ఫ్రాన్స్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్, ఫార్ రైట్ పార్టీ ‘నేషనల్ ర్యాలీ’కి ఆధిక్యం

ఫొటో సోర్స్, REUTERS/Yves Herman
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ న్యూస్
ఫ్రాన్స్‌లో తొలి విడత పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ఫార్ రైట్ పార్టీ నేషనల్ ర్యాలీ (ఆర్‌ఎన్) ఆధిక్యంలో నిలిచింది.
ఈ ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడి మేక్రానిస్ట్ బ్లాక్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందంటూ ఆర్‌ఎన్ నేత మరీన్ లె పెన్ వ్యాఖ్యానించడంతో ఆమె మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
తొలి విడత ఎన్నికల్లో ఆర్‌ఎన్ పార్టీకి 33.1 శాతం ఓట్లు రాగా, లెఫ్ట్ వింగ్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28 శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ కూటమి 20 శాతం ఓట్లతో వెనుకబడింది.
‘‘మాకు ప్రజలంతా ఓటు వేస్తే నేను ఫ్రాన్స్‌కు ప్రధానమంత్రి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని ఆర్‌ఎన్ పార్టీ లీడర్ 28 ఏళ్ల జోర్డాన్ బర్డెల్లా అన్నారు.
ఆర్‌ఎన్ పార్టీ మునుపెన్నడూ ఫ్రాన్స్ పార్లమెంటరీ ఎన్నికల తొలి రౌండ్‌లో గెలవలేదు. ఇప్పుడిలా జరగడం చరిత్రాత్మక అంశమని విశ్లేషకుడు అలైన్ దుహామెల్ వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్ పార్లమెంట్‌లోని 577 స్థానాల్లో 289 సీట్ల సంపూర్ణ మెజారిటీని మరీన్ లె పెన్, జోర్డాన్ బర్డెల్లా కోరుకుంటున్నారు.


ఫొటో సోర్స్, Ludovic MARIN / AFP
అయితే, ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికల్లో సీట్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.
సంపూర్ణమైన మెజారిటీ లేకపోతే ఫ్రాన్స్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్‌ఎన్ పార్టీ తాము అనుకున్న వలసలు, పన్ను కోతలు, శాంతిభద్రతలపై తమ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లలేకపోవచ్చు.
పార్లమెంటరీ ఎన్నికల తొలి విడతలో 1997 తర్వాత ఇప్పుడే అత్యధికంగా 66.7 శాతం ఓటింగ్ నమోదైంది.
తొలి విడత ఎన్నికల్లో, తమ నియోజకవర్గాల్లో సగానికిపైగా ఓట్లు సాధించిన 37 మంది నేషనల్ ర్యాలీ అభ్యర్థులు, 32 మంది న్యూ పాపులర్ ఫ్రంట్ అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు.
ఆర్‌ఎన్ విజయంపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది లెఫ్ట్ వింగ్ ఓటర్లు పారిస్‌లోని డి లా రిపబ్లిక్ ఏరియాలో గుమిగూడారు.
సెంట్రిస్ట్ కూటమి నేతలు తమ మద్దతుదారులను ఉత్సాహరిచేలా మాట్లాడారు. ప్రధాని గాబ్రియేల్ అట్టల్ తన నివాసం బయట గంభీరమైన ప్రసంగం చేశారు.
‘‘నేషనల్ ర్యాలీకి కనీసం ఒక్క ఓటు కూడా వేయకూడదు. నేషనల్ ర్యాలీకి సంపూర్ణ మెజారిటీ రాకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ARNAUD FINISTRE/AFP
ఫ్రాన్స్ సమాజంలో నేషనల్ ర్యాలీ పార్టీ ప్రయాణం సుదీర్ఘమైనది.
తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం నుంచి ఎనర్జీ పన్నుల్లో కోత, విదేశీయులకు ఇచ్చే ప్రయోజనాల్లో కోత వంటి పాలసీలతో వారు ఈ ఎన్నికల బరిలో దిగారు.
ఆర్‌ఎన్‌కు సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.
లేదంటే ఆర్‌ఎన్ అతిపెద్ద పార్టీగా హంగ్ పార్లమెంట్ ఏర్పడొచ్చు. న్యూ పాపులర్ ఫ్రంట్‌కు కూడా ఓట్ల శాతం పెరగొచ్చు.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














