎలా, ఎప్పుడు విదేశీ అభిమానులను సంపాదించుకున్నారు? అని తెలుసుకుంటున్నారు.
రియల్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. 1985లో వరల్డ్ ఆఫ్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్యాన్స్ (WOMAD) ఫెస్టివల్‌లో ఆయన ప్రదర్శన తర్వాత పీటర్ గేబ్రియేల్, రియల్ వరల్డ్ రికార్డ్స్‌తో నుస్రత్ ఫతే అలీ ఖాన్ సంబంధాలు పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాశ్చాత్య అభిమానుల ఎదుట నుస్రత్ ప్రదర్శన ఇవ్వడం అదే తొలిసారి.
ఆయన తనతో పాటు తొమ్మిది మందితో కూడిన ఖవ్వాల్ బృందాన్ని తీసుకెళ్లారు.
ఆ ప్రదర్శన ఎసెక్స్‌లోని మారిసా ద్వీపంలో జరిగింది. అర్ధరాత్రి వరకు సాగిన ఆ ప్రదర్శనతో ప్రజలు మైమరచిపోయారు.
ఆ తర్వాతే, ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పెరగడం ప్రారంభమైంది. ఆయన గేబ్రియేల్‌తో కలిసి 1989లో 'ప్యాషన్' ఆల్బమ్‌లో పాడిన పాటను 'ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్' చిత్రంలో ఉపయోగించుకున్నారు.
“నేను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సంగీతకారులతో కలిసి పనిచేశాను, కానీ బహుశా నా కాలంలో అందరి కంటే గొప్ప గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్. ఆయన గొంతులో అసాధారణమైన విలక్షణత ఉంది" అని పీటర్ గేబ్రియేల్ అన్నారు.
"ఆయనను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడంలో మా పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఈ టేప్ అందుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ ఆల్బమ్‌లో, ఆయన నైపుణ్యం మరో స్థాయికి చేరింది" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
“1990 నుస్రత్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. ఆ సమయంలో ఆయనకు పాశ్చాత్య దేశాలలో అభిమానులు పెరిగారు. ఆయన ఎప్పుడూ ప్రయోగాలు చేయాలనుకునేవారు. ఒక రకమైన సంగీతానికి తనను తాను పరిమితం చేసుకోకూడదు అనేది ఆయన అభిప్రాయం. ఇది ఆయన రికార్డింగ్‌లలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది" అని నుస్రత్ వద్ద మేనేజర్‌గా పని చేసిన రషీద్ అహ్మద్ దిన్ చెప్పారు.
నుస్రత్ శిష్యుడైన ఇలియాస్ హుస్సేన్, తన చిన్నప్పటి నుంచి ఒక ఖవ్వాల్ బృందంలో పని చేశారు.
ఆయన 2020లో నుస్రత్ ఫతే అలీ ఖాన్ విదేశీ పర్యటనలు, ఆయన పాశ్చాత్య అభిమానుల గురించి బీబీసీకి వివరించారు.
"యూరప్ పర్యటనలో నుస్రత్ 'అల్లా హు అల్లా హు' పాడినప్పుడు శ్వేతజాతీయులు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఫ్రాన్స్ ప్రజలు ఆయనకు ‘మిస్టర్ అల్లా హు' అనే బిరుదును ఇచ్చారు" అని చెప్పారు.
యూరప్‌లో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నుస్రత్ ఫతే అలీ ఖాన్‌ను 'మిస్టర్ అల్లా హు' అని పిలిచేవాళ్లన్నారు.
జపాన్‌లో మ్యూజిక్ ఫెయిర్‌లో ఆయన ప్రదర్శన జరిగినప్పుడు, ఆయన గానానికి ముగ్థులైన జపాన్ ప్రజలు ఆయనను 'సింగింగ్ బుద్ధ' అని పిలిచారు.
జపాన్ ఏదైనా ప్రదర్శన కోసం వెళ్లినప్పుడల్లా, ఆయన హాల్‌లోకి ప్రవేశించిన వెంటనే, ఆయన గౌరవార్థం ప్రతి ఒక్కరూ తమ సీట్ల నుంచి లేచి నిలబడేవారని హుస్సేన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్బమ్ ఎక్కడ దొరికింది?
