పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక చిన్న సెల్‌లో తమను తాము బంధించుకుంటున్నారు, ఎందుకు?

ఫొటో సోర్స్, Korea Youth Foundation
- రచయిత, హ్యోజుంగ్ కిమ్
- హోదా, బీబీసీ కొరియన్
ఈ ‘హ్యాపీనెస్ ఫ్యాక్టరీ’లో చిన్న చిన్న గదులున్నాయి. ఒక్కో గదిలో ఒక్కో వ్యక్తి ఒంటరిగా ఉంటున్నారు. వారికి భోజనం అందించేందుకు గది (సెల్) తలుపుకి చిన్న రంధ్రం మాత్రమే ఉంది. అంతకు మించి వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధమూ ఉండదు.
ఈ సెల్ లోపలికి ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటికి అనుమతి లేదు. స్టోర్ రూంలోని అల్మారా అంత ఉండే ఈ గదుల్లో ఉండే వారి చుట్టూ.. కేవలం గోడలు మాత్రమే ఉంటాయి.
అందులో ఉండేవారు నీలం రంగు యూనిఫాం ధరిస్తారు, కానీ వారు జైలు ఖైదీలు కాదు.
స్వీయ నిర్బంధం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం వారు దక్షిణ కొరియాలోని ఈ కేంద్రానికి వచ్చారు.
ఈ కేంద్రానికి వచ్చిన వారిలో ఎక్కువగా మనుషులకు దూరంగా, ఒంటరి జీవితం గడుపుతున్న పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ప్రపంచానికి దూరంగా బతకడం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వారు వచ్చారు.
స్వీయ నిర్బంధ గది
ఇక్కడున్న తల్లిదండ్రుల పిల్లల మాదిరిగా ఒంటరి జీవితం గడుపుతున్న వారిని 'హికికొమొరి'గా పిలుస్తారు. 1990లలో జపాన్‌లో సమాజానికి దూరంగా, ఒంటరిగా జీవించాలనుకుంటున్న కౌమార దశలో ఉన్నవారిని, యువతను సూచించేందుకు ఈ పదాన్ని ఉపయోగించారు.
దక్షిణ కొరియా ఆరోగ్య, సంక్షేమ శాఖ 19 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్యనున్న 15,000 మందిపై గత ఏడాది జరిపిన సర్వేలో 5 శాతానికి పైగా మంది తమకు తాము సమాజానికి దూరంగా ఉంటున్నామనే భావనలో ఉన్నట్లు తేలింది.
ఈ గణాంకాల ప్రకారం చూస్తే, దక్షిణ కొరియా మొత్తం జనాభాలో దాదాపు 5,40,000 మంది ఇదే పరిస్థితిలో ఉన్నట్లు అర్థం.
ప్రభుత్వేతర సంస్థలైన కొరియా యూత్ ఫౌండేషన్, బ్లూ వేల్ రికవరీ సెంటర్ నిధులు సమకూర్చి మరీ నిర్వహిస్తున్న '13 వారాల పేరెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్'కు గత ఏప్రిల్ నుంచి తల్లిదండ్రులు హాజరవుతున్నారు.
వారు తమ పిల్లలతో మరింత మెరుగ్గా ఎలా మెలగాలో నేర్పించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.
గాంగ్వాన్ ప్రావిన్స్‌లోని హాంగ్‌చియోన్-గన్‌లో ఏర్పాటు చేసిన ఈ ‘హ్యాపీనెస్ ఫ్యాక్టరీ’లో నిర్వహించే ఈ మూడు రోజుల ప్రోగ్రామ్‌లో భాగంగా తల్లిదండ్రులు నిర్బంధ గదిలో ఒంటరిగా గడుపుతారు.
ఈ ఒంటరితనం పిల్లలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనేది వారి ఆశ.


ఫొటో సోర్స్, Getty Images
'ఎమోషనల్ జైలు'
జిన్ యంగ్ - హే కుమారుడు దాదాపు మూడేళ్లుగా తన బెడ్రూమ్‌లో ఒంటరిగా గడుపుతున్నారు.
అయితే, ఇప్పుడు జిన్ (ఇది ఆమె అసలు పేరు కాదు) స్వీయ నిర్బంధం గడిపినందున, తన 24 ఏళ్ల కుమారుడి 'ఎమోషనల్ జైలు'ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతారు.
