రాహుల్ ద్రవిడ్ పిల్లాడిలా మారి సంబరాలు చేసుకున్న వేళ…

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ కందేరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అతడి వయసు 51. కానీ, విరాట్ కోహ్లీ టి20 వరల్డ్ కప్‌ను తన చేతికి అందించగానే అతడి ముఖ కవళికలు మారిపోయాయి.
పాతికేళ్ల కుర్రాడిలా పళ్ళు కరిచి, నరాలు బిగబట్టి భావోద్వేగంతో ట్రోఫీని ఎత్తి పట్టుకుని ఊపుతుంటే ఈ తరం వాళ్లకు ఉత్తేజం కలగొచ్చు.
కానీ, నిన్నటి తరం వాళ్లకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కళ్ళు తప్పకుండా చెమ్మగిల్లి ఉంటాయి. ఆ కంటి తడి చిరునామా రాహుల్ ద్రవిడ్.


ఫొటో సోర్స్, Getty Images
గెలుపు ముంగిట అవమానాలు
రవి శాస్త్రి తరువాత 2021 నవంబర్‌లో ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌కు సంవత్సరం తిరగక ముందే 2022 టి20 వరల్డ్ కప్ రూపంలో ఎదురు గాలి వీచింది.
ఈ టోర్నీసెమీస్‌లో ఇండియా ఓటమి పాలైంది. 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా కోచ్ ద్రవిడ్‌పై అనేక విమర్శలు వచ్చాయి.
2023తో కోచ్‌గా తన పదవీ కాలం ముగిసినా బీసీసీఐ, ద్రవిడ్‌పై విశ్వాసం కోల్పోలేదు. 2024 టీ20 వరల్డ్ కప్ వరకు ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించింది.
అలా తన మీద ఉన్న బాధ్యతను వరల్డ్ కప్ రూపంలో నెరవేర్చి భారత్ మొత్తం తల ఎత్తుకునేలా చేశాడు ఈ మిస్టర్ డిపెండబుల్.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
‘వ్యక్తి కోసం ఆడడాన్ని నేను వ్యతిరేకిస్తాను’
దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో #DoItForDravid అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.
దీనిపై ఒక స్పోర్ట్స్ ఛానల్‌తో ద్రవిడ్ మాట్లాడుతూ, ఒక ప్లేయర్ లేదా ఒక వ్యక్తి కోసం క్రికెట్ ఆడడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను అని అన్నారు.
టీంలో వ్యక్తి భాగమే కానీ వ్యక్తి కోసం టీం కాదు అనే దాన్ని నేను దృఢంగా నమ్ముతాను అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రోఫీని అందుకున్న క్షణం
1996లో టీమిండియాలో అరంగేట్రం చేసిన ద్రవిడ్ మొత్తం మూడు వరల్డ్ కప్ టోర్నమెంట్లు ఆడినా ఒక్కసారి కూడా కప్ గెలిచే అదృష్టం దక్కలేదు.
2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచినా, ఆ జట్టులో ద్రవిడ్ లేడు. కానీ, ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాల తర్వాత టీమిండియా కోచ్‌గా ట్రోఫీని ముద్దాడే క్షణం వరించింది.
వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ గెలిచింది. రోహిత్ ట్రోఫీ అందుకున్నాడు. ఆటగాళ్లు షాంపేన్ చిమ్ముకున్నారు, ట్రోఫీతో గంతులేశారు. ఇంతలో విరాట్ కోహ్లీ కప్ అందుకుని గుంపులో కలిసి ఉన్న ద్రవిడ్‌ను వెదుక్కుంటూ వచ్చాడు.
కప్‌ను ద్రవిడ్‌కు అందించాడు. ఆ క్షణం అతడి వయసు మరిచి చిన్న పిల్లాడిలా పళ్ళు కరిచి నరాలు బిగబట్టి భావోద్వేగంతో ద్రవిడ్ అరిచాడు. ఆ క్షణాలు చిరస్మరణీయం.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
సచిన్ ప్రశంసలు
2007 వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్, మళ్ళీ అదే దేశంలో భారత్‌కు కోచ్‌గా కప్ గెలవడం ఒక చరిత్రాత్మక అంశం.
‘‘ఈ టి20 ప్రపంచ కప్ విజయంలో నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ సహకారం అపారమైనది. అతన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది’’ అని సచిన్ ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images
గెలుపుతో ముగింపు
"ఈ టీంకు అపార సామర్థ్యం, ప్రతిభ ఉంది. అత్యుత్తమ ప్రదర్శన చేసినా ట్రోఫీని గెలవలేకపోయామని భావించిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఈరోజు ఈ జట్టు ఆడిన తీరు, పోరాట పటిమ చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తారని, మున్ముందు మరిన్ని ట్రోఫీలు గెలుస్తారని నేను విశ్వాసంతో చెప్పగలను.
ఇలాంటి జట్టులో భాగం కావడం చాలా అద్భుతం. ఇది నాకు జీవితకాల జ్ఞాపకం. దీన్ని సాధ్యం చేసిన బృందానికి, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు" అని ద్రవిడ్ అన్నారు.
ఈ మ్యాచ్ అనంతరం రోహిత్, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా, కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం కూడా ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌తో ముగిసింది.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














