అస్సాంలో ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్ బికినీ ఫొటోల వివాదం, స్కూల్‌లో వివక్ష చూపించారా

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, గువాహాటీ నుంచి బీబీసీ కోసం
‘‘ఆ రోజు రాత్రి ప్రిన్సిపల్ ఫోన్‌లో ‘అవమానకరం, సిగ్గుచేటు’ అని చెప్పిన రెండు మాటలు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాను. బహుశా ఇక మరచిపోలేనేమో. ఓ టీచర్ ఇలా ప్రతిస్పందిస్తారని నేనెప్పుడూ ఊహించలేదు’’
‘‘నా అస్తిత్వంపై దాడి జరిగినట్లు అనిపించింది. నేను తీవ్ర దిగ్భ్రాంతి చెందాను’’
ఈ మాటలు చెప్పిన తరువాత 17 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్ కొన్ని నిమిషాలు వేదనతో మౌనంగా ఉండిపోయారు.
ఆ స్టూడెంట్ గువాహాటీలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బికినీ చిత్రాలు పోస్ట్ చేసినందుకు, ఆ స్టూడెంట్‌ను స్కూల్ నుంచి బహిష్కరించారు.
దీనిపై అంతటా చర్చ జరుగుతోంది.
తమ బిడ్డపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు తల్లి ఫిర్యాదు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రికి ఆమె ఓ బహిరంగ లేఖ కూడా రాశారు.
అయితే ఆ ఆరోపణలన్నీ నిరాధారమని స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. ఆ చిత్రాలు అభ్యంతరకరంగా ఉండటంతో వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని మాత్రమే కోరినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, GETTY IMAGES
‘ఆ మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి’
సోషల్ మీడియాలో బికినీ చిత్రాలు పోస్టు చేసిన విషయం గురించి ఆ స్టూడెంట్ మాట్లాడుతూ.. ‘‘ఆ చిత్రాలు జూన్ 9న మేం కుటుంబంతో సెలవులు గడపడానికి వెళ్లినప్పుడు తీసినవి. ఆ సమయంలో నేను స్విమ్మింగ్ పూల్ వద్ద కొన్ని ఫొటోలు దిగాను. వాటినే నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాను’’ అని చెప్పారు.
‘‘ఇప్పటి వరకు నేను ప్రజల నుంచి ఎదుర్కొన్న తిట్లు నన్ను తీవ్రమైన అభద్రతకు గురిచేశాయి. నాకు నేను సానుకూలంగా, సంతోషంగా ఉండేలా తయారవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.
ఆ స్టూడెంట్ చెప్పిన ప్రకారం జూన్ 10 రాత్రి 9 గంటల సమయంలో ప్రిన్సిపల్ ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టారు.
‘‘నేను చాలా భయపడ్డాను. ఫోన్ మా అమ్మకు ఇచ్చాను. ఫోన్ స్పీకర్ ఆన్ అయి ఉంది. అవతలి వైపు నుంచి ప్రిన్సిపల్ మాట్లాడుతూ నాకు సిగ్గులేదని, అవమానకరంగా ఉన్నానని’’ చెప్పారు.
‘‘ఆ రెండు మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ రెండు మాటలు మాట్లాడింది ఏ సాధారణ మనిషో, చదువుకోని వ్యక్తో కాదు’’ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్ తల్లి ఏం చెప్పారు?
ప్రిన్సిపల్ తనకు గానీ, తన భర్తకు గానీ ఫోన్ చేయకుండా ఫోటోల గురించి నేరుగా తన కుమార్తె నంబర్‌కే ఫోన్ చేయడంపై విద్యార్థి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రిన్సిపల్ ఫోటోలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అర్ధనగ్నం’ అనే పదాలు ఉపయోగించారు’’ అని ఆమె తెలిపారు.
‘‘రేపు మీరు స్కూలుకు వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్లండి. మీరు కట్టిన అడ్మిషన్ ఫీ తిరిగి ఇచ్చేస్తాం’’ అని ప్రిన్సిపల్ చెప్పారని ఆమె ఆరోపించారు.
దీంతో తన కుమార్తె వేదనకు గురైందని, తరువాత రోజు ఆమెను సైకియాట్రిస్ట్ వద్దకు కౌన్సెలింగ్‌కు తీసుకువెళ్లినట్టు చెప్పారు.
తరువాత రోజు తాను ప్రిన్సిపల్‌తో మాట్లాడటానికి వెళ్లినప్పుడు ఆయన సరైన తీరుతో మాట్లాడలేదని ఆమె ఆరోపించారు.
‘‘చాలాసేపు మాట్లాడిన తరువాత స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థి తమ స్కూల్లో చదువు కొనసాగించాలంటే ఆమె ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి బయటకు రావాలి. ఆమె తన శరీరంపై ఉన్న టాటూలను తొలగించుకోవాలి. స్కూల్లో సైకియాట్రిస్టు దగ్గర కౌన్సెలింగ్ తీసుకోవాలి అనే మూడు షరతులు విధించారని’’ తల్లి తెలిపారు.
