ఆంధ్రప్రదేశ్: ‘భూతవైద్యుడి మరణంతో దెయ్యాలు ఊళ్లోకి వచ్చాయి’ అంటూ ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్న జనం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని చుట్టమెట్ట గ్రామం
ఫొటో క్యాప్షన్, చుట్టుమెట్ట గ్రామం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘‘భూతవైద్యం చేస్తుండగా, భూతవైద్యుడితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. దెయ్యాలు ఊళ్లోకి వచ్చాయి’’ అంటూ ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు ఈ గ్రామ వాసులు.

ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరడకోట పంచాయతీ పరిధిలోని చుట్టుమెట్ట గ్రామం. పది రోజులుగా ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దీంతో.. అసలు చుట్టుమెట్ట గ్రామంలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ బృందం చుట్టుమెట్ట గ్రామానికి వెళ్లింది.

ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న కొందరు వైద్య సిబ్బంది మినహా గ్రామంలో ఎవరూ కనిపించలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఇళ్లలో ఉన్నవారు బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు.

గ్రామ సమీపంలోనే ఉన్న కాఫీ తోటల్లో పనులకు కూడా ఎవరూ రావడం లేదని కాఫీ బోర్డు ఉద్యోగులు చెప్పారు.

అయితే, దెయ్యాలు, ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దని, అవన్నీ మూఢనమ్మకాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా చెప్పారు.

భూత వైద్యుడు చనిపోవడానికి కారణాలపై వైద్యాధికారులు ఏమంటున్నారు? భూతవైద్యుడి ఇంట్లో జరిగిన రెండు మరణాలు గ్రామస్తులపై ఎలాంటి ప్రభావం చూపాయి? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

బీబీసీ న్యూస్ తెలుగు
అనాసమ్మ, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ఈనెల 19వ తేదీన ముగ్గురు మహిళలు సమీపంలోని కొండపైకి కట్టెల కోసం వెళ్లినట్లు అనాసమ్మ చెప్పారు

అసలేం జరిగింది?

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో జూన్ 19వ తేదీన ముగ్గురు మహిళలు సమీపంలోని కొండపైకి కట్టెల కోసం వెళ్లారు. వారిలో ఒకరు పాంగి అనాసమ్మ.

‘‘మా గ్రామం పక్కనే ఉన్న కాఫీతోటలు దాటి కొండపైకి కట్టెల కోసం వెళ్లాం. అక్కడ అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో అటు వైపు చూస్తే నాకు ఒక ఆకారం కనిపించింది. దాంతో పరుగు పరుగున ఇంటికి వచ్చేసి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు’’ అని అనాసమ్మ బీబీసీకి వివరించారు.

రాములమ్మ, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, భూతవైద్యుడు, మామయ్య ఇద్దరూ వాంతులు చేసుకుని చనిపోయారని రాములమ్మ చెప్పారు

శ్మశానంలో కూడా అరుపులు వినిపించాయి: రాములమ్మ

అనాసమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కుమార్తె రాములమ్మ కూడా అక్కడే ఉన్నారు. అనాసమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో రాములమ్మ చెప్పారు.

“మా అమ్మ ఇంటికి రాగానే స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే మా మామయ్య (అనాసమ్మ సోదరుడు త్రినాథ్) గోరవగాడు (భూతవైద్యుడు) దగ్గరకు మా అమ్మని తీసుకెళ్లాడు” అని రాములమ్మ బీబీసీతో చెప్పారు.

''త్రినాథ్ మామయ్య అమ్మను గోరవగాడైన కిముడు సహదేవ్ వద్దకు తీసుకుని వెళ్తే.. అక్కడ సహదేవ్ మంత్రాలు చదువుతూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయాడు. ఏం జరిగిందోనని కంగారు పడుతుండగా.. అమ్మకు సేవలు చేస్తున్న మామయ్య కూడా అక్కడికక్కడే చనిపోయాడు. భూతవైద్యుడు, మామయ్య ఇద్దరూ వాంతులు చేసుకుని చనిపోయారు.