చాలా కాలం తర్వాత ఈ రికార్డింగ్‌లు ఎలా దొరికాయి అని రియల్ వరల్డ్ రికార్డ్స్‌ని బీబీసీ ప్రశ్నించినప్పుడు ఆ వివరాలు వెల్లడించింది.
"నుస్రత్ ఫతే అలీ ఖాన్ 90వ దశకం ప్రారంభంలో రియల్ వరల్డ్ స్టూడియోస్‌లో సాంప్రదాయ ఖవ్వాలీ పాటలను.. మైఖేల్ బ్రూక్, పీటర్ గేబ్రియేల్‌తో కలిసి అనేక సెషన్‌లను రికార్డ్ చేశారు. లైవ్ సెషన్‌లలో రికార్డ్ చేసింది ఒకటి విడుదల కాలేదు. అది రియల్ వరల్డ్ టేప్ ఆర్కైవ్స్‌లో స్టోర్ చేశారు. అలా అది చాలా సంవత్సరాలు అలాగే ఉండిపోయింది.
ఇటీవల, మేం మా టేప్ కలెక్షన్‌ను మరొక ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మాకు ఒక టేప్ బాక్స్ కనిపించింది.
దానిపై నుస్రత్ ఫతే అలీ ఖాన్ రికార్డింగ్స్ అని రాసి ఉంది. అందులో ఉన్న పాటలు ఇంతకు ముందు ఎప్పుడూ విడుదల కాలేదు. ఇది చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం. ఎంతో సంతోషించాం’ అని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
"అవి పాత అనలాగ్ టేప్‌లు కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిని డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి, రియల్ వరల్డ్ స్టూడియోలో మిక్స్ చేశాం. వీటిని ఇంతవరకు విడుదల చేయలేదు. వీటిని ఎవరూ వినలేదు కూడా’’ అని తెలిపింది.
“మాకు ఈ ఆల్బమ్ దొరికినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఈ టేప్ మా వద్ద ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. 90వ దశకంలో, మేం నుస్రత్ ఆల్బమ్‌లను విడుదల చేయడంలో చాలా జాగ్రత్త వహించే వాళ్లం’’ అని చెప్పింది.
ఆ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు లేనందు వల్ల ఆయన రికార్డింగ్‌లను సీడీలు, ఎల్‌పీల ద్వారానే విడుదల చేసే వాళ్లమని రియల్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది.
“తర్వాత విడుదల చేయడానికి కొన్ని పాటలను పక్కన పెట్టడం కొత్తేమీ కాదు. ఈ పాటల విషయంలో అదే జరిగి ఉండొచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ మేం ఆ టేపులను మరచిపోయాం. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మేం వాటిని మళ్లీ కనుగొనడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రికార్డింగ్‌లను విడుదల చేయడానికి ఎందుకు ఎక్కువ సమయం పట్టింది?
ఈ రికార్డింగ్‌లు 2021లోనే దొరికినా వాటిని విడుదల చేయడానికి ఎందుకు ఇంత ఎక్కువ సమయం పట్టింది? అని ప్రశ్నించగా..
"టేప్‌ను సరైన స్థితికి తీసుకురావడానికి మాకు సమయం పట్టింది. మైఖేల్ బ్రూక్‌ను సంప్రదించి దానిని మిక్స్ చేయడానికి ఇంత సమయం తీసుకుంది" అని రియల్ వరల్డ్ తెలిపింది.
ఈ ఆల్బమ్‌లో 42 నిమిషాల పాటు సాగే నాలుగు ఖవ్వాలీలు ఉన్నాయి.
"రియల్ వరల్డ్ రికార్డ్స్‌లో గతంలో నుస్రత్‌కు సంబంధించిన అనేక ఆల్బమ్‌లు విడుదల చేసింది. ఆయన సంగీతం ప్రతి యుగంలో సజీవంగా ఉంటుంది. అది ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ ఆల్బమ్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ సంగీత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతుందని మేం ఆశిస్తున్నాం" అని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














