క్యాప్సైసిన్: కారం హానికరమా? ఎంత తినొచ్చు, ఎక్కువ తింటే చనిపోతారా

మిరపకాయ తింటున్న మహిళ
    • రచయిత, జెస్సికా బ్రౌన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కారంలో ఉండే క్యాప్సైసిన్ అధిక పరిణామంలో ఉందంటూ ఇటీవల కొన్ని యూరప్ దేశాల్లో రామెన్ నూడుల్స్‌ను నిషేధించారు. ఇది నిజంగా ఆరోగ్యానికి ప్రమాదకరమా?

దక్షిణ కొరియా బ్రాండ్ ఇన్‌స్టంట్ రామెన్‌లోని కొన్ని ఫ్లేవర్లు "అత్యంత విషపూరితం"గా మారే ప్రమాదం ఉందంటూ ఇటీవల డెన్మార్క్ ఫుడ్ ఏజెన్సీ చేసిన ప్రకటన పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.

అమెరికాలో స్పైసీ ఫుడ్ చాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు మరో కథనం పత్రికల్లో వచ్చింది.

ఈ రెండు కథనాల్లో కీలకమైన అంశం, మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం. వంటలకు కారం రుచిని ఇచ్చేది ఇదే.

అయితే, డెన్మార్క్ అధికారులు చెబుతున్న జాగ్రత్తలు సరైనవేనా? విషపూరితం అయ్యేంత క్యాప్సైసిన్‌ను మనం తింటామా?

బీబీసీ న్యూస్ తెలుగు
మిరప కాయ

ఫొటో సోర్స్, Getty Images

క్యాప్సైసిన్ అంటే ఏమిటి?

క్యాప్సైసిన్ అనేది మిరపకాయలకు కారం రుచిని, వాటిని తిన్నప్పుడు మనకు నోరు మండుతున్న అనుభూతిని కలిగించే రసాయన సమ్మేళనం. ఇది క్యాప్సైసినాయిడ్స్ అని పిలిచే రసాయన సమ్మేళన విభాగాలలో ఒకటి.

మిరపకాయల్లో దాదాపు 23 రకాల క్యాప్సైసినాయిడ్లు ఉంటాయని కనుగొన్నా, వీటిలో అత్యంత శక్తివంతమైనది క్యాప్సైసిన్.

యూకేలో ఆహార తయారీదారులు ఆహార పదార్థాల్లో స్వచ్ఛమైన క్యాప్సైసిన్ కలపడానికి యూకే ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ అనుమతించదు, ఎందుకంటే ఇది సురక్షితం కాదు.

అయితే, క్యాప్సైసిన్‌ సహజంగా లభించే మిరపకాయల రూపంలో ఎంతవరకూ తీసుకోవచ్చు అనే దానికి మాత్రం పరిమితులు లేవు.

మిరప కాయ

ఫొటో సోర్స్, Getty Images

క్యాప్సైసిన్ ఎక్కువగా తింటే కనిపించే లక్షణాలు..

క్యాప్సైసిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినొద్దని హెచ్చరించిన మొదటి దేశం డెన్మార్క్ కాదు. జర్మనీలోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిస్క్ అసెస్‌మెంట్ (బీఎఫ్ఆర్) సైతం క్యాప్సైసిన్ అధిక వినియోగంపై హెచ్చరికలు చేసింది.

అధిక మోతాదులో క్యాప్సైసినాయిడ్స్ తినడం వల్ల గుండెలో మంట, వికారంగా ఉండడం, విరేచనాలు, ఉదరం, ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఉందని బీఎఫ్ఆర్ చెబుతోంది. ఇది చెమటలు, రక్తపోటులో మార్పులు, మైకం వంటి లక్షణాలనూ కలిగిస్తుంది, కానీ అవి ఏ మోతాదులో ఈ లక్షణాలను కలగజేస్తాయో చెప్పగలిగేంత సమాచారం లేదు.

"క్యాప్సైసినాయిడ్స్‌ మోతాదు, దాని వల్ల కలిగే రియాక్షన్ విషయంలో పరిమితమైన డేటా మాత్రమే అందుబాటులో ఉన్న కారణంగా, ఆరోగ్య పరిమితులపై ఎలాంటి సిఫార్సులూ చేయలేం" అని బీఎఫ్ఆర్ ప్రతినిధి చెప్పారు.

