భీకర హరికేన్ భయంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా, అసలు అక్కడ ఏం జరుగుతోంది?

టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

టీ20 ప్రపంచకప్ గెలిచి దేశాన్ని ఆనందంలో ముంచిన భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. పెను తుపాను (హరికేన్) హెచ్చరికల కారణంగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకుపోయినట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

బార్బడోస్ వైపు దూసుకొస్తున్న ఈ పెను తుపానుకు ‘బెరిల్’ అని పేరు పెట్టారు.

భారత జట్టు అక్కడి హిల్టన్ హోటల్‌లో బస చేస్తోంది. హరికేన్ హెచ్చరికల కారణంగా ముందుజాగ్రత్తగా బార్బడోస్‌ విమానాశ్రయాన్ని మూసివేశారని, అలాగే నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారని ఏఎన్ఐ తెలిపింది.

ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జే షా విలేఖరులతో మాట్లాడుతూ భారత జట్టు బార్బడోస్‌లోనే ఉందని తెలిపారు.

జట్టు స్వదేశానికి చేరుకున్న తరువాత వారికి సత్కారం చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు.

అత్యంత తీవ్రమైన తుపాను బలపడుతూ దూసుకొస్తోందని ప్రజలందరూ అత్యవసర సన్నద్ధతతో ఉండాలని స్థానిక అధికారులు ప్రజలను హెచ్చరించారు.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్
Hurricane Beryl

ఫొటో సోర్స్, Reuters

దూసుకొస్తున్న బెరిల్ హరికేన్

భీకరంగా దూసుకొస్తున్న తుపానుకు ‘బెరిల్’ అని పేరు పెట్టారు. ఇది ‘‘అత్యంత ప్రమాదకరం’’ అని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

ఈ తుపాను ‘కేటగిరి 4’గా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దీనర్థం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో తుపాను గాలులు వీస్తాయి.

సముద్రంలో అలలు 6 నుంచి 10 మీటర్ల వరకు ఎగసిపడతాయి.

కరీబియన్ దీవులైన బార్బడోస్, డొమినికా, గ్రెనెడా, మార్టినిక్యూలను సమీపించే కొద్దీ ఈ తుపాను మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు.

‘‘అట్లాంటిక్ సముద్రంలో ఈ సీజన్‌ ప్రారంభంలో తుపాను ఇంత త్వరగా బలపడటం చాలా అరుదు. లోయర్ అంటీలీస్‌లోని అనేక ద్వీపాలలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే ముప్పు ఎక్కువగా ఉంది’’ అని అక్యూ వెదర్‌కు చెందిన అలెక్స్ డాసిల్వా హెచ్చరించారు.

తుపానును ఎదుర్కోవడంలో భాగంగా ప్రజలు నిత్యావసరాలను సిద్ధం చేసుకుంటున్నారు. పెట్రోలు బంకుల వద్ద బారులు తీరారు. మంచి నీళ్లు, ఇతర ఆహారపదార్థాలను నిల్వ చేసుకుంటున్నారు.

బెరిల్ తుపాను

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తుపాను దెబ్బను కాచుకునేందుకు, కిటికీలను చెక్కలతో మూసివేస్తున్న స్థానికులు

శుక్రవారం రాత్రి ఏర్పడిన ఈ తుపాను పశ్చిమ కరీబియన్ దీవుల వైపు పయనిస్తోందని వాతావరణ నిపుణులు చెప్పారు.

డొమినికా, మార్టినిక్యూ, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్ దీవులను తుపాను తాకేటప్పటికీ ప్రమాదకరమైన ఈదురుగాలులతో పాటు భారీవర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు.

ఈ సీజన్‌లో అల్బెర్టో తుపాను తరువాత రెండోది ఇదే. అల్బెర్టో జూన్ 20న ఈశాన్య మెక్సికోలో తీరాన్ని తాకింది. అప్పుడు భారీ వర్షాల కారణంగా నలుగురు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)