దేశ రాజధాని దిల్లీలోని విమానాశ్రయం పైకప్పు ఎందుకిలా కూలింది?

దిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం కురిసిన వర్షానికి ఇందిరాగాంధీ విమానాశ్రయం టర్మినల్-1లో కొంత భాగం కూలడంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

టర్మినల్-1 నుంచి నడిచే ఇండిగో, స్పైస్‌జెట్‌ విమానాల రాకపోకలను రద్దు చేశారు. ఈ టర్మినల్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

టర్మినల్-1 మూసివేయడంతో విమానాల రాకపోకలను ప్రస్తుతం టర్మినల్ 2కి, టర్మినల్ 3కి మళ్లించారు.

శుక్రవారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఈ శాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్, పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామన్నారు.

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఇలాంటి నిర్మాణాలను తనిఖీ చేస్తామని పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

దిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు

ఫొటో సోర్స్, Getty Images

టర్మినల్-2, టర్మినల్-3 నుంచి విమానాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేందుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఈ విమానయాన శాఖ పర్యవేక్షణలో పనిచేస్తుంది.

రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులను తిరిగి ఇవ్వడం లేదా వేరే విమానాల్లో ప్రయాణ సదుపాయం కల్పించడం వంటి విషయాలను ఈ వార్ రూమ్ చూసుకుటుంది.

టిక్కెట్ డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ఏడు రోజుల గడువు విధించారు. వార్ రూమ్‌కు సంబంధించిన హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా పౌర విమానయాన శాఖ జారీ చేసింది.

వార్ రూమ్ హెల్ప్‌లైన్ నెంబర్లు:

ఇండిగో ఎయిర్‌లైన్

టీ2 టర్మినల్ – 7428748308

టీ3 టర్మినల్ – 7428748310

స్పైస్‌జెట్

టీ3 టర్మినల్ - 0124-4983410/0124-7101600

9711209864 (రోహిత్)

టర్మినల్-1 తాత్కాలికంగా మూసివేయడంతో, టర్మినల్ 2, టర్మినల్ 3పై పడే అదనపు భారాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు పలు చర్యలు తీసుకుంది.

ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని విమానం టికెట్ల ధరలను పెంచడానికి వీలు లేదని అన్ని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నిర్మాణాల సామర్థ్యంపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి, ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అన్ని చిన్న, పెద్ద విమానాశ్రయాలకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల భద్రతను పెంచడం, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా దీర్ఘకాలిక విధానాలను చేపట్టడం తమ ప్రథమ కర్తవ్యమని తెలిపింది.

అలాగే, జబల్‌పూర్ ప్రమాదాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించనుంది. దిల్లీలో ఈ ప్రమాదం జరగడానికి ఒక్క రోజు ముందే జబల్‌పూర్ విమానశ్రయంలో కూడా పైకప్పు కూలింది.

మార్చి 31న అస్సాంలోని గువహాటి విమానాశ్రయంలోనూ సీలింగ్ కొంతమేర కూలిపోయింది.

దిల్లీ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంపై ఐఐటీ దిల్లీకి చెందిన ఇంజనీర్లు ప్రాథమిక విచారణ నిర్వహించాలని విమానయాన శాఖ కోరింది. ఈ ప్రాథమిక విచారణ నివేదికను ఆధారంగా చేసుకుని దీనిపై తదుపరి దర్యాప్తు చేపట్టనుంది.

దిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో రమేష్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ చనిపోయారని బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా చెప్పారు. క్యాబ్ యజమాని ఉమ్మద్ సింగ్‌తో ఆయన మాట్లాడారు.

రమేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి దిల్లీలో ఉంటున్నారని, తన కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కరేనని ఉమ్మద్ చెప్పారు. మూడు నెలలుగా రమేష్ కుమార్ తన క్యాబ్ నడుపుతున్నారని తెలిపారు. ఉమ్మద్ సింగ్ కూడా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

‘‘ఉదయాన్నే పోలీసులు నాకు కాల్ చేశారు. విమానాశ్రయానికి రమ్మని చెప్పారు. కారు దగ్గరికి నన్ను వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత డ్రైవర్ చనిపోయినట్లు చెప్పారు. ఆయన మృతదేహాన్ని నేను చూడలేకపోయాను’’ అని బీబీసీ ప్రతినిధితో ఉమ్మద్ సింగ్ చెప్పారు.

టర్మినల్-1 కొంత భాగం కూలిన ప్రమాదంలో పది వాహనాల వరకు దెబ్బతినట్లు ఉమ్మద్ సింగ్ తెలిపారు.

భారీ ఇనుప పిల్లర్లు కార్ల మీద పడ్డాయి. దాంతో, కొన్ని కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్వహిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. విమానాశ్రయం పైకప్పు కూలిన తర్వాత శుక్రవారం ఆ సంస్థ షేర్ విలువ 2.86 శాతం పడిపోయింది.

దిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కోట్ల రూపాయలతో ఈ టర్మినల్‌ను పునర్ నిర్మించారని, సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమవ్వడానికి కొద్ది రోజుల ముందు మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారని కొంతమంది పోస్టులు పెట్టారు.

అయితే, పునర్ నిర్మించింది ఇది కాదని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

‘‘మోదీ ప్రారంభించిన నిర్మాణం మరో టర్మినల్‌లో ఉంది. ప్రస్తుతం కూలిన పైకప్పు పాతది. దీనిని 2009లో ప్రారంభించారు. 15 ఏళ్ల నాటిది. ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని ప్రధాని మోదీనే ఈ టర్మినల్ ప్రారంభించారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ, రాజకీయాలు చేయాలనుకోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను’’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

దిల్లీలో భారీ వర్షం, రోడ్డుపై నిలిచిన నీరు, ట్రాఫిక్ జామ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దిల్లీలో రోడ్లపై భారీగా నీళ్లు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కుండపోత వర్షం

దాదాపు రెండు నెలలు తీవ్రమైన ఎండలతో ఉడికిపోయిన దిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో రాత్రి 2.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు 228 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 88 ఏళ్లలో అంత తక్కువ వ్యవధిలో ఇంత భారీగా వాన పడటం ఇదే తొలిసారి అని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.

రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)