గర్భిణులు, పాలిచ్చే తల్లులు చేపలు తింటే ఏమవుతుంది? చెరువు, సముద్రం చేపల్లో ఏవి మంచివి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్సికా బ్రౌన్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
చేపలు ఆరోగ్యానికి మంచివని పోషకాహార నిపుణులు చెప్పేమాట. అయితే గర్భిణులు మాత్రం తక్కువగా తినాలని ఇప్పుడు సైంటిస్టులు, నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చేపల సంతతి తగ్గిపోతున్న తరుణంలో చేపలు తినడం నిజంగా ఆరోగ్యానికి ఎంత వరకు ప్రయోజనకరం అన్నది చర్చనీయంగా మారింది.
శాకాహారం సమృద్ధిగా లభిస్తున్నవేళ.. సముద్ర జీవుల్లో కార్బన్ అవశేషాలు పెరుగున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. చేపలను తినడం ఎంతవరకు అవసరం అనే ప్రశ్న మొదలైంది.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం, 1974తో పోలిస్తే చేపల సంతతి సుమారు 66 శాతానికి పడిపోయిందని అంచనా.
అయితే, మిగతావారి సంగతి ఎలా ఉన్నా గర్భిణులు, పాలిచ్చే తల్లులు చేపల్లాంటి కొన్ని సముద్ర జీవులను తినడం తగ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సముద్ర జలాల్లో పాదరసంతోపాటు ఇతర రసాయనాలు ఎక్కువగా కలుస్తుండటంతో నిపుణులు ఈ సలహా ఇస్తున్నారు.
అసలు చేపలను తింటే లాభమా, నష్టమా?


ఫొటో సోర్స్, Getty Images
చేపల్లో భార లోహాలు
సముద్ర జలాల్లో చేరుతున్న వ్యర్థ కాలుష్యాలు, లోహాల ప్రభావం చేపలపై గణనీయంగా పడుతోందని గత కొన్ని దశాబ్దాలుగా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది.
పరిశ్రమల వ్యర్థాల నుంచి వచ్చే పాలీక్లోరినేటెడ్ బైఫినైల్(పీసీబీ)లను 1980ల నుంచి నిషేధించినా అవి అటు భూమిలోనూ, ఇటు నీటిలోనూ గణనీయంగా చేరుతూనే ఉన్నాయని తేలింది.
మనిషి మెదడు నుంచి వ్యాధి నిరోధక వ్యవస్థ వరకు శరీరంలోని వివిధ భాగాల మీద అవి ప్రభావం చూపిస్తాయని నిపుణులు తేల్చారు.
పాలు, మంచినీరులాంటి వాటిలో ఈ పీసీబీల ఆనవాళ్లు ఉన్నా, చేపల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
వాటి ప్రభావం నుంచి బయటపడాలంటే అవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటమే మార్గమని ఇంగ్లండ్‌లోని రోథమాస్టెడ్ రీసెర్చ్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న జోనాథన్ నేపియర్ అన్నారు.
“మనుషులు వేటాడి తినే ప్రాణుల్లో ఈ తరహా ప్రమాదకర అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి’’ అన్నారాయన. అందుకే సముద్రాలలో దొరికే చేపలకన్నా, చెరువుల్లో పెంచే చేపలు కొంత వరకు మంచివని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, చేపల చెరువులు కూడా సముద్ర జలాల కాలుష్యానికి చాలా వరకు కారణమవుతున్నాయి. ఈ చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలు పెద్ద ఎత్తున సముద్రంలో కలుస్తుండటంతో ఇక్కడ పుట్టే వ్యాధులన్నీ సముద్రపు చేపల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి.
పీసీబీ శాతం ఎక్కువ ఉన్నందున చేపలను తీసుకోవడం తగ్గించాలని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఆ దేశంలోని గర్భిణులకు సూచించింది.
