ప్రసవం కోసం వెళ్లి 15 ఏళ్లు కోమాలోకి, డాక్టర్ల ‘నిర్లక్ష్యం’తో ప్రాణాలు కోల్పోయిన పెద్ద కూతురి కథ

ఫొటో సోర్స్, FAKHRA AHMAD'S FAMILY
- రచయిత, మొహమ్మద్ జుబైర్ ఖాన్
- హోదా, బీబీసీ ఉర్దూ
‘ఉదయం పూట ఆమె వద్దకు వెళ్లగానే ఆమె ముఖం, కళ్లు సంతోషంగా నన్ను చూస్తున్నట్లు అనిపించేది. ఆమెకు మరింత దగ్గరగా వెళ్లినప్పుడు సంతోషంగా ఉన్నట్లు కనిపించేది’ అని ఫౌజియా అజీమ్ తాహిర్ తన కూతురు ఫఖ్రా అహ్మద్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఫఖ్రా అహ్మద్ దాదాపు 15 ఏళ్ల పాటు కోమాలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 28న ఫఖ్రా అహ్మద్ చనిపోయినట్లు ఆమె తల్లి ఫౌజియా బీబీసీతో చెప్పారు.
‘‘ఫఖ్రా అహ్మద్ కోమాలోకి వెళ్లే సమయంలో, ఆమె ఒకరి కోసం వేచిచూస్తున్నట్లు అనిపించింది. కానీ, పుట్టిన బిడ్డ చనిపోయిందని ఆమెకు తెలియదు. ఆమె ఏం ఆలోచించిందో నాకు తెలియదు’’ అని ఫఖ్రా తల్లి ఫౌజియా అజీమ్ తాహిర్ అన్నారు.
ఫఖ్రా అహ్మద్ ప్రసవం కోసం 2009లో ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలోనే ఆమె కోమాలోకి వెళ్లారు. తర్వాత రెండు రోజులకు పుట్టిన బిడ్డ కూడా ఆస్పత్రిలోనే చనిపోయింది.
పాకిస్తాన్ సుప్రీంకోర్ట్ అప్పటి చీఫ్ జస్టిస్ ఇఫ్తిఖార్ ముహమ్మద్ చౌధరీ ఈ కేసును సుమోటోగా స్వీకరించి, దీనిపై విచారణకు ఆదేశించారు.
ఫఖ్రా మరణానికి అక్కడి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోని వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలింది.
‘‘ఈ 15 ఏళ్లల్లో మేం పడ్డ బాధ, ఇబ్బందులు మాటల్లో చెప్పలేనివి’’ అని ఫఖ్రా అహ్మద్ తండ్రి ఖాజి ఇస్మాయిల్ తాహిర్ అన్నారు.

15 ఏళ్లు కోమాలో ఉన్న బ్యాంకర్, ప్రతిభావంతమైన విద్యార్థి
కోమాలోకి వెళ్లేముందు, ఫఖ్రా అహ్మద్ ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేవారు. ఉద్యోగం చేస్తూనే ఆమె తన చదువును కొనసాగించేవారు. ఆమె పరిశోధన పత్రాలు పలుచోట్ల ప్రచురితమయ్యాయి.
ప్రసవం కోసం తను పుట్టింటికి వచ్చినప్పుడు కూడా ఆమె రీసెర్చ్ పేపర్ రాశారని, దాన్ని పోస్టు చేయాలని తనను కోరారని ఫఖ్రా తండ్రి ఖాజి ఇస్మాయిల్ తాహిర్ గుర్తు చేసుకున్నారు.
తమ నలుగురు పిల్లల్లో ఫఖ్రా పెద్దమ్మాయని ఇస్మాయిల్ తాహిర్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆమె చురుకైన, ప్రతిభావంతమైన విద్యార్థి అని అన్నారు.
ఉన్నత చదువులు కొనసాగిస్తూనే ఆమె బ్యాంకులో పనిచేసేవారని తెలిపారు. బ్యాంకర్ కావాలనుకునే విద్యార్థులకు ఆమె పాఠాలు కూడా చెప్పేవారు.
