బ్రిటన్ కొత్త ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి?

కీర్ స్టార్మర్

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్‌, బ్రిటన్‌కు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

స్టార్మర్ 2015 నుంచి హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

స్టార్మర్ వయసు 61 ఏళ్లు. ఆయన రైగేట్ గ్రామర్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లలో చదువుకున్నారు. ఆయన భార్య విక్టోరియా అలెగ్జాండర్‌, నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.

స్టార్మర్ తండ్రి టూల్ మేకర్‌. తల్లి నర్సుగా పని చేసేవారు.

ఈ లేబర్ పార్టీ లీడర్ తనను తాను "శ్రామిక వర్గ నేపథ్యం" నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పుకుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆయన రైగేట్ గ్రామర్ స్కూల్‌లో చేరిన రెండేళ్ల తర్వాత అది ప్రైవేట్ పాఠశాలగా మారింది. ఆయనకు 16 ఏళ్లు వచ్చే వరకు స్కూల్ ఫీజులను స్థానిక కౌన్సిల్ చెల్లించింది.

తమ కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తి స్టార్మర్. లీడ్స్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు.

1987లో బారిస్టర్ పూర్తయ్యాక, మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. ఉద్యోగరీత్యా కరీబియన్, ఆఫ్రికాలలో పని చేశారు. అక్కడ మరణశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీల తరపున వాదించారు.

మెక్‌డోనాల్డ్స్ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందంటూ కరపత్రాలను పంచిపెట్టిన మెక్‌లైబెల్ కార్యకర్తలపై ఆ సంస్థ కేసు వేసింది. 90ల చివర్లలో ఆయన ఉచితంగా ఆ కార్యకర్తలకు తన సేవలను అందించారు.

2008లో ఇంగ్లండ్, వేల్స్‌లో పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా స్టార్మర్ నియమితులయ్యారు.

కీర్ స్టార్మర్

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, భార్య విక్టోరియాతో కీర్ స్టార్మర్

2015లో తొలిసారి ఎంపీగా గెలిచి..

ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి ఆయన 2015లో ఎంపీగా ఎన్నికయ్యారు.

లేబర్ పార్టీ మాజీ నాయకుడు జెరెమీ కార్బిన్ బృందంలో షాడో బ్రెగ్జిట్ సెక్రటరీగా పనిచేశారు. రెండో ఈయూ రెఫరెండం నిర్వహించడంపై ఆలోచించాలని ఆ సమయంలో స్టార్మర్ సూచించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం తర్వాత, కీర్ స్టార్మర్ 2020 ఏప్రిల్‌లో పార్టీ నాయకుడి పదవికి పోటీ చేసి గెలిచారు.

తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ ప్రధాని అయ్యారు.

కీర్ స్టార్మర్

ఫొటో సోర్స్, PA MEDIA

లేబర్ పార్టీ ముఖ్యమైన హామీలు:

లేబర్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన కొన్ని కీలక హామీలు:

  • హెల్త్‌కేర్: ప్రతీ వారం అదనంగా 40,000 అపాయింట్‌మెంట్‌లను అందుబాటులోకి తెచ్చి, ఎన్‌హెచ్‌ఎస్‌ (బ్రిటన్‌లో వైద్య సేవలు అందించే ప్రభుత్వ విభాగం) వెయిటింగ్ లిస్ట్‌లను తగ్గించడం. పన్ను ఎగవేతలను అడ్డుకొని, పన్ను చెల్లింపుల్లోని 'లొసుగులను' నిర్మూలించి ఎన్‌హెచ్‌ఎస్‌కు నిధులు సమకూర్చడం.
  • ఇమ్మిగ్రేషన్: చిన్న పడవల్లో బ్రిటన్‌కు ప్రజల్ని అక్రమంగా రవాణా చేసే ముఠాలను అడ్డుకునేందుకు ‘బోర్డర్ సెక్యూరిటీ కమాండ్’ను ప్రారంభించడం.
  • గృహ నిర్మాణం: ప్రణాళికా చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించడం. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ప్రాధాన్యత ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టడం.
  • విద్య: ప్రైవేట్ పాఠశాలలకు పన్ను మినహాయింపులను నిలిపేసి, ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడం.
కీర్ స్టార్మర్

ఫొటో సోర్స్, REUTERS

లేబర్‌ పార్టీ: ఘోర పరాజయం నుంచి ఘన విజయం దాకా..

మొదట్లో పార్టీకి వస్తున్న పేలవమైన పోల్ రేటింగ్‌లను పెంచడానికి పార్టీ నాయకుడిగా కీర్ స్టార్మర్ చాలా కష్టపడ్డారు.

2021లో హార్ట్‌పూల్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఓటర్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు.

నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్, మిడ్‌లాండ్స్‌ రీజియన్ల నియోజకవర్గాల్లోని ఓటర్లు ఒకప్పుడు లేబర్ పార్టీకి అండగా ఉండేవారు. కానీ, 2019 ఎన్నికల్లో ఆ స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ గెలిచింది.

పార్టీ విధానాల పునరాలోచనలో భాగంగా విశ్వవిద్యాలయ ట్యూషన్ ఫీజులను రద్దు చేస్తామని ఇంధన, నీటి కంపెనీలను జాతీయం చేస్తామన్న వాగ్దానాల నుంచి స్టార్మర్ వెనక్కి తగ్గారు.

దీంతో స్టార్మర్ నమ్మకద్రోహం చేశారని, వాగ్దానాలను తుంగలో తొక్కారని ఆయన పార్టీలోని కొందరు వామపక్షవాదులు ఆరోపించారు.

వీడియో క్యాప్షన్, ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసిన సునాక్, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన స్టార్మర్

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)