బెరిల్: ‘మా ద్వీపం మొత్తాన్ని తుడిచిపెట్టేసిన హరికేన్ ఇది’ అంటున్న బాధితులు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే....

ఫొటో సోర్స్, Alizee Sailly
- రచయిత, విల్ గ్రాంట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాత్రిపూట సంభవించిన భయంకరమైన బెరిల్ హరికేన్ నుండి బయటపడిన కత్రినా కాయ్‌కు, తాను నివసించే యూనియన్ ద్వీపంలో జరిగిన విధ్వంసాన్ని చూశాక మతిపోయింది.
సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌కు సమీపంలో ఉన్న ద్వీపంలో దాదాపు ప్రతి ఇల్లు ధ్వంసమైందని ఆమె చెప్పారు.
"బెరిల్ హరికేన్ ప్రభావం తగ్గిన తర్వాత చూస్తే యూనియన్ ఐలాండ్ ఘోరంగా దెబ్బతింది. దాదాపు ద్వీపమంతా నాశనమైంది.” అని ఆమె ఒక వీడియో సందేశంలో తెలిపారు.
కొన్ని భవనాలు మాత్రమే హరికేన్ ధాటిని తట్టుకుని నిలిచాయి. చాలా ఇళ్లు కూలిపోయాయి. నేలమట్టమైన ఇళ్లతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. వీధుల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
“నేను సర్వస్వం కోల్పోయాను. ఎక్కడ ఉండాలో తెలియడం లేదు” అని ఆ ప్రాంతంలో చేపలుపట్టుకుని జీవించే సెబాస్టియన్ సెయిలీ ఆవేదన వ్యక్తం చేశారు.
1985 నుండి తాను యూనియన్ ఐలాండ్‌లో నివసిస్తున్నానని ఆయన వెల్లడించారు.
‘‘2004 లో వచ్చిన ఇవాన్ హరికేన్‌ను కూడా తట్టుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన హరికేన్ దానిని మించి భయంకరమైంది.’’ అని ఆయన అన్నారు.
హరికేన్ కలిగించిన భయం ఆయన గొంతులో ప్రతిధ్వనించింది.
‘‘నా భార్య, కూతురితో కలిసి నేను షెల్టర్‌లో ఉంటున్నాను. ఈ హరికేన్ దెబ్బ నుంచి మేము ఎప్పటికి కోలుకుంటామో తెలియదు.’’ అని అన్నారాయన.


ఫొటో సోర్స్, Alizee Sailly
కుటుంబంతో కలిసి హోటల్ నిర్వహించే ఆయన సోదరి అలీజీ, తమ పట్టణంపై బెరిల్ హరికేన్ చూపిన భయంకరమైన ప్రభావాన్ని వివరించారు.
హరికేన్ సమయంలో వచ్చిన ప్రచండ గాలుల నుండి రక్షించుకునేందుకు తలుపులు, కిటికీలకు ఫర్నిచర్‌ను అడ్డం పెట్టామని చెప్పారు.
"హరికేన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ హోరు గాలులు మా చెవుల్లో మారుమోగాయి. ఒక భవనం పైకప్పు ఊడిపోయి మరో భవనంపై పడటం వినిపించింది. కిటికీలు విరిగిపోయాయి. వరదలు ముంచెత్తాయి.” అని ఆమె వివరించారు.
ఈ హరికేన్ ఇంత భయంకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.
సెబాస్టియన్ సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకంతోపాటు మత్స్యకారుడు కూడా. కానీ, ఆయన పొలాలు, తేనెటీగల గూళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
తనకు ఇంత నష్టం ఎదురైనప్పటికీ, ఇక్కడి కమ్యూనిటీలోని బాధితులకు ఆశ్రయం కల్పించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన చెప్పారు.
స్థానికులు చెక్క, ప్లాస్టిక్‌ని సేకరించి తమ కుటుంబం కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
“ఈ క్లిష్ట పరిస్థితిలో నీరు, ఆహారం దొరకడం చాలా కష్టంగా ఉంది.” అని ఆయన అన్నారు.
ఆహారం, పాలు, శానిటరీ నాప్కిన్స్‌తో పాటు టెంట్లు వంటి కొన్ని నిత్యావసర వస్తువులు తక్షణమే యూనియన్ ద్వీపంలో నిరాశ్రయులైన వారికి కావాలని అలిజీ సెయిలీ చెప్పారు.
అలాగే జనరేటర్లు కూడా అవసరం ఉన్నాయన్నారు.
కరెంట్‌తో పాటు కమ్యూనికేషన్ కూడా స్తంభించడంతో, ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నెట్‌వర్క్ ద్వారా ఆమె సందేశాలను పంపగలిగారు.
దీంతో సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్‌లోని ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించిందని ఆమె చెప్పారు.

