నరేంద్ర మోదీ: భారత ప్రధాని రష్యా పర్యటన ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపనుందా

పుతిన్ - మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, లండన్

హంగరీ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ రష్యాలో పర్యటించారు. ఆయన శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ పరిణామాలపై యూరోపియన్ సీనియర్ నేతల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.

రష్యా నుంచి తమను తాము కాపాడుకునేందుకు యుక్రెయిన్‌కు సైనిక సాయంతో పాటు ఇతర సాయం అందించడంలో యూరోపియన్ దేశాలు తలమునకలై ఉన్న సమయంలో, ఏ కారణంతోనైనా, యూరప్ దేశాలకు చెందిన ఏ నాయకుడైనా మాస్కోలో పర్యటించడం యూరప్ ప్రయోజనాలకు ద్రోహంగానే అవి పరిగణిస్తాయి.

హంగరీని యూరప్‌‌లో తరచూ అవకాశవాదిగానే భావిస్తారు. ఓర్బన్‌ను కూడా చాలా మంది నిరంకుశుడిగా చూస్తారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య జులై 8, 9 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనను పశ్చిమ దేశాలు ఎలా చూస్తున్నాయి?

మోదీ పర్యటనపై పశ్చిమ దేశాధినేతలు ఇప్పటి వరకూ బహిరంగంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అయితే, భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్షెటి గురువారం మాట్లాడుతూ.. రష్యా విషయంలో కలిసి పని చేయడంపై భారత్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

యుక్రెయిన్‌పై యుద్ధంతో యూరప్‌లో గందరగోళానికి కారణమని చాలామంది నమ్ముతున్న నాయకుడిని, మోదీ ఆలింగనం చేసుకున్న చిత్రాలను చూసి యూరప్, ఇంకా అమెరికా ఎంతమాత్రం సంతోషించవు.

బీబీసీ న్యూస్ తెలుగు
పుతిన్ - మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఇది ద్వైపాక్షిక భేటీయేనా?

అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు భారత్ - రష్యాల 22వ వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని మాస్కో పర్యటనకు వెళ్తున్నారనేది అధికారిక సందేశం. గత మూడేళ్లలో రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలూ జరగలేదు.

2021లో చివరిసారి అలాంటి సమావేశం జరిగింది.

రెండు దేశాల నాయకుల సమావేశంలో చర్చించనున్న అజెండాపై బుధవారం రష్యా ప్రకటన చేసింది.

‘‘రష్యా - భారత్ సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ అజెండాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు’’ అని క్రెమ్లిన్ పేర్కొంది. పర్యటనపై భారత్ వైపు నుంచి పెద్దగా సమాచారం వెల్లడించకపోయినప్పటికీ, కొన్ని కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ పర్యటనను పశ్చిమ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో బయటికి కనిపించని అజెండా ఏదైనా ఉందా?

లండన్‌లోని కింగ్స్ కాలేజీలో సౌత్ ఏషియన్ స్టడీస్‌ నిపుణులు క్రిస్టోఫీ జాఫ్రెలాట్ స్పందిస్తూ.. మోదీ పర్యటనను ప్రపంచ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

''రష్యాతో సంబంధాల బలోపేతంపై భారత్‌ దృష్టి ఉంటుంది. అది కేవలం సైనిక పరికరాల విషయంలో ఆధారపడడం వల్ల మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో భిన్నధ్రువాలను (మల్టీపోలార్ వరల్డ్) ప్రోత్సహించేందుకు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తన ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా తమతో కలిసి వచ్చే అన్నిరకాల భాగస్వాములను కలుపుకొనిపోతుంది'' అని ఆయన చెప్పారు.

పుతిన్ - జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పర్యటన చైనాతో రష్యా సాన్నిహిత్యం కోణంలోనూ చూడాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జాఫ్రెలాట్ అభిప్రాయపడ్డారు. ''రష్యాతో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలను కాపాడుకోవడం రష్యా - చైనా సంబంధాలపై ప్రభావం చూపించవచ్చు'' అన్నారు.

మోదీ 2019లో ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరయ్యేందుకు రష్యా నగరం వ్లాడివోస్టాక్ వెళ్లారు. 2022లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో పుతిన్, మోదీ కలిశారు. 2021లో పుతిన్ భారత్‌లో పర్యటించారు.