అయితే, 0.5 మిల్లీగ్రాముల నుంచి 1 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ క్యాప్సైసినాయిడ్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఒళ్లు వేడిగా ఉండడం, పొట్ట పైభాగంలో ఒత్తిడి లేదా గుండెల్లో మంట వంటి తేలికపాటి అవాంఛనీయ లక్షణాలు కనిపించవచ్చని బీఎఫ్ఆర్ తెలిపింది.

"క్యాప్సైసినాయిడ్స్‌ను 170 మిల్లీగ్రాముల వరకు తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు. సుమారు 600 మిల్లీగ్రాముల క్యాప్సైసినాయిడ్స్ తీసుకోవడంతో రోగి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది" అని బీఎఫ్ఆర్ తెలిపింది.

జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించిన మిరపకాయలు తినే పోటీలో పాల్గొన్న 27 ఏళ్ల వ్యక్తి, నాలుగు భూత్ జోలోకియా మిరపకాయలు, ఇతర మసాలా కలిపిన అనేక ఆహార పదార్థాలను తిన్నారు. భూత్ జోలోకియా లేదా "ఘోస్ట్ పెప్పర్" అనేది ప్రపంచంలోని అత్యంత కారంగా ఉండే మిరపకాయలలో ఒకటి.

కారంగా ఉండే ఆహారాన్ని తిన్న రెండున్నర గంటల తర్వాత, ఆ వ్యక్తికి పొత్తికడుపు నొప్పి, కడుపులో మందంగా ఉన్నట్లు అనిపించడం ప్రారంభించింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఏమైందో వైద్యులు గుర్తించలేక కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అది కొంతసేపు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. మిరపకాయలు తిన్న 12 గంటల తర్వాత ఆ వ్యక్తి వాంతి చేసుకుని క్రమంగా సాధారణ స్థితికి వచ్చారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఈ లక్షణాలు కేవలం క్యాప్సైసిన్ వల్ల మాత్రమే కాదు.

"తక్కువ టైంలో ఎక్కువ క్యాప్సైసిన్ తీసుకుంటే అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది" అని ఆస్ట్రేలియాలోని బాండ్ యూనివర్సిటీలో సైన్స్ అండ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టియన్ మోరో చెప్పారు.

"అది కంటిలో పడితే చాలా బాధను కలిగిస్తుంది. దాని వల్ల కంటిచూపు అస్పష్టం కావొచ్చు. దీన్ని ఎక్కువగా పీలిస్తే దీర్ఘకాల దగ్గుకు కారణమవుతుంది, ఉబ్బసం వంటి వ్యాధులనూ ప్రేరేపిస్తుంది." కానీ క్యాప్సైసిన్ తినడం వల్ల కలిగే లక్షణాలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోరో చెప్పారు.

"క్యాప్సైసిన్ మన నరాలను యాక్టివేట్ చేస్తుంది. అందువల్లే మీ శరీరం కాలిపోతున్నట్లు అనిపిస్తుంది, కానీ అది కేవలం అలా అనిపిస్తుందంతే.. నిజానికి అది మనకు ఎలాంటి హానీ చేయదు" అని ఆయన చెప్పారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఏ లక్షణాలు హానికరం?

అధిక మోతాదులో తీసుకున్న క్యాప్సైసిన్ పిల్లల్లో "విషపూరితం" కావొచ్చని బీఎఫ్ఆర్ చెబుతోంది. అయితే అధిక మోతాదును బీఎఫ్ఆర్ నిర్వచించలేదు.

