టీ20 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా ఆటగాళ్లు బార్బడోస్‌లో ఏం చేస్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారు?

విరాట్, ద్రవిడ్, రోహిత్

ఫొటో సోర్స్, PHILIP BROWN/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విరాట్, ద్రవిడ్, రోవిత్
    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, బ్రిడ్జ్‌టౌన్(బార్బడోస్)

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమిండియా ఎప్పుడెప్పుడు భారత్‌కు వస్తుందా? అని దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే, బార్బడోస్‌లో పెను తుపాను హెచ్చరికల కారణంగా వారు అక్కడే ఆగిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం వారి రాకకు సంబంధించి గుడ్ న్యూస్ తెలిసింది.

భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం (ఈరోజు) సాయంత్రం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో క్రీడాకారులు తిరిగి స్వదేశానికి బయలుదేరుతున్నారు.

అంటే బుధవారం రాత్రి కల్లా టీమిండియా భారత్‌కు వచ్చేస్తుంది.

క్రీడాకారులు, వారి సపోర్టింగ్ సిబ్బంది బుధవారం రాత్రి దిల్లీలో ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తారు. ఆ తర్వాత రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
బార్బడోస్‌లో హిల్టన్ హోటల్

ఫొటో సోర్స్, VIMAL KUMAR

2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే వరల్డ్ కప్‌ తుది మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈ సమయంలో ప్రధానమంత్రి వారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి భారత క్రికెటర్లను ఓదార్చారు.

టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియా కోసం సోమవారం రాత్రే బార్బడోస్‌లో ప్రత్యేక డిన్నర్ సెషన్ నిర్వహించారు. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా‌తో పాటు క్రీడాకారులందరూ వారి కుటుంబ సభ్యులతో ఈ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ అనుభవాలను పంచుకున్నారు.

విరాట్ కోహ్లీ ఇంత సంతోషంగా ఉండటాన్ని వారంతా మరెప్పుడూ చూసుండరు.

డిన్నర్ కోసం లోపలికి వెళ్లినప్పుడు, ఆయనతో ఐదారు నిమిషాలు మాట్లాడేందుకు సమయం చిక్కింది. ఈ సమయంలో ఆయన చాలాసేపు సంతోషంగా మాట్లాడారు.

అయితే, కోహ్లి ఉన్నంత సంతోషంగా రోహిత్ శర్మ కనిపించలేదు. ఎందుకంటే, ఈ కలను సాకారం చేసుకునేందుకు ఆయన గత రెండేళ్ల పాటు ఎంతో శ్రమించారు. చాలా సమయాన్ని వెచ్చించారు. అలసిపోయినట్లు కనిపించారు.

హోటల్ బయట ఇద్దరు ఆటగాళ్లు

ఫొటో సోర్స్, VIMAL KUMAR

తదుపరి మిషన్ కోసం సిద్ధం

రోహిత్‌ను చూస్తే, తదుపరి మిషన్ కోసం ఆయన ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టు కనిపించింది.

తాను ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన భావోద్వేగాల్లోనే అర్థమవుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మున్ముందు చాలా ఉందని ఆయనను చూస్తే తెలుస్తుంది.

ప్రస్తుతం టీమిండియా ముందున్న సవాలు, చాంపియన్స్ ట్రోఫీని, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను గెలుపొందడం.

బార్బడోస్‌ను హరికేన్‌ తాకుతుందన్న వార్త అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే, మ్యాచ్ అయిన తర్వాత భారత ఆటగాళ్లు అక్కడే ఉన్నారు.

సోమవారం మధ్యాహ్నం వరకు క్రీడాకారులు హోటల్‌ను విడిచి బయటికి రాలేదు.

సాయంత్రం పూట ఒకరిద్దరు ఆటగాళ్లు హోటల్ నుంచి బయటకు రావడం కనిపించింది. ఈ సమయంలో హోటల్ లాబీలో మీడియా కానీ, భారత అభిమానులుగానీ లేరు.

సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్‌లు జింబాబ్వే వెళ్లాల్సి ఉంది.

ఈ నలుగురు క్రీడాకారులు గురువారం సాయంత్రం దిల్లీ నుంచి హరారే వెళ్లాలి. ఇప్పటికే శుభ్‌మన్ గిల్‌, ఆయన తోటి ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన క్రీడాకారులందరూ ఆదివారమే స్వదేశానికి వెళ్లిపోయారు. టీవీ కామెంటర్లు, విదేశీ జర్నలిస్టులు కూడా వారి ఇళ్లకు చేరుకున్నారు.

బార్బడోస్‌లో బీచ్‌లు

ఫొటో సోర్స్, VIMAL KUMAR

బీచ్‌లో గడిపిన ఆటగాళ్లు

గత రెండు రోజులుగా రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలు బార్బడోస్‌లోని హిల్టన్ హోటల్‌లో ఎప్పుడు కనిపించినా వారి ముఖాల్లో ఆనందం, సంతృప్తి కనిపిస్తోంది.

సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, విక్రమ్ రాథోడ్‌లతో కలిసి ద్రవిడ్, రోహిత్ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలపాటు బీచ్‌లో గడిపారు.

గత రెండేళ్లలో టీమిండియా ఎన్నో విదేశీ పర్యటనలు జరిపింది. ఈ సమయంలో మైదానానికి వెలుపల ఇంత ఎక్కువ సేపు రాహుల్ ద్రవిడ్ తన పర్సనల్ టైమ్‌ను గడపడం చాలా తక్కువగా చూసుంటారు.

ద్రవిడ్‌, రోహిత్ శర్మ మధ్యలో మంచి అనుబంధం ఉంది. ద్రవిడ్ నుంచి ఎన్నో విషయాలను రోహిత్ నేర్చుకున్నారు.

భారత క్రికెట్‌ను మరింత మెరుగ్గా మార్చేందుకు ఎన్నో ముఖ్యమైన అంశాలను కోచ్ ద్రవిడ్‌తో బీసీసీఐ సెక్రటరీ జయ్ షా చర్చించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్‌లతో పాటు రవీంద్ర జడేజా కూడా టీ-20 ఫార్మాట్‌‌ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.

ఈ ముగ్గురు మాత్రమే కాక, వచ్చే రెండు మూడేళ్లలో రవిచంద్రన్ అశ్విన్ కూడా క్రికెట్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు.

ఈ లోగా భవిష్యత్‌ కోసం ఒక పటిష్టమైన రోడ్డుమ్యాప్‌ను సిద్ధం చేయాల్సినవసరం ఉంది.

దీంతో, కోచ్‌గా ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ, ద్రవిడ్ అనుభవాలు, సలహాలకు జయ్ షా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)