లెస్టర్: హిందూ, ముస్లిం ఘర్షణ మిగిల్చిన గాయాలతో పోరాడుతున్న బ్రిటిష్ నగరం

లెస్టర్
ఫొటో క్యాప్షన్, లెస్టర్
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లెస్టర్ వీధుల్లో భారత సంతతికి చెందిన కీత్ వాజ్ ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చేయడం చూస్తుంటే 2022 సెప్టెంబర్‌లో హిందువులు, ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన ప్రదేశం ఇదేనా అని అనిపిస్తుంది.

యూకేలోని తూర్పు లెస్టర్ స్థానంలో కీత్ వాజ్ 32 ఏళ్ల పాటు లేబర్ పార్టీ ఎంపీగా పనిచేశారు. ఈసారి ఆయన వన్ లెస్టర్ అనే కొత్త పార్టీ నుంచి బరిలోకి దిగారు. లెస్టర్‌తో చాలా ఏళ్లుగా అనుబంధం ఉన్న ఆయన ఇక్కడ సుపరిచితులు.

అయితే, విభిన్న సంస్కృతులకు ఉదాహరణగా పరిగణించే లెస్టర్ విషయంలో అప్పుడు జరిగిన హింస, ఉద్రిక్తతల గురించి కీత్ వాజ్ వారితో మాట్లాడలేదు.

ప్రజలను కలిసినప్పుడు స్థానిక సమస్యలపైనే మాట్లాడుతుంటారు.

వాట్సాప్
 బెల్‌గ్రేవ్ రోడ్‌లో రెస్టారెంట్
ఫొటో క్యాప్షన్, ధర్మేష్ లఖానీ బెల్‌గ్రేవ్ రోడ్‌లో రెస్టారెంట్ నడుపుతున్నారు

‘నగరం దహనమైనట్లు కనిపించింది’

2022 సెప్టెంబర్ 17న రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు వీధుల్లోకి వచ్చాయి. ఈ ఘర్షణల్లో కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు, ఆందోళనలకు పాల్పడిన డజన్ల మందిని అరెస్టు చేశారు.

సాధారణంగా భారత్‌-పాకిస్తాన్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ల సమయంలో ఇలాంటి ఉద్రిక్తత కనిపించేదని స్థానికులు చెప్పారు. కానీ 2022లో పరిస్థితి మరింత దిగజారింది, రెండు వర్గాల మధ్య ఆగ్రహం స్పష్టంగా కనిపించింది.

లెస్టర్‌లోని బెల్‌గ్రేవ్ రోడ్డులో గుజరాత్ సంతతికి చెందిన ధర్మేష్ లఖానీ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఆయన మదిలో మెదులుతూనే ఉన్నాయన్నారు.

ధర్మేష్ బెల్‌గ్రేవ్ రోడ్‌లో హింస జరిగిన ప్రదేశాన్ని చూపిస్తూ "ఆ రోజు వందలాది మంది ఇక్కడే గుమిగూడారు. చాలా కోపంగా ఉన్నారు. నేను ఇక్కడ నిలబడి ఏం జరుగుతుందోనని చూశాను. మా నగరం దహనమైనట్లు అనిపించింది" అని అన్నారు.

లఖానీ బెల్‌గ్రేవ్ రోడ్‌లోని కార్ వాష్‌ షాపును చూపిస్తూ "ఈ కార్ వాష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. లోపల దాదాపు 150 నుంచి 200 మంది హిందువులున్నారు. బయట పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నారు" అని అన్నారు ధర్మేష్.

కార్ వాష్‌కి ఎదురుగా హిందూ దేవాలయం ఉందని, అల్లరి మూకలోని కొందరు ఆలయం గోడ దూకి, అందులోని జెండాను తీసి, తగలబెట్టేందుకు ప్రయత్నించారని ధర్మేష్ చెప్పారు.

"జెండా కాలిపోతుండటంతో వెంటనే మరో ముస్లిం యువకుడు మంటలను ఆర్పివేశారు, అప్పటికే అది కొద్దిగా కాలిపోయింది. అలా జెండాలకు నిప్పుపెట్టేవాళ్లు హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించేవారే. కానీ ఆ గుంపులోని అందరూ అలా లేరు. అయితే, అప్పుడు జరిగినదైతే సరైంది కాదు, ఇరు వర్గాలు చాలా బాధపడ్డాయి’’ అని అన్నారు ధర్మేష్.

ఆనాటి బీబీసీ రిపోర్టు ప్రకారం ఈ హింసలో చర్చిలు, మసీదులు, దేవాలయాలను అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకున్నాయి.