కొన్ని అంచనాల ప్రకారం, మనుషులకు హాని కలిగించే క్యాప్సైసిన్ మోతాదు ఒక కిలో శరీర బరువుకు 500-5,000 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది 70 కిలోల బరువున్నవారిలో దాదాపు 35,000 మిల్లీగ్రాముల క్యాప్సైసిన్‌కు సమానం. సాధారణంగా, 100 గ్రాముల జలపెనో మిరపకాయల్లో దాదాపు 15 మిల్లీగ్రాముల క్యాప్సైసిన్ ఉంటుంది, అదే పరిమాణంలో ఉన్న స్కాచ్ బానెట్ మిరపకాయల్లో అది దాదాపు 260 మిల్లీగ్రాములు ఉంటుంది. భూత్ జోలోకియా 100 గ్రాముల తాజా మిరపకాయల్లో దాదాపు 4,000 మిల్లీగ్రాముల క్యాప్సైసిన్ ఉంటుంది.

అయినప్పటికీ, మనుషుల్లో క్యాప్సైసిన్ మోతాదు ఎక్కువైన కేసులు ఏవీ రిపోర్టు కాలేదని మోరో చెప్పారు.

పదేళ్ల కిందట ఒక అధ్యయనం.. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో కడుపు, కాలేయ క్యాన్సర్‌లకు క్యాప్సైసిన్‌తో సంబంధం ఉందని, అలాగే, క్యాప్సైసిన్ గ్యాస్ట్రిక్ "మైక్రోబ్లీడింగ్"కు కారణమవుతుందని సూచించింది. కానీ, ఇలాంటి లక్షణాలేవీ కనిపించలేదని ఇతర అధ్యయనాలు సూచిస్తున్నాయి.

సిస్టమేటిక్‌గా నిర్వహించిన 11 అధ్యయనాలు, వాటి డేటాను 2022లో రివ్యూ చేసినప్పుడు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాల వల్ల మంచి లేదా చెడు ఆరోగ్య ప్రభావాలు కలిగే అవకాశాలు స్థిరంగా లేవని, వాటి ఆధారంగా ఇలాంటి ప్రభావాలు ఉంటాయని కచ్చితంగా నిర్ధరించలేమని తేలింది.

"ఎక్కువ కారంగా ఉండే మిరపకాయలు తింటే చనిపోతారా?' అని నన్ను చాలాసార్లు అడిగారు. జీవితంలో చాలా విషయాల మాదిరిగానే దీనికి సమాధానం 'అవును, కాదు'" అని న్యూ మెక్సికోలోని రీజెంట్స్ ప్లాంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ ప్రొఫెసర్ పాల్ బోస్లాండ్ చెప్పారు. ప్రపంచంలోని మిర్చి నిపుణుల్లో ఆయన ఒకరు.

"మిర్చి కారణంగా మనుషులు మరణించవచ్చు, కానీ ఆ స్థితికి చేరుకోవడానికి ముందే శరీరాలు దానికి సిద్ధంగా ఉండవు. " దీనిని మరోలా చెప్పాలంటే, ప్రాణాంతకంగా మారేంత మోతాదులో క్యాప్సైసిన్ కలిగిన ఆహారాన్ని మన శరీరాలు తీసుకోవని ఆయన చెప్పారు.

"చెమటలు పట్టడం, వణకడం, వాంతులు చేసుకోవడం, ఇలాంటి వాటిని దాటి మరీ మిరపకాయలను తినడాన్ని కొనసాగించాలి. అందువల్ల, ఎంతకారంగా ఉన్న మిరపకాయలు అయినప్పటికీ మరణానికి కారణం కాలేవని చెప్పొచ్చు" అని ఆయన అన్నారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

కొందరికి ఎలాంటి ప్రమాదం లేదా?

అనేక ఇతర ఆహారాలు, పానీయాల మాదిరిగానే క్యాప్సైసిన్‌కు శరీరం ఎలా స్పందిస్తుంనేది ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది, అది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

క్యాప్సైసిన్ ప్రభావం వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుందని బీఎఫ్ఆర్ తెలిపింది. ఉదాహరణకు, పిల్లలు లేదా ఎప్పుడో కానీ కారం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోనివారు, రోజూవారీ జీవితంలో కారం క్రమం తప్పకుండా తినే వ్యక్తుల కంటే ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటారు.

ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉన్నవారిలో క్యాప్సైసిన్ చికాకు కలిగిస్తుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కానీ, ఆరోగ్యంగా ఉన్నవారిలో దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు.