ఇక నీళ్ల ద్వారా చేపల్లోకి, తద్వారా మనుషుల కడుపులోకి వెళ్లే పాదరసం అవశేషాలు మనిషి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ కారక లోహాలలో ఒకటిగా పాదరసానికి పేరుంది. అలాగే డయాబెటిస్, గుండె సంబంధ సమస్యలకూ పాదరసం కారణమని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయల్లోనూ కొంత శాతం ఉన్నా, 78 % పాదరసం చేపల ద్వారానే మనుషుల శరీరంలోకి వస్తుందని పరిశోధనలు తేల్చాయి. అందుకే ట్యూనా, హాలీబట్‌లాంటి చేపలను తినడం తగ్గించాలని గర్భిణులకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) సూచించింది.
భూమి మీద వేడి పెరుగుతున్న కొద్దీ నీటిలో పాదరసం కలిసే అవకాశాలూ పెరుగుతాయని, ఆర్కిటిక్ కరుగుతున్న కొద్దీ సముద్రాలలో మెర్క్యురీ అవశేషాలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రపు చేపలు వర్సెస్ మంచినీటి చేపలు
సాలమన్, ట్యూనా, సార్డైన్స్, మెకెరెల్‌లాంటి కొవ్వులు ఎక్కువ ఉండే చేపలు తింటే గుండె సంబంధ సమస్యలు పెద్దగా రావని, దీనికి ఈకోసపెంటానోయిక్(ఈపీఏ), డొకోసాహెక్జానిక్ యాసిడ్(డీహెచ్‌ఏ), మెరైన్ ఒమేగా-3 అనే ఫ్యాటీ ఆమ్లాలే కారణమని పరిశోధనలు తేల్చాయి.
అయితే మొక్కల నుంచి వచ్చే ఒమేగా-3లాంటి ఫ్యాటీ ఆమ్లం సముద్ర జీవుల నుంచి వచ్చే ఫ్యాటీ ఆమ్లాలకు సరితూగుతుందా లేదా అనేదానిపై మాత్రం ఇంకా పరిశోధన జరుగుతోంది.
“ఈపీఏ, డీహెచ్‌ఏలు రెండూ మానవ జీవక్రియలలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ అవే ముఖ్యమనుకోవడం పొరపాటే. వాటిని ఎంత వరకు తీసుకోవాలో అంత వరకే తీసుకోవడం మంచిది’’ అన్నారు నేపియర్.
మానవ మస్తిష్కం, రెటీనా, ఇంకా కొన్ని కణాలలో డీహెచ్‌ఏ ఎక్కువగా ఉంటుంది. ఈపీఏతో కలిసి అది శరీరంలో ఏర్పడే మంటల్లాంటి పరిస్థితులను అదుపుచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మంటలే గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్‌లాంటి వాటికి కారణమవుతాయి.
“ఈపీఏ, డీహెచ్‌ఏ ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకునేవారిలో సాధారణంగా జబ్బుల సమస్య తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులు తక్కువగా ఉంటాయి’’ అని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ ఫిలిప్ కాల్డర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒమేగా-3ని తీసుకుంటున్నప్పుడు మెర్క్యూరీ ప్రభావాన్ని తగ్గించడానికి చేపల నూనె తీసుకోవడం ఒక మార్గంగా చెబుతున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన పరిశోధనలో దీని ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నేరుగా చేపలను తీసుకున్నప్పటి ప్రభావం, చేపల నూనెను తీసుకోవడంలో ఉండదని ఈ పరిశోధన తేల్చింది.
వరసగా నాలుగైదు సంవత్సరాలపాటు ఒమేగా-3 తీసుకున్న 334 మందిలో ఒక్కరు కూడా గుండె సంబంధ సమస్యలతో చనిపోలేదని ఒక పరిశోధన తేల్చి చెప్పినట్లు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో రీడర్‌గా పని చేస్తున్న లీ హూపర్ వెల్లడించారు.
చేపలను తినడం వల్ల ప్రతీ ఒక్కరి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏ మేరకు అవి ఈపీఏ, డీహెచ్‌ఏలుగా పరివర్తన చెందుతాయన్నది మనిషికి మనిషికి తేడా ఉంటుంది.
సదరు మనిషి జీవన విధానం, అతను తీసుకునే ఇతర ఆహార పదార్థాలతోపాటు జన్యుక్రమం ప్రభావం కూడా ఉంటుందని ఫిలిప్ కాల్డర్ వెల్లడించారు.
