మెదడును తినే అమీబా సోకి కేరళలో ముగ్గురు మృతి, ఇదెలా సోకుతుంది? దీని బారిన పడకుండా ఉండటం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.నందకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''కేరళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా'' అని శుక్రవారం ఒక్కరోజే దాదాపు 20 వేల మందికిపైగా గూగుల్‌లో వెతికారు. గత కొద్ది నెలల్లోనే కేరళలలో మెదడుని తినే అమీబా సోకి ముగ్గురు మరణించడమే అందుకు ప్రధాన కారణం.
చనిపోయిన ముగ్గురికీ మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ఈ మరణాలు ఇన్ఫెక్షన్ ఎంత ప్రమాదకరమైనదో తెలియజేస్తున్నాయి.
కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్, కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల దక్షిణ, మలప్పురానికి చెందిన 5 ఏళ్ల ఫద్వా అమీబా ఇన్ఫెక్షన్‌తో మృతి చెందారు.
మెదడు కణజాలాన్ని నాశనం చేసి, మెదడు వాపునకు కారణమయ్యే ఈ అమీబా సోకిన వారిలో 97 శాతం మందికి పైగా మరణిస్తున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

కేరళలో ఏం జరిగింది?
కోజికోడ్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి మృదుల్‌కు చెరువులో స్నానం చేసిన తర్వాత తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి.
అతన్ని మొదట కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ నిర్వహించిన పరీక్షల్లో 'ప్రైమరీ అమీబిక్ మెనింగోయిన్సెఫాలైటిస్ అనే మెదడును తినే 'అమీబా ఇన్ఫెక్షన్'కు గురైనట్లు నిర్ధరణ అయింది.
తీవ్ర అస్వస్థతకు గురవడంతో జూన్ 24 నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నారని, మృదుల్ చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
''తదుపరి చికిత్స కోసం బాలుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వచ్చేప్పటికే తను స్పృహలో లేడు. వెంటనే అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' నిర్ధరణ పరీక్షలు నిర్వహించాం. యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలు సూచించాం. కానీ, మేం అతని ప్రాణాలు కాపాడలేకపోయాం'' అని కోజికోడ్‌లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అబ్దుల్ రౌబ్ చెప్పారు.
ఇదే తరహాలో, కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల దక్షిణ అనే బాలిక మెదడును తినేసే అమీబా సోకి జూన్ 12న మరణించింది.
స్కూల్ టూర్‌లో భాగంగా మున్నార్‌కు వెళ్లినప్పుడు, స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేయడంతో దక్షిణ అమీబా బారిన పడినట్లు వార్తా సంస్థ ది హిందూ రిపోర్ట్ చేసింది.
ఈ ఘటన కంటే ముందు, మలప్పురానికి చెందిన 5 ఏళ్ల ఫద్వా మే ఒకటో తేదీన తన ఇంటికి సమీపంలోని కడలుండి నదిలో తన బంధువులతో కలిసి స్నానం చేసింది.
మే 10న వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం అమీబా ఇన్ఫెక్షన్‌తో చిన్నారి కన్నుమూసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా'?
'ప్రైమరీ అమీబిక్ మెనింగోయిన్సెఫాలైటిస్' అనేది మెదడును తినేసే అమీబా అయిన 'నెగ్లేరియా ఫౌలెరి' వల్ల కలిగే ఇన్ఫెక్షన్.
నేగ్లేరియా ఫౌలెరి అమీబా అనేది ఒక రకమైన ఏక కణ జీవి అని, వెచ్చగా ఉండే మంచినీటి సరస్సులు, నదుల్లో ఇది కనిపిస్తుందని సీడీసీ పేర్కొంది.
సరస్సులు, నదులు, అపరిశుభ్రంగా ఉండే స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉండే కనిపించే ఏకకణ జీవిని అమీబాగా పిలుస్తాం. అలాంటి ప్రదేశాల్లో స్నానం చేసేప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా కొందరి శరీరంలోకి చొరబడుతుంది.