భూత వైద్యుడి ఇంట్లోనే ఇద్దరూ మరణించడంతో గ్రామస్తులు వెంటనే వారిద్దరికి దహన సంస్కారాలు చేయాలని స్థానిక శ్మశాన వాటికలో చితిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దహన సంస్కారాలకు వెళ్లిన కొందరు విచిత్రంగా ప్రవర్తించారు. దీంతో మా గ్రామంలో భయం మొదలైంది. దెయ్యాలు, ఆత్మలు గ్రామంలోకి ప్రవేశించాయని.. ఇళ్లలో నుంచి బయటకు ఎవరూ రాకూడదని నిర్ణయించుకుని, పనులకు వెళ్లకుండా అంతా ఇళ్లకే పరిమితమయ్యాం'' అని రాములమ్మ చెప్పారు.

అనాసమ్మ, రాములమ్మ ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు. ఊరిలో ‘దోషం’ (శాంతి పూజలు) జరిగిన తర్వాతే బయటకు వస్తామని చెప్పారు.

అయితే, ఈ ఏజెన్సీ గ్రామాల్లో మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని హేతువాదులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, భూత వైద్యుడి ఇంటి ముందు సిమెంట్ దిమ్మె

గ్రామంలో ఇళ్లు 50.. భూతవైద్యులు ముగ్గురు..

బీబీసీ పర్యటించే నాటికి (జూన్ 25) సంఘటన జరిగి వారం రోజులైంది. వారం రోజుల తర్వాత కూడా చుట్టుమెట్ట గ్రామాన్ని భయం వీడలేదు. గ్రామంలో ఒక్కరూ బయట కనిపించలేదు. అంతా ఇళ్ల లోపలే ఉన్నారు.

బీబీసీ వారితో మాట్లాడేందుకు ప్రయత్నించినా పెద్దగా స్పందించలేదు. అప్పుడు స్థానికుడైన కిముడు కృష్ణారావు సాయంతో గ్రామంలో తిరుగుతూ కొందరితో మాట్లాడగలిగాం. అలాగే, భూతవైద్యుడి ఇంటికి కూడా కృష్ణారావు తీసుకుని వెళ్లారు.

గ్రామంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. శ్లాబు ఇళ్లు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ఇళ్ల ముందర కార్లు కూడా ఉన్నాయి. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయంతో పాటు కాఫీ తోటల్లోని పనులకు వెళ్తున్నారు.

గ్రామ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే కనిపించింది. అయితే ఆచారాలు, నమ్మకాల విషయంలో మాత్రం చాలా పట్టింపులు ఉన్నట్లు వారి మాటల్లో అర్థమైంది.

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, కిమిడి కృష్ణారావు

గ్రామంలోని దాదాపు అన్ని ఇళ్ల ముందూ దీపాలు వెలిగించుకునేందుకు సిమెంట్‌తో కట్టిన దిమ్మెలు కనిపించాయి. భూత వైద్యుడి ఇంటి ముందు కూడా ఇలాంటి ఏర్పాట్లే ఉన్నాయి.

భూత వైద్యులు అక్కడే భూతాలను, దెయ్యాలను, ఆత్మలను వదిలించే పూజలు చేస్తారని కృష్ణారావు తెలిపారు.

గ్రామంలో మొత్తం ముగ్గురు భూతవైద్యులు ఉన్నారని, వారిలో ఒకరు మరణించగా.. మిగిలిన ఇద్దరు భూతవైద్యులు ఆ సంఘటన తర్వాత గ్రామం విడిచి వెళ్లారని కృష్ణారావు చెప్పారు.

గ్రామంలో ఎవరికి ఏ అనారోగ్యం చేసినా ముందు భూతవైద్యుడి దగ్గరికి వెళ్లి.. తగ్గకపోతే అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తామని ఆయన తెలిపారు.