''నేనేం తప్పు చేశానా అని ఆలోచిస్తున్నా.. నిజంగా అలా ఆలోచించాల్సి రావడం బాధాకరం'' అని 50 ఏళ్ల జిన్ అన్నారు.
''కానీ, అలాంటి పరిస్థితినే నేను అనుభవించినప్పుడు, నాకు కొంత స్పష్టత వచ్చింది'' అన్నారామె.
మాట్లాడేందుకు విముఖత
తన కుమారుడు చాలా తెలివైనవాడని జిన్ చెప్పారు. తనకు, తన భర్తకు కొడుకుపై చాలా అంచనాలు ఉన్నాయి.
కానీ, అతను తరచూ అనారోగ్యం బారిన పడేవాడు. స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు చాలా ప్రయత్నించాడు. చివరికి, ఈటింగ్ డిజార్డర్(ఎంతపడితే అంత తినడం)కు గురయ్యాడు. స్కూల్‌కి వెళ్లడం కూడా కష్టంగా మారింది.
యూనివర్సిటీకి వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత కొద్దికాలం బాగానే అనిపించింది. కానీ, ఉన్నట్టుండి అందరికీ దూరంగా ఉండడం మొదలుపెట్టాడు.
ఒక్కడే గదిలో ఒంటరిగా ఉండడం, శుభ్రంగా లేకపోవడం, భోజనం కూడా సరిగ్గా చేయకపోవడం వంటివి చూసి ఆమె గుండె పగిలిపోయింది.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో పెద్దగా కలవకపోవడం, టాప్ యూనివర్సిటీలో సీటు రాలేదన్న నిరాశకు గురవడం వంటి ఆందోళనలు ఉన్నప్పటికీ, అసలు ఏం జరిగిందో తల్లితో చెప్పేందుకు కూడా ఆమె కొడుకు ఇష్టపడేవాడు కాదు.
హ్యాపీనెస్ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత, ఒంటరిగా ఉంటున్న ఇతర యువకులు రాసిన నోట్స్‌ను జిన్ చదివారు.
''ఆ నోట్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఎవరూ తనను అర్థం చేసుకోలేదు కాబట్టి, తనకి తాను ఒంటరిగా ఉంటున్నాడు'' అని ఆమె చెప్పారు.
పార్క్ హ్యాన్-సిల్ (ఆమె అసలు పేరు కాదు) ఏడేళ్ల నుంచి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా బతుకుతున్న తన 26 ఏళ్ల కొడుకు కోసం ఇక్కడకు వచ్చారు.
అతను కొన్నిసార్లు ఇంటి నుంచి పారిపోయాడు కూడా, ప్రస్తుతం అప్పుడప్పుడూ తన గది నుంచి బయటికి వస్తుంటాడు.
పార్క్ తన కొడుకుని కౌన్సిలర్, డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారు. కానీ, వారు సూచించిన మందులు వాడడానికి ఆమె కొడుకు నిరాకరించాడు. వీడియో గేమ్‌లు ఆడుకుంటూ ఉంటాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతరులతో సంబంధాలు
తన కుమారుడిని అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతున్న పార్క్.. ఒంటరిగా గడపడం అనే ఈ కార్యక్రమం ద్వారా తన కుమారుడి ఆలోచనలను మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారు.
''తను ఇలాగే ఉండాలని అతన్ని ఒత్తిడి చేయకుండా, తను ఎలా ఉంటే అలా అంగీకరించడం చాలా ముఖ్యం అని నేను గ్రహించా'' అని ఆమె చెప్పారు.
యువకులు ఒంటరిగా ఉండేందుకు మొగ్గుచూపడానికి అనేక కారణాలు ఉన్నాయని దక్షిణ కొరియా ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం, 19 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వారిలో ఎక్కువగా కనిపించిన ఒకేరకమైన కారణాలు ఇవి..
- ఉద్యోగం వెతుక్కోవడంలో ఇబ్బందులు - 24 శాతం
- ఇతరులతో సంబంధాల్లో ఇబ్బందులు - 23.5 శాతం
- కుటుంబ సమస్యలు - 12.4 శాతం
- ఆరోగ్య సమస్యలు - 12.4 శాతం
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, దక్షిణ కొరియాలో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం గత ఏడాది పంచవర్ష ప్రణాళికను ఆవిష్కరించింది.
20 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులు, ప్రతి ఒక్కరికీ రెండేళ్లకోసారి ప్రభుత్వ ఖర్చుతో మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రులు ప్రకటించారు.