రష్యాను ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని చేసేందుకు అమెరికా, యూరప్‌లోని దాని మిత్రదేశాలు ప్రయత్నిస్తున్న ఇలాంటి తరుణంలో మోదీ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

తమ విదేశాంగ విధానం 'వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, జాతీయ ప్రయోజనాల'పై ఆధారపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.

అయితే, ఇది పశ్చిమ దేశాల్లో రష్యా వ్యతిరేక భావనలు వ్యాప్తి చెందుతున్న సమయంలో, భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయిన అమెరికాకు చికాకు తెప్పిస్తుందా?

అమెరికా, బాల్టిమోర్‌లోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో అప్లయ్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్, అమెరికా మాజీ అధ్యక్షుడు రీగన్‌ హయాంలో కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్‌లో ఒకరైన స్టీవ్ హెచ్ హాంకే మాట్లాడుతూ రష్యాతో భారత్ సంబంధాలు చారిత్రకమైనవని అభిప్రాయపడ్డారు.

''ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన ప్రకారం.. భారత్ అన్ని దేశాలతో, మరీముఖ్యంగా సోవియట్ యూనియన్ నాటి నుంచి తమతో మంచి సంబంధాలున్న రష్యాతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది'' అన్నారు.

మోదీ - పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ - రష్యా చారిత్రక సంబంధాలు

భారత్‌లో 1960ల నుంచి 1980లలో పుట్టిన వారికి సోవియట్ యూనియన్‌తో సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

భారత్‌లో భారీ ఉక్కు ఫ్యాక్టరీలను రష్యన్లే స్థాపించారు. అంతరిక్ష ప్రయోగాల్లో సాయమందించారు. అనేక సంక్షోభ సమయాల్లో సోవియట్ యూనియన్ భారత్‌కు అండగా నిలిచింది.

1965లో భారత్, పాకిస్తాన్ మధ్య తాష్కెంట్‌లో జరిగిన చారిత్రక మైత్రీ ఒప్పందానికి సోవియట్ మధ్యవర్తిత్వం వహించింది.

2000లో పుతిన్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత అదే ఏడాది రెండు దేశాలు 'వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం'పై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా రక్షణ, అంతరిక్ష, ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇంధన రంగంలో సహకారం వంటివి ఆధునిక సంబంధాలకు ఉదాహరణ.

ఇన్ని సంక్లిష్టతల నడుమ, ప్రపంచ రాజకీయాలు వేగంగా మారిపోతున్న వేళ తమ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే సామర్థ్యం భారత్, రష్యాకు ఉంది.

రైట్ వింగ్ ఐడియాలజిస్ట్ డాక్టర్ సువ్రోకమల్ దత్తా మాట్లాడుతూ, భారత్ - రష్యా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని అన్నారు.

''ప్రధాని మోదీ పర్యటన ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి, కొత్త కలయికలకు నాంది పలకనుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

పుతిన్ - మోదీ - జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ తటస్థ వైఖరి నిరాశ కలిగిస్తోందా?

యుక్రెయిన్‌పై 'చట్టవిరుద్ధం'గా సాగిస్తున్న యుద్ధాన్ని బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఖండించలేదంటూ పశ్చిమ దేశాల్లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

భారత్ తటస్థ వైఖరి చాలావరకు రష్యా వైపు మొగ్గుచూపడంతో సమానంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

అదేసమయంలో రష్యా విషయానికి వచ్చేసరికి పాశ్చాత్య మీడియా తన తటస్థతను కోల్పోతుందని భారతీయుల్లో ఎక్కువ మంది భావిస్తున్నారు.

''యుక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని భారత్ ఖండించాలన్న పశ్చిమ దేశాల కోరిక ఎట్టిపరిస్థితుల్లోనూ నిజం కాదు. భారత్‌కు జాతీయ ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యం'' అని డాక్టర్ దత్తా చెప్పారు.

ఏదేమైనా, భారత్ - రష్యా సంబంధాలు బలోపేతం కావడం, యుక్రెయిన్ దాడిని ఖండించేందుకు భారత్ సుముఖంగా లేకపోవడం వంటివి పశ్చిమ దేశాలకు మింగుడుపడడం లేదు.

