చైనా గూఢచర్యం ఖండాలు దాటి విస్తరిస్తోందా, ఎవరికి ప్రమాదం, ఆందోళన ఏంటి?

- రచయిత, గోర్డాన్ కొరెరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాను ఓ కంట కనిపెట్టి ఉండాలని పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. బ్రిటన్ గూఢచార సంస్థ జీసీహెచ్‌క్యూ చీఫ్ దీనిని ‘ఈ యుగంలో ఎదుర్కొనే అతిపెద్ద సవాలు’ అంటూ అభివర్ణించారు.
పశ్చిమ దేశాలలో చైనా కోసం గూఢచర్యం చేశారని, అలాగే హ్యాకింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పలువురి అరెస్టులు జరిగిన సమయంలో ఈ ప్రకటన వచ్చింది.
హాంకాంగ్ గూఢచార సంస్థలకు ముగ్గురు వ్యక్తులు సహాయం అందిస్తున్నారని సమాచారం అందడంతో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం చైనా రాయబారిని సోమవారం పిలిపించింది.
ఏళ్లుగా పశ్చిమ దేశాలకు, చైనాకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇలాంటి అరెస్టులు ఈ పోటీ బహిరంగ వేదికపైకి రావడానికి సంకేతంగా చూడొచ్చు.
చైనా తీరుపై ప్రతిస్పందించడానికి అమెరికా, దాని మిత్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి.
అయితే పశ్చిమ దేశాలు చైనా తీరును సీరియస్‌గా తీసుకోలేదని, నిఘా కార్యకలాపాల్లో వెనుకబడిపోయాయని సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ దేశాల అధికారుల ఆందోళన ఏమిటి?
పశ్చిమ దేశాల అధికారులు ఆందోళనకు కారణం ఏంటంటే బీజింగ్ కొత్త అంతర్జాతీయ విధానం రూపొందించడానికి జిన్‌పింగ్ సిద్ధంగా ఉన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద శక్తి అనిపించుకున్న అమెరికా స్థానాన్ని తాను తీసుకోవాలని చైనా గట్టిగా ప్రయత్నిస్తోందని బ్రిటన్ విదేశీ గూఢచార సంస్థ ఎంఐ6 చీఫ్ రిచర్డ్ మూర్ అంటున్నారు. బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఏళ్ల తరబడి హెచ్చరికల తర్వాత కూడా పశ్చిమంలో చైనా కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అక్కడి ఏజెన్సీలు తంటాలు పడుతున్నాయి.
పాశ్చాత్య దేశాలు అనేక ఇతర సమస్యలతో నిమగ్నమై ఉన్న సమయంలో చైనా ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా పుట్టుకొచ్చిందని నిగెల్ ఇంక్‌స్టర్ అంటున్నారు.
నిగెల్ ఇంక్‌స్టర్ 2006లో పదవీ విరమణ చేయడానికి ముందు ఎంఐ6లో నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు.
2000 సంవత్సరం తొలి దశాబ్ధంలో చైనా ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నప్పుడు, పాశ్చాత్య విధాన రూపకర్తలు, భద్రతా అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దృష్టి అఫ్గానిస్తాన్, ఇరాక్‌లలో ఉగ్రవాదంపై యుద్ధం, సైనిక జోక్యంపై ఉంది.
రష్యా ఎదుగుదల, ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఇటీవలి రోజుల్లో ప్రధాన సవాళ్లని అమెరికా, యూరోపియన్ అధికారులు భావిస్తున్నారు.
అదే సమయంలో చైనా నుంచి భద్రతా సమస్యలను ఎదుర్కోవడానికి బదులుగా, చైనా భారీ మార్కెట్‌ను పొందడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం, బిజినెస్ రంగాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
నిఘా సంస్థల చీఫ్‌లు చైనా పేరును నేరుగా ప్రస్తావించకూడదని ఈ దేశాల రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. అంతేకాదు, తమ రహస్యాలను లక్ష్యంగా చేసుకున్నారని అంగీకరించడానికి వ్యాపార రంగాలు సిద్ధంగా లేవు.
2000ల నుంచి చైనీస్ ఏజెన్సీలు పారిశ్రామిక గూఢచర్యంలో నిమగ్నమై ఉన్నాయని నిగెల్ ఇంక్‌స్టర్ ఆరోపించారు. కానీ పాశ్చాత్య కంపెనీలు దీనిపై మౌనం వహించాయి.