లెస్టర్
ఫొటో క్యాప్షన్, లెస్టర్

ఎన్నికల ‘ఫీవర్’

బ్రిటన్‌లో జులై 4న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈస్ట్ లెస్టర్ స్థానం నుంచి మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది దక్షిణాసియా మూలాలు ఉన్నవారు.

ఈ అభ్యర్థులు లెస్టర్‌లో పెద్దసంఖ్యలో స్థిరపడిన దక్షిణాసియా జనాభా ఓట్లతో ఈ సీటును గెలుచుకోవాలని ఆశిస్తున్నారు.

అయితే దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో ఎన్నికల వాతావరణం కనిపించే తీరుకు లెస్టర్ చాలా భిన్నంగా ఉంది. ఇక్కడ కొంతమంది అభ్యర్థుల పోస్టర్లు, బ్యానర్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపించవు.

చాలావరకు శని, ఆదివారాల్లో ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. ఎందుకంటే ఉద్యోగాలు చేసేవారు, పనులకు వెళ్లేవారు ఆరోజు ఎక్కువగా ఇంట్లో ఉంటారు. అభ్యర్థులు ప్రచారం కోసం ప్రజల ఇళ్లకు, దుకాణాలకు వెళుతున్నారు.

చాలామంది దృష్టి తూర్పు లెస్టర్ సీటుపై ఉంది. ఎందుకంటే 2022 సంఘటనల తర్వాత దక్షిణాసియా వాసులు ఏ పార్టీ లేదా అభ్యర్థిపై విశ్వాసం ఉంచారనేది ఆసక్తికరంగా మారింది.

కీత్ వాజ్
ఫొటో క్యాప్షన్, భారత సంతతికి చెందిన కీత్ వాజ్, తూర్పు లెస్టర్ స్థానం నుంచి లేబర్ పార్టీ ఎంపీగా పనిచేశారు.

'వైవిధ్యానికి ఉదాహరణ'

1951 జనాభా లెక్కల ప్రకారం లెస్టర్‌లో దక్షిణాసియా మూలాలున్నవారు 624 మంది. కానీ, ఇప్పుడు బ్రిటిష్ సౌత్ ఆసియన్లు అత్యధికంగా ఉన్న నగరాల్లో లెస్టర్ ఒకటి.

1950ల నుంచి భారతీయులు, పాకిస్తానీలు చెయిన్ మైగ్రేషన్ ద్వారా లెస్టర్‌కు వచ్చారు. అంటే, వారి కుటుంబ సభ్యులు లేదా గ్రామస్తులు మొదట ఇక్కడ నివసించారు, దీంతో వాళ్లు కూడా ఇక్కడకు వచ్చారు. లెస్టర్ వారికి ఆకర్షణీయంగా కనిపించింది. ఇది సంపన్నమైనది కూడా. డన్‌లాప్, ఇంపీరియల్ టైప్‌రైటర్, హోజరీ మిల్లులలో ఉద్యోగాలూ ఉన్నాయి.

చాలామంది కొత్తవారు మొదట్లో ఉత్తర, తూర్పు లెస్టర్‌లోని బెల్‌గ్రేవ్ రోడ్, స్పిన్నే హిల్ పార్క్ వంటి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వచ్చినవారిలో భారతదేశ విభజన సమయంలో హింసను చూసిన హిందువులు, ముస్లింలు, సిక్కులు కూడా ఉన్నారు.

1960వ దశకం ప్రారంభంలో వారి కుటుంబాలు కూడా ఇక్కడికి రావడం ప్రారంభించాయి. లెస్టర్ దశాబ్దాలుగా సాంస్కృతిక వైవిధ్యం, సహనం, సమాజ ఐక్యతకు ఒక ఉదాహరణగా ఉంటోంది.

ఈస్ట్ లెస్టర్ మాజీ ఎంపీ కీత్ వాజ్ మాట్లాడుతూ "లెస్టర్ గురించి తెలిసిన ఎవరికైనా ఇది షాకింగ్‌గా అనిపిస్తుంది. ఇది విభిన్న మతాలు, నేపథ్యాలకు చెందిన వ్యక్తులతో ఉన్న ప్రదేశం. ఆ ఘటన జరిగినప్పుడు నాకు షాక్‌గా అనిపించింది. మేం గతంలో అలాంటిది చూడలేదు" అని అన్నారు.

‘2022 హింస’ వెనుక కోవిడ్ లాక్‌డౌన్, ఇక్కడి ఆర్థిక పరిస్థితి, ఉపాధి లేకపోవడం సహా చాలా కారణాలు ఉన్నాయని కీత్ వాజ్ అభిప్రాయపడ్డారు.