దౌత్యపరంగా, ఆర్థికంగా రష్యాను ఏకాకిని చేసే తమ ప్రయత్నాలను క్లిష్టతరం చేసేలా భారత్ వైఖరి ఉందని అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు భావిస్తున్నాయి.

రష్యాతో వాణిజ్యం, రక్షణ సహకారం వంటి భారత్ కొనసాగిస్తున్న నిరంతర సంబంధాలు, యుక్రెయిన్‌‌పై దాడిని విరమించుకునేలా రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను బలహీనపరుస్తాయని ఆందోళన చెందుతున్నారు. రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్, అమెరికా నేతృత్వంలో రష్యా ఇంధన ఎగుమతులపై విధించిన ఆంక్షలను గౌరవించాలని వారు కోరుకుంటున్నారు.

ఇది సంక్లిష్లమైన సమస్య అని భారత్‌కు తెలుసు. చర్చలు, దౌత్యపరమైన సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ, వ్యూహాత్మక ప్రయోజనాలు - ఇంధన భద్రతా అవసరాల మధ్య సమతుల్యతను సాధించేందుకు భారత్ తన నైపుణ్యాలకు పదునుపెడుతోంది.

రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు నిల్వలపై సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ఈ ఏడాది ప్రారంభంలో తన నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం, 2022లో రష్యా యుక్రెయిన్‌పై దాడి అనంతరం చమురు దిగుమతులు 13 రెట్లు పెరిగాయి.

ఫలితంగా, భారత్ - రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023 - 24లో ఒక్కసారిగా 6,400 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇందులో భారత్ నుంచి ఎగుమతులు కేవలం 400 కోట్ల డాలర్లు.

యుక్రెయిన్‌పై దాడికి ముందు కంటే, ఇప్పుడు రష్యా మరింత సంపన్న దేశంగా ఉందని పాశ్చాత్య మీడియా విస్తృతంగా రిపోర్ట్ చేసింది. రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, భారత్‌‌కు ధన్యవాదాలు అంటూ విమర్శించింది.

జోబైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఆంక్షలు పని చేశాయా?

అయితే, యుక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చుకోకుండా రష్యాను నిలువరించేందుకు ఉద్దేశించిన పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఏమాత్రం పనిచేయలేదని ఎవరైనా స్పష్టంగా చెప్పగలరా?

ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా నుంచి పశ్చిమ దేశాలు భారత్‌ కంటే ఎక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయని రెండేళ్ల కిందట వాషింగ్టన్‌లో జర్నలిస్టులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానమిచ్చారు.

ఆయన మాట్లాడుతూ, ''రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను పరిశీలిస్తే, మీ ఫోకస్ యూరప్‌పై పెట్టాలని నేను సూచిస్తా. మాకు అవసరమైన ఇంధన నిల్వల కోసం మేం కొద్దిమొత్తంలో కొనుగులు చేస్తాం. కానీ, గణాంకాలను చూస్తే.. బహుశా నెలలో మా మొత్తం కొనుగోళ్లు యూరప్ ఒక్కరోజు మధ్యాహ్నం కొనుగోలు చేసే దానికంటే తక్కువే ఉండొచ్చని అనుకుంటున్నా. కాబట్టి, మీరు దాని గురించి ఆలోచించాలనుకుంటా'' అన్నారు.

ఆంక్షలు పనిచేయవని విశ్వసిస్తున్న విశ్లేషకుల సంఖ్య అమెరికాలో పెరుగుతోంది. వారిలో ప్రొఫెసర్ హాంకే కూడా ఉన్నారు.

''సైద్ధాంతికపరంగానూ, ఆచరణాత్మకంగానూ.. ఆంక్షలు, స్వేచ్ఛా వాణిజ్యంలో జోక్యాన్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకంటే, ఆంక్షలతో ఉద్దేశించిన లక్ష్యాలు ఎప్పటికీ నెరవేరవు. చమురు ఆంక్షల విషయంలో భారత్ అభిప్రాయమే, నా అభిప్రాయం'' అని ఆయన అన్నారు.

అయితే, ఈ విషయంలో ప్రొఫెసర్ జాఫ్రెలాట్ ఏకీభవించలేదు.

