స్నేహ్ రాణా: దక్షిణాఫ్రికాపై 10 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టులో ఈ బౌలర్ చేసిన అద్భుతం తెలుసా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, వర్షా సింగ్
- హోదా, బీబీసీ కోసం
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య చెన్నై వేదికగా జూన్ 28న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.
తొలి రోజు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఇందుకు బదులుగా దక్షిణాఫ్రికా 266 పరుగులు మాత్రమే చేసి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. దీంతో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటై, ఇండియా ముందు 37 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఆ లక్ష్యాన్ని భారత జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్ షెఫాలీ వర్మ 205 పరుగులు చేశారు. టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా షెఫాలీ నిలిచారు.
భారత బౌలర్ స్నేహ్ రాణా మొదటి ఇన్నింగ్స్‌లో 77 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసుకున్న బౌలర్లలో ఆమె మూడో బౌలర్‌గా నిలిచారు.


ఫొటో సోర్స్, GETTY IMAGES
కుగ్రామం నుంచి టీమిండియా దాకా..
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ సమీపంలోని ఓ గ్రామం నుంచి టీమిండియా వరకు చేరుకున్న స్నేహ్ ప్రయాణం అద్భుతం.
స్నేహ్ గురించి ఆమె కోచ్ నరేంద్ర సాహా గతంలో బీబీసీతో మాట్లాడారు.
‘‘ఉత్తరప్రదేశ్‌లో బనారస్‌లో ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. 11 ఏళ్ళ వయసు ఉన్న స్నేహ్ బ్యాట్‌తో బంతిని దంచికొడుతోంది. ఆ మ్యాచ్‌లో 20 ఏళ్ళ అమ్మాయిలు ఆడుతున్నా అందరి దృష్టి స్నేహ్ పైనే పడేలా ఆడి, సంచలనం సృష్టించింది’’ అని చెప్పారు.
డెహ్రాడూన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో సినోలా గ్రామంలో స్నేహ్ పుట్టారు.
ఆమె తన కెరీర్ ద్వారా తన కుటుంబానికే కాదు, గ్రామంలోని అనేక కుటుంబాలకు క్రికెట్ పట్ల మోజు పెరిగేలా చేశారు.
ఇప్పడా గ్రామంలో ప్రతి కుటుంబం తమ ఆడపిల్లల చేతుల్లో బ్యాట్లు పెట్టి ప్రోత్సహిస్తున్నారామె.

ఫొటో సోర్స్, ANI
మొదటిసారి స్నేహ్ క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పుడు ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు. కానీ ఓ వారం రోజుల తరువాత 9 ఏళ్ళ స్నేహ్‌ను క్రికెట్ ఆడేందుకు ఆమె తండ్రి అనుమతించారు.
స్నేహ్ తండ్రి 2021లో చనిపోయారు. ఇంటి వద్ద తల్లి మాత్రమే ఉండేవారు. పెద్దక్కకు పెళ్ళి అయిపోయింది. స్నేహ్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆమె అక్క తల్లిని చూసుకుంటారు.
‘‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం స్నేహ్‌కు అంత సులభం కాలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మేం ఆడపిల్లలపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ ఇరుగుపొరుగువారు, బంధువులు గుసగుసలాడుకునేవారు. కానీ ఇప్పుడు వారే అభినందనలు చెబుతున్నారు’’ అని స్నేహ్ తల్లి విమలా రాణా చెప్పారు.
‘‘స్నేహ్ చిన్నప్పుడు గ్రామంలో అబ్బాయిలు మాత్రమే క్రికెట్ ఆడేవారు. ఆడపిల్లలు క్రికెట్ ఆడటమనేది చూడలేదు. కానీ స్నేహ్ క్రికెట్ బాగా ఆడటాన్ని చూసి అబ్బాయిలు తమ జట్టులో చేర్చుకునేవారు. ఓసారి గ్రామంలో జరిగిన టోర్నమెంట్‌లో స్నేహ్ బాగా ఆడటంతో, ఆమెకు సరైన శిక్షణ ఇవ్వాలని క్రికెట్ కోచ్ కిరణ్ షా నిర్ణయించుకున్నారు’’ అని ఆమె తెలిపారు.
‘‘ఆ సమయంలో ఉత్తరాఖండ్‌కు సొంత క్రికెట్ అసోసియేషన్ లేదు. దీంతో మేం ఆమెను హరియాణాకు తీసుకువెళ్ళాం. కానీ ఆమెకు అండర్ 19లో అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. తరువాత మేం పంజాబ్ క్రికెట్ జట్టుతో మాట్లాడాం. అక్కడ ఆమె అండర్ 19 క్రికెట్ నైపుణ్యం ఆమెను పంజాబ్ జట్టుకు కెప్టెన్‌ను చేసింది. తరువాత స్నేహ్ రైల్వేస్, ఇండియా ఏ టీమ్‌కు ఆడుతూ అనేక మ్యాచ్‌లు గెలిచింది’’ అని స్నేహ్ ప్రస్తుత కోచ్ నరేంద్ర బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘స్నేహ్ నరనరాల్లో క్రికెట్’
స్నేహ్ నరనరాల్లో క్రికెట్ నిండిపోయిందంటారు నరేంద్ర.