"చైనీస్ మార్కెట్లో తమ స్థానం ప్రమాదంలో పడుతుందనే భయంతో వారు దానిని చెప్పడానికి ఇష్టపడటం లేదు" అని అంటున్నారు నిగెల్ ఇంక్‌స్టర్.

ఫొటో సోర్స్, FBI
చైనా గూఢచర్యం దేనికోసం?
చైనా గూఢచర్యం పాశ్చాత్య దేశాలకు భిన్నంగా ఉండటం ఆయా దేశాలకు సవాలు. ఇది గూఢచర్య కార్యకలాపాలను గుర్తించడం, ఎదుర్కోవడం రెండింటినీ కష్టతరం చేసింది.
తమ ప్రత్యర్థులను అర్థం చేసుకోవడంలో సాయపడే గూఢచార సమాచారాన్ని సేకరించడానికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తాయని ఒక మాజీ పాశ్చాత్య గూఢచారి అన్నారు.
కానీ చైనా గూఢచారులకు భిన్నమైన ప్రాధాన్యతలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రయోజనాలను కాపాడటమే వారి ప్రధాన లక్ష్యం.
"పరిపాలన స్థిరత్వమే వారి మొదటి ప్రాధాన్యత" అని ఎఫ్‌బీఐ అధికారి రోమన్ రోగావ్స్కీ చెప్పారు.
ఇందుకు ఆర్థికాభివృద్ధి అవసరం. అందుకే జాతీయ భద్రత కోసం పశ్చిమ దేశాల సాంకేతికతను పొందడం చాలా ముఖ్యమైనదిగా చైనా గూఢచారులు భావిస్తారు.
చైనా ప్రభుత్వ సంస్థల నుంచి లభించిన సమాచారాన్ని చైనా సహచరులు పంచుకుంటారని, కానీ, పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలా పంచుకోవని పాశ్చాత్య గూఢచారులు తెలిపారు.
"నా ఏజెన్సీ 74 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంత బిజీగా ఉంది" అని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ఏఎస్ఐవో) చీఫ్ మైక్ బర్గెస్ వివరించారు.
"నేను ఏ దేశాన్ని నిందించలేను, ఎందుకంటే గూఢచర్యం విషయానికి వస్తే, మనం కూడా అలాగే చేస్తున్నాం" అని అన్నారు.
వాణిజ్య గూఢచర్యం అనేది పూర్తిగా భిన్నమైన విషయం, అందుకే చైనాను భిన్నంగా చూస్తున్నారని తెలిపారు. అయితే, ఈ ముప్పును పాశ్చాత్య దేశాలు ఆలస్యంగా అర్థం చేసుకున్నాయని మైక్ అంగీకరించారు.
"ఇది చాలా కాలంగా జరుగుతోందనుకుంటున్నా" అని ఆయన చెప్పారు.

ఫైవ్ ఐ సమావేశం
2023 అక్టోబర్‌లో కాలిఫోర్నియాలో నేను మైక్ ను కలిశా. 'ఫైవ్ ఐ' సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వచ్చారు.
'ఫైవ్ ఐ' అనేది ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కూటమి ఏర్పాటు చేసుకున్న కూటమే ఫైవ్ ఐ.
ఈ సమావేశం ఉద్దేశం.. చైనా నుంచి పెరుగుతున్న ముప్పు గురించి హెచ్చరించడం. ఎందుకంటే, చాలా కంపెనీలు, సంస్థలు ఇప్పటికీ ఈ ముప్పును పట్టించుకోవడం లేదు.
సమావేశ వేదికగా సిలికాన్ వ్యాలీని కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే సాంకేతికతను దొంగిలించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను సిలికాన్ వ్యాలీ హైలైట్ చేసింది. కొన్నిసార్లు సైబర్-గూఢచర్యం ద్వారా,కొన్నిసార్లు అంతర్గత వ్యక్తులను నియమించడం ద్వారా ప్రయత్నించింది.
గూఢచర్యం కోసం చైనా వద్ద భారీ వనరులు ఉన్నాయి. ఒక పాశ్చాత్య అధికారి అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 మిలియన్ల మంది చైనా కోసం నిఘా, భద్రతా విషయాల మీద పని చేస్తున్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ.