"ఇది ఒక్కసారి మాత్రమే జరిగే సంఘటన అనుకుంటున్నా. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి" అని ఆయన సూచించారు.

లెస్టర్

ఘర్షణ జరిగిన బెల్‌గ్రేవ్ రోడ్ ఎలా ఉంటుంది?

బెల్‌గ్రేవ్ రోడ్‌కి వస్తుంటే మీరు భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. రెస్టారెంట్లు అయినా దుస్తులు, జ్యువెలరీ షాపులైనా చాలావరకు భారత సంతతికి చెందిన వారివే ఇక్కడ కనిపిస్తాయి.

2022లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన ప్రాంతం ఇదే. ఇక్కడి వ్యాపారాలపై ఇప్పటికీ 2022 ఘర్షణ ప్రభావాలున్నాయి.

భారత సంతతికి చెందిన ఇమ్రాన్ పఠాన్ ఇక్కడ వివాహ దుస్తుల దుకాణాన్ని నడుపుతున్నారు.

"ఆ ఘర్షణ తరువాత వ్యాపారం కొద్దిగా దెబ్బతింది. ఇక్కడికి వచ్చే ముందు అంతా బాగానే ఉందా అని జనం ఆలోచించే విధంగా ఇది ప్రభావితమైంది. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య టీ-20 మ్యాచ్ జరిగింది. అలాంటప్పుడు కొనుగోలుదారులు ఉదయమే వస్తారు, మేం మ్యాచ్ జరగడానికంటే ముందే పని ముగిస్తాం. వారి మనస్సులో కొంచెం భయం ఉంది, అది దూరమవడానికి కొంత సమయం పడుతుంది" అని అన్నారు.

బెల్‌గ్రేవ్ రోడ్‌లోని ఇమ్రాన్ దుకాణానికి కొద్ది అడుగుల దూరంలో భారత సంతతికి చెందిన రంజు మోదా కూడా దుస్తుల దుకాణాన్ని నడుపుతున్నారు.

"ఇలాంటిది జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. గత రెండేళ్లుగా వ్యాపారం తగ్గింది. నగరం వెలుపల నుంచి వచ్చే మా దక్షిణాసియా కస్టమర్లు తగ్గారు. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ మీడియాలో కనిపించడంతో ఈ వ్యాపారం బాగా ప్రభావితమైంది’’ అని అన్నారు రంజు మోదా.

లెస్టర్

గత కొన్నేళ్లుగా లెస్టర్‌లోని కొన్ని వీధుల్లో హిందువులు, మరికొన్ని ప్రాంతాలలో ముస్లింలు మెజారిటీగా ఉంటున్నారు. అలాంటి ప్రాంతమే ఎవింగ్టన్ రోడ్. ఇక్కడ పెద్ద మసీదు ఉంది.

బెల్‌గ్రేవ్ రోడ్ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా నివసిస్తున్నారని హై ఫీల్డ్స్, ఎవింగ్టన్ రోడ్ వంటి ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

రెండు వర్గాల మధ్య ఉన్న టెన్షన్ కారణంగా ఒక్కోసారి ఒక వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు మరో వర్గం వారు సంకోచిస్తుంటారని కొందరు అంటున్నారు.

మొహమ్మద్ ఒవైస్
ఫొటో క్యాప్షన్, మొహమ్మద్ ఒవైస్, యూకే ఇండియన్ ముస్లిం కౌన్సిల్ డైరెక్టర్.

హిందూ వర్సెస్ ముస్లిం

2022లో జరిగిన సంఘటనలకు రెండు వర్గాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

లెస్టర్‌లో నివసించే మొహమ్మద్ ఒవైస్ యూకే ఇండియన్ ముస్లిం కౌన్సిల్ డైరెక్టర్.

"ముస్లిం సమాజం నిరంతరం బెదిరింపులకు గురవుతోంది. ప్రపంచ హిందూత్వ ఉద్యమం ద్వారా ముస్లిం జనాభాకు కోపం తెప్పించే వ్యూహాత్మక లక్ష్యం ఇక్కడ ఉందని మేం నమ్ముతున్నాం" అని అన్నారు.

అల్లర్లకు ముందు మతపరమైన సోదరభావం ఉందని ఒవైస్ అంటున్నారు.

"వారు తిరిగి రావాలని మేమూ కోరుకుంటున్నాం. లెస్టర్‌లోని చాలామంది హిందువులు శాంతిని కోరుకుంటున్నారు. ముస్లింలు, సిక్కులులతో హిందువులు సోదరభావంతో ఉంటారని మేమూ నమ్ముతున్నాం" అని ఆయన అన్నారు.