ఫఖ్రాకు ఇద్దరు చెల్లెళ్లు. ఒక తమ్ముడు. వారందరూ ఇప్పుడు డాక్టర్లు. ‘‘ప్రసవం కోసం ఆమె పుట్టింటికి వచ్చినప్పుడు, నేను 9వ తరగతి చదువుతున్నాను’’ అని ఆమె చిన్న తమ్ముడు డాక్టర్ రోషన్ అహ్మద్ గుర్తుకు చేసుకున్నారు.
‘‘పరీక్షలు రాసేటప్పుడు, నాకు ఆమె పాఠాలు చెప్పడమే కాదు, పరీక్షకు నేను సిద్ధమో కాదో తెలుసుకునేందుకు టెస్టులు కూడా పెట్టేది. నన్ను ఈ రోజు డాక్టర్‌గా నిలబెట్టింది ఫఖ్రానే’’ అని రోషన్ చెప్పారు.
ముల్తాన్‌లోని నిష్తార్ టీచింగ్ హాస్పిటల్‌లో జుబైదా అనే స్టాఫ్ నర్సు 12 ఏళ్ల నుంచి ఐసీయూ వార్డులో పనిచేస్తున్నారు. ఫఖ్రా అహ్మద్‌కు ఆమెనే సేవలందించారు.
ఫఖ్రాతో తాను, ఇతర వైద్య సిబ్బంది మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు జుబైదా చెప్పారు.
‘‘ఫఖ్రా కళ్లు తెరిచేది. కానీ, కదిలేది కాదు. ఆమె కాస్త అర్థం చేసుకునేది. మేం వార్డులో ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఆమె మావైపు కళ్లు తిప్పి చూసేది’’ అని జుబైదా గుర్తుకు చేసుకున్నారు.
కోమాలో ఉన్నవారు దేనికీ స్పందించరు. కానీ, ఎక్కువ సమయం పాటు ఒకే వైపు పడుకుని పెడితే, ఆమె ముఖ కదలికల్లో మార్పు కనిపించేదని ఫఖ్రాను చూసుకున్న వైద్య సిబ్బంది తెలిపారు.
ఫఖ్రాతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు తాను ప్రయత్నించినట్లు జుబైదా చెప్పారు.
‘‘ఈ సమయంలో ఆమె తల్లి, కుటుంబం ఎంతో కష్టాన్ని భరించారు’’అని జుబైదా అన్నారు.
ఫఖ్రా తల్లి ఈ 15 ఏళ్ల పాటు కోమాలో ఉన్న తన కూతురుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తాను చేయాల్సిందల్లా చేశారని, ప్రతి క్షణాన్ని వెచ్చించారని జుబైదా తెలిపారు.

ఫొటో సోర్స్, FAMILY OF FAKHRA AHMAD
కొత్త జీవితం, న్యాయం కోసం పోరాటం
‘‘పాకిస్తాన్ సుప్రీంకోర్టు, పాకిస్తాన్ మెడికల్ అండ్ డెంటల్ అసోసియేషన్, పంజాబ్(పాకిస్తాన్‌లోని) ప్రభుత్వం చేపట్టిన విచారణల్లో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఫఖ్రా చనిపోయినట్లు తెలిసింది. కానీ, ఇప్పటి వరకు ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు నాకు తెలియలేదు’’ అని ఖాజి ఇస్మాయిల్ తాహిర్ చెప్పారు.
ఫఖ్రాకు సాధారణ కాన్పే అయింది. కానీ, ఆమెకు ‘అనస్తీషియా ఇంజెక్షన్’ ఇచ్చారని ఆమె తండ్రి తెలిపారు.
ఈ ఇంజెక్షన్ ఇచ్చేందుకు తమ నుంచి కానీ, ఫఖ్రా నుంచి కానీ అనుమతి తీసుకున్నట్లు రికార్డుల్లో లేదు.