‘పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు’
బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ5 ప్రకారం, బ్రిటన్‌లోనే 20 వేల మందికి పైగా చైనా గూఢచారులు సంబంధాలు ఏర్పరచుకోవడానికి సంప్రదించారు.
ఈ గూఢచారులు సంప్రదింపుల కోసం లింక్డ్‌ఇన్ వంటి ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఉపయోగించారు.
ఎంఐ5 చీఫ్ కెన్ మెక్‌కలమ్ మాట్లాడుతూ ‘‘మనం మాట్లాడుతున్నది వేరే దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారితో అన్నది జనాలకు తెలియకపోవచ్చు. కానీ వారు ఇస్తున్న సమాచారంతో వారి కంపెనీ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే'' అని అన్నారు.
ఇది జాతీయ భద్రత పరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని, ఆర్థికంగా ప్రమాదనమేనని కేన్ అభిప్రాయపడ్డారు.
విదేశాల్లో తన పనిపై విమర్శలను పరిమితం చేయడానికి చైనా తన గూఢచార వ్యవస్థను కూడా ఉపయోగిస్తుందని తెలిపారు.
ఇటీవల చైనా గూఢచారులు పాశ్చాత్య దేశాల రాజకీయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి.
దీని తరువాత బ్రిటన్, బెల్జియం, జర్మనీలలో పలు అరెస్టులు జరిగాయి, కెనడాలోను పలువురిపై విచారణ కొనసాగుతోంది.
యూరప్, అమెరికాలలో చైనీస్ ‘పోలీస్ స్టేషన్లు’ ఉన్నట్లు కూడా రిపోర్టులు ఉన్నాయి.
పాశ్చాత్య దేశాలలో చైనా అసమ్మతివాదుల విషయంలో చైనా నిఘా సంస్థలు సుదూర ప్రాంతాల నుంచి పనిచేస్తాయని భద్రతా అధికారులు అంటున్నారు.
కొన్నిసార్లు అది ప్రైవేట్ పరిశోధకులను నియమించుకుంటుంది. అవసరమైనచోట బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా చేస్తుంది.
2000వ సంవత్సరం ప్రారంభంలో యూకే ప్రభుత్వ వ్యవస్థలపై మొదటి సైబర్ దాడి రష్యా నుంచి కాదు, చైనా నుంచి జరిగింది. ఈ దాడి ఉద్దేశం టిబెటన్, వీగర్ కమ్యూనిటీకి చెందిన అసమ్మతివాదుల గురించి సమాచారాన్ని సేకరించడం.

పాశ్చాత్య దేశాలు కూడా కొత్త చట్టాలు..
రాజకీయ జోక్యంపై ఆస్ట్రేలియాలో ఆందోళనలున్నాయి. 2016లో ఇది మొదలైందని, దానిలో ఎన్నికలలో అభ్యర్థిని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలున్నాయని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) చెప్పింది.
‘వాళ్లు రాజకీయంగా తమ ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అని మైక్ బర్గెస్ బీబీసీతో అన్నారు. ఇలాంటి గూఢచార కార్యకలాపాలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా 2018లో కొన్ని కొత్త చట్టాలను ఆమోదించింది.
అనేక బ్రిటీష్ రాజకీయ పార్టీలకు బీజింగ్ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి యూకేకు చెందిన న్యాయవాది క్రిస్టిన్ లీ విరాళాలు ఇస్తున్నారని ఆరోపిస్తూ 2022 జనవరిలో ఎంఐ5 యూకేలో ఒక హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.
2023 సంవత్సరంలో బ్రిటన్‌లో కొత్త జాతీయ భద్రతా చట్టం ఆమోదించారు.
ఈ చట్టం ప్రకారం విదేశాల జోక్యం, ఇతర కార్యకలాపాలను ఎదుర్కోవటానికి కొత్త అధికారాలు ఇచ్చారు.
పాశ్చాత్య దేశాలపై చైనా గూఢచర్యం చేస్తున్నట్లే ఆ దేశాలు కూడా చైనాపై నిఘా పెడుతున్నాయనడంలో సందేహం లేదు.
అయితే ఎంఐ6, సీఐఏ వంటి పాశ్చాత్య గూఢచార సంస్థలకు చైనాపై నిఘాను సేకరించడం సవాలుతో కూడుకున్న పని.

