పాకిస్తాన్‌లో వీళ్లంతా తేళ్లను ఎందుకు వేటాడుతున్నారు?
తేలు పేరు చెప్పగానే చాలామంది భయపడతారు. కానీ పాకిస్తాన్‌లోని ఈ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం చీకట్లో వెతికి మరీ తేళ్లను పట్టుకుంటున్నారు.
ఒక లీటర్ తేలు విషం కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది. పాకిస్తాన్‌లో లాహోర్ యూనివర్సిటీ- ఫైసలాబాద్ క్యాంపస్ జంతుశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు డాక్టర్ మొహ్సిన్ ఇషాన్, ఆయన విద్యార్థులు తేళ్లను పట్టుకుని వాటి నుంచి విషం తీస్తుంటారు.
‘తేలు విషంలో కాన్సర్ నిరోధక లక్షణాలు, నొప్పి తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఔషధాల తయారీలో కీలకం అవుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి కాస్మొటిక్ పరిశ్రమలో ఉపయోగపడతాయి’ అని డాక్టర్ మొహ్సిన్ ఇషాన్ బీబీసీతో చెప్పారు.

అయితే ఈ విషపూరిత తేళ్లను పట్టుకోవడం, వాటిని ల్యాబొరేటరీకి తీసుకురావడం చాలా ప్రమాదకరమైన పని. దీనికోసం ఈ రీసెర్చ్ టీమ్ వేసవికాలంలో డేరా ఘాజీఖాన్, టౌన్సా లాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్తోంది.
చీకటి పడగానే తేళ్లు ఆహారం కోసం బయటికొస్తాయి. వాటిని పట్టుకోడానికి అదే సరైన సమయం.
కానీ తేళ్లు మామూలు లైట్ల వెలుతురులో కనిపించవు. వాటిని వెతకడానికి అల్ట్రావయోలెట్ లైట్ ఉపయోగించాల్సి ఉంటుంది.
డాక్టర్ మొహ్సిన్, ఆయన బృందం కూడా ఇలాంటి లైట్లే వాడుతున్నారు.
రకరకాల ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన విషపూరితమైన తేళ్ల నుంచి ల్యాబొరేటరీలో విషం తీస్తారు.
‘మేం తేలుకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినపుడు, అది తన విషాన్ని విడుదల చేస్తుంది. మేం దానికి తగిన ఆహారం, తగిన పరిస్థితులను కల్పించడం కొనసాగిస్తే 15 నుంచి 20 సార్లు విషం తీయవచ్చు’ అని డాక్టర్ మొహ్సిన్ చెప్పారు.


యూనివర్సిటీలో ఉన్న డాక్టర్ మొహ్సిన్, ఆయన బృందం ఈ విషాన్ని రీసెర్చ్ కోసం ఉపయోగిస్తోంది.
కాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఈ విషం అడ్డుకుంటుందనే విషయం తేలింది అన్నారు మొహ్సిన్.
ఈ విషం కోసం ఔషధ కంపెనీలు, అంతర్జాతీయ పరిశోధన సంస్థలు డాక్టర్ మొహ్సిన్‌ను సంప్రదించాయి. అయితే ప్రస్తుతానికి ఆయన బృందం దీన్ని విక్రయించడం లేదు.
‘మేం అలా ఎవరికీ విషం ఇవ్వం. ఇది మాతో కలిసి పనిచేయాలనుకునే సైంటిస్టులకు, పరిశోధనలకు మాత్రమే ఉపయోగిస్తాం. యూనివర్సిటీ ఏదైనా కంపెనీతో ఒప్పందం చేసుకుంటే, మేం వారికి సరఫరా చేయడం గురించి ఆలోచిస్తాం’ అన్నారు మొహ్సిన్.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