‘‘ఇక్కడ సరైన వైద్యసదుపాయాలు అందుబాటులో లేకపోవడం, ఆధునిక వైద్యపద్ధతుల మీద నమ్మకం లేకపోవడం, వెనుకబాటుతనం వంటివి కూడా ఇందుకు కారణాలు’’ అని హేతువాది, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మి బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, భూతవైద్యుడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించినట్లు డాక్టర్ జమాల్ బాషా తెలిపారు

కొడవలిని ల్యాబ్‌కు పంపాం: వైద్యాధికారి

సంఘటన జరిగిన తర్వాత అల్లూరి జిల్లా వైద్యాధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

మరణించిన భూతవైద్యుడి ఇంటికి పోలీసులు, వైద్యాధికారులు వెళ్లారు. అక్కడ ఒక కొడవలి, కొన్ని శంఖాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల కోసం విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జమాల్ బాషా బీబీసీతో చెప్పారు.

కొడవలిపై రసాయనాలు చల్లి ఏవో మంత్రాలు చదువుతుండగా.. కొడవలిపై చల్లిన రసాయనాల చర్య కారణంగా ఊపిరాడక ఇద్దరూ మరణించి ఉంటారని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు జమాల్ బాషా తెలిపారు.

''దెయ్యాలు, ఆత్మలు వంటి పుకార్లని నమ్మొద్దని మానసిక వైద్యనిపుణులతో గ్రామంలో అవగాహన కల్పించాం. రక్తపోటు, షుగర్, బీపీ, మలేరియా, నీటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నాం. గ్రామంలో అందరి ఆరోగ్యం బాగానే ఉంది. అయితే, గ్రామస్తుల్లో భయం పోలేదు. కనీసం పనులకు కూడా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు'' అని డాక్టర్ బాషా చెప్పారు.

కాఫీ తోటల్లో పనులకు రావడం లేదు: కాఫీ బోర్డు ఉద్యోగి

దెయ్యం భయంతో చుట్టుమెట్ట గ్రామంలో ఎవరూ బయటకు రాకపోవడంతో దాని ప్రభావం స్థానిక కాఫీ తోటల పనులపై పడింది. చుట్టుమెట్ట గ్రామంలోని దెయ్యం భయం ఆ పక్కనే ఉన్న మరో 8 గ్రామాలకూ పాకింది. దాంతో వారు కూడా కాఫీ తోటల పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారని బీబీసీ వారితో మాట్లాడినప్పుడు తెలిసింది.

చుట్టుమెట్ట సమీప గ్రామాలైన ఈదురుపుట్టు, మంగబంద, సరేపల్లి, పేడపల్లి, మధ్యవీధి వంటి గ్రామాల నుంచి రోజూ సుమారు 100 నుంచి 150 మంది కాఫీ తోటల పనులకు వెళ్తుంటారు.

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, దెయ్యం భయం ఆ పక్కనే ఉన్న మరో 8 గ్రామాలకూ పాకడంతో వారు కూడా కాఫీ తోటల పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు

“చుట్టుమెట్ట గ్రామస్తులపై ఆధారపడి దాదాపు 88 హెక్టార్లలో కాఫీ తోటల పనులు జరుగుతుంటాయి. ఇప్పుడే కాఫీ ప్లాంటేషన్ సీజన్ మొదలైంది. ఇప్పుడు సరిగ్గా పనులు చేస్తే డిసెంబర్ నాటికి కాఫీ పిక్కలు దక్కుతాయి. కానీ, దెయ్యం భయంతో గ్రామస్తులు ఎవరూ పనులకు రావడం లేదు. ఇవాళ కూడా (27.06.24) గ్రామానికి వెళ్లి బతిమలాడా. కానీ, ఎవరూ పనులకు రావడానికి ఇష్టపడలేదు.