‘‘ఇంజక్షన్‌ను నిపుణులైన వైద్యులు లేదా వారి పర్యవేక్షణలో ఇవ్వలేదు. ఈ ఇంజక్షన్‌ను ఎక్కువ మోతాదులో ఇచ్చినట్లు అన్ని దర్యాప్తుల్లో రుజువైంది.’’ అని ఖాజి ఇస్మాయిల్ తాహిర్ చెప్పారు.
‘‘ఫఖ్రా రక్తపోటును పరీక్షించేందుకు ఎలాంటి మానిటరింగ్ సిస్టమ్ లేదని విచారణ నివేదికలో ఉంది’’ అని తండ్రి తెలిపారు.
ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో అంబులెన్స్ లేదని, బయట నుంచి అంబులెన్స్‌ను తెప్పించారని చెప్పారు.
‘‘ప్రతి దగ్గర నేను ఇబ్బంది పడ్డాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్కువ కాలం పాటు ఒక రోగిని ఆస్పత్రిలో పెట్టుకోలేమని చెప్పింది. ఆ సమయంలో కోర్టు మాకు ఉపశమనం కల్పించింది.’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, QAZI ISMAIL TAHIR
ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో ఏం ఉంది
‘‘అనస్తీషియా ఇచ్చే వైద్య నిపుణుడు టెస్టు డోస్ ఇచ్చిన తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడం, ఆ తర్వాత ఎలాంటి నైపుణ్యం లేని ఒక మిడ్‌వైఫ్ లెవల్ పారామెడిక్ అనస్తీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఈ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. అనస్తీషియా ఇచ్చిన తర్వాత రోగి పరిస్థితి క్లిష్టంగా మారింది. గైనకాలజిస్ట్ కంగారు పడ్డారు. సీపీఆర్‌ను సరిగ్గా చేయలేకపోయారు’’ అని 2009లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఇఫ్తిఖార్ హుస్సేన్ ఖురేషి చైర్మన్‌గా ఏర్పాటైన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ తన నివేదికలో పేర్కొంది.
‘‘గైనకాలజిస్ట్ మరో వైద్యునికి ఫోన్ చేస్తూ చాలా సమయాన్ని వృథా చేశారు. కృత్రిమ శ్వాస ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో రోగి మెదడు తీవ్రంగా దెబ్బతింది’’ అని తమ విచారణలో నివేదికలో రాశారు.
‘‘డెలివరీ చేసే సమయంలో అనస్తీషియా వైద్యుడిని అక్కడే ఉంచడం ఆస్పత్రి బాధ్యత’’ అని నివేదికలో పేర్కొన్నారు.
ఫఖ్రా పరిస్థితికి కారణం ముల్తాన్‌లో ప్రైవేట్ ఆస్పత్రి మేనేజ్‌మెంటే అని విచారణ నివేదిక తేల్చింది. ఈ కేసులో డాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహించినట్లు తెలిపింది.
కోర్టు ఆదేశాలతోనే బీమా చెల్లింపులు
ఫఖ్రాకు బీమా చెల్లింపులను తక్షణమే చేపట్టాలని బ్యాంకుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫఖ్రాకు రూ.23 లక్షల ఇన్సూరెన్స్ వచ్చాయి.
చైనాలో ఒక ప్రముఖ ఆస్పత్రికి ఆమె తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స లభిస్తుందని వారు భావించారు. కానీ, అక్కడ కూడా ఆమె కుటుంబానికి నిరాశ ఎదురైంది.
ఫఖ్రా కోలుకోలేదు. ఆ తర్వాత ఫఖ్రాను తీసుకుని ముల్తాన్‌కు వచ్చేశామని ఆమె తండ్రి చెప్పారు.