1990వ దశకంలో, జపాన్‌లో యువత తమకు తాము ఒంటరిగా ఉండడం, పెద్దవయసు వారైన వారి తల్లిదండ్రులపై మధ్యవయస్కులు ఆధారపడడానికి దారితీసింది.
పెరిగి పెద్దయిన పిల్లలను కూడా కేవలం వారికొచ్చే పెన్షన్‌తో ఆదుకోవాల్సి రావడం వల్ల కొందరు వృద్ధులు పేదరికంలో, నిరాశలో కూరుకుపోయారు.
భారీ జీవిత లక్ష్యాలను తాము అనుకున్న నిర్దేశిత సమయంలోపు చేరుకోవాలనే కొరియన్ సమాజపు ఆలోచనా విధానం యువతలో ఆందోళనలను పెంచుతోందని, మరీముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు స్తబ్దుగా ఉన్నప్పుడు, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఆందోళనలు ఎక్కువని క్యుంగ్ హీ యూనివర్సిటీ సోషియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జియోంగ్ గో - వూన్ అన్నారు.
పిల్లలు విజయం సాధించడమే తల్లిదండ్రుల విజయమనే భావన.. మొత్తం కుటుంబం ఒంటరితనమనే ఊబిలో కూరుకుపోవడానికి కారణమవుతోంది.
అలాగే, తమ పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలు తమ వైఫల్యమేనని తల్లిదండ్రులు గ్రహిస్తారు. ఇది అపరాధ భావానికి దారితీస్తుంది.
''కొరియాలో తల్లిదండ్రులు తమ ప్రేమను మాటల్లో కంటే, తమ చర్యల ద్వారా ఎక్కువగా వ్యక్తపరుస్తుంటారు'' అని ప్రొఫెసర్ జియోంగ్ చెప్పారు.
''తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లల ట్యూషన్ ఫీజులు కట్టడమనేది వారి బాధ్యతను నొక్కిచెప్పే కన్ఫ్యూషియన్ సంస్కృతి(విలువలు, నైతికత గురించి చైనీస్ విశ్వసించే పురాతన సంస్కృతి)కి ఒక ఉదాహరణ'' అన్నారు.
కష్టపడి పనిచేయడానికి ఉన్న ఈ సాంస్కృతిక ప్రాధాన్యత 21వ శతాబ్దపు రెండో అర్థభాగంలో ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిన దక్షిణ కొరియా వేగవంతమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది.
అయితే, ప్రపంచ అసమానతల డేటాబేస్ ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో దేశంలో అసమానతలు మరింత దిగజారాయి.

ఫొటో సోర్స్, Korea Youth Foundation
తమ పిల్లలు స్వీయ నిర్బంధంలో ఉండడాన్ని కుటుంబ సమస్యగా భావించి తల్లిదండ్రులు కూడా తమ చుట్టూ ఉన్న సంబంధాలను తెంచుకుంటారని బ్లూ వేల్ రికవరీ సెంటర్ డైరెక్టర్ కిమ్ ఓక్- రాన్ అన్నారు.
తమను ఎక్కడ జడ్జి చేస్తారోననే భయంతో తమ పరిస్థితి గురించి, తమ కుటుంబ సన్నిహితులతో మాట్లాడేందుకు కూడా భయపడతారని ఆయన చెప్పారు.
''వారు సమస్యను బయటికి రానీయరు. ఇది తల్లిదండ్రులు కూడా ఒంటరి జీవితం గడపడానికి దారితీస్తుంది. సెలవుల్లోనూ తమ కుటుంబానికి సన్నిహితులైన వారిని కలవడం కూడా మానేస్తారు'' అని కిమ్ చెప్పారు.
ఎదురుచూపులు..
తమ పిల్లలు ఎప్పుడు సాధారణ జీవితానికి తిరిగివస్తారా అని సాయం కోసం హ్యాపీనెస్ ఫ్యాక్టరీకి వచ్చిన తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
మీ అబ్బాయి ఒంటరి జీవితం నుంచి బయటికి వస్తే అతనికి ఏం చెబుతారు అని అడిగినప్పుడు, జిన్ కళ్లు నీళ్లతో నిండిపోయాయి.
''నువ్వు చాలా బాధలు పడ్డావు'' అంటూ ఆమె గొంతు వణుకుతోంది.
''ఇది చాలా కష్టం కదా?
నీ కోసం ఎదురుచూస్తుంటా.''
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














