భార్యను చంపి సూట్‌కేసులో పెట్టి నదిలో పడేసిన భర్త, దోషిగా తేల్చిన కోర్టు....

అమినాన్ రెహమాన్

ఫొటో సోర్స్, Met Police

    • రచయిత, జెరెమీ బ్రిట్టన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆన్‌లైన్‌లో వివాహేతర సంబంధం నెరపుతోందనే కారణంతో భార్య గొంతు నులిమి చంపేసి, మృతదేహాన్ని నదిలో పడేసిన భర్తను ఇంగ్లండ్ కోర్టు దోషిగా తేల్చింది.

తూర్పు లండన్‌‌కు చెందిన అమినాన్ రెహమాన్(46)ను ఈ కేసులో దోషిగా గుర్తించారు. ఆయన తన భార్య సుమా బేగం(24)ను గత ఏప్రిల్‌లో ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతుండగా ఈ దారుణానికి పాల్పడినట్లు ఇంగ్లండ్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టు నిర్ధరణకు వచ్చింది.

భార్యను గొంతు పిసికి చంపిన తర్వాత రెహమాన్ ఆమెను సూట్‌కేసులో ఎలా కుక్కాడో విచారణ జరిపిన అధికారులు జ్యూరీకి వివరించారు. ఆ సమయంలో ఆమె బతికే ఉండొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి.

రెహమాన్‌కు జూలై 31న శిక్ష విధించనున్నారు.

2023 ఏప్రిల్ 29 రాత్రి జరిగిన పరిణామాలను ఓల్డ్ బెయిలీ కోర్టు జ్యూరీ ముందు సుమా బేగం బాయ్‌ఫ్రెండ్ షాహిన్ మియా వివరించారు.

టవర్ హామ్లెట్స్‌లో ఉన్న తమ ఫ్లాట్‌లో బేగమ్‌ను రెహమాన్‌ చంపేసిన తర్వాత, ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి, లీ నదిలో పడేశారని కోర్టు విచారణలో తేలింది.

10 రోజుల తర్వాత నది లోతట్టు ప్రాంతానికి కొట్టుకుని వచ్చిన సూట్‌కేసును స్థానికులు గుర్తించారు. ఆ సూట్‌కేసులో బేగం మృతదేహం ఉంది.

మెట్రోపాలిటన్ పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఒక చేతిలో తమ బిడ్డను, మరో చేతిలో సూట్‌కేసును పట్టుకుని ఫ్లాట్ నుంచి బయటికి వస్తున్న రెహమాన్‌ కనిపించారు.

రెండో క్లిప్‌లో సూట్‌కేసును నదిలో పడేయడానికి ముందు, లీ నది వద్ద ఆయన నిల్చున్న దృశ్యాలు కనిపించాయి.

రెహమాన్ లండన్‌లో, బేగం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న సమయంలో వీరిద్దరూ 2019లో టెలిఫోన్ ద్వారా ఇస్లామిక్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్లు కోర్టు విచారణలో తెలిసింది.

ఆ తర్వాత సోమర్‌సెట్‌లో వారిద్దరూ కలిసి నివసించారు. అక్కడ రెహమాన్ షెఫ్‌గా పని చేసేవారు. ఏప్రిల్‌లో తూర్పు లండన్‌కు వెళ్లేముందు తమ ఇద్దరు పిల్లలతో డాక్‌ల్యాండ్స్‌ ఫ్లాట్‌లో నివసించారు.

ఆ తర్వాత బేగమ్, తన ఈడువాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న షాహిన్ మియా అనే వ్యక్తితో ఆన్‌లైన్‌లో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ప్రాసిక్యూటర్ జోసెలిన్ లెడ్‌వార్డ్ చెప్పారు.

సుమా బేగమ్

ఫొటో సోర్స్, Met police

ఆమెను చంపేశాను, ఇక నీ వంతే..

బేగం హత్య జరిగిన రాత్రి, పిల్లల ఏడుపులను, గోడ మీద గట్టిగా బాదిన శబ్దాలను విన్నట్లు ఆమె పొరుగింటివారు చెప్పారు.

అదే రోజు రాత్రి రెహమాన్‌ నుంచి మియాకు వాట్సాప్ వీడియో కాల్ వెళ్లింది.