ముల్తాన్‌లోని నిష్తార్ హాస్పిటల్‌లో ఆమెను తిరిగి చేర్చారు. ఆస్పత్రికి ఇల్లు దూరం కావడంతో, వారుండే ఇంటిని కూడా వదిలేసి, ఆస్పత్రికి దగ్గర్లో మరో ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు ఫఖ్రా తండ్రి చెప్పారు.
ఆ సమయంలో, ఫఖ్రా తల్లి ఎప్పుడూ ఆస్పత్రిలోనే ఉండేవారు.
‘’15 ఏళ్లల్లో కేవలం ఒకే ఒక్కసారి ఊరిని విడిచి వెళ్లాను. అది కూడా మా అమ్మ చనిపోయినప్పుడు’’ అని ఫఖ్రా తల్లి ఫౌజియా అజీమ్ తాహిర్ చెప్పారు.
ఆస్పత్రి బెడ్‌పై ఉన్న కూతురి దుస్తులు మార్చడం, డైపర్లను ఆమే మార్చేవారు. రోజంతా ఆమెను చూసుకుంటూ ఉండేవారు.
‘‘ఉదయం ఫఖ్రా దగ్గరికి వెళ్తే ఫౌజియా అజీమ్ చాలా సేపు అక్కడే ఉండేవారు. మధ్యాహ్నం కొద్దిసేపు ఇంటికి వచ్చేవారు. మళ్లీ సాయంత్రం ఆస్పత్రికి వె రాత్రి ఫఖ్రా బట్టలు ఉతికేవారు. ఆమెకు కావాల్సినవన్నీ సిద్ధం చేసేవారు. ఆ సమయంలో కొన్నిసార్లు ఇంట్లో ఒక్కపూటే వండటం, కొన్నిసార్లు అసలు వండకపోవడం జరిగేది’’ అని ఖాజి ఇస్మాయిల్ తాహిర్ చెప్పారు.

ఫొటో సోర్స్, FAKHRA AHMAD'S FAMILY
ఫఖ్రా తల్లి అయ్యే సమయంలో..
ఫఖ్రా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె ఉద్యోగం చేశారు. కాన్పు కోసం తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు.
‘‘పుట్టబోయే బిడ్డ గురించి తరచూ మాట్లాడేది. మంచి స్కూల్‌లో చేర్పిస్తానని చెప్పేది. పుట్టబోయే బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనేది. ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయాలనుకుంది. ‘నేను వర్క్ చేస్తాను, ఉద్యోగం వదిలిపెట్టడం సరైంది కాదు’ అని తరచూ చెప్పేది. బిడ్డను ఎలా బాగా చూసుకోవాలో తెలియడం లేదని చెప్పేది’’ అని కుటుంబ సభ్యులు చెప్పారు.
డెలివరీకి ముందు ఫఖ్రా అన్నీ సిద్ధం చేసుకున్నారు. పుట్టబోయే బిడ్డకు కావాల్సిన దుస్తులు, వస్తువులు అన్నింటిన్నీ ముందే కొన్నారు.
డెలివరీకి వెళ్లినప్పుడు, తాను తల్లి కాబోతున్నాని చాలా సంతోషంగా ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
‘‘ఫఖ్రా కోమాలోకి వెళ్లినప్పుడు, ఆమె ఒకరి కోసం వేచిచూస్తున్నట్లు అనిపించింది. కానీ, పుట్టిన కూతురు చనిపోయిందని ఆమెకు తెలియదు. ఏం ఆలోచిస్తుండేదో అర్థం కాకపోయేది. చాలాసార్లు ఆస్పత్రిలో ఆమె పనులు చేస్తున్నప్పుడు, బెడ్‌పై పడుకుని ఆమె ఏం ఆలోచిస్తుందోనని తలుచుకుంటే ఆందోళనగా అనిపించేది’’ అని ఫఖ్రా తల్లి ఫౌజియా చెప్పారు.
కోమాలోకి వెళ్లిను భార్యను చూసేందుకు ఫఖ్రా భర్త కొన్నిరోజులు ఆస్పత్రికి వచ్చారని, కానీ, ఆ తర్వాత నుంచి ఆయన రావడం మానేశారని తెలిపారు.