దానితో పాటు, జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు క్యాప్సైసినాయిడ్స్ తీసుకోవడం వల్ల పేగులపై ఎక్కువగా ప్రభావం పడొచ్చని బీఎఫ్ఆర్ తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకూ అధిక మొత్తంలో తీసుకున్న క్యాప్సైసినాయిడ్స్ ప్రమాదాన్ని కలిగిస్తాయి.

మిర్చి తినడం వల్ల కలిగే ప్రభావాలు, వాళ్లు ఎలాంటి స్పైసీ ఫుడ్‌ తింటారనే అలవాటుపై కూడా ఆధారపడి ఉండొచ్చని బోస్లాండ్ అన్నారు. ఇది మాత్రమే కాకుండా, క్రమం తప్పకుండా మిరపకాయలు తింటే, ఆ కారానికి అలవాటు పడొచ్చని కూడా ఆయన అన్నారు.

ఉదాహరణకు, క్యాప్సైసిన్‌ను క్రమం తప్పకుండా తింటూ ఉంటే, అది గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గించే అవకాశం ఉందని, శరీరం దానిని తట్టుకోగలుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

"ఒకసారి మిరపకాయలపై పరిశోధనలు చేస్తున్న చైనా, భారత్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు నా ప్రయోగశాలకు వచ్చారు. నేను వారిని భోజనానికి తీసుకెళ్లాను. మేమంతా ఎంచిలాడాస్ తింటున్నప్పుడు, తాను భారత్ వెళ్లినప్పుడు అక్కడి వంటకాలు రుచిచూశానని, అవి చైనా వంటకాల కంటే కారంగా అనిపించాయని చైనా సైంటిస్ట్ అన్నారు" అని బోస్లాండ్ చెప్పారు.

"నేను చైనా వెళ్లినప్పుడు నాకు కూడా అలానే అనిపించింది" అని భారత సైంటిస్ట్ అన్నారని ఆయన చెప్పారు.

ఆ ఇద్దరు సైంటిస్టులు మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలకు ప్రసిద్ధి చెందిన దేశాల నుంచి వచ్చినప్పటికీ, వారు మరొకరి వంటకాలు కారంగా ఉన్నాయని చెప్పారని బోస్లాండ్ చెప్పారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య ప్రయోజనాలు

చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మిరపకాయలను పలు ఆరోగ్య సమస్యలకు చిట్కాగా ఉపయోగించారు. ఆధునిక వైద్యంలో క్యాప్సైసిన్‌‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నొప్పి నివారణ, మైగ్రేన్, తలనొప్పి, సోరియాసిస్‌లకు వైద్య చికిత్సలో ఈ మిరపకాయల నుంచి తీసిన రసాయనాలను ఉపయోగిస్తారు.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నివారణ, చికిత్సలోనూ క్యాప్సైసిన్‌ను సూచిస్తారు.

క్యాప్సైసిన్‌ను రోజూ తీసుకోవడం వల్ల, వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కారణంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మోరో చెప్పారు.

అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్, ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి క్యాప్సైసిన్‌ను వినియోగించడం మేలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ అల్సర్‌లకు కారణమని భావించినప్పటికీ, నిజానికి క్యాప్సైసిన్ వాటి నివారణకు, నయం చేసేందుకు సాయపడుతుందని సూచించే ఆధారాలున్నాయి.

క్యాప్సైసిన్ గురించి కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, ఆహారంలో ఎక్కువగా మిర్చి వాడడం వల్ల కారంగా అనిపించడం మినహా ఏదైనా హాని కలుగుతుందనడానికి కచ్చితమైన ఆధారాలూ లేవు. అలాగే, మన ఆహారంలో కొంత క్యాప్సైసిన్ కలిగి ఉండటం నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందని సూచించేందుకు మాత్రం చాలా ఆధారాలు ఉన్నాయి.

కానీ, ఇప్పటికీ ఒక మిస్టరీ మాత్రం అలాగే మిగిలిపోయింది. కారం ఎక్కువగా తినేది చైనీయులా, భారతీయులా? దీనికి సమాధానం మాత్రం ఎప్పటికీ చర్చనీయాంశమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)