హాథ్‌రస్: తొక్కిసలాటల్లో ప్రాణాలు కోల్పోతున్నారు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరగొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు.
2005లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మాంఢర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది చనిపోయారు.
రాజస్థాన్‌లోని చాముండా దేవి మందిరంలో 2008లో జరిగిన తొక్కిసలాటలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది, హిమాచల్‌ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో ఇలాంటి ఘటనలోనే 162 మంది చనిపోయారు.
2003లో ఇందోర్‌లో రామనవమి సందర్భంగా ఒక పురాతన మెట్లబావిపై అమర్చిన స్లాబ్ కూలడంతో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృత్యువాత పడ్డారు.
గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి తొక్కిసలాటలలొ ఎంతమంది చనిపోయారో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, ANI
2015లో గోదావరి పుష్కరాల సమయంలో
2022 జనవరి 1
జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 12 మంది చనిపోగా, చాలామందికి గాయాలయ్యాయి.
2015 జులై 14
పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద గోదావరి నదికి ప్రజలు పోటెత్తారు. ఘాట్ వద్ద తొక్కిసలాట జరగడంతో 27 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు.
2014 అక్టోబర్ 3
పట్నాలోని గాంధీ మైదానంలో దసరా సంబరాల్లో తొక్కిసలాట కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది గాయాల పాలయ్యారు.
2013 అక్టోబర్ 13
మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా రత్నగిరి మందిరంలో నవరాత్రి ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
భక్తులు వెళ్తున్న మార్గంలోని ఒక బ్రిడ్జి కూలిపోయిందనే వదంతి వ్యాప్తి చెందడంతో అక్కడున్న భక్తులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
2012 నవంబర్ 19
ఛఠ్ పూజ సందర్భంగా పట్నాలోని గంగా తీరంలో ఉన్న అదాలత్ ఘాట్‌పై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. చాలామందికి గాయాలయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
హరిద్వార్‌లో
2011 నవంబర్ 8
హరిద్వార్‌లోని హర్ కీ పౌడీ వద్ద గంగా ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోయారు.
2011 జనవరి 14
కేరళలోని ఇడుక్కి జిల్లా పుల్మేదు సమీపంలో ఒక జీప్, శబరిమలకు వెళ్లి తిరిగొస్తున్న భక్తుల్ని ఢీకొట్టింది. ఈ ఘటన తర్వాత అక్కడ చెలరేగిన తొక్కిసలాటలో 104 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
2010 మార్చి 4
ఉచితంగా పంచుతున్న ఆహారం, దుస్తులు తీసుకోవడం కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ నగరంలో ఉన్న రామ్ జానకీ మందిరానికి ప్రజలు పోటెత్తారు. స్థానిక ఆధ్యాత్మిక గురువు ఒకరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆయన దుస్తులు, ఆహారం పంచుతుండగా ప్రజలు నియంత్రణ కోల్పోయి తొక్కిసలాట జరిగింది. కనీసం 63 మంది చనిపోయారు.
2008 సెప్టెంబర్ 30
రాజస్థాన్, జోధ్‌పూర్ నగరంలోని చాముండా దేవి ఆలయంలో బాంబు పెట్టారనే వదంతులలో అక్కడికి వచ్చిన భక్తుల్లో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోగా, 60 మందికి పైగా గాయాల పాలయ్యారు.
2008 ఆగస్ట్ 3
హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్ జిల్లాలోని నైనా దేవి మందిరం వద్ద ఒక పర్వతం నుంచి రాళ్లు పడుతున్నాయనే వదంతులు రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత, తొక్కిసలాట జరగడంతో 162 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు.
ఇదే కాకుండా 2003 ఆగస్ట్ 27న మరో 39 మంది చనిపోయారు. 140 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఈ విషాదం తలెత్తింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














