రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా స్థానాలను భర్తీ చేసేది ఎవరు?

రోహిత్, విరాట్, రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సంజయ్ కిశోర్
    • హోదా, సీనియర్ క్రీడా జర్నలిస్ట్, బీబీసీ కోసం

టీమిండియా 17 ఏళ్ల తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది.

ఇది జరిగిన కొన్ని గంటల్లోనే టీమిండియా ముఖచిత్రం మారిపోయింది.

జట్టులోని సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఈ దిగ్గజాలను భర్తీ చేసేది ఎవరు?

టీ20ల్లో ఈ ముగ్గురు దిగ్గజాల స్థానాలను భర్తీ చేయడం బీసీసీఐకి అంత సులభం కాదు.

2007 నుంచి అంటే 17 ఏళ్లుగా రోహిత్ శర్మ భారత టీ20 జట్టులో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 14 ఏళ్ల పాటు, జడేజా 15 ఏళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

వీరి తరువాత శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు టాప్ ఆర్డర్ కోసం పోటీపడొచ్చు.

కెప్టెన్లుగా గిల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్‌ల మధ్య పోటీ నెలకొంటుంది.

శనివారం అర్ధరాత్రి భారత్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ రెండు రోజుల్లో భారత క్రికెట్‌లో చాలా పరిణామాలు సంభవించాయి.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, ANI

మొదట కోహ్లీ, తర్వాత రోహిత్, జడేజా రిటైర్మెంట్

భారత్ విశ్వవిజేతగా నిలిచిన వెంటనే 35 ఏళ్ల విరాట్ కోహ్లి టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.

‘‘భారత్ తరఫున ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్, ఇదే చివరి మ్యాచ్. కొత్త తరం టీ20 పగ్గాలు తీసుకోవాల్సిన తరుణం ఇదే’’ అంటూ కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు ముందు అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 75 పరుగులు చేసిన కోహ్లీ, ఫైనల్లో 76 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’’‌ అవార్డును అందుకున్నాడు.

ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన విలేఖరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

‘‘టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం రాదు. వరల్డ్ కప్ గెలవాలనుకున్నాను. ఇంతకాలం ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

టోర్నీ అంతటా జట్టును ముందుండి నడిపించిన రోహిత్, సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 92 పరుగులు, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 57 పరుగులు చేశాడు.

టైటిల్ గెలిచిన మరుసటి రోజు టీమిండియా ఆల్‌రౌండర్, 35 ఏళ్ల రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, ANI

టీ20ల్లో అత్యధిక పరుగులు రోహిత్ చేసినవే

37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా రిటైర్ అయ్యాడు.

రోహిత్ 159 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలతో 4,231 పరుగులు చేశాడు. టీ20ల్లో అతని సగటు 32.05, స్ట్రయిక్‌రేట్ 140.89

2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత్ తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడే టీ20 కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్, వరల్డ్ చాంపియన్‌గా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకొన్నాడు.

ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ఆడాడు. రోహిత్ కాకుండా ఇలా అన్ని టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న మరో ప్లేయర్ బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్.

వీడియో క్యాప్షన్, విరాట్ పర్వం ఇలా మొదలైంది

టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో హయ్యస్ట్ స్కోరర్ కోహ్లీ

విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

కోహ్లీ 35 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 58.72 సగటు, 128.81 స్ట్రయిక్‌రేట్‌తో 1,292 పరుగులు సాధించాడు.

భారత్ తరఫున మొత్తం 120 టీ20లు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఒక సెంచరీ, 38 అర్ధసెంచరీల సహాయంతో 4,188 పరుగులు చేశాడు. అతని సగటు 48.69 కాగా, స్ట్రయిక్ రేట్ 137.04.

ఈ ఫార్మాట్‌లో రోహిత్ తర్వాత అత్యధికంగా పరుగులు చేసిన రెండో క్రికెటర్ కోహ్లీ.

2010లో జింబాబ్వేతో మ్యాచ్‌లో కోహ్లీ టీ20 కెరీర్ మొదలైంది.

జడేజా ప్రదర్శన ఎలా ఉందంటే?

35 ఏళ్ల రవీంద్ర జడేజా ఈ ప్రపంచకప్‌లో పెద్దగా రాణించలేకపోయాడు.

2009లో భారత్ తరఫున టీ20ల్లో అతను అరంగేట్రం చేశాడు.

ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో 127.16 స్ట్రయిక్ రేట్‌తో 515 పరుగులు చేశాడు. 7.13 ఎకానమీతో 54 వికెట్లు తీశాడు.