"నేను విభేదిస్తున్నా. పాశ్చాత్య దేశాలకు చెందిన చాలా మంది భిన్నమైన వాదనలు చేస్తుంటారు. ఆంక్షల ఉద్దేశం నెరవేరలేదు. ఎందుకంటే, వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు కాబట్టి. ముఖ్యంగా రష్యా విక్రయాలకు సాయం చేస్తున్న భారత్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల విషయంలో పూర్తిగా అమలుచేయలేదు. ఇలాంటి విధానాలు ఎలా వివాదాస్పదంగా మారుతుందో చూడాలి'' అని ఆయన అన్నారు.

అయితే, అమెరికాలో డోనల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయా?

ఫ్రెంచ్ నిపుణులు ఒకరు భారత్‌కు హెచ్చరిక చేస్తున్నారు, ''ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే అన్నీ మారిపోతాయి. అప్పుడు పుతిన్ అన్నింటికీ దూరమవుతారు. యుక్రెయిన్ భూభాగాలపై విజయాలు సహా. అప్పుడు భారత్‌కు లాభమా? హిమాలయాల ప్రాదేశిక నిర్ధరణ విషయంలో భారత్‌కు అనుకూలంగా లేని ఒక ముగింపునకు చైనా రావొచ్చు'' అని ఆయన అంటున్నారు.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్ నేతృత్వంలో రష్యా ఏకాకి అవుతోందా?

యుక్రెయిన్‌పై దాడి, 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యల కారణంగా పుతిన్ హయాంలో రష్యా అంతర్జాతీయంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు దూరమవుతోంది.

ఈ చర్యలు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర మిత్రదేశాల నుంచి ఆంక్షలకు, దౌత్య సంబంధాలు దెబ్బతినేందుకు దారితీశాయి. అయినప్పటికీ, చైనా, భారత్, మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికాలోని వివిధ దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది. ఇవి పాశ్చాత్య దేశాల నుంచి ఎదురైన వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించేందుకు సాయపడతాయి.

మోదీ, ఇతర నాయకులు రష్యా పర్యటనకు వెళ్లడం రష్యా లేదా పుతిన్ ఒంటరి అయ్యారనేందుకు సంకేతం కాదని ప్రొఫెసర్ స్టీవ్ హాంకే అభిప్రాయపడ్డారు. ''మోదీ, పుతిన్ నేరుగా కలవడం ఒక గొప్ప ఆలోచన. నిజమైన దౌత్య సంబంధాలకు ఇది నిదర్శనం'' అన్నారు.

పుతిన్ ఎక్కువగా నిరంకుశ పాలనలకు దగ్గరగా ఉంటారని ప్రొఫెసర్ జాఫ్రెలాట్ అభిప్రాయపడ్డారు. ''ఆఫ్రికన్ నియంతలు, ఇరాన్, చైనా వంటి వాటితో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం రష్యా నిరంకుశ పాలనలకు దగ్గరగా ఉందని స్పష్టం చేస్తుంది'' అన్నారు.

యూరోపియన్ యూనియన్‌ దేశల్లో రష్యాకు దగ్గరగా ఉండే ఏకైక దేశం హంగరి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అంత ఉదారంగా లేవు. మరి భారత్ విషయానికొస్తే?

"ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించే విషయంలో ఇలాంటి సారూప్యతల కారణంగా భారత్ రష్యాతో సత్సంబంధాలను కొనసాగించవచ్చు. అలాగే, పశ్చిమ దేశాలకు, వాటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా గ్లోబల్ సౌత్ నాయకుడిగా కనిపించేందుకు దిల్లీ చేస్తున్న ప్రయత్నం కావొచ్చు కూడా" అని ఆయన అన్నారు.

భారత్, హంగరి, చైనా నేతలు రష్యాలో పర్యటిస్తూ ప్రపంచ రాజకీయ పరిణామాలను మార్చేసే, కొత్త వాణిజ్య సంబంధాలు, సహకారాన్ని పెంపొందించుకోవడంతో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు పుతిన్‌ను ఒంటరిని చేయడంలో విఫలమయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు.

అందువల్ల మోదీ మాస్కో వస్తున్నారంటే, అది పుతిన్ చెవులకు వినసొంపైన సంగీతమే అవుతుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)