అగ్నిపథ్: ఈ స్కీమ్‌ గురించి కేంద్రంపై ప్రతిపక్షం విమర్శలేంటి, మరణించిన ఓ అగ్నివీర్ కుటుంబం ఏం చెప్పింది?

రాహుల్ ఓదార్పు ఫోటో

ఫొటో సోర్స్, YT/ RAHUL GANDHI

ఫొటో క్యాప్షన్, అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేస్తామని రాహుల్ గాంధీ తమ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారని చరణ్‌జిత్ సింగ్ తెలిపారు.

అజయ్ కుమార్ అగ్నివీర్‌గా భారత సైన్యంలో చేరారు. జమ్ముకశ్మీర్‌లోని రజౌరీ ప్రాంతంలో మందుపాతర పేలిన ఘటనలో ఆయన 2024 జనవరిలో చనిపోయారు.

ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ ప్రకారం అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ళ పాటు సైన్యంలో పని చేయడానికి యువతను చేర్చుకుంటారు. వీరిని అగ్నివీర్ అని పిలుస్తారు.

నాలుగేళ్ళ తరువాత వీరిలో 25 శాతం మందిని మాత్రమే ఇండియన్ ఆర్మీలో కొనసాగిస్తారు.

అగ్నివీర్‌లుగా నియమితులయ్యే యువతకు మొదట్లో ఏడాదికి సుమారు 4.76 లక్షల జీతం ఇస్తారు. సర్వీసు కాలం పూర్తయ్యేలోగా ఆ మొత్తం సుమారు 6.92 లక్షలకు చేరుతుంది.

రిటైర్‌మెంట్ నాడు 11.71 లక్షలు చెల్లిస్తారు.

సర్వీసులో మరణిస్తే రూ. 48 లక్షల బీమా, రూ. 44 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. మిగిలిన సర్వీసు కాలానికి జీతమూ చెల్లిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అజయ్ కుమార్

అగ్నిపథ్‌పై ప్రతిపక్షం ఆగ్రహం

అగ్నిపథ్ పథకాన్ని ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ సమావేశాల తొలి సెషన్‌లో ప్రతిపక్షం డిమాండ్ చేసింది.

అయితే భారత సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచుతున్నామని ప్రభుత్వం చెప్పింది.

మరోపక్క నిపుణులు కూడా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం (01.07.2024)నాడు 18వ పార్లమెంటు తొలి సమావేశాలలో అగ్నివీర్‌ల గురించి మాట్లాడారు.

ఆయన ప్రసంగంతో...లూథియానా జిల్లా రామ్‌ఘర్ గ్రామానికి చెందిన అగ్నివీర్ అజయ్ కుమార్‌ను కుటుంబానికి తమ కుటుంబీకుడిని మరోసారి గుర్తు చేసింది.

అజయ్‌కుమార్ తండ్రి చరణ్‌జిత్ సింగ్‌కు జనవరి 18న తన కుమారుడు మరణించినట్టు అందిన వార్త ఇప్పటికీ గుర్తుంది.

ఆ వార్తతో ఒక్కసారిగా మిన్ను విరిగి మీదపడినట్టయింది.

‘‘ఆరోజు సాయంత్రం మందుపాతర పేలి ముగ్గురు గాయపడ్డారని, ఆ ముగ్గురిలో మీ అబ్బాయి కూడా ఉన్నాడంటూ నాకు ఫోన్ కాల్ వచ్చింది.’’ అని చరణ్‌జిత్ సింగ్ చెప్పారు.

చరణ్‌జిత్‌సింగ్‌కు ఆరుగురు కుమార్తెలు.

ఇప్పటిదాకా అందిన సాయమెంత?

మందుపాతర పేలుడులో అజయ్ చనిపోయిన తరువాత, తమ కుటుంబానికి పంజాబ్ రాష్ట్రప్రభుత్వం రూ. కోటి అందించిందని చరణ్‌జిత్ చెప్పారు. దీంతోపాటు తమకు ఆర్మీ నుంచి 48 లక్షల రూపాయలు అందాయని తెలిపారు.

కానీ అజయ్ కుటుంబీకులు కేంద్రప్రభుత్వం మీద కోపంగానే ఉన్నారు.

‘‘మీ అబ్బాయి సరిహద్దు రక్షణలో చనిపోయారంటూ ఓదార్పు గానీ, సంతాపసూచకంగా ఓ లేఖగానీ కేంద్రప్రభుత్వం ఇవ్వలేదు.’’ అని ఆ కుటుంబం చెప్పింది.

‘‘మా కుటుంబానికి పెన్షన్‌గానీ, అమర జవాన్లకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ అందడం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం మా అబ్బాయి మృతిపై ఇంత ఓదార్పు కూడా ఇవ్వలేకపోయింది.’’ అని చరణ్‌జిత్ సింగ్ అన్నారు.

రాహుల్, రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అగ్నివీర్‌లను వాడుకొని వదిలేస్తున్నారని రాహుల్ పార్లమెంట్‌లో అన్నారు.

పార్లమెంట్‌లో రగడ

‘‘కొన్ని రోజుల కిందట పంజాబ్‌లోని ఓ కుగ్రామంలో అగ్నివీర్ కుటుంబాన్ని కలిశాను. మందుపాతర పేలడంతో ఆ అగ్నివీర్ అమరుడయ్యాడు. నేను ఆయనను అమరవీరుడు అంటున్నాను. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆయనను అమరవీరుడు అనడం లేదు.’’ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొన్నటి సోమవారం నాటి పార్లమెంట్ సమావేశాల ప్రసంగంలో చెప్పారు.

‘‘నరేంద్ర మోదీ ఆ సైనికుడిని అమరవీరుడు అనరు. అగ్నివీర్ అంటారు. ఆ అగ్నివీర్ కుటుంబానికి పెన్షన్ రాదు. ఎటువంటి పరిహారం అందదు. కనీసం అమరవీరుడి హోదా కూడా దక్కదు.’’ అని రాహుల్ అన్నారు.

‘‘సైనికులు పెన్షన్ పొందుతారు. భారతప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుంది. కానీ అగ్నివీర్‌లను సైనికులుగా పరిగణించరు. వారిని వాడుకుని వదిలేస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.

‘‘ఆరు నెలలు శిక్షణ ఇచ్చిన అగ్నివీర్‌ను ఐదేళ్ళ ట్రైనింగ్ పొందిన చైనా జవాన్ ముందు నిలబెడుతున్నారు.’’ అని రాహుల్ అన్నారు.

రాహుల్ ప్రసంగంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ అబద్ధపు ప్రకటనలతో రాహుల్ గాంధీ సభను తప్పుదోవపట్టిస్తున్నారని చెప్పారు.

సరిహద్దు రక్షణలోగానీ, యుద్ధంలో గానీ అగ్నివీర్ జవాన్ అమరుడైతే అతని కుటుంబానికి సాయం కింద రూ. కోటి అందిస్తామని చెప్పారు.

రాహుల్ ప్రకటన తప్పుదోపట్టించేదిలా ఉందని మంగళవారం (02.07.204)నాడు పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు.

అజయ్ కుమార్ కుటుంబం

ఫొటో సోర్స్, GURMINDER GREWAL/BBC

ఫొటో క్యాప్షన్, అజయ్ కుమార్ తండ్రి కూలీగా పనిచేస్తున్నారు.

అజయ్ కుటుంబాన్ని కలిసిన రాహుల్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 29న అజయ్‌ కుమార్ కుటుంబసభ్యులను రాహుల్ గాంధీ కలుసుకున్నారు.

ఆయన ఆ కుటుంబంతో చాలా సేపు గడిపారు. వారి బాగోగులు తెలుసుకున్నారు.

రాహుల్ గాంధీ తమ కుటుంబాన్ని ఓదార్చారని, తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారని చరణ్‌జిత్ సింగ్ తెలిపారు.

తమ కుటుంబాన్ని చూసుకోవాల్సిందిగా స్థానిక ఎంపీ అమర్ సింగ్‌కు రాహుల్ గాంధీ చెప్పారని ఆయన తెలిపారు.

పార్లమెంటులో రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనతో తాను ఏకీభవించడం లేదని చరణ్‌జిత్ సింగ్ అన్నారు.

ఇతర సైనిక కుటుంబాలకు అందుతున్నట్టు తమకు పెన్షన్ అందడం లేదని తెలిపారు.

అజయ్‌కుమార్ సోదరి బక్షోదేవి మాట్లాడుతూ సైన్యంలో శాశ్వత నియామకాల కోసం అజయ్ ఎదురుచూశాడని, కానీ కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదని, దీంతో అగ్నివీర్ పథకంలో చేరాడని వివరించారు.

అగ్నివీర్‌గా ఎంపికైన తరువాత 6-7 నెలల శిక్షణ పొంది ఆగస్టులో ఇంటికి వచ్చాడని, దీని తరువాత సెప్టెంబర్‌లో అతనిని కశ్మీర్‌లో నియమించారని చెప్పారు.

భారత సైన్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

పరిహారం ఎంత?

అగ్నివీర్‌లు మరణిస్తే అందించే పరిహారాన్ని అగ్నిపథ్ పథకంలో పేర్కొన్నారు.

భారత సైన్యం అధికారిక వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

దీనిప్రకారం అగ్నివీర్‌లకు సర్వీసులో ఉన్న నాలుగేళ్ళ కాలానికి రూ. 48 లక్షల జీవితబీమా వర్తిస్తుంది.

అయితే చనిపోయే పరిస్థితులను బట్టి దీనిని X,Y,Z గా వర్గీకరించారు.

ఇందులో కర్తవ్య నిర్వహణలో ఉండగా ప్రమాదం జరిగి మరణించడాన్ని Y కేటగిరీలో చేర్చారు. దీనికింద మృతి చెందిన అగ్నివీర్ కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, రూ. 44 లక్షల పరిహారం, మిగిలిన ఉద్యోగ కాలానికి జీతం, ఇతర ఆర్థిక సాయం అందుతుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సైన్యం ఏం చెప్పింది?

బుధవారం, సైన్యం ట్విట్టర్‌లో విడుదల చేసిన పోస్ట్‌లో ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ అయ్యాయని పేర్కొంది.

“అగ్నివీర్ అజయ్ కుమార్ త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తుంది” అని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి సైనిక లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించామని వెల్లడించింది. అగ్నివీర్ అజయ్ కుటుంబానికి ఇవ్వాల్సిన మొత్తంలో రూ.98.39 లక్షలు ఇప్పటికే చెల్లించినట్లు తెలిపింది.

"అగ్నివీర్ యోజన నిబంధనల ప్రకారం, పోలీసు వెరిఫికేషన్ తర్వాత వెంటనే తుది సెటిల్‌మెంట్ ద్వారా దాదాపు రూ. 67 లక్షల ఎక్స్-గ్రేషియా మొత్తం, ఇతర ప్రయోజనాలు చెల్లిస్తామని తెలిపింది. దీంతో ఆయనకు చెల్లించిన మొత్తం సుమారు రూ.1.65 కోట్లు అవుతుదని తెలిపింది.

అగ్నివీర్‌తో సహా అమరవీరులైన సైనికుల కుటుంబాలకు చెల్లించాల్సిన అలవెన్సులు వెంటనే చెల్లిస్తున్నామని కూడా సైన్యం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)