రోహిత్, కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కెప్టెన్ అయ్యేది ఎవరు?

టీమిండియా కెప్టెన్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా పనిచేశారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించిన 62 టీ20ల్లో భారత్ 49 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం 12 మ్యాచ్‌ల్లోనే ఓడింది.

కోహ్లీ 50 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అందులో 30 గెలవగా, 16 ఓడిపోయాడు. వీరిద్దరి తరహాలో ఇప్పుడు భారత్‌ను ముందుండి నడిపించేది ఎవరు?

ఈ వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్‌గా.. పలు సిరీస్‌లలో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య తదుపరి కెప్టెన్ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.

రిషబ్ పంత్ కూడా ఈ రేసులో ఉన్నట్లు ఐపీఎల్‌లో తన ప్రదర్శనతో నిరూపించాడు. అయితే, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా గిల్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది.

వరల్డ్ కప్ టోర్నీలోని అన్ని మ్యాచ్‌ల్లో రోహిత్, కోహ్లీ ఓపెనింగ్ చేశారు. గిల్, యశస్వి, రుతురాజ్‌లు ఓపెనింగ్ స్థానాలను భర్తీ చేయగలరు.

గిల్

ఫొటో సోర్స్, ANI

శుభ్‌మన్ గిల్

వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మతో పాటు గిల్ ఓపెనింగ్ చేశాడు. టాప్ ఆర్డర్‌లో గిల్ మంచి ప్రత్యామ్నాయం.

బ్యాక్‌ఫుట్‌పై ఆడటంతో పాటు గ్యాప్‌లలోకి బాల్‌ను పంపించడంలో మంచి నైపుణ్యం చూపే 24 ఏళ్ల గిల్ తొణకని బెణకని వ్యక్తిత్వం ఉన్నవాడు.

కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గిల్‌కు జింబాబ్వే టూర్ చక్కని అవకాశం.

ఈ టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేయడం ద్వారా తమ భవిష్యత్ ప్రణాళికల్లో గిల్ ఉన్నాడనే సంకేతాలను సెలెక్టర్లు పంపించారు.

యశస్వీ జైస్వాల్

ఫొటో సోర్స్, ANI

యశస్వి జైస్వాల్‌పై అందరి కళ్లు

గత ఏడాది కాలంలో డాషింగ్ బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తన గుర్తింపును చాటుకున్నాడు.

వేగంగా పరుగులు చేస్తాడని జైస్వాల్‌కు పేరుంది.

వెస్టిండీస్ నుంచి దక్షిణాఫ్రికా వరకు విభిన్న పరిస్థితుల్లో జైస్వాల్ రాణించాడు. ముఖ్యంగా ప్రతీ టీమ్ మేనేజ్‌మెంట్ కుడి-ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కలయికను కోరుకుంటుంది.

ఇప్పటివరకు 16 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలు సహా 502 పరుగులు చేశాడు.

రుతురాజ్

ఫొటో సోర్స్, ANI

రేసులో రుతురాజ్ కూడా

ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రేసులో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన గైక్వాడ్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ మొదలుపెడతాడు. ఒకసారి అతను క్రీజులో కుదురుకుంటే అవుట్ చేయడం అంత సులభం కాదు.

ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ

2018లో వరల్డ్ కప్ గెలిచిన అండర్-19 జట్టులో సభ్యుడు అభిషేక్ శర్మ.

దూకుడైన స్ట్రోక్ ప్లే అతని సొంతం. ఈ ఏడాది ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ తన మార్కు చూపించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి విధ్వంసకర ఆరంభాన్ని అందించాడు.

అతను 16 మ్యాచ్‌ల్లో 204.21 స్ట్రయిక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు.

నంబర్ 3లో బ్యాటింగ్ చేసేది ఎవరు?

కోహ్లీ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. ఆధునిక క్రికెట్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీ స్థానాన్ని ఇప్పుడు ఎలా భర్తీ చేస్తారనేదే ప్రశ్న.

కోహ్లీ రూపంలో భారత క్రికెట్ జట్టుకు ఒక స్టార్ బ్యాట్స్‌మన్, చురుకైన ఫీల్డర్, అనుభవంతో కూడిన క్రికెట్ మైండ్ దొరికింది.

మరిప్పుడు ఇలాంటి కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని టీమ్ మేనేజ్‌మెంట్ తయారుచేయాల్సి ఉంది. పైన మనం చెప్పుకొన్న ఆటగాళ్లలో ఎవరో ఒకరు మూడోస్థానంలో బరిలోకి దిగొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)