బొలీవియా: ప్రపంచంలోనే ఎక్కువ తిరుగుబాట్లు జరిగిన దేశం ఇదేనా

బొలీవియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫెర్నాండా పాల్, జోస్ కార్లోస్ క్యూటో
    • హోదా, బీబీసీ ముండో

బొలీవియా రాజధాని లా పాజ్‌లోని అధ్యక్ష భవనంపై సైనికులు దాడి చేసిన కొన్ని గంటలకే పోలీసులు తిరుగుబాటుకు యత్నించిన నాయకుడిని అరెస్టు చేశారు.

కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న మురిల్లో స్క్వేర్‌లో వందలాది మంది సైనికులు, సాయుధ వాహనాలు ఉన్నాయి.

ఒక సాయుధ వాహనం అధ్యక్ష భవనం ప్రవేశ ద్వారాన్ని (ఎంట్రన్స్ గేటు) ధ్వంసం చేసేందుకు యత్నించింది. ఆ తర్వాత సైనికులు ఈ లాటిన్ అమెరికా నగరం నుంచి వెనుదిరిగారు.

ఈ దాడి వెనక ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
జనరల్ జునిగా

ఫొటో సోర్స్, MINISTRY OF GOVERNMENT OF BOLIVIA HANDOUT / GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, బుధవారం మురిల్లో స్క్వేర్‌ను ఆక్రమించిన దళాలకు జనరల్ జునిగా నాయకత్వం వహించారు

1.తిరుగుబాట్ల చరిత్ర

బొలీవియాలో 1950ల నుంచి అత్యధిక సంఖ్యలో జరిగిన తిరుగుబాట్లు, ప్రభుత్వాలను కూలదోసినప్పటి చీకటి జ్ఞాపకాలు కొద్దిగంటలపాటు కదలాడాయి.

అమెరికాకు చెందిన చరిత్రకారులు జొనాథన్ పావెల్, క్లేటన్ థైన్‌ల డేటా విశ్లేషణ ప్రకారం.. గత 74 ఏళ్లలో బొలీవియా డజన్ల కొద్దీ తిరుగుబాట్లకు గురైంది. వాటిలో సగం విఫలమయ్యాయి.

పావెల్ బీబీసీతో మాట్లాడుతూ, బహుశా ప్రపంచంలోనే ఎక్కువ తిరుగుబాట్లు జరిగిన దేశం బొలీవియా కావొచ్చు. అయితే, ''1950కి ముందు జరిగినట్లు చెబుతున్న తిరుగుబాట్ల గురించి విశ్వసించదగ్గ సమాచారం పొందడం కష్టం'' అన్నారు.

సామాజిక తిరుగుబాటు లేదా రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం నుంచి సైనిక తిరుగుబాట్లను వేరు చేసినప్పుడు, వాటి మధ్య కొంత అస్పష్టత కనిపిస్తుందని విశ్లేషకులు బీబీసీతో చెప్పారు.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన రాజకీయ శాస్త్రవేత్త ఫాబ్రిస్ లెహౌక్ ప్రకారం, 1900వ సంవత్సరం నుంచి లాటిన్ అమెరికాలో దాదాపు 320 సైనిక తిరుగుబాట్లు జరిగాయి.

''ఈక్వెడార్, అర్జెంటీనా, బొలీవియాతో సంబంధమున్నవే వాటిలో ఎక్కువ'' అని లెహౌక్ చెప్పారు.

ఈ తిరుగుబాట్లలో దాదాపు సగం విజయవంతం అయ్యాయని లెహౌక్ చెప్పారు. 20వ శతాబ్దంలో బొలీవియాలో జరిగిన తిరుగుబాట్లలో సగానికి పైగా సార్లు అధ్యక్షుడిని పదవి నుంచి కూలదోయగలిగారని అన్నారు.

బొలీవియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సైనిక సమీకరణ ముగిసిన తర్వాత, బొలీవియా రాజధాని లా పాజ్‌లో వ్యాపారాలు సాధారణ రోజుల్లో మాదిరిగానే నడిచాయి

అందువల్ల, ఈ తాజా తిరుగుబాటుకి కారణమేంటి? దానికి ప్రేరేపించినదేంటి?

సైన్యాధ్యక్ష పదవి నుంచి మంగళవారం తొలగించక ముందు వరకూ జనరల్ జువాన్ జోస్ జునిగా సైన్యానికి నాయకత్వం వహించారు.

