మూడు క్రిమినల్ చట్టాలు ‘గందరగోళం’గా ఉన్నాయని కొందరు నిపుణులు ఎందుకు అంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అనేక బీజేపీయేతర రాష్ట్రాలు, పౌర సమాజం, న్యాయ నిపుణులు లేవనెత్తుతున్న ప్రశ్నల మధ్య మూడు క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
- ఇండియన్ పీనల్ కోడ్, 1860 (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 2023
- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) 2023
- ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 (ఐఈ చట్టం) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) 2023
ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినా, జూన్ 30 వరకు జరిగిన నేరాలకు సంబంధించి పోలీసు విచారణ, కోర్టులు పాత చట్టాల ప్రకారం పనిచేస్తాయి.
ఇప్పుడు ఏకకాలంలో రెండు రకాల చట్టాల ప్రకారం పని జరుగుతుంది.
ఈ చట్టాల పేరును కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు - ఈ చట్టాల పేర్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ని ఉల్లంఘిస్తున్నాయని, దీని కింద చట్టాల పేర్లు ఆంగ్లంలో ఉండాలని అంటున్నాయి.
ఈ మూడు చట్టాలపై ఇలాంటి అనేక అభ్యంతరాలు, ప్రశ్నలు తలెత్తుతున్నా కేంద్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయవద్దని డిమాండ్ చేశారు.
ఈ మూడు కొత్త చట్టాల అధ్యయనానికి అధికారిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి.
ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక నివేదికను సమర్పించగా, హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలను కోరింది.
పాటిల్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘మా సూచనలకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.’’ అన్నారు.
కర్ణాటక కమిటీ వలసవాద చట్టాల నుంచి స్వేచ్ఛ పేరుతో ఈ చట్టంలోని అనేక నిబంధనలలో ‘నామమాత్రపు, తాత్కాలిక’ మార్పులు చేశారని ఆరోపించింది.
డీఎంకె అధికార ప్రతినిధి, న్యాయవాది మనురాజ్ షణ్ముగం బీబీసీతో మాట్లాడుతూ, "కేవలం బ్రిటిష్ వాళ్లు నిర్మించారన్న కారణంతో మీరు దాని పక్కనే మరో మరో రైల్వే ట్రాక్‌ను నిర్మించరు. కొత్త చట్టం వల్ల న్యాయవాదులు ఎక్కువగా ప్రభావితమవుతారు" అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
కొత్త చట్టాలపై ఆందోళన ఎందుకు?
జాతీయ జెండా, జాతీయ గీతం, జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడం భారతీయ న్యాయ సంహితలో నేరంగా పరిగణించరు.
కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ మాట్లాడుతూ, ‘‘ఆత్మహత్యలను నేరంగా పరిగణించకుండా, నిరాహార దీక్షను నేరంగా పరిగణించడం దురదృష్టకరం. మహాత్మాగాంధీ నిరాహార దీక్ష చేసి సత్యాగ్రహం చేస్తేనే కదా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది’’ అన్నారు.
దేశంలో అత్యాచారాలకు సంబంధించిన చట్టాలను లైంగిక వివక్ష లేకుండా రూపొందించాలని లా కమిషన్ 2000 సంవత్సరంలో సిఫార్సు చేసినా, వయోజన పురుషులపై లైంగిక దోపిడీకి కొత్త చట్టంలో ఎలాంటి నిబంధనలూ లేవని కర్ణాటక నిపుణుల కమిటీ పేర్కొంది.
భారతీయ న్యాయ సంహిత నుంచి IPC 377 ను పూర్తిగా తొలగించారు. కర్ణాటక ప్రభుత్వం దీనిపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది, దీనిని ప్రకృతి విరుద్ధమైన సెక్స్‌కు ఉపయోగించుకుంటారని వాదించింది.
సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, డబ్బు దాచడం, పన్ను రహిత దేశాల్లో డబ్బు డిపాజిట్ చేయడం, డిజిటల్ నష్టం కలిగించడం వంటి నేరాలను కొత్త చట్టంలో చేర్చలేదు.
కొత్త చట్టాల అమలులో 'ప్రాథమిక ఆటంకాలు' ఉన్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హోంమంత్రికి లేఖ రాశారు.
ఉదాహరణకు – భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 103లో, హత్యకు సంబంధించిన రెండు వేర్వేరు పద్ధతులకు సంబంధించి రెండు ఉపవిభాగాలున్నాయి, కానీ శిక్ష మాత్రం ఒక్కటే.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలలో, "చాలా చోట్ల స్పష్టత లేదు, చాలా చోట్ల అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి."