‘‘ఆయన తన భవిష్యత్ గురించి తప్పక ఆలోచించి ఉండొచ్చు’’ అని ఆమె అన్నారు.
ఫఖ్రా చనిపోయిన వార్త తెలిసినా ఆమె భర్త ఏం మాట్లాడలేదని ఫఖ్రా తల్లి చెప్పారు.
ఫఖ్రా మరణం తర్వాత ఆయన ఏమన్నా మాట్లాడితే తమకు మంచిగా అనిపించేదని అన్నారు.
ప్రతి ఏడాది ఫఖ్రా పుట్టిన రోజును తాము జరిపే వాళ్లమని ఫౌజియా చెప్పారు. పెళ్లికి సంబంధించిన ఏదైనా వేడుకను లేదా ఇంట్లో ఏదైనా సంతోషకరమైన సందర్భం ఉన్నా ఫఖ్రా బెడ్ దగ్గరనే ఎక్కువ సమయం గడిపేవాళ్లమన్నారు.
‘‘ఫఖ్రా నాపైపు సంతోషంగా చూస్తున్నట్లు అనిపించేది’’
ఫఖ్రా కోమాలో ఉన్నప్పటికీ.. ఆమె కనీసం బతికి ఉందనేది తనకు ఊరటనిచ్చేదన్నారు ఆమె తల్లి ఫౌజియా.
‘‘ఉదయం పూట ఆమె వద్దకు వెళ్లగానే, ఆమె ముఖం, కళ్లు సంతోషంగా చూస్తున్నట్లు అనిపించేది. ఆమెకు మరింత దగ్గరగా వెళ్లినప్పుడు, సంతోషంగా ఉన్నట్లు కనిపించేది’’ అని చెప్పారు.
‘‘చాలాసార్లు నేను పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, బాధతో నావైపు చూసేది. నేను పనులన్నీ పూర్త చేయగానే నవ్వుతున్నట్టు కనిపించేది. నాకు చాలా సంతోషమేసేది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను’’ అని ఫౌజియా అన్నారు.
కోమాలో ఉన్నప్పుడు ఫఖ్రా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆమె రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చాలా రకాల ఇంజెక్షన్లు ఇచ్చేవారు.
‘‘ఆమెకు ఇంజెక్షన్లు ఇస్తున్నప్పుడు నాకు బాధగా ఉండేది’’ అని తెలిపారు.
‘‘మొదట ఫఖ్రాకు తిరిగి తన జీవితం ప్రసాదించమని దేవుణ్ని కోరుకునేదాన్ని. కానీ, ఇంజెక్షన్లు వల్ల ఆమె పడుతున్న ఇబ్బంది చూసి, ఏదో ఒక రూపంలో ఆమె ప్రాణాన్ని తీసుకెళ్లాలని దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాను’’ అని చెప్పారు.
‘‘డాక్టర్లు, వైద్య సిబ్బంది అందరూ నిర్లక్ష్యంగా ఉంటారని మేం అనడం లేదు. కానీ, ఈ వృత్తిలో కూడా నిర్లక్ష్యం, తప్పులకు ఆస్కారం ఉంది.’’ అని ఫఖ్రా తండ్రి ఖాజి ఇస్మాయిల్ అన్నారు.
‘‘మా 15 ఏళ్ల బాధను దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది వినాలని మేం కోరుకుంటున్నాం. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి బాధను, మా కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను అనుభవించకూడదనేది మా ఉద్దేశం.’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బెరిల్: ‘మా ద్వీపం మొత్తాన్ని తుడిచిపెట్టేసిన హరికేన్ ఇది’ అంటున్న బాధితులు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే....
- పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక చిన్న సెల్లో తమను తాము బంధించుకుంటున్నారు, ఎందుకు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- ‘60’ మందిని ఉరి తీసిన తలారి మృతి
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