‘‘మీ బిడ్డపై మనసులో బోలెడంత వ్యతిరేకత పెట్టుకున్నచోటుకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎందుకు పంపుతారు? అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రిన్సిపల్ ఏం చెబుతున్నారు?
విద్యార్థి జెండర్ ఐడెంటీటీ విషయంలో స్కూల్‌కు ఎలాంటి సమస్య లేదని ప్రిన్సిపల్ చెప్పారు. దీంతోపాటు స్టూడెంట్‌కు కౌన్సెలింగ్ ద్వారా మానసిక సాయం అందిస్తున్నామని.. టీచర్లు, విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు.
‘‘ఆ విద్యార్థి 9, 10 తరగతులలో ఉన్నప్పుడు అంతా సాధారణంగానే ఉండేది. కానీ 11వ తరగతిలోకి వచ్చాక ముఖంపై పూసలు కుట్టించుకుని, శరీరంపై టాటూలు వేయించుకున్నారు’’ అని ప్రిన్సిపల్ చెప్పారు.
విద్యార్థిని ‘అర్ధ నగ్న’ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక, చాలామంది తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారని, కొంతమంది లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారని ప్రిన్సిపల్ చెప్పారు.
ఆ ఫోటోలు వైరల్ కావడంతో వాటిని తొలగించాలని కోరితే తల్లిదండ్రులు తిరస్కరించారని, దానిని భావ వ్యక్తీకరణ హక్కుగా చెప్పారని తెలిపారు.
దీని తరువాత , ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని లేదంటే స్కూల్‌కు రావద్దంటూ స్కూల్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేయాలనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలి?
సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిత్రాలలో అభ్యంతకరమైనవేవీ లేవని ఎల్‌జీబీటీక్యూ కార్యకర్త హరీశ్ అయ్యర్ చెప్పారు.
‘‘విద్యార్థి తన తల్లి అనుమతితో సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తే దాంతో ఎవరికైనా సమస్య ఏమిటి? మన నైతికతను పిల్లలపై రుద్దకూడదని భావిస్తున్నాను’’ అని హరీశ్ అయ్యర్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘నా లోదుస్తులు తొలగించారు’
ఈ స్కూల్లో ఆ స్టూడెంట్ నాలుగో తరగతి నుంచి చదువుతున్నారు. స్కూల్లో అబ్బాయిగానే చేరారు.
ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం కూడా అంగీకరించారు.
కానీ, 9వ తరగతిలో తన జెండర్ ఐడెంటీటీని తల్లిదండ్రుల ద్వారా స్కూల్ యాజమాన్యానికి తెలిపారు ఆ స్టూడెంట్.
స్కూల్లో అనుభవాల గురించి ఆ విద్యార్థి మాట్లాడుతూ ‘‘స్కూల్లో నా పరిస్థితి ఘోరంగా ఉండేది. 9వ తరగతిలో ఉన్నప్పుడు నా తోటి విద్యార్థి వెనుక నుంచి వచ్చి అందరిముందు నా లోదుస్తులు తొలగించాడు. ఈ లైంగిక దాడి తరగతి గదిలో టీచర్ ఎదురుగానే జరిగింది’’
దీనిపై తాను టీచర్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తరువాత తనతో దురుసుగా ప్రవర్తించిన విద్యార్థిని టీచర్ బయటకు తీసుకెళ్లి ఏదో చెప్పడంతో ఆ విషయం అక్కడితో సద్దుమణిగిపోయింది అని ఆరోపించారు.
‘‘ఈ ఘటన తరువాత నేను షాక్‌కు గురయ్యా. దీంతో రోజూ స్కూలుకు వెళ్లడం తగ్గించాను. స్కూల్లో వేధింపుల కారణంగా టాయిలెట్‌కు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడాల్సివచ్చేది. నా క్లాస్ 3వ అంతస్తులో ఉండేది. కానీ నన్ను గ్రౌండ్‌ఫ్లోర్‌లో టాయిలెట్స్ వినియోగించుకోమని చెప్పేవారు’’ అని తెలిపింది.

ఫొటో సోర్స్, DILIP SHARMA
‘స్నేహితులు దూరమయ్యారు’
నాలుగో తరగతి నుంచి నాతో చదువుకున్న నా స్నేహితులంతా వారంతట వారే దూరమవడం మొదలుపెట్టారని ఈ ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్ చెప్పారు.
తాను 9వ తరగతిలో ఉండగా, తాను ఆడపిల్లననే విషయాన్ని వెల్లడించినప్పటి నుంచి ఈ మార్పు మొదలైంది.
స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను హౌస్ యూనిఫామ్ (వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే అనుమతించే ప్రత్యేక యూనిఫామ్)లో మాత్రమే రావాలని చెప్పింది. దానిని జెండర్ యూనిఫామ్‌గా పేర్కొంది.