సెయింట్ విన్సెంట్ , గ్రెనడైన్స్ ప్రధాన మంత్రి రాల్ఫ్ గొన్సాల్వ్స్ కరేబియన్ దేశం అంతటా నెలకొన్న దిగ్భ్రాంతికర పరిస్థితుల గురించి ఆరా తీశారు.
"బెరిల్ హరికేన్ వినాశనాన్ని మిగిల్చింది.’’ అని ఆయన అన్నారు. ఆ బాధని దేశం అంతా అనుభవిస్తోందని చెప్పారు.
హరికేన్ అనంతర పరిస్థితులపై ప్రాధాన్యతా క్రమంలో పరిస్థితులను చక్కదిద్దుతామని రాల్ఫ్ గొన్సాల్వ్స్ హామీ ఇచ్చారు.
అయితే, ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
“మాకు సహాయం చేయడానికి మిలిటరీని, కోస్ట్‌గార్డ్‌ను పంపుతారని నేను ఆశిస్తున్నాను. వారు ద్వీపాన్ని పునర్నిర్మించగలరో లేదో నాకు తెలియదు.” అని సెబాస్టియన్ అన్నారు.
"దీనికి వందల కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఇతర దేశాల నుంచీ సహాయం కావాలి." అని ఆయన అన్నారు.
యూనియన్ ఐలాండ్ ఎన్విరాన్‌మెంటల్ అలయన్స్ డైరెక్టర్ అయిన కత్రినా కాయ్, తమకు చేతనైనంత సహాయం చేయాలని కరీబియన్ డయాస్పోరా సభ్యులను కోరారు.
“మాకు సహాయం చాలా అవసరం. ఎమర్జెన్సీ కిట్లు, ఆహారం, తరలింపు, ఇవన్నీ తక్షణ అవసరాలు.’’ అని ఆమె అన్నారు.
కొన్నేళ్లుగా కరేబియన్‌లోని యూనియన్ ఐలాండ్ నీటి భద్రత కోసం కాయ్ కీలకమైన పనులు చేపట్టారు. అలాగే చిన్న ద్వీప కమ్యూనిటీలకు కీలక వనరులు కల్పించారు.
విషాదం ఏమిటంటే ఆ వనరులన్నీ బెరిల్ హరికేన్ వల్ల తుడిచిపెట్టుకుపోయాయని ఆమె అన్నారు.
గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో బెరిల్ హరికేన్ యూనియన్ ఐలాండ్‌ను విచ్ఛిన్నం చేసింది.
వేలాది మంది ప్రజలు విద్యుత్తు లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
చాలా మంది సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, గ్రెనడాతో పాటు సెయింట్ లూసియాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హరికేన్ సహాయక శిబిరాలలో తలదాచుకున్నారు.
యూనియన్ ఐలాండ్‌లోని ప్రతి అంగుళం హరికేన్‌తో ప్రభావితమైనా, ప్రజలు నిరాశ్రయులైనప్పటికీ ఇంతకన్నా అధ్వాన్న పరిస్థితులు తలెత్తనందుకు సెబాస్టియన్ సెయిలీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు.
"గొప్ప విషయం ఏంటంటే మేము బతికే ఉన్నాం. మాకు ఎలాంటి గాయాలూ కాలేదు." అని ఆయన అన్నారు.
"మేము ఇంత భయంకర పరిస్థితులను అనుభవించిన తర్వాత కూడా, నా పొరుగువారిని చూడగలిగినందుకు సంతోషంగా ఉంది." అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బాలుడి పుర్రెలో మూర్ఛను తగ్గించే పరికరం అమర్చారు.. తర్వాత ఏమైందంటే?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