'ప్రజలు మరిచిపోలేదు'

హింస వల్ల కలిగే నష్టాన్ని ప్రజలు చూశారని, సోదరభావం, ఐక్యతతో జీవించడం ద్వారానే ముందుకు వెళ్లగలమని స్థానికులు అర్థం చేసుకున్నారని కీత్ వాజ్ అన్నారు.

లెస్టర్‌లోని చాలామంది ప్రజలు 2022 నాటి చెడు జ్ఞాపకాలను మరచిపోయి తమ జీవితాలను కొనసాగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందు ఇపుడు ద్రవ్యోల్బణం, ఉపాధి, పిల్లలకు మంచి విద్యను అందించడం గురించి అర్థం చేసుకోవాలని చాలామంది అంటున్నారు.

భారత సంతతికి చెందిన రీటా పటేల్ లెస్టర్ సిటీ కౌన్సిల్‌లో అసిస్టెంట్ మేయర్‌గా పనిచేశారు. ఆ సంఘటనలను ప్రజలు మరిచిపోలేదని ఆమె అంటున్నారు.

‘’ఆ సంఘటనలు అపనమ్మకాన్ని మిగిల్చాయి, ఇప్పుడు అంతా సద్దుమణిగినందున సమస్య లేదనుకోవడం తప్పు. మనం పాఠాలు నేర్చుకోవాలి. లేకపోతే మళ్లీ ఆ తప్పులు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది’’ అని రీటా సూచించారు.

"మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడినా ఆ సంఘటనలు వారిపై ఎలాంటి చెడు అభిప్రాయాన్ని కలిగించాయో మీకు అర్థమవుతుంది. అయితే, ఒక సంఘటన నగరాన్ని విచ్ఛిన్నం చేయబోదని అనుకుంటున్నా. ఇది ఒక షాక్ కావచ్చు, కానీ లెస్టర్ ప్రజలు ఎల్లప్పుడూ కష్టాలను అధిగమించి ముందుకు సాగుతారని భావిస్తున్నాను" అని ఆమె అన్నారు.

ప్రొఫెసర్ గుర్హర్‌పాల్ సింగ్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ గుర్హర్‌పాల్ సింగ్

న్యాయం కోసం ఎదురుచూపులు

లెస్టర్‌లో హింస వెనుక కారణాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం రెండు అధ్యయనాలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి ప్రభుత్వం జరుపుతుండగా, మరొకటి లండన్‌లోని ఎస్‌వోఏఎస్ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ గుర్హర్‌పాల్ సింగ్ గత 60 సంవత్సరాలుగా లెస్టర్‌లో నివసిస్తున్నారు.

2022 ఘర్షణ ప్రభావాలు నగరంలో ఇప్పటికీ ఉన్నాయని ఆయన అంటున్నారు.

"నగరంలో కమ్యూనిటీలు స్థిరపడిన ప్రాంతాలలో ప్రాదేశిక హక్కులపై ఘర్షణ వాతావరణం ఉంది. రామ మందిర ప్రతిష్ట, వేడుకల సమయంలో కూడా ఉద్రిక్తత నెలకొని ఉంది. దక్షిణాసియాలో ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగితే ఇక్కడ ఘర్షణ సృష్టించడానికి కొన్ని గ్రూపులు ఆసక్తి కనబరుస్తాయి" అని గుర్హర్‌పాల్ సింగ్ అన్నారు.

ఇది పాలనా వైఫల్యమా? అని గుర్హర్‌పాల్ సింగ్‌ను అడిగితే.. ఆయన సమాధానమిస్తూ "కచ్చితంగా. 60 సంవత్సరాలుగా లెస్టర్‌లో నివసిస్తున్న వ్యక్తిగా చెప్పగలను. ఆ సంక్షోభం తీవ్రతను పరిష్కరించడానికి జాతీయంగా లేదా స్థానికంగా సరైన స్పందన లేదు" అని అన్నారు.

లీసెస్టర్

పైకి చూస్తే పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడి ప్రజలతో మాట్లాడితే 2022లో జరిగిన హింసాత్మక ఘటనల టెన్షన్ వారిలో ఇంకా ఉందని అర్థమవుతుంది.

2022లో జరిగిన సంఘటన లెస్టర్ ప్రతిష్టను దిగజార్చిందని, ఆ చెడు జ్ఞాపకాల నుంచి నగరం ముందుకు వెళ్లాలంటే ఆ హింసకు కారకులైన వారిని గుర్తించి శిక్షించాల్సి ఉంటుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

ఇది పూర్తయ్యే వరకు లెస్టర్ గాయాలు అలాగే ఉంటాయని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)