చేపల్ని ఎక్కడ పెంచారన్న అంశంపై చేపలు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
సముద్ర అంతర్భాగంలో ఒమేగా-3కి కొరత లేదు. మొక్కల నుంచి చిన్నచేపలు, చిన్న చేపల నుంచి పెద్ద చేపలు, పెద్ద చేపల నుంచి మనుషుల వరకు ఇది రవాణా అవుతూ ఉంటుంది. కానీ, మనం పెంచే చేపల్లో ఈ క్రమం ఉండదు. “చెరువుల్లో మనం పెంచే చేపలు రైతు పెట్టిన తిండి తిని పెరుగుతాయి’’ అని అన్నారు నేపియర్.
పైగా పెంపకపు చేపలు ఒకే జాతికి చెందిన చిన్న చేపలను తింటాయి. కానీ నదులు, సముద్రాలలో పెరిగే చేపలు వివిధ జాతుల చేపలను తిని పెరుగుతాయి.
2016లో జరిగిన పరిశోధనల్లో సాలమన్ చేపలలో పెరిగే ఈపీఏ, డీహెచ్‌ఏ శాతాలు దశాబ్దకాలంలో దాదాపు సగానికి తగ్గాయని తెలిసింది. సముద్రపు చేపల్లో కన్నా, రైతులు పెంచే చేపల్లోనే ఒమేగా-3 ఎక్కువగా కనిపించిందని నేపియర్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
మెదడుకు మేత
ఒమేగా-3తోపాటు ఇన్ఫెక్షన్లను తగ్గించే అనేక పోషకాలు చేపల్లో ఉంటాయని తేలింది. అలాగే చేపలు తినడం వల్ల మెదడు చురుకుగా ఉంటుందని నమ్ముతారు.
ఒమేగా-3కి మెదడు వేగానికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉడికించిన చేపను తినడం వల్ల మెదడు పరిమాణం పెరగుతుందని కూడా గమనించారు.
మెదడుపై చేపల నుంచి వచ్చే పోషకాల ప్రభావం మీద పరిశోధనలో భాగంగా 70 సంవత్సరాలు దాటిన 163మంది మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేశారు.
అయితే, చేపలు తినని వారి మెదళ్లతో పోల్చినప్పుడు వారానికొక్కసారైన చేపలను తినే వారి మెదళ్ల సైజు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, తెలివి మీద పని చేసే మెదడు ప్రాంతాల పరిణామం ఎక్కువగా ఉందట.
చేపలను తినడంలో ఇంకొక ప్రయోజనం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “మనం చేపలు ఎక్కువ తింటే మనకు ఇతర ఆహార పదార్థాలను తినబుద్ధి కాదు’’ అన్నారు హూపర్.
చేపల తినని వారికి కలిగే నష్టాల గురించి పూర్తిస్థాయిలో పరిశోధనలు లేకపోయినా, తినేవాళ్లకు మాత్రం చాలా ప్రయోజనాలున్నాయి అన్నారు కాల్డర్. ఒమేగా-3 ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ముఖ్యంగా గుండెకు మంచిదని ఆయన చెప్పారు.
కాకపోతే మనం తినే చేపలు ఎంత ఆరోగ్యవంతమైనవి అన్నదే అసలు సమస్య. “ ఆల్గేను పెంచడం, ఒమేగా-3ని సేకరించడంపై పరిశోధనలు వేగవంతం కావచ్చు’’ అన్నారు కాల్డర్.
మంచి రకం చేపలేవో వెతుక్కుని తినడం వల్ల కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. మెరైన్ కన్జర్వేషన్ సొసైటీ ఏయే రకాల చేపలు మంచివో ఒక జాబితా తయారు చేసింది.
133 రకాల చేపల జాతులలోని 50 రకాల చేపలను మంచివిగా ఈ జాబితాలో పేర్కొంది. అదృష్టం కొద్దీ మనకు ఎక్కువగా లభించే, ఎక్కువమంది ఇష్టపడే సాలమన్‌లు, రొయ్యలు, కాడ్, మెకెరెలో, ఆయ్‌స్టర్స్, హాలిబాట్‌లాంటి చేపజాతులు ఈ లిస్టులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