‘‘ఆమెకు 12 ఏళ్ళ వయసున్నప్పుడు, ఓ మ్యాచ్‌లో 18, 19 సంవత్సరాల పిల్లాడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతి శరీరానికి తగలడంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి కానీ, ఆమె ఏడవలేదు’’ అని చెప్పారు.
శ్రీలంకలో 2016లో జరిగిన ఓ మ్యాచ్‌లో మోకాలుకు గాయమైంది. దీంతో స్నేహ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ఐదేళ్ళపాటు దూరమైంది. అప్పటికి ఆమె అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి కేవలం రెండేళ్ళే.
అది ఆమెకు ఎంతో కఠినమైన సమయం. చికిత్స తీసుకున్నాకా ఆమె దేశవాళీ క్రికెట్ ఆడింది. ఒకరోజు స్నేహ్ టీమిండియాకు ఎంపిక అయినట్టు ఫోన్ కాల్ వచ్చింది. ఆమె తన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్‌పై ఆడింది.
ఇంగ్లండ్‌పై స్నేహ్ అద్భుత ప్రదర్శన చూశాక, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆమెను ‘భారత దేశ కొత్త కథనాయిక’ అని కీర్తించింది.
ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అంచులోకి జారి ఫాలో ఆన్ ఆడింది. ఆ మ్యాచ్‌లో స్నేహ్ 154 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
బ్యాటింగ్‌లో 8వ స్థానంలో వచ్చి 50కిపైగా పరుగులు చేసిన ఘనతను 1998 తరువాత స్నేహ్ రిపీట్ చేశారు.
‘‘గతంలో కేవలం అబ్బాయిల మ్యాచ్‌లు మాత్రమే చూసేవారు. ఇప్పుడు అమ్మాయిల మ్యాచ్’లు కూడా చూస్తున్నారు. క్రికెట్ ఇక ఎంతమాత్రం అబ్బాయిల ప్రపంచం కాదు. ఇప్పుడు కేవలం బ్యాట్స్‌మెన్లే కాదు, బ్యాట్స్ ఉమెన్లు కూడా ఉన్నారు. వారు స్వేచ్ఛగా ఆడుతున్నారు. స్నేహ్ ఇంటి వద్ద ఉన్నప్పుడు ప్రజలు తమ ఆడపిల్లలను తీసుకువచ్చి కలుస్తుంటారు. ఎలా ఆడాలో అడుగుతూ ఉంటారు’’ అని స్నేహ్ రాణా అక్క రుచి రాణా నేగి చెప్పారు.
స్నేహ్‌లా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని డెహ్రాడున్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేసే అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారని రుచి చెప్పారు.
‘‘స్నేహ్ తాను ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చేటప్పుడు సరైన సౌకర్యాలు లేవని, కానీ ఇప్పుడు ఇదో మంచి గ్రౌండ్ అయిందని, మీరు బాగా కష్టపడి విజయం సాధించాలని చెబుతూ ఉంటారు’’ ఉత్తరాఖండ్‌లోని చమోలీ నుంచి క్రికెట్ నేర్చుకోవడానికి డెహ్రాడున్ వచ్చిన మన్సీ నేగీ చెప్పింది.
గ్రామంలో పిల్లలతో క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన స్నేహ్ ఇప్పుడు టీమ్ ఇండియాలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆమె ఇప్పుడు వేలాదిమంది ఆడపిల్లలకు ఓ ప్రేరణ.
ఇవి కూడా చదవండి:
- నేటి నుంచి మూడు కొత్త చట్టాలు అమల్లోకి.. పెళ్లి చేసుకుంటానని లైంగిక దోపిడీకి పాల్పడితే పదేళ్ల జైలు
- భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ ప్రజలు ఏమంటున్నారు?
- ఈ పామును చంపితే రూ. 35 వేలు బహుమతి ఇస్తామని ఆ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రకటించారు?
- పోస్ట్‌లో కప్పలు, ఖడ్గమృగాల కొమ్ములు: మారుతున్న స్మగ్లర్ల వ్యూహాలు, వన్యప్రాణుల అక్రమ రవాణాకు ఎలా ఆజ్యం పోస్తున్నాయి?
- ఆన్లైన్ యాప్‌లలో లోన్స్ తీసుకుంటున్నారా, మీరు మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