‘దోషం’ చేసిన తర్వాతే వస్తామని చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కాఫీ తోటల్లో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో వారు కూడా పనులకు రావడం లేదు” అని కాఫీ బోర్డులో ప్లాంటేషన్ కండక్టర్‌గా పనిచేస్తున్న సుందర్ కుమార్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ పర్యటించిన 25వ తేదీ తర్వాత, గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న అతికొద్ది మంది మాత్రమే పొలాలకు వెళ్లేందుకు బయటికి వస్తున్నట్లు తెలిసింది. అది కూడా పగటిపూట మాత్రమే. దోష నివారణ పూజల తర్వాతే బయటికి వస్తామని వారంటున్నారు.

ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, ‘దోషం’ చేసిన తర్వాతే పనులకు వస్తామని చెప్తున్నారని కాఫీ బోర్డు అధికారులు తెలిపారు

ఈ మూఢనమ్మకాలు పట్టణాలకూ వ్యాపిస్తున్నాయి: హేతువాదులు

మూఢనమ్మకాల కారణంగా ఆదివాసీలు, ‘చుట్టుమెట్ట’ వంటి సంఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని భారత నాస్తిక సమాజం విశాఖ జిల్లా అధ్యక్షుడు వై.నూకరాజు బీబీసీతో అన్నారు. మూఢనమ్మకాలు ఇప్పుడు పల్లెల్లోనే కాదు పట్టణాలు, నగరాల్లో కూడా కనిపిస్తున్నాయని అన్నారు.

“చదువుకున్న యువత సైతం ఈ మూఢ నమ్మకాలను కలిగి ఉండటం ప్రమాదకరమైన పరిణామం. భారత నాస్తిక సమాజం తరఫున ఒక బృందాన్ని అక్కడికి పంపుతాం. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించి నిర్మూలన దిశగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ అధికారులు విడతలవారీగా ఆదివాసీ గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తే.. మార్పు తప్పక వస్తుంది” అని నూకరాజు తెలిపారు.

‘‘జ్ఞానానికి సంబంధం లేకుండా పూర్వీకుల విశ్వాసాలన్నింటినీ వారసత్వంగా స్వీకరించడమే ఆదివాసీ గ్రామాల్లో కొనసాగుతున్న మూఢనమ్మకాలకు కారణం. వీటిపై వారిలో సరైన అవగాహన కల్పిస్తే భూతవైద్యం, దెయ్యాలు, ఆత్మలు అనే నమ్మకాలను తొలగించవచ్చు’’ అని హేతువాది, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మి అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగానే..

అక్కడ ఏం జరిగిందో సరైన కారణం తెలియకపోవడంతో గ్రామస్తులు దెయ్యాల వల్లే ఇలా జరిగిందని నమ్ముతున్నారని ఆ గ్రామాన్ని సందర్శించిన పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వ్యాధుల వైద్యులు, డాక్టర్ శివరామకృష్ణ బీబీసీతో చెప్పారు.

“చనిపోయిన వారికి పోస్టుమార్టం జరగకుండానే ఖననం చేశారు. దీంతో అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం లేదు. గిరిజన గ్రామాల్లో మూఢనమ్మకాలను అనుసరిస్తుండడంతో వారిని ఆ నమ్మకాల నుంచి బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గ్రామంలో సాధారణ పరిస్థితి నెలకొనడానికి కాస్త సమయం పడుతుంది” అని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శివ రామకృష్ణ చెప్పారు.

భూత వైద్యుడి ఇంట్లో దొరికిన రసాయనాలు, కొడవలి, ఇతర సామగ్రిని పరీక్షల కోసం పంపించారు. వాటి రిపోర్ట్ రాగానే భూత వైద్యులు ఏ విధమైన రసాయనాలు వాడుతున్నారు, అవి ఎంతటి ప్రమాదాల్ని తీసుకుని వస్తాయనేది తేలుతుందని డాక్టర్ జమాల్ బాషా చెప్పారు.

గ్రామంలో దెయ్యం భయం తొలిగిపోయేంత వరకూ వైద్య శిబిరాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)