కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

ఫొటో సోర్స్, Nyobolt
- రచయిత, జో క్లెయిన్‌మాన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అతిపెద్ద సవాల్‌గా ఉన్న బ్యాటరీ చార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భారీ పోటీనే జరుగుతోంది. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు శరవేగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఓ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం దాకా చార్జ్ అయింది.
బ్రిటన్‌లో తెలుగు వ్యక్తి డాక్టర్ సాయి శివారెడ్డి స్థాపించిన స్టార్టప్ సంస్థ న్యోబోల్ట్ ఈ బ్యాటరీని తయారు చేసింది.
ఈ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ తొలి ప్రదర్శనలో నాలుగు నిమిషాల 37 సెకన్లలోనే 10 శాతం నుంచి 80 శాతం విజయవంతంగా చార్జ్ అయింది.
బెడ్ ఫోర్డ్‌లో ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ స్పోర్ట్స్ కారుతో ఈ బ్యాటరీని పరీక్షించారు.
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) త్వరగా చార్జ్ అయ్యేలా జరుగుతున్న ప్రయత్నాలలో ఇదొక కీలక ముందడుగు అని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న టెస్లా సూపర్‌చార్జర్‌తో కారు బ్యాటరీని 80 శాతం చార్జి చేయాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది.


ఫొటో సోర్స్, Nyobolt
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి చార్జింగ్ సదుపాయాలను మెరుగుపరచడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ‘రేంజ్ యాంగ్జైటీ’ (గమ్యం చేరేవరకూ బ్యాటరీ చార్జింగ్ ఉంటుందో ఉండదో అనే ఆందోళన) కూడా తొలగించుకోవాలంటున్నారు.
‘‘మరింత వేగంగా చార్జింగ్ చేసే సాంకేతికను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. ఒక కారుకు తిరిగి ఇంధనం నింపడానికి ఎంత సమయం పడుతుందనే విషయం చాలా ముఖ్యమైనది’’ అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సస్టెయినబుల్ ఎనర్జీ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పాల్ షీరింగ్ చెప్పారు.
అన్నిరకాల చార్జర్లు ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
‘‘ప్రజలు తాము ఏ కారును ఉపయోగిస్తున్నామనే దానితో సంబంధం లేకుండా వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆ పని త్వరగా అయిపోవాలనుకుంటున్నారు’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
6 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్
న్యోబోల్ట్ తయారు చేసిన బ్యాటరీని అమర్చిన స్పోర్ట్స్ కారును రెండు రోజులపాటు పరీక్షించారు. అది నాలుగు నిమిషాల బ్యాటరీ చార్జింగ్‌తో 193 కిలోమీటర్లు ప్రయాణించింది.
అయితే, సాధారణంగా టెస్లా కారు 80 శాతం చార్జ్ చేస్తే దాదాపు 320 కిలోమీటర్లు (200 మైళ్ళు) ప్రయాణిస్తుంది.
తాజా పరీక్షల ఫలితాలతో సంతృప్తిగా ఉన్నామని, కానీ బ్యాటరీ పరీక్ష ఆందోళన కలిగించిందని న్యోబోల్ట్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శివారెడ్డి బీబీసీకి చెప్పారు.
ఈ బ్యాటరీ సామర్థ్య ప్రత్యక్ష ప్రదర్శన తొలిసారిగా కొంతమంది పరిశ్రమ వృత్తినిపుణులు, ఆహ్వానితుల నడుమ, దారిలో కొన్ని సవాళ్ళతో సాగింది.
యూకేలోని వడగాడ్పులు, కార్ కూలింగ్ వ్యవస్థ వైఫల్యం, న్యోబోల్ట్ తయారు చేయని ఆన్ సైట్ చార్జర్ తదితర సవాళ్ళను న్యోబోల్ట్ కంపెనీ ఈ పరీక్షలో ఎదుర్కొంది.
అయితే ఈ సవాళ్ళు లాబోరేటరీలో ఫలితాలను మరోసారి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేశాయని బ్యాటరీ 6 నిమిషాల్లోనే 0 శాతం నుంచి 100 శాతం చార్జ్ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది.
4 వేల సైకిల్స్ తరువాత..
దీనిని ‘‘విద్యుదీకరణలో ఓ పెద్ద మైలురాయి’’ అని శివారెడ్డి అభివర్ణించారు. అలాగే తన సొంత కారును ముందురోజు చార్జింగ్‌లో పెట్టానని, ఇప్పటికీ చార్జ్ అవుతూనే ఉందని ఆయన చమతర్కించారు.
సొంత వాహనాలను తయారు చేయాలనే ఆలోచన లేదని, ఇప్పటికే ఉన్న కార్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకోవాలనే ప్రణాళికతో ఉన్నామని, ఏడాదిలోగా ఈవీలలోని బ్యాటరీలను చిన్నస్థాయిలో తయారు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు న్యోబోల్ట్ తెలిపింది.
బ్యాటరీకి అవసరమైన 350 కిలోవాటర్ల డీసీ సూపర్‌ఫాస్ట్ చార్జర్స్ యూకేలో బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి కానీ, ఇంకా అంతటా వ్యాపించలేదు.
బ్యాటరీ క్షీణతను కూడా తగ్గించినట్టు ఆ సంస్థ పేర్కొంది.
4 వేల సైకిల్స్ తరువాత కూడా బ్యాటరీ ఇంకా 80 శాతం చార్జ్ అవుతుందని తెలిపింది.
ఒక పూర్తి సైకిల్ అంటే 0 నుంచి 100 శాతం చార్జ్ చేయడం. కానీ ఇది ఒకేసారి 100 శాతం అవ్వాల్సిన అవసరం లేదు. 50 శాతం చొప్పున రెండుసార్లు చేసే చార్జింగ్‌ను ఒక సైకిల్‌గా లెక్కిస్తారు.
వెయ్యి సైకిల్స్ తరువాత ఐఫోన్15 బ్యాటరీ 80 శాతం పనిచేస్తుందని యాపిల్ కంపెనీ తెలిపింది.

