పార్లమెంట్ సమావేశాలు: రాహుల్ ‘హిందూ’ వ్యాఖ్యలపై సభలో దుమారం

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, SANSADTV

ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌లో శివుడి చిత్రాన్ని చూపుతున్న విపక్ష నేత రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో రాహుల్ గాంధీ తీవ్ర వాగ్వాదానికి దిగారు.

రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతిని చేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు.

అయితే ప్రసంగం మధ్యలో శివుని బొమ్మను చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. బీజేపీ ఎంపీలు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. హిందూ సమాజం మొత్తం హింసావాదులన్నట్టుగా మాట్లాడటం తగదన్నారు.

మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నివీర్‌ పథకంపై కూడా రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అగ్నివీర్‌ సైనికులు ‘యూజ్‌ అండ్‌ త్రో’ కూలీలుగా మారారని అన్నారు.

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్
మోదీ, రాహుల్

ఫొటో సోర్స్, SANSADTV

ఫొటో క్యాప్షన్, హిందువులమని చెప్పుకునేవారూ 24 గంటలూ ద్వేషం అంటున్నారని రాహుల్ విమర్శించారు.

హిందూ అంటే మోదీ, ఆర్ఎస్ఎస్ కాదు

రాహుల్ గాంధీ తన ప్రసంగం సందర్భంగా శివుని చిత్రాన్ని చూపిస్తూ... ‘‘మోదీజీ ఒక రోజు తన ప్రసంగంలో భారత్ ఎవరిపైనా దాడి చేయదని, దానికి కారణం ఉందని, భారత్ అహింసను అనుసరిస్తుందని, అది ఎవరికీ భయపడదని చెప్పారు’’ అని గుర్తు చేశారు.

‘‘మన మహాపురుషులు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. భయపడొద్దు, ఎవరినీ భయపెట్టొద్దన్నారు. శివుడు ఓ చేతిలో అభయహస్తాన్ని చూపిస్తూ త్రిశూలాన్నే పక్కనపెట్టేశారు. కానీ హిందువులమని చెప్పుకునేవారు మాత్రం 24 గంటలూ హింస, ద్వేషం అంటున్నారు. మీరు అసలు హిందువులే కాదు, సత్యాన్ని సమర్థించాలని హిందూమతంలో స్పష్టంగా రాసి ఉంది’’ అని రాహుల్ అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘ఈ అంశం చాలా తీవ్రమైనది, మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకం అని పేర్కొనడం తీవ్రమైన విషయం’’అన్నారు.

తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీజీ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదు.. బీజేపీ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే పూర్తి హిందూ సమాజం కాదు’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, SANSADTV

‘అగ్నివీర్’ పథకంపై నిప్పులు

మోదీ ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్ పథకంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

‘‘మందుపాతర పేలి ఒక అగ్నివీరుడు అమరుడయ్యారు. నేను ఆయన్ను అమరవీరుడని అంటున్నాను. కానీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ఆయన్ను అమరవీరుడు అని పిలవరు. వారు ఆయన్ను అగ్నివీర్ అని పిలుస్తారు. ఆయనకు పెన్షన్ రాదు. ఆ ఇంటికి పరిహారం అందదు" అని రాహుల్ అన్నారు.

‘‘ఓ సాధారణ సైనికుడు పెన్షన్ పొందుతారు. కానీ అగ్నివీర్‌ను సైనికుడని పిలవరు. అగ్నివీరులను కూలీల్లా వాడుకుని వదిలేస్తున్నారు. మీరు వారికి ఆరు నెలలు శిక్షణ ఇస్తున్నారు. కానీ, వారు ఐదేళ్ళు శిక్షణ పొందిన చైనా సైనికుడి ముందు నిలబడాల్సి వస్తోంది’’ అని రాహుల్ చెప్పారు.

‘‘మీరు సైనికులు, ఇతరులకు మధ్య వివాదం సృష్టించారు. ఒకరు పెన్షన్ పొందుతారు, అమరవీరుడి హోదా పొందుతారు. కానీ మరొకరు పెన్షనూ పొందరు, అమరవీరుడి హోదానూ పొందరు. కానీ మిమ్మల్ని మీరు దేశభక్తులని పిలుచుకుంటారు. కానీ ఇది ఏ రకమైన దేశభక్తి?’’ అని రాహుల్ విమర్శించారు.

‘‘అగ్నివీర్ సైనిక పథకం కాదు, అది ప్రధాని కార్యాలయ పథకం. ఈ పథకం ప్రధాని మానసపుత్రిక అని సైన్యమంతటికీ తెలుసు’’ అని రాహుల్ చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రసంగం మధ్యే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జోక్యం చేసుకుంటూ ‘‘తప్పుడు ప్రచారం చేస్తూ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయొద్దు. యుద్ధంలో లేదా సరిహద్దు భద్రత చూస్తున్న సమయంలో ఎవరైనా అగ్నివీరులు మరణిస్తే, వారి కుటుంబానికి కోటి రూపాయల సహాయం అందచేస్తాం’’ అని చెప్పారు.

తరువాత హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. సభలో అబద్ధాలు చెప్పవద్దని రాహుల్ గాంధీకి సూచించారు.

కోటి రూపాయలు ఇవ్వలేదని ఆయన (రాహుల్‌గాంధీ) అంటున్నారని.. అమరులైన అగ్నివీరుడికి కోటి రూపాయలు వస్తాయని రాజ్‌నాథ్‌సింగ్ అధికారికంగా ప్రకటించారని, సభ అబద్ధాలు చెప్పే స్థలం కాకూడదని అమిత్ షా అన్నారు.

"ఇక్కడ నిజం మాట్లాడాలి. నిజాన్ని ధృవీకరించలేకపోతే సభకు, దేశానికి అగ్నివీర్‌లకు క్షమాపణలు చెప్పాలి" అని ఆయన అన్నారు.

అయితే రాహుల్ మాట్లాడుతూ.. ‘‘అగ్నివీరులకు సంబంధించిన నిజాన్ని నేను సభ ముందుంచాను. రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా మాట్లాడారు. భారత సైన్యానికి, అగ్నివీర్‌కి నిజానిజాలు తెలుసు. వాళ్లు (అధికారపక్షం) లేదా నేను ఏం మాట్లాడినా పర్వాలేదు. ఎవరు నిజం చెబుతారో వాళ్లకు తెలుసు" అని అన్నారు.

తన ప్రకటన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు .. ‘‘ఈ అంశం తీవ్రమైనది. రాహుల్ గాంధీ తాను చెప్పిన విషయాలను నిరూపించాలి’’ అన్నారు.

హోం మంత్రి అమిత్ షా

ఫొటో సోర్స్, SANSADTV

నీట్, రైతులు, మణిపుర్

నీట్ పేపర్ లీక్, మణిపుర్‌ అంశాలపై కూడా రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రభుత్వ పాత నిర్ణయాలపై కూడా ఆయన బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు.

నీట్ పరీక్ష ధనికులకు సంబంధించినదని.. చాలా మంది అభ్యర్థులతో మాట్లాడానని.. ధనవంతులకు ఉపయోగపడే విధంగా పరీక్షల సరళి ఉంటోందని చెప్పారు.

‘'నీట్‌పై ఒకరోజు చర్చ జరగాలని మేము కోరుతున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండు కోట్ల మంది యువత నష్టపోయారు. గత ఏడేళ్లలో 70 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. దీనిపై ఒక రోజు చర్చ జరగాలని మేం కోరుతున్నాం’’ అని అన్నారు.

రైతు ఉద్యమ అంశాన్ని కూడా లేవనెత్తిన రాహుల్ గాంధీ.. రైతులను తీవ్రవాదులు అనేంత దురహంకారంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రైతు ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించేందుకు ఒక నిమిషం మౌనం పాటించాలని అనుకున్నామని, అయితే మీరు వారిని తీవ్రవాదులని చెప్పి నిరాకరించారన్నారు. వారికి కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీని ఇవ్వలేకపోయారని విమర్శించారు.

తరువాత మణిపుర్ హింసపై మాట్లాడిన రాహుల్ గాంధీ, మణిపుర్ ఈ దేశంలో భాగం కాదన్నట్లుగా ప్రధాని, హోంమంత్రి వ్యవహరిస్తున్నారని, అక్కడి హింసపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, బీజేపీ రాజకీయాలు, విధానాలు మణిపుర్‌ను తగులబెట్టాయని.. అంతర్యుద్ధం అంచుకు నెట్టాయని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)