రాజ్యంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 2025 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆయన్ను అరెస్టు చేస్తామని బెదిరించడంతో జనరల్ జునిగాను దేశాధ్యక్షుడు లూయిస్ ఆర్స్ సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పించారు.

జనరల్ తన చర్యలను ''ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించే ప్రయత్నం''గా అభివర్ణించారు.

అధ్యక్షుడి అభ్యర్థన మేరకు సైన్యం జోక్యం చేసుకున్నట్లు మీడియాకు చెప్పిన కొద్ది సెకన్లలోనే జునిగాను అరెస్టు చేశారు.

ఈ దాడిని ''తిరుగుబాటు ప్రయత్నం''గా వర్ణిస్తూ, ఈ ఘటనను అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ ఖండించారు. ''ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా సంఘటితం కావాలి, అంతా ఏకమవ్వాలి'' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

దీంతో ప్రభుత్వానికి మద్దతుగా వందలాది మంది బొలీవియన్లు వీధుల్లోకి వచ్చారు.

దేశంలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది.

బలహీన ఆర్థిక పరిస్థితులు, అధ్యక్షుడు ఆర్స్, మాజీ మొరేల్స్ మధ్య రాజకీయ పోటీ గత కొద్ది నెలలుగా దేశంలో అనేక ప్రదర్శనలు, వర్గ విభజనలకు దారితీశాయి.

లూయిస్ ఆర్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్

ఆర్స్ వర్సెస్ మొరేల్స్

గతంలో రాజకీయ మిత్రులైన అధ్యక్షుడు ఆర్స్, మాజీ అధ్యక్షుడు మొరేల్స్ మధ్య 2025 ఎన్నికల ముందు ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది.

వారిద్దరూ ఒకే రాజకీయ పార్టీ 'మూవిమియెంటో అల్ సోషిలిస్మో' (ఎంఏఎస్)కి చెందినవారు. ఇంగ్లిష్‌లో దాని పేరు మూమెంట్ టు సోషలిజం.

నాలుగోసారి అధ్యక్ష బరిలో నిలిచేందుకు ఆ దేశ రాజ్యాంగ ధర్మాసనం గత డిసెంబరులో అనర్హుడిగా ప్రకటించినప్పటికీ, మొరేల్స్ తాను అధ్యక్ష బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించడంతో విభేదాలు తలెత్తాయి.

కాలపరిమితి అనేది ''తాము శాశ్వతంగా అధికారంలో ఉండాలని అనుకోకుండా ఉండడానికి అనువైన కొలమానం'' అని కోర్టు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అయితే, మొరేల్స్ ప్రకటన మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్న ఆర్స్‌కి సవాల్‌గా మారింది.

2019 ఎన్నికల్లో అధ్యక్ష ఫలితాలను రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో, మిలిటరీ చీఫ్స్ జోక్యంతో మొరేల్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

అయితే, రిగ్గింగ్ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు.

జీనైన్ అనెజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తిరుగుబాటుకు పాల్పడ్డారనే ఆరోపణలతో జీనైన్ అనెజ్‌కి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది

మధ్యేమార్గంగా, 2019 నుంచి 2020 వరకు జీనైన్ అనెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే, మొరేల్స్‌ను పదవి నుంచి తప్పించేందుకు తిరుగుబాటు చేశారనే ఆరోపణలు రావడంతో ఆమెకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆర్స్ విజయం సాధించారు.

ఇవో మొరేల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యాయస్థానం అనర్హుడిగా ప్రకటించినప్పటికీ, నాలుగోసారి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు మొరేల్స్ సిద్ధమయ్యారు

తనపై అనర్హత కొనసాగితే బొలీవియాలో ''సామాజిక తిరుగుబాటు'' జరుగుతుందని మొరేల్స్ బెదిరించారు. తనను ఎన్నికల బరిలో లేకుండా చేసేందుకు ప్రస్తుత అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మొరేల్స్ మొట్టమొదటి స్థానిక అధ్యక్షుడు. 2006 నుంచి 2019 వరకూ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు ప్రజాదరణ ఉన్నప్పటికీ వివాదాస్పద నేతగా పేరొందారు.

అధ్యక్షుడు ఆర్స్, జనరల్ జునిగా తనకు వ్యతిరేకంగా 'చీకటి ప్రణాళిక' రచిస్తున్నారని మొరేల్స్ హెచ్చరించారు.

సైనిక సమీకరణ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకురావాలని మొరేల్స్ బొలీవియన్లకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకోకుండా, ఆర్స్ ప్రభుత్వం కొద్దికాలం అధికారంలో ఉండాలని అది సూచిస్తుంది.