ఫొటో సోర్స్, Getty Images
చైనా నెట్‌వర్క్ ఛేదించడం ఎందుకంత కష్టం?
చైనాలో నిఘా, ఫేస్ రికగ్నిషన్, డిజిటల్ ట్రాకింగ్ కారణంగా ఏజెంట్‌లను నేరుగా కలవడం దాదాపు అసాధ్యం.
దాదాపు దశాబ్దం కిందట సీఐఏ ఏజెంట్ల భారీ నెట్‌వర్క్‌ను చైనా పట్టేసుకుంది.
మరోవైపు, ఇలాంటి పనులు జీసీహెచ్‌క్యూ, అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సాంకేతికంగా చాలా కష్టమైన పని. ఎందుకంటే వారు కమ్యూనికేషన్‌లను అడ్డగించడానికి, డిజిటల్ ఇంటెలిజెన్స్‌ని సేకరించడానికి పాశ్చాత్య సాంకేతికతను కాకుండా వారి సొంత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
"చైనీస్ పొలిట్‌బ్యూరో ఎలా ఆలోచిస్తుందో మాకు నిజంగా తెలియదు" అని ఒక పాశ్చాత్య అధికారి చెప్పారు.
సమాచార లోపం అపార్థాలకు దారితీస్తుంది. అది ప్రమాదాలకు కారణమవ్వొచ్చు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మాస్కో తాను ఎంత అభద్రతలో ఉన్నానని భావించిందో గుర్తించడంలో పశ్చిమ దేశాలు విఫలమయ్యాయి. ఫలితంగా ఇరుపక్షాలు విధ్వంసకర యుద్ధానికి దగ్గరగా వచ్చాయి, ఇది ఏ పక్షమూ కోరుకోలేదు.
తైవాన్‌పై నియంత్రణ సాధించాలనే చైనా కోరిక కారణంగా నేడు ఇలాంటి అపార్థాలు వచ్చే ప్రమాదం ఉంది. దక్షిణ చైనా సముద్రంలో కూడా ఉద్రిక్తత పెరుగుతోంది. ఇక్కడ కూడా వివాదం ఉండవచ్చు.
‘మనం జీవిస్తున్న ప్రమాదకరమైన ప్రపంచంలో ఎప్పుడూ సంఘర్షణ పట్ల ఆందోళన చెందాలి, దానిని నివారించడానికి సిద్ధంగా ఉండాలి.’ అని ఎంఐ6 చీఫ్ రిచర్డ్ మూర్ సూచించారు.
ప్రమాదాలను ఎదుర్కోవటానికి అవసరమైన సమాచారాన్ని అందించడం ఎంఐ6 పని అని మూర్ చెప్పారు.
‘‘అపార్థం అనేది ఎప్పుడూ ప్రమాదకరమే. కమ్యూనికేషన్‌కు డోర్లు తెరిచి ఉంచడం ఎప్పుడూ మంచిదే. మీతో పోటీ పడుతున్న వ్యక్తి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా మంచిదే’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాదుల నుంచి బెదిరింపులకు సంబంధించి చైనా సహచరులతో ఎంఐ6 సంప్రదింపులు జరుపుతుంటుంది. అమెరికా, చైనాల మధ్య కొన్ని సైనిక సంబంధాలు తిరిగి మొదలయ్యాయనడం కూడా వాస్తవమే.
అటువంటి పరిస్థితిలో, ఇటీవలి నెలల్లో బీజింగ్, వాషింగ్టన్ దేశాల మధ్య సైనిక, దౌత్య సంబంధాలు వాతావరణాన్ని కొంచెం శాంతపరిచాయి. అయితే దీర్ఘకాలికంగా కొంత ఆందోళనకర పరిస్థితి మాత్రం కొనసాగుతోంది.
గూఢచర్యం గురించి బయటికి తెలుస్తున్న విషయాల వల్ల ఇరువైపులా ప్రజల్లో అపనమ్మకం, భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉంది. భయంకరమైన సంఘర్షణను నివారించడానికి, ఒకరితో ఒకరు కలిసి జీవించడానికి, అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌పై పెట్టిన మారణహోమం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యల అర్ధమేంటి, ఎవరు పొరపాటుపడ్డారు?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే.....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