''అమీబా ముక్కులో నుంచి మెదడుకు చేరుతుంది. మెదడు కణజాలాన్ని నాశనం చేయడంతో పాటు బాధను కలిగిస్తుంది. ఈ అమీబా సోకిన వ్యక్తికి జ్వరం వస్తుంది. ఆ తర్వాత చనిపోతారు'' అని డాక్టర్ అబ్దుల్ రౌబ్ చెప్పారు.
చాలా అరుదైన సందర్భాల్లో, సరిగ్గా క్లోరినేషన్ చేయని వాటర్ పార్కుల్లోనూ ఈ అమీబా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని సీడీసీ తెలిపింది.
అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, అమెరికాలో ప్రతి ఏటా ఈ అమీబా బారిన పడుతున్న వారి సంఖ్య 10 మంది కంటే తక్కువే. కానీ, వారిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యాధి లక్షణాలు..
మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు మొదట తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అమీబా వేగంగా వృద్ధి చెందడంతో, వ్యాధి లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుంచి 18 రోజుల్లోపు బాధితులు చనిపోయే అవకాశం ఉంది. సీడీసీ ప్రకారం, సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన 5 రోజుల తర్వాత కోమాలోకి వెళ్లడం, ఆ తర్వాత మరణం సంభవించవచ్చు.
శరీరంలో అమీబా వృద్ధి చెందిన తర్వాత మెడ బిగుసుకుపోవడం, చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం, బ్యాలెన్స్ తప్పిపోవడం, మనోభ్రాంతి వంటి సమస్యలు తలెత్తుతాయని సీడీసీ పేర్కొంది.
ఇది చాలా అరుదైన ఇన్ఫెక్షన్ కావడంతో సాధారణ వైద్య పరీక్షల ద్వారా గుర్తించడం కష్టం. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మరణించిన తర్వాతే ఈ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయ్యే పరిస్థితి.

ఫొటో సోర్స్, Getty Images
కొన్నిచోట్ల మాత్రమే ఎందుకు వ్యాపిస్తుంది?
వేసవిలో సరస్సులు, నదులు, స్విమ్మింగ్ పూల్స్‌లో నీళ్లు ఎక్కువ కాలం వేడిగా ఉన్నప్పుడు ఈ అమీబా ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
తక్కువ నీటి నిల్వలు, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం ఈ అమీబా ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణాలుగా సీడీసీ చెబుతోంది.
''చెరువులు, నదులు, స్విమ్మింగ్‌పూల్స్‌లో ఈత కొట్టేందుకు దిగినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది'' అని డాక్టర్ అబ్దుల్ రౌబ్ చెప్పారు.
నీటిని తాగడం వల్ల అమీబా ఇన్ఫెక్షన్ రాదని, అది ఒకరి నుంచి మరొకరికి సోకదని సీడీసీ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చాలా మంది చెరువులు, నదుల్లో స్నానాలు చేసేందుకు ఇష్టపడతారు. కొంతమంది స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి?
ఈ అమీబా ఇన్ఫెక్షన్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి డాక్టర్ అబ్దుల్లా కొన్ని సూచనలు చేశారు. అవి..
- తక్కువ నీరు ఉన్న, నిర్వహణ సరిగ్గా లేని స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లకుండా ఉండడం మంచిది.
- కలుషిత చెరువులు, నదుల్లో స్నానం చేయకూడదు.
- స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ చేయాలి.
- ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి, తల కిందికి పెట్టి నీటిలో దూకడం, డైవింగ్ వంటివి చేయకుండా తల పైకి ఉండేలా చూసుకోవాలి.
కేరళ ప్రభుత్వం ఏమంటోంది?
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో మెదడును తినే అమీబా కారణంగా జరిగిన మరణాలపై చర్చించారు. సీఎం విజయన్ కొన్ని సూచనలు కూడా చేశారు.
అపరిశుభ్రమైన నీటిలో స్నానాలు చేయవద్దని, స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు.
పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్‌కు ఎక్కువగా అవకాశం ఉన్నందున, ఇన్‌ఫెక్షన్‌ను రాకుండా నివారించేందుకు చెరువులు, నదుల వద్దకు వెళ్లినప్పుడు 'స్విమ్మింగ్ నోస్ క్లిప్'లు ఉపయోగించాలని, అలాగే, చెరువులు, నదులను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