అధ్యక్షుడు ఆర్స్ 2022లో సైన్యానికి జనరల్ హెడ్‌ను నియమించారు. వీరిద్దరూ మొరేల్స్‌పై తీవ్ర విమర్శలు చేసేవారు.

సోమవారం ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ''రాజ్యాంగాన్ని తుంగలో తొక్కయినా'' మాజీ అధ్యక్షుడు మొరేల్స్‌ను అడ్డుకుంటామని జునిగా అన్నారు.

కానీ, బుధవారం తన అరెస్టు సమయంలో, ''తన ప్రజాదరణను పెంచుకోవడానికి'' అధ్యక్షుడు ఆర్స్ తిరుగుబాటుగా చిత్రీకరించారని ఆరోపించారు.

తన ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలేవీ జునిగా బయటపెట్టలేదు. ఈ వ్యవహారంలో అసలు నిజాలు ఇంకా బయటపడాల్సి ఉంది.

బొలీవియా

ఫొటో సోర్స్, Getty Images

3.'ఎకనమిక్ మిరాకిల్‌'కు ముప్పు

సంక్లిష్టమైన ఆర్థిక, సామాజిక పరిణామాల నేపథ్యంలో బొలీవియాలో అశాంతి నెలకొంది.

లాటిల్ అమెరికాలోని పొరుగు దేశాలు దీర్ఘకాలిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ స్థిరత్వం, తక్కువ ద్రవ్యోల్బణంతో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా బొలీవియా కొనసాగుతోంది.

అయితే, లాటిన్ అమెరికాలో అత్యధిక పేదరికం రేటు ఉన్న దేశం కూడా బొలీవియానే.

బొలీవియన్ కరెన్సీ విలువ పతనమవుతుండడంతో, వస్తువుల కొనుగోళ్ల కోసం ప్రజలు అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేస్తుంటారు.

అయితే, అమెరికన్ కరెన్సీ తగ్గిపోతుండడం ''బొలీవియన్ ఎకనమిక్ మిరాకిల్‌''‌కి ముప్పుగా పరిణమిస్తోందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమెరికన్ డాలర్ కొరత ఎగుమతి, దిగుమతులను దెబ్బతీస్తోంది. బియ్యం, టొమాటోలు వంటి కనీస అవసరాలను కొనుగోలు చేసేందుకు కూడా బొలీవియన్లు జేబులు తడుముకోవాల్సి వస్తోంది.

2006లో మొరేల్స్ హైడ్రోకార్బన్ పరిశ్రమను జాతీయం చేయడంతో దేశంలో సహజవాయువు ఉత్పత్తి తగ్గి అమెరికన్ డాలర్ కొరత ఏర్పడిందని బొలీవియన్ ఆర్థికవేత్త జైమ్ డన్ చెప్పారు.

ఇంధన కొనుగోలు కార్యక్రమం వంటి సామాజిక పథకాలకు నిధులు సమకూర్చేందుకు మొరేల్స్, ఆర్స్ ప్రభుత్వాలు అమెరికన్ డాలర్లను వెచ్చించాయి.

''ఇది దేశంలో సంక్షోభానికి దారితీసింది. ఆదాయం తగ్గినప్పటికీ ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 2014 నుంచి సహజవాయువు ద్వారా వచ్చే ఆదాయం దేశీయ, విదేశీ అప్పులకే సరిపోయింది'' అని డన్ వివరించారు.

అధ్యక్షుడు ఆర్స్ ప్రకారం, బొలీవియా 56 శాతం పెట్రోల్, 86 శాతం డీజిల్‌ను దిగుమతి చేసుకుంటోంది.

ఇప్పుడు, అవసరమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు సరిపడా డాలర్ల నిల్వలు లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో నిరసన ప్రదర్శనలు కూడా పెరుగుతున్నాయి.

బుధవారం జరిగిన తిరుగుబాటు ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి.

అధికారాన్ని చేజిక్కించుకోవడం చేసిన విస్తృతమైన చర్యగా కాకుండా, తొందరపాటు నిర్ణయంతో చేసిన తిరుగుబాటుగా బుధవారం జరిగిన చర్య కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

2025లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తిరుగుబాటు యత్నాన్ని తిప్పికొట్టిన సామర్థ్యం ప్రభుత్వంపై ప్రజాదరణను పెంచుతుందా, లేక అధికారం కోసం జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో బలహీనపరుస్తుందా అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)