సీఆర్పీసీ పేరును భారతీయ నాగరిక్ సురక్షా సంహితగా మార్చడంపై కర్ణాటక నిపుణుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో దర్యాప్తు, విచారణ, నేర విచారణకు సంబంధించిన చట్టాలు ఉన్నందున ఈ పేరు "తప్పుదోవ పట్టించేది"గా ఉందని కమిటీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
పోలీసులకు మరిన్ని అధికారాలు
ఈ చట్టాలకు సంబంధించి లేవనెత్తుతున్న అతిపెద్ద అభ్యంతరాలలో ఒకటి పోలీసులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం.
బీఎన్‌ఎస్‌ఎస్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి, ప్రాథమిక విచారణ జరిపేందుకు పోలీసులకు 14 రోజుల సమయం ఇచ్చారు.
లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఫిర్యాదులో గుర్తించదగిన నేరం ఉంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది.
అలాగే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం హెడ్ కానిస్టేబుల్‌కు ఇవ్వడం, ఉగ్రవాదానికి పాల్పడినట్లు ఎవరిపైన అయినా ఆరోపణలు చేయడం ఆందోళన కలిగించే విషయాలని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'కొత్త సెక్షన్లు రాజ్యాంగానికి లోబడి లేవు'
కర్ణాటక ప్రభుత్వ మాజీ న్యాయవాది బీటీ వెంకటేష్ బీబీసీతో మాట్లాడుతూ..
"ఒక నిందితుడికి కానీ నేరస్థుడికి కానీ ఈమెయిల్ పంపడం, నిందితుడితో టీ తాగడానికి వెళ్లడం వంటి చిన్నచిన్న కారణాలతోనూ ఇప్పుడు కేసు పెట్టవచ్చు.
రెండవ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రొసీజర్. ఎవరినైనా అదుపులోకి తీసుకుని 90 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకునే హక్కు పోలీసులకు ఉంది.
మీరు సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా నిరసన తెలిపితే, మీరు ఉగ్రవాద చర్యలో పాల్గొన్నారని, దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించవచ్చు.
భారతదేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే లేదా నిరసన తెలిపే వారెవరిపై అయినా తీవ్రవాద అభియోగాలు మోపవచ్చు. దేశద్రోహాన్ని బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 152 కింద విస్తృత పరిధిలోకి తీసుకువచ్చారు'' అని అన్నారు.
మరికొన్ని చట్టాలను సవరించి, కొన్నింటిని ఒకే సెక్షన్ కిందకు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. కానీ జోడించిన సెక్షన్‌లు రాజ్యాంగానికి లోబడి లేవని, అవి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని వెంకటేష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ సంకల్పం లేకపోవడం
కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మినహా మరే ఇతర బీజేపీయేతర ప్రభుత్వాలు ఈ చట్టాలపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.
కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల న్యాయ మంత్రుల సమావేశం నిర్వహించడానికి అవకాశం ఉన్నా వారు ఆ పని చేయలేదని కొందరు పేరు వెల్లడించడానికి ఇష్టపడని రాజకీయ నాయకులు అన్నారు.
మరో కాంగ్రెస్ నాయకుడు డీఎంకే నేత స్టాలిన్‌తో ఏకీభవిస్తూ, కొత్త చట్టాల అమలుపై తగిన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే విద్యా సంస్థలతోనూ చర్చలు జరపాలని, ఎందుకంటే దీని వల్ల న్యాయ విద్యాసంస్థలలోనూ సిలబస్ మారుతుందని అన్నారు.
స్టాలిన్ తన లేఖలో, "న్యాయవ్యవస్థ, పోలీసులు, జైళ్లు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్స్ వంటి భాగస్వాముల సామర్థ్యాలను, ఇతర సాంకేతికతలను పెంపొందించడానికి తగిన వనరులు, సమయం అవసరం. ఈ చట్టాల నిర్వహణ, అమలు ప్రక్రియ భాగస్వాములతో, సంబంధిత వ్యక్తులతో సంప్రదించిన తర్వాతే జరుగుతాయి. ఈ పనిని తొందరపడి చేయకూడదు’’ అన్నారు.
"ఈ మార్పులతో పోరాడే రాజకీయ సంకల్పం మనకు లేదు. మనం చట్టపరమైన గందరగోళం వైపు దారి తీస్తున్నాం" అని ఒక నాయకుడు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ప్రెసెడెన్షియల్ డిబేట్లో బైడెన్, ట్రంప్‌లు ఏం చెప్పారు
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