దీంతో తాను టీ షర్ట్, ప్యాంట్ ధరించి స్కూల్‌కు వెళ్లినట్లు తెలిపారు.
‘‘వారమంతా నేను హౌస్ యూనిఫామే ధరించాలి. కానీ మిగతా పిల్లలు హౌస్ యూనిఫామ్‌లో కేవలం ఒక్కరోజు అదీ శనివారం మాత్రమే వస్తారు. కానీ టెన్త్ క్లాస్ నుంచి నేను అమ్మాయిల యూనిఫామ్ వేసుకోవాలనుకున్నాను. అలాగే చేశాను’’ అని చెప్పారు.
క్లాస్‌రూమ్‌లో తనను వెనుక నుంచి థర్డ్ జెండర్‌ను సూచించే అభ్యంతరకర పదాలతో పిలిచేవారని, ఇది రోజూ జరిగేదని తెలిపారు.
‘’10 వ తరగతి పరీక్షల సమయంలో నాతోటి విద్యార్థుల తల్లిదండ్రులు నన్ను తమ పిల్లల నుంచి దూరంగా ఉండమంటూ ఫోన్‌లో తిట్టిపోసేవారు. నేను 10వ తరగతిలో స్కర్ట్, టీషర్ట్ వేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అసభ్యకరంగా తిట్టేవారు. దీంతో నన్ను నేను అసహ్యించుకోవడం మొదలుపెట్టాను. కానీ నా తల్లిదండ్రులు ఎప్పుడూ నాకు అండగా నిలబడ్డారు అని ఆమె చెప్పారు.
అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమని స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు.
‘‘4వ తరగతిలో చేరినప్పుడు తను అబ్బాయి. 9వ తరగతిలో జెండర్ మార్చాలని తల్లిదండ్రులు అడిగినప్పుడు వారికి మేం పూర్తిగా సహకరించాం. మాకు ఆమె జెండర్‌తో ఎటువంటి సమస్యా లేదు. పైగా స్కూల్లో మంచి వాతావరణం ఉండటానికి మేం అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాం’’ అని ప్రిన్సిపల్ చెప్పారు.
తన కుమార్తె జెండర్ మార్పు గురించిన పూర్తి సమాచారాన్ని లిఖితపూర్వకంగా స్కూల్‌కు సమర్పించినట్టు ఆ స్టూడెంట్ తల్లి తెలిపారు. అలాగే టాటూ వేయించుకోవడానికి గల కారణాన్ని కూడా స్కూల్ యజమాన్యానికి ముందుగానే చెప్పారు.
‘‘సైక్రియాటిస్ట్ సలహా మేరకు ఆమె శరీరంపై పచ్చబొట్టు వేయించాం. ఇది ఆమె మానసిక ఆరోగ్యానికి సాయపడుతుందని ఆయన చెప్పారు. నా కుమార్తె అబ్బాయి శరీరంతో పుట్టింది. వేధింపులు, ఛీత్కారాలు ఎదురయ్యే ఇలాంటి సంఘర్షణాత్మక జీవితాన్ని తాను కోరుకోలేదు.’’ అని తల్లి చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎల్‌జీబీటీక్యూ పై సమాజం ఎలా వ్యవహరిస్తోంది?
‘‘అటువంటి సంఘటనలు ఆమోదనీయం కాదు. ఆ విద్యార్థి మానసిక వేదనకు గురవుతోంది. మేం ఇప్పటికే ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు తరపున స్కూల్ యాజమాన్యానికి లేఖ రాశాం’’ అని అస్సాం స్టేట్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు అసోసియేట్ వైస్ చైర్‌పర్సన్ రీతూపర్ణ చెప్పారు.
ఇలాంటి కేసులలో బాధితులను ఓదార్చిన సైకియాట్రిస్ట్ ప్రియాంకా భట్టాచార్య మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ పిల్లలను సున్నితంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
తమపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని ఇటువంటి పిల్లలకు ఎప్పుడూ మనసులో భయం మెదులుతుంటుంది. వారు కూడా ఈ దేశ పౌరులే. వారికీ సమానహక్కులు ఉన్నాయి. వారు కూడా అందరిలానే గౌరవం పొందాలని భట్టాచార్య వివరించారు.
బాలలహక్కుల కమిషన్ ఏం చెప్పింది?
‘‘ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్ తల్లిదండ్రులు జూన్ 26న ఓ ఫిర్యాదుతో వచ్చారు. తల్లిదండ్రుల వాదన విన్నామని, స్కూల్ ప్రిన్సిపల్ వాదన కూడా విన్నతరువాత వివక్ష చూపినట్టు తేలితే చట్టపరమైన పక్రియ చేపడతాం’’ అని అస్సాం స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆప్ చైల్డ్ రైట్స్ చైర్మన్ శ్యామల్ సైకియా చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