ఫొటో సోర్స్, Nyobolt
ప్రపంచవ్యాప్త పోటీ..
తేలికైన, మన్నికైన త్వరగా చార్జ్ అయ్యే బ్యాటరీల అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ ఉంది.
కిందటేడాది 10 నిమిషాలు చార్జ్ చేస్తే 1,200 కిలోమీటర్లు ప్రయాణించగలిగే బ్యాటరీని అభివృద్ధి చేయడానికి సాంకేతిక పురోగతి దోహదపడిందని టయోటా తెలిపింది.
అమెరికా స్టార్టప్ గ్రావిటీ 13 నిమిషాల చార్జింగ్‌తో ఓ ఎలక్ట్రిక్ వాహనం 200 మైళ్ళు ప్రయాణించేలా కాంపాక్ట్ చార్జర్‌ను అభివృద్ధి చేసింది.
అయితే త్వరగా చార్జ్ అయ్యే బ్యాటరీలు దూరప్రాంత ప్రయాణాలకు ఉపయోగపడతాయని, కానీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అసలైన అవరోధం దానికి మద్దతుగా నిలిచే మౌలిక సదుపాయాలలోనే ఉందని స్ట్రత్‌క్లైడ్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎడ్వర్డ్ బ్రైట్ మాన్ తెలిపారు.
‘‘ఎలక్ట్రిక్ కార్లు ఇకపై ఎంత మాత్రమే బ్యాటరీలకు పరిమితం కావు’’ అని చెప్పారు.
‘‘వెంటనే గ్రిడ్‌ను అప్‌గ్రేడ్ చేసి, బ్యాటరీలకు శక్తిని అందించే వేగవంతమైన చార్జర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- యజమాని నుంచి తప్పిపోయి అయిదేళ్లుగా అడవి జింకలతో తిరుగుతున్న గాడిద
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- కల్కి 2898 ఏడీ రివ్యూ: అరాచకానికి, ఆశావాదానికి మధ్య యుద్ధం.. ప్రభాస్, అమితాబ్ నటన ఎలా ఉందంటే
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