బేగం ను చంపుతానని రెహమాన్ ఎలా బెదిరించాడో కాల్‌లో ఉన్న తాను విన్నట్లు మియా జ్యూరీకి వివరించారు.

‘‘ఆమె పారిపోవాలనుకున్నారు. కానీ, ఆయన ఆమె గొంతు పట్టుకున్నారు.’’ అని జ్యూరీకి వివరించారు మియా.

ఆ తర్వాత మియాకు అదే రోజు రాత్రి మరో కాల్ వచ్చింది. ‘‘నేను ఆమెను చంపేశాను. ఇక నువ్వు సిద్ధంగా ఉండు.’’ అని రెహమాన్ తనతో అన్నట్లు మియా చెప్పారు.

‘‘సుమా బేగం నోటి నుంచి నురగ రావడం చూశాను. వీడియో కాల్‌లో ఆయన నాకు చూపించారు. నన్నూ బెదిరించారు.’’ అని కోర్టుకు తెలిపారు మియా.

సుమా బేగం మృతదేహాన్ని ఉంచి, నదిలో పడేసిన సూట్‌కేసు

ఫొటో సోర్స్, Met police

ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఫ్లాట్ నుంచి రెహమాన్ బయటకు రావడం, ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఒక చేతితో ఎత్తుకుని, మరో చేతిలో పెద్ద సూట్‌కేసు పట్టుకుని వెళుతున్న దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజీని జ్యూరీకి చూపించారు.

ఒక ఇనుప వస్తువుతో సూట్‌కేసును పైకెత్తి, లీ నదిలో పడేసినట్లు మరో ఫుటేజీలో ఉంది.

ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఇంగ్లండ్‌లో సెటిల్ అయ్యేందుకు ఆర్ధికంగా సాయం చేయాలని తన భార్య డిమాండ్ చేసిందని రెహమాన్ తన వాదనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన సమర్పించారు.

10వేల పౌండ్లు (సుమారు రూ. రూ.10 లక్షలు) పైగా ఇవ్వకపోతే, పిల్లలను తీవ్రంగా హింసిస్తానని సుమా బేగం బెదిరించిందని రెహమాన్ ఆరోపించారు.

పిల్లలను కాపాడే ప్రయత్నంలో తన రెండు చేతులతో ఆమె మెడను పట్టుకుని పిసికినట్లు రెహమాన్ తెలిపారు. కాసేపటికి బేగం నేలపై పడిపోయినట్లు పేర్కొన్నారు.

ఆ తర్వాత తాను చాలా కంగారు పడ్డానని, ఆమె శరీరాన్ని సూట్‌కేసులో పెట్టినట్లు కోర్టుకు చెప్పారు.

విచారణలో రెహమాన్ తన నేరాన్ని ఒప్పుకునేందుకు ఆయన చేసిన వీడియో కాల్‌ కీలకంగా మారిందని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.

ఆమె మృతదేహానికి గౌరవప్రదంగా, చట్టబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించలేదనే అభియోగాలపై కూడా రెహమాన్ దోషిగా తేలారు.

‘‘అమినాన్ రెహమాన్‌ను ప్రధాన అనుమానితుడిగా గుర్తించిన తర్వాత, నరహత్యలపై విచారణ చేసే మా బృందం హత్యకు ముందు, తర్వాత ఆయన కదలికలు రికార్డయిన గంటల కొద్దీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది.’’ అని కేసుకు ప్రధాన విచారణాధికారిగా పనిచేసిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కెల్లీ అలెన్ తెలిపారు.

‘‘సుమా బేగం బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న మియాకు రెహమాన్ చేసిన పూర్తి వీడియో కాల్‌ను డౌన్‌లోడ్ చేశాం. అసూయతోనే ఆమెను ఆయన చంపేసినట్లు తేలింది.’’ అని చెప్పారు.

ఇది చాలా క్లిష్టమైన కేసని, విచారణ సందర్భంగా ఆమె మృతదేహాన్ని భర్త ఎలా దాచిపెట్టి తీసుకెళ్లాడో గ్రాఫిక్స్ ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారని కెల్లీ అలెన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)