రాహుల్ ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ సరైన కౌంటర్ ఇచ్చారా?

లోక్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, @BJP4INDIA

ఫొటో క్యాప్షన్, లోక్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జులై 2న లోక్‌సభలో ప్రసంగించారు.

రెండు గంటల ప్రధాని ప్రసంగం సాగినంత సేపు ప్రతిపక్ష ఎంపీలు మణిపూర్, నీట్ వంటి అంశాలపై నినాదాలు చేస్తూనే ఉన్నారు. ‘మణిపూర్‌కు న్యాయం చేయండి’, ‘మాకు న్యాయం కావాలి,’ అంటూ ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలారు.

తన ప్రసంగంలో ప్రధాని మోదీ విపక్ష నేత రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించకుండానే, ఆయనను లక్ష్యంగా చేసుకుని, "రేపు ఏం జరిగినా దేశ ప్రజలు శతాబ్దాల పాటు మిమ్మల్ని క్షమించరు." అని వ్యాఖ్యానించారు.

131 సంవత్సరాల కిందట షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ... హిందువులు సహనశీలురు, కలిసిమెలిసి జీవించే స్వభావం కలవాళ్లని, నేడు హిందువులను తప్పుబట్టే కుట్ర జరుగుతోందని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ సమాధానం

'వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే దేశం క్షమించదు' అని వివిధ మతాలను ప్రస్తావిస్తూ సోమవారం రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

అగ్నివీర్ పథకంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ.. దేశ సైన్యాన్ని ఆధునికీకరించే పని జరుగుతోందని, అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు.

అవినీతిని సహించక పోవడం వల్లే ప్రజలు తమ ప్రభుత్వాన్ని ప్రజలు మూడోసారి ఎన్నుకున్నారని ప్రధాని అన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అన్నది తమ మొదటి లక్ష్యమని, బుజ్జగింపు రాజకీయాలు తమ విధానం కాదని స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ, ఈ చర్యతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైందని, దీని వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజలు ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని తెలిపారు.

మూడోసారి మూడు రెట్లు ఎక్కువ పని చేస్తామని, దేశ ప్రజలకు మూడు రెట్లు ఫలితాలను అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది మూడో అతిపెద్ద ఓటమి అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

"ఒక చిన్న పిల్లాడిని ఊరడించే పని జరుగుతోంది. పిల్లల బుర్రలు ఏమీ అర్థం చేసుకోలేవు." అని ప్రధాని మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

'పిల్లవాళ్ల బుర్ర’ అనే పదాన్ని ప్రధాని మోదీ పదే పదే ఎందుకు ఉపయోగించారు? ఈ ప్రశ్నపై సీనియర్ రాజకీయ విశ్లేషకులు సంజీవ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘తన పార్టీ మనుషులు ‘పప్పు’ అని పిలిచే వ్యక్తి ఇప్పుడు పెద్దవాడయ్యాడని మోదీ అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.

2018లో రాహుల్ గాంధీ లోక్‌సభలో తన సీటులోంచి హఠాత్తుగా లేచి వెళ్లి నరేంద్ర మోదీని కౌగిలించుకున్నారు. అప్పుడు తన సీటులో కూర్చొని ఉన్న మోదీ, రాహుల్ చేసిన ఈ పనికి ఆశ్చర్యపోయారు.

"రాహుల్ గాంధీని ఇప్పుడు ఎవరూ పప్పుగానో, చిన్నపిల్లవాడిగానో భావించరు. ఆయన భారత రాజకీయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత కూడా. రాహుల్ గాంధీని ఎంత హేళన చేస్తే, బీజేపీ అంతగా తనకు తానే హాని చేసుకుంటుంది’’ అని సంజీవ్ విశ్లేషించారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం: ప్రధాని

ప్రధాని తన ప్రసంగంలో ఏమన్నారంటే...

"కాంగ్రెస్ దేశంలో ఆర్థిక అరాచకాన్ని వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశంపై ఆర్థిక భారం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి" అన్నారు.

"సీఏఏకు సంబంధించి అరాచకం సృష్టించారు. వాళ్లు తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు పని చేస్తున్నారని కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులు చెబుతున్నాయి. దేశ ప్రజలు అల్లర్లను రెచ్చగొట్టే దురుద్దేశపూర్వక ప్రయత్నాలను చూశారు." అని అన్నారు

పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగంపై ప్రధాని స్పందిస్తూ, "సభలో జరిగిన చిన్నపిల్లల చేష్టలను దేశమంతా చూసింది. సానుభూతి పొందేందుకు ఈ డ్రామా ఆడారు. వీళ్లు వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో బెయిల్‌పై బయట ఉన్న సంగతి దేశమంతటికీ తెలిసిందే" అన్నారు.

“అగ్నివీర్ గురించి అబద్ధాలు చెబుతున్నారు. కనీస మద్దతు ధర విషయంలోనూ అదే జరుగుతోంది.” అని ప్రధాని మోదీ అన్నారు.

కాంగ్రెస్ దళిత వ్యతిరేకి కాబట్టే అప్పట్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మంత్రివర్గానికి రాజీనామా చేశారన్న ప్రధాని.. దళితులకు, వెనుకబడిన వర్గాలకు నెహ్రూ అన్యాయం చేశారని ఆరోపించారు.

ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్‌పై తీవ్రమైన దాడి

ఒక రోజు ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోదీ, “నిన్న జరిగిన దాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము. ఈ చర్యలను చిన్నపిల్లల చేష్టలుగా విస్మరించకూడదు. దీని వెనుక ఉన్న ఉద్దేశాలు దేశానికి తీవ్రమైన ముప్పును కలుగజేస్తాయి." అని హెచ్చరించారు.

కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, "దేశంలో ఆర్థిక అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 4న తాము అనుకున్న ఫలితాలు రాకపోతే దేశవ్యాప్తంగా గొడవలు తప్పవని వాళ్లు బహిరంగంగా ప్రకటించారు." అన్నారు.

"ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. నిరంతరం అబద్ధాలు చెబుతున్నా, వాళ్లు ఘోర పరాజయాన్ని చవిచూశారంటే, నేను వాళ్ల బాధను అర్థం చేసుకోగలను." అన్నారు.

తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ, వాటిని చూసే ప్రజలు తమను గెలిపించారని అన్నారు.

ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన విషయాన్నిమోదీ తన ప్రసంగంలో గుర్తు చేస్తూ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకున్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, @RahulGandhi

ఫొటో క్యాప్షన్, లోక్ సభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ

మోదీ Vs రాహుల్ గాంధీ

సోమవారం రాహుల్ గాంధీ ప్రసంగంలో, మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగంలో ఎవరు ఎవరిపై విజయం సాధించారు? ఈ ప్రశ్నపై సంజీవ్ శ్రీవాస్తవ మాట్లాడారు.

రాహుల్ గాంధీ చాలా బాగా మాట్లాడారని, అందులో ఆశ్చర్యకరమైన అంశం పార్లమెంటులో ఆయన ఇంత సుదీర్ఘంగా, ఇంత గంభీరంగా ప్రసంగం చేయడమేనని అన్నారు.

ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను చాలా బాగా పోషించారు. కానీ ఆయన హిందువులకు సంబంధించిన ఉచ్చులో చిక్కుకోకూడదు. అదే విధంగా, ప్రధానమంత్రి కూడా సభా నాయకుడి పాత్రను బాగా పోషించి, 45-50 నిమిషాల తర్వాత మంచిగా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించారన్నారు.

ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగ సారాంశం ఏమిటి? దీనికి కూడా సంజీవ్ శ్రీవాస్తవ విశ్లేషణ ఇచ్చారు.

"మొదటి గంట ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు, అన్నీ పాత విషయాలే. అవన్నీ 2014కి ముందు సంగతులు. అయితే గంట తర్వాత ఆ ప్రసంగం రాజకీయాల వైపు తిరిగింది. ఆయన ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది" అన్నారు.

"హిందుత్వ రాజకీయాలపై రాహుల్ గాంధీని ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో హిందుత్వ రాజకీయాలకు ఎదురుదెబ్బ తగిలిన మాట వాస్తవమే. హిందుత్వ రాజకీయాలు వెనక్కి తగ్గాయి. కానీ, ఇది సున్నితమైన అంశం.

ఇది ఏ సమయంలోనైనా సీసాలోంచి బయటకు వచ్చే భూతం లాంటిదని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి. ఆయన హిందువుల గురించి హీనంగా మాట్లాడలేదు. కానీ ఆయన అధికార పక్షానికి ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? హిందువులను అవమానిస్తున్నారనే సందేశం వెళ్లకుండా రాహుల్ గాంధీ జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన కారణం లేకుండా మాట్లాడి, సమస్యలను సృష్టించుకోకుండా ఆయన జాగ్రత్త వహించాలి." అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)