మహిళను మింగిన కొండచిలువ, దాని తల నరికేసిన భర్త

ఫొటో సోర్స్, POLICE HANDOUT
ఓ మహిళను కొండచిలువ మింగింది. ఆమె కొండచిలువ కడుపులోనే మృతి చెందారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.
కొండచిలువలు మనుషులను మింగడం చాలా అరుదు. అయితే ఈ ప్రాంతంలో గడిచిన నెలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.
దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని సితేబా గ్రామానికి చెందిన 36 ఏళ్ల సిరియాతి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమారుడికి మందుల కోసం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదు. వారి ఇంటికి 500 మీటర్ల దూరంలో సిరియాతి చెప్పులు, బట్టలు కనిపించడంతో భర్త అడియన్సా అధికారులకు సమాచారం అందించారు.
"సిరియాతి భర్త అడియన్సా కొండచిలువను చూశారు. పాము పొట్ట భాగా ఉబ్బి ఉండటంతో దాని తలను ఆయన నరికేశారు. అనంతరం ఆ కొండచిలువ ఉబ్బిన కడుపుని కోశారు" అని స్థానిక పోలీసు చీఫ్ ఇదుల్ బీబీసీతో చెప్పారు.
ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ ప్రావిన్సులోనే ఇలాంటి ఘటన జరిగింది. ఒక మహిళను ఐదు మీటర్ల పొడవున్న కొండచిలువ మింగేసింది. దీంతో కొండచిలువ దాడిని ఊహించి, ఎప్పుడూ కత్తిని తీసుకెళ్లాలని పోలీసులు ఆ చుట్టపక్కల ప్రాంతాల ప్రజలకు సూచించారు.


ఫొటో సోర్స్, POLICE HANDOUT
కొండచిలువలు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి?
జంతువుల దాడులకు, అడవుల నరికివేతకు సంబంధం ఉంటుందని దక్షిణ సులవేసి ఎన్విరాన్‌మెంటల్ ఇన్‌స్టిట్యూట్‌లోని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలో మైనింగ్ కోసం, సాగు కోసం భూమిని చదును చేయడం (అడవులను నరికివేయడం) భారీగా పెరుగుతోందని సంస్థ డైరెక్టర్ ముహమ్మద్ అల్ అమీన్ బీబీసీకి తెలిపారు.
"దీని ఫలితంగా ఈ జంతువులు ఆహారం కోసం బయటకు వెళ్లి, మానవ నివాస ప్రాంతాలలో వేటాడతాయి. నేరుగా మనుషులపై దాడి చేస్తాయి" అని అమీన్ చెప్పారు.
అడవి పందులను కొండ చిలువలు వేటాడుతాయని పోలీసు అధికారి ఈదుల్ తెలిపారు. కానీ, ప్రస్తుతం ఇక్కడి అడవిలో పందుల సంఖ్య చాలా తగ్గిపోయింది.
ఈ ప్రాంతంలో ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొండచిలువ మనిషిని ఎలా తింటుంది?
ఇండోనేషియాలోని రెటిక్యులేటెడ్ పైథాన్ జాతికి చెందిన కొండచిలువలు మనుషులను మింగుతుంటాయి. రెటిక్యులేటెడ్ పైథాన్‌లు 10 మీటర్లకు పైగా పొడవు పెరుగుతాయి. చాలా శక్తివంతమైనవి.
దొంగచాటుగా దాడి చేస్తాయి. అవి తమ ఆహారం లేదా ఎర కోసం తిరుగుతాయి. ఎర కనిపించగానే ట్రాప్ చేస్తాయి. వాటి బలాన్ని ఉపయోగించి ఎరను చూర్ణం చేస్తాయి. గట్టిగా బంధిస్తాయి. ఈ పరిస్థితిలో ఎరకు శ్వాస కష్టమవుతుంది. నిమిషాల వ్యవధిలోనే ‘ఎర’ ఊపిరాడక లేదా గుండెపోటుకు గురై చనిపోతుంది.
కొండచిలువలు తమ ఎరను మొత్తం మింగేస్తాయి. వాటి దవడలు సులువుగా వ్యాకోచిస్తాయి. దాంతో, ఎర పెద్దదైనా సరే దాని చుట్టూ దవడలను విస్తరింపజేసేస్తుంది.
కానీ మనుషులను మింగే సమయంలో కొండచిలువకు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ముఖ్యమైన అంశం మానవ భుజాలు. మనిషి భుజాలు కదలకుండా బలంగా ఉంటాయి’’ అని మేరీ-రూత్ బీబీసీతో చెప్పారు.
మేరీ రూత్ సింగపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లు లేదా అభయారణ్యాలకు పరిరక్షణ, పరిశోధన అధికారి, రెటిక్యులేటెడ్ పైథాన్ నిపుణురాలు.
కొండచిలువలు కొన్నిసార్లు మొసళ్ల వంటి సరీసృపాలను తింటాయని అయితే, ఎక్కువగా క్షీరదాలే వాటి ఆహారమని మేరీ-రూత్ చెప్పారు.
"సాధారణంగా అవి ఎలుకలు, ఇతర చిన్న జంతువులను తింటాయి. కానీ కొండచిలువ ఒక నిర్దిష్ట పరిమాణంలో పెరిగిన తర్వాత ఎలుకలు వాటికి సరిపోవు. వాటి నుంచి పొందే శక్తి ఆ భారీ పాముకు సరిపోదు" అని మేరీ వివరించారు.
అవి పందులను, ఆవులను కూడా తింటాయని రూత్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మెదడును తినే అమీబా సోకి కేరళలో ముగ్గురు మృతి, ఇదెలా సోకుతుంది? దీని బారిన పడకుండా ఉండటం ఎలా?
- నుస్రత్ ఫతే అలీ ఖాన్: ఇంతవరకు ఎవరూ వినని 4 ఖవ్వాలీల రిలీజ్ ఎప్పుడంటే
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- ‘మా ముత్తాత విశాఖపట్నానికి తొలి ఎంపీ. కానీ మాకు తినడానికి తిండి లేదు. పనసపళ్లు తిని బతుకుతున్నాం